75 రోజులు...‘పుర’ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు | officials preparing plans for municipalities | Sakshi
Sakshi News home page

75 రోజులు...‘పుర’ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు

Published Fri, Apr 24 2015 3:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

officials preparing plans for municipalities

- మున్సిపాలిటీలు ఇక ‘చెత్త’ రహితం
- గడపగడపకూ వెళ్లి చెత్త సేకరించాలని సీఎం ఆదేశాలు
- జీహెచ్‌ఎంసీ డిజైన్‌తో మార్కెట్లు, రైతుబజార్లు
- జిల్లా కేంద్రంలో వైకుంఠధామం పేరుతో శ్మశానవాటిక
- ఎల్‌ఈడీ లైటింగ్‌లు, పార్కులుగా డంపింగ్ యార్డులు
- ప్రణాళిక అమలుకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి మెప్మా బాధ్యతలు
- రేపు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా అధికారుల సమావేశం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :
జిల్లాలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసం ‘పుర’ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా అధికారులు 75 రోజుల కార్యాచరణ ప్రణాళికను తయారుచేస్తున్నారు. ఈ 75 రోజుల్లో జిల్లాలోని పట్టణ ప్రాంతాలను చెత్త రహిత ప్రాంతాలుగా మార్చాలని, పట్టణాల్లో అనేక మార్పులు తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.  మున్సిపల్ పరిపాలన శాఖలో సుదీర్ఘ అనుభవం ఉన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ నేతృత్వంలో ఈ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

ఈ ప్రణాళికలను అమలు చేసేందుకు గాను ఎస్పీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్‌ను మెప్మా పీడీగా నియమించారు. ఈ ప్రణాళికల అమలుపై చర్చించడంతోపాటు అవగాహన కల్పించేందుకు మున్సిపల్ చైర్మన్లతో జిల్లా కేంద్రంలో కలెక్టర్ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నారు.

‘చెత్త’పైనే దృష్టి
తెలంగాణలోని పట్టణాలను చెత్త రహిత నగరాలుగా మార్చాలని సీఎం కేసీఆర్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలని సూచించిన నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా ఇందుకు