The plans
-
75 రోజులు...‘పుర’ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు
- మున్సిపాలిటీలు ఇక ‘చెత్త’ రహితం - గడపగడపకూ వెళ్లి చెత్త సేకరించాలని సీఎం ఆదేశాలు - జీహెచ్ఎంసీ డిజైన్‌తో మార్కెట్లు, రైతుబజార్లు - జిల్లా కేంద్రంలో వైకుంఠధామం పేరుతో శ్మశానవాటిక - ఎల్ఈడీ లైటింగ్లు, పార్కులుగా డంపింగ్ యార్డులు - ప్రణాళిక అమలుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మెప్మా బాధ్యతలు - రేపు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా అధికారుల సమావేశం సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ‘పుర’ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు 75 రోజుల కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తున్నారు. ఈ 75 రోజుల్లో జిల్లాలోని పట్టణ ప్రాంతాలను చెత్త రహిత ప్రాంతాలుగా మార్చాలని, పట్టణాల్లో అనేక మార్పులు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. మున్సిపల్ పరిపాలన శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ నేతృత్వంలో ఈ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రణాళికలను అమలు చేసేందుకు గాను ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్‌ను మెప్మా పీడీగా నియమించారు. ఈ ప్రణాళికల అమలుపై చర్చించడంతోపాటు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా కేంద్రంలో కలెక్టర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు. ‘చెత్త’పైనే దృష్టి తెలంగాణలోని పట్టణాలను చెత్త రహిత నగరాలుగా మార్చాలని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా ఇందుకు తగిన ప్రణాళికలు తయారుచేస్తున్నారు. ప్రతి పట్టణంలో చెత్త సేకరణను ఒక ఉద్యమంగా చేపట్టనున్నారు. గడపగడపకూ వెళ్లి చెత్తను సేకరించే విధానం ఇప్పటికే అమలవుతున్నా, దాన్ని మరింత పక డ్బందీగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అవసరమైన అదనపు సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఏమిటన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చనున్నారు. మిర్యాలగూడ, భువనగిరి యార్డులను ఇప్పటికే ఆ దిశలో తయారుచేసే పనిలో ఉండగా, మిగిలిన మున్సిపాలిటీల్లోని యార్డులను కూడా పార్కులుగా తయారుచేయనున్నారు. ఇందుకోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే చెట్లను డంపింగ్ యార్డుల్లో కూడా పెట్టనున్నారు. ఏరోమాటిక్ (సువాసన వెదజల్లే), మెడిసినల్ (ఔషధ)మొక్కలను యార్డుల్లో నాటుతామని అధికారులు చెపుతున్నారు. ఏ డంప్ విస్తీర్ణం ఎంత ఉంది? ఎన్ని మొక్కలు అవసరం అవుతాయనే దానిపై కూడా జిల్లా యంత్రాంగం లెక్కలు కడుతోంది. ప్రతి మూడో శనివారం ‘అర్బన్ డే’ చెత్తతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు, చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ల ఏర్పాటు, పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. ప్రతి మార్కెట్లో రెండున్నర అడుగుల ప్లాట్‌ఫారాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. అయితే, ఈ మార్కెట్లకు సంబంధించి ఎలాంటి మార్పులు చేపట్టాలన్న దానిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు డిజైన్లు తయారుచేస్తున్నారని, ఆ డిజైన్ల మేరకు మన జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మార్కెట్లను అభివృద్ధి పరుస్తామని జిల్లా ముఖ్య అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. మరోవైపు అన్ని పట్టణాలలో ఎల్ఈడీ లైటింగ్ ఏర్పాటు కోసం కూడా ఈ ప్రణాళికలో ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే పట్టణ ప్రాంతాల అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అయితే, జిల్లాలోని పట్టణ ప్రాంతాల సమస్యలపై చర్చించేందుకు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రతి నెలా మూడో శనివారాన్ని ‘అర్బన్ డే’గా ప్రకటించనున్నట్టు తెలిసింది. -
