ఆ ప్రాజెక్టులన్నీ ‘స్విస్ చాలెంజ్’లోనే
9 రంగాల్లో ‘ప్రైవేటు’ పెత్తనం
మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులన్నీ అయినవాళ్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
సర్కారు తాజా జీవో జారీ
హైదరాబాద్: రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రాజెక్టులన్నింటినీ అయినవాళ్లకే కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల అభివృద్ధి చట్టం-2001 పరిధిలో ఉన్న స్విస్ చాలెంజ్ పద్ధతిని ఎంపిక చేసిన రాష్ట్రప్రభుత్వం ఆ చట్టం పరిధిలో అత్యంత కీలకమైన మరో తొమ్మిది రంగాలను కూడా చేర్చింది. తద్వారా ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న కీలకమైన ఈ తొమ్మిది రంగాల పరిధిలోకి వచ్చే ప్రాజెక్టులను సైతం స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే ఎంపిక చేయడానికి సర్కారు సిద్ధమైంది. ఈ మేరకు తొమ్మిది రంగాలను చట్టం పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. కొత్త రాజధాని నిర్మాణంలో మాస్టర్ డెవలపర్‌గా అయినవాళ్లను ఎంపిక చేయడానికి స్విస్ చాలెంజ్ విధానాన్ని తెరమీదకు తేవడం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన అతి ముఖ్యమైన ప్రాజెక్టులను సైతం దీనిపరిధిలోకి చేర్చడంద్వారా అడ్డగోలు దోపిడీకి చట్టబద్ధత కల్పించినట్లయింది.
అన్నింటికీ అధికారిక ముద్ర...
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు మొత్తం తొమ్మిది రంగాలను ఎంచుకున్నారు. టెలికమ్యూనికేషన్స్, బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ సేవలతోపాటు కొత్తగా రాష్ట్రంలో పెద్దఎత్తున వేసే ఫైబర్‌గ్రిడ్, వైఫై సర్వీసు ఏర్పాటు పనులనూ, అలాగే విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌తోపాటు సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టులన్నింటినీ ఈ చట్టం పరిధిలోకి చేర్చారు. అదేవిధంగా జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా నిర్వాసితులకు గృహాల నిర్మాణం, రవాణా డిపోలు, పట్టణ ప్రాంతాల్లో అంతర్గత రైల్వే ప్రాజెక్టులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల నిర్మాణం, పట్టణాభివృద్ధి పనులు, స్మార్ట్‌సిటీలు, విద్యాసంస్థల ఏర్పాటు తదితర రంగాల్లో చేపట్టబోయే అన్ని ప్రాజెక్టులనూ దీనిపరిధిలోకి తీసుకొచ్చారు. అంటే ఈ రంగాల్లో ఏ ప్రాజెక్టు చేపట్టినా ఇకనుంచీ స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే కట్టబెట్టడానికి రంగం సిద్ధమైనట్టే. కొత్త రాజధానిలో వివిధ ప్రాజెక్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు చేపట్టబోతున్న తరుణంలో అన్నింటినీ స్విస్‌చాలెంజ్ విధానంలో అప్పగించడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు తాజా జీవోతో విదితమవుతోంది.