పాయింట్ తేడాతో వరంగల్ మిస్
* ఏప్రిల్ 15 వరకు సవరించిన ప్రతిపాదనలిస్తే పరిశీలిస్తాం: వెంకయ్య
* రూ. 50,802 కోట్లతో ఐదేళ్లలో స్మార్ట్ సిటీలు రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘స్మార్ట్ సిటీ’లకు మరో అడుగు పడింది. తొలివిడతలో స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనున్న 20 నగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో.. ఏపీ నుంచి విశాఖ, కాకినాడ నగరాలకు స్థానం దక్కింది. తెలంగాణాలోని నగరాలకు అవకాశం దక్కలేదు. ఒక్క పాయింట్ తేడాతో వరంగల్ టాప్-20 జాబితాలో స్థానం కోల్పోయింది. ‘ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఒక్కో నగరానికి తొలి జాబితాలో స్థానం కల్పించాలనేది మా ఉద్దేశం.
ఈ జాబితాలో అవకాశం దక్కని రాష్ట్రాలకు ఫాస్ట్ ట్రాక్ పోటీలో పాల్గొనడానికి మరొక అవకాశం ఇస్తాం. ఆయా రాష్ట్రాలు టాప్ ర్యాంకింగ్ నగరాల స్మార్ట్ సిటీ ప్రతిపాదనలను ఆధునీకరించి ఏప్రిల్ 15 లోగా పంపిస్తే ఈ మిషన్‌లో చేరుస్తాం’ అని వెంకయ్యనాయుడు తెలిపారు. తొలిజాబితాలోని 20 నగరాలను రూ. 50,802 కోట్లతో ఐదేళ్ల లోపు స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామన్నారు. స్మార్ట్ సిటీల తొలి జాబితాలో విశాఖకు 8వ స్థానం, కాకినాడకు 14వ స్థానం దక్కింది. స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చాలని వివిధ రాష్ట్రాలనుంచి 97 ప్రతిపాదనలు అందాయన్న కేంద్ర మంత్రి ఈ జాబితా ఎంపిక పూర్తి పారదర్శకంగా జరిగిందని వెల్లడించారు.
నగరాల్లో సమీకృత పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, సరైన రవాణా వ్యవస్ధ, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక సదుపాయాలు, చెత్త నిర్వహణ, స్వచ్ఛమైన నీరు, అందరకీ ఇళ్లు, పరిపాలనా సౌలభ్యంపైనే దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ పోటీయుత వాతావరణంలో గెలిచి.. టాప్-20లో స్థానం సంపాదించిన నగరాలకు ప్రధాని మోదీ, వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ సర్వీస్ పరీక్షలకున్నంత పోటీ ఈ తొలి జాబి తాలో చోటు దక్కించుకునేందుకు నగరాలు, రాష్ట్రాల మధ్య కనిపించిందని.. మోదీ అన్నారు. రెండో విడతలో 54 నగరాల ఎంపిక కోసం ఈ ఏడాది ఏప్రిల్ 1నుంచి పోటీ మొదలవుతుందని వెంకయ్య తెలిపారు.
ప్రధాని సొంత నియోజకవర్గం వారణాసితోపాటు ఉత్తరప్రదేశ్‌నుంచి ఒక్క నగరానికి కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు. అయితే డెహ్రాడూన్‌ను ఈ జాబితాలో చేర్చకపోవటం కేంద్రం వివక్షకు అద్దం పడుతుందని కాంగ్రెస్ విమర్శించింది. కాగా, జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఈ పథకం కోసం ప్రతిపాదనలు పంపకపోవటాన్ని ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆక్షేపించారు.
ఎంపిక విధానం
రాష్ట్రాలు పంపిన స్మార్ట్ సిటీల ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం.. వివిధ ప్రామాణికాల ఆధారంగా తొలిజాబితాను రూపొందించారు. వ్యయ సాధ్యతతో కూడిన అమలు విధానానికి 30 శాతం, ఫలితాల లక్ష్యానికి 20 శాతం, ప్రజల భాగస్వామ్యానికి 16 శాతం, వినూత్నమైన ప్రతిపాదనలకు 10 శాతం, వ్యూహాత్మక ప్రణాళికకు 10 శాతం, విజన్, లక్ష్యాలకు 5 శాతం, సాక్షాధాన ప్రొఫైలింగ్, కీలక పనితీరు సూచికలకు 5 శాతం, అనుసరించిన విధానాలకు 4 శాతం మార్కులు వేశారు. రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలతోపాటు.. కేంద్రం, విదేశీ ప్రతినిధులు వచ్చి ఆయా నగరాలను పరిశీలించి నివేదికలు సమర్పించారు. వీటి ఆధారంగానే తొలిజాబితా రూపొందింది.
తొలి జాబితాలోని స్మార్ట్ సిటీలు
భువనేశ్వర్ (ఒడిశా), పుణే, షోలాపూర్ (మహారాష్ట్ర), జైపూర్, ఉదయపూర్ (రాజస్తాన్), అహ్మదాబాద్, సూరత్ (గుజరాత్), కొచ్చి( కేరళ), జబల్‌పూర్, ఇండోర్, భోపాల్ (మధ్యప్రదేశ్), విశాఖపట్నం, కాకినాడ (ఏపీ), దావణగెరే, బెల్గావి (కర్ణాటక), న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, కోయంబత్తూర్, చెన్నై (తమిళనాడు), గువాహటి (అసోం), లూథియానా (పంజాబ్)