మొండి బకాయిలు
మార్కెటింగ్‌శాఖలో లక్ష్యం మేరకు వసూలు కాని సెస్ {పతికూల పరిస్థితుల్లోనూ రూ.70కోట్లు వసూలు జిల్లాలో మార్కెటింగ్‌శాఖకు సెస్ మొండి బకాయిలు గుదిబండగా మారుతున్నాయి. రూ.కోట్లలో పెరుకుపోతున్నాయి. ఏ ఆర్థిక సంవత్సరంలోనూ లక్ష్యం మేరకు వసూలు కాలేదు. వీటిలో ఎక్కువ పౌరసరఫరాలశాఖకు చెందినవే. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశాఖ ఈఏడాది రూ.70కోట్ల మేర వసూలు చేసింది. లక్ష్యానికి చేరుకోలేకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలోనే పన్నుల వసూలు చేయగలిగింది. విశాఖపట్నం: విశాఖలోని ప్రాంతీయ మార్కెటింగ్ శాఖ పరిధిలో శ్రీకాకుళం, విజ యనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 51 మార్కెట్యార్డులుండగా, వాటి పరిధిలో 80 చెక్‌పోస్టులు న్నాయి. ఈ చెక్‌పోస్టుల ద్వారా వ్యవసాయఉత్పత్తులపై ఒక శాతం, మత్స్యశాఖ ఉత్పత్తులపై 0.5 శాతం సెస్ రూపంలో వసూలు చేస్తుంటారు. 2013-14లో నిర్దేశించిన రూ.83 కోట్ల కు రూ.67కోట్లు వసూలు చేయగలిగారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఈ నాలుగు జిల్లాల పరిధిలో 92.93కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. గతేడాది ఎలాగైనా లక్ష్యానికి చేరుకోవాలని మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ హుద్‌హుద్‌తో లక్షలాది ఎకరాల్లో పంటల న్నీ దెబ్బతిన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు నామరూపాల్లేకుండా పోయాయి. అయినప్పటికీ ఊహించని స్థాయిలోనే పన్నుల వసూలు జరిగాయి. గతేడాది వసూళ్లనైనా ఈ ఏడాది సాధించగలమో లేదోనని ఆందోళన పడ్డారు. కానీ గతేడాది వసూళ్లకు మించి ఈ ఏడాది వసూళ్లు సాధించ గలిగారు. ఈ ఏడాది రూ.92.93కోట్ల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 69.75కోట్ల మేర వసూలు చేయగలిగారు. మరో 20రోజుల గడువు ఉన్నందున ఈ మొత్తం రూ.75కోట్లకు వరకు చేరుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వసూలైన పన్నుల్లో ధాన్యం ద్వారానే అత్యధికంగా రూ.50కోట్లు, బియ్యం ద్వారా మరో రూ.10 కోట్లు వసూలయ్యాయి. మిగిలిన రూ.10 కోట్లు ఇతర వ్యవసాయ, మత్స్యశాఖ ఉత్పత్తుల మార్కెటింగ్ ద్వారా ఆర్జించ గలిగారు. ‘తూర్పు’లోనే అత్యధిక వసూలు జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాకు రూ.22కోట్ల పన్నుల వసూళ్లు లక్ష్యం కాగా, రూ.11.12 కోట్ల వసూలు చేశారు. విజయనగరం జిల్లాలో రూ.10.75 కోట్లకు రూ.7.90కోట్లు, విశాఖపట్నం జిల్లాలో రూ.10.53కోట్ల లక్ష్యానికి రూ.10.04కోట్లమేర వసూలు చేయగా, తూర్పు గోదావరిలో రూ.49కోట్ల లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.40.69కోట్ల మేర సెస్‌ల రూపంలో వసూలు చేశారు. మొండిబకాయిలు సివిల్ సప్లయిస్వే: పేరుకుపోయిన మొండిబకాయిలు ఎక్కువ పౌరసరఫరాలశాఖవే. గత ఏడేనిమిదేళ్ల నుంచి రూ.25కోట్లమేరబకాయిలు పేరుకుపోయాయి. వీటిలో రైసు మిల్లర్లు, వ్యాపారస్తుల నుంచి రూ.12కోట్ల వరకు వసూలు కావాల్సిఉండగా..సివిల్ సప్లయిస్ నుంచే ఏకంగా రూ.12కోట్ల వరకు వసూలు కావాల్సిఉంది. గతరెండేళ్లుగా ధాన్యం కొనుగోళ్లు సివిల్ సప్లయిస్ చేపట్టింది. సుమారు 8లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని గడిచిన ఏడాదిలో కొనుగోలు చేసింది. ఈ ధాన్యానికి ఒకశాతం సెస్‌రూపంలో రూ.15కోట్లు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.3కోట్లు మాత్రమే చెల్లించింది. మరో రూ.12కోట్ల మేర ఈ శాఖ చెల్లించాల్సి ఉంది. -
సాగర యాగం
*హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు రంగం సిద్ధం *విభిన్న శాఖల భాగస్వామ్యం *ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నం *వేసవిలో ముహూర్తం ఒక మహా యజ్ఞానికి భాగ్యనగరం వేదికవుతోంది.ఒక మహా ప్రయత్నానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మహా నగరి మెడలో మణిహారంలా భాసిల్లుతున్న హుస్సేన్ సాగర్‌ను శుద్ధ జలంతో నింపే క్రతువుకు రంగం సిద్ధమవుతోంది. కాలుష్య కాసారంలా మారిన సాగర్‌ను ఖాళీ చేసి... భవిష్యత్తులో శుద్ధి చేసిన నీటిని నింపే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. వేసవిలో ఈ మహా యజ్ఞం నిర్వహణకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. ముందుగా సాగర్‌ను ఖాళీ చేసి... పూడికను తొలగించేందుకు వివిధ విభాగాలు యత్నాలు మొదలుపెట్టాయి. నీరు తోడడం... పూడిక తొలగించడం వంటి పనులకు ఎంత సమయం పడుతుంది...ఎంత వ్యయమవుతుందనే విషయమై లెక్కలు వేస్తున్నాయి. సాగర్ ప్రక్షాళనతో పాటు పరిసరాలను పచ్చదనంతో నింపి... సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించాయి. విభిన్న శాఖల సమన్వయంతో ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. -
స్మార్ట్ సిటీ లక్ష్యంగా మౌలిక సదుపాయాలు
విజన్-2030కి తగ్గట్టుగా ప్రణాళికలు ఏడీబీ బృందానికి వివరించిన జిల్లా అధికారులు విశాఖపట్నం : విశాఖపట్నంలో స్మార్ట్ సిటీకు తగ్గ మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖ-చెన్నై కారిడార్ అధ్యయనం కోసం జిల్లాకు వచ్చిన ఏడీబీ బృందం సభ్యులకు స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేయనున్న విశాఖపట్నంలో కల్పించనున్న మౌలిక సదుపాయలను కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌లు వివరించారు. అమెరికా సౌజన్యంతో దేశంలో అలహాబాద్, అజ్మీర్లతో పాటు విశాఖపట్నం స్మార్ట్ సిటీలుగా ఎంపికైన విషయం తెలిసిందే. విజన్-2030 తగ్గట్టుగా విశాఖలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ యువరాజ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏడీబీ బృందం సభ్యులకు వివరించారు. ప్రస్తుతం 18 లక్షలుగా ఉన్న నగర జనాభా 2030 నాటికి కనీసం 30 లక్షలకు పైగా చేరుకుంటుందని అంచనాతో ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు. స్మార్ట్‌సిటీ ప్రాధాన్యతను వివరిస్తూ తొలుత 24ఇన్‌టూ 7 విద్యుత్ సరఫరా చేయాలని, ప్రతి మనిషికి రోజూ 130 గ్యాలెన్ల నీటిని సరఫరా చేయాలని, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని పెంపొందించాలని, పుట్పాత్స్ను కనీసం రెండు మీటర్లు వెడల్పుతో ఉండాలని, డెడికేటెడ్ బైస్కిల్ ట్రాక్స్‌తో పాటు ఏ మూల నుంచైనా 45 నిమిషాల వ్యవధిలోనే వర్క్ ప్లేస్‌కు చేరుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏడీబీ బృందం సభ్యులు సూచించారు. కలెక్టర్ యువరాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నప్పటికీ వేసవిలో కోతలు విధించకతప్పడం లేదని వివరించారు. ఈ పరిస్థితిని రానున్న వేసవిలో అధిగమించేందుకు వీలుగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏలేరు నుంచి రోజూ 30 మిలియన్ గ్యాలెన్స్ నీరు తరలిస్తున్నామని, ఈ నీటితో ప్రజల మంచినీటిఅవసరాలు తీరుస్తూనే విశాఖ ఉక్కు కర్మాగారంతో పాటు ఇతర పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తున్నామన్నారు. గోదావరిలో సర్ప్లస్ వాటర్‌ను ప్రత్యేక పైపులైన్ ద్వారా విశాఖకు మళ్లించేందుకు రూ.2వేల కోట్లతో ఓ ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. 24 గంటలూ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నామన్నారు. ఇందుకోసం 917 ఎకరాల భూములను కూడా గుర్తించామన్నారు. రానున్న ఐదేళ్లలో 4 వేల మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ శేషగిరిబాబు, డీఆర్వో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.