విజన్-2030కి తగ్గట్టుగా ప్రణాళికలు
ఏడీబీ బృందానికి వివరించిన జిల్లా అధికారులు
విశాఖపట్నం : విశాఖపట్నంలో స్మార్ట్ సిటీకు తగ్గ మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖ-చెన్నై కారిడార్ అధ్యయనం కోసం జిల్లాకు వచ్చిన ఏడీబీ బృందం సభ్యులకు స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నంలో కల్పించనున్న మౌలిక సదుపాయలను కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌లు వివరించారు. అమెరికా సౌజన్యంతో దేశంలో అలహాబాద్, అజ్మీర్‌లతో పాటు విశాఖపట్నం స్మార్ట్ సిటీలుగా ఎంపికైన విషయం తెలిసిందే. విజన్-2030 తగ్గట్టుగా విశాఖలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏడీబీ బృందం సభ్యులకు వివరించారు. ప్రస్తుతం 18 లక్షలుగా ఉన్న నగర జనాభా 2030 నాటికి కనీసం 30 లక్షలకు పైగా చేరుకుంటుందని అంచనాతో ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. స్మార్ట్‌సిటీ ప్రాధాన్యతను వివరిస్తూ తొలుత 24ఇన్‌టూ 7 విద్యుత్ సరఫరా చేయాలని, ప్రతి మనిషికి రోజూ 130 గ్యాలెన్ల నీటిని సరఫరా చేయాలని, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఎఫిషియన్సీని పెంపొందించాలని, పుట్‌పాత్స్‌ను కనీసం రెండు మీటర్లు వెడల్పుతో ఉండాలని, డెడికేటెడ్ బైస్కిల్ ట్రాక్స్‌తో పాటు ఏ మూల నుంచైనా 45 నిమిషాల వ్యవధిలోనే వర్క్ ప్లేస్‌కు చేరుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏడీబీ బృందం సభ్యులు సూచించారు. కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ వేసవిలో కోతలు విధించకతప్పడం లేదని వివరించారు.
ఈ పరిస్థితిని రానున్న వేసవిలో అధిగమించేందుకు వీలుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏలేరు నుంచి రోజూ 30 మిలియన్ గ్యాలెన్స్ నీరు తరలిస్తున్నామని, ఈ నీటితో ప్రజల మంచినీటిఅవసరాలు తీరుస్తూనే విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నామన్నారు. గోదావరిలో సర్‌ప్లస్ వాటర్‌ను ప్రత్యేక పైపులైన్ ద్వారా విశాఖకు మళ్లించేందుకు రూ.2వేల కోట్లతో ఓ ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. 24 గంటలూ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇందుకోసం 917 ఎకరాల భూములను కూడా గుర్తించామన్నారు. రానున్న ఐదేళ్లలో 4 వేల మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు, డీఆర్‌వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ సిటీ లక్ష్యంగా మౌలిక సదుపాయాలు
Published Sat, Dec 13 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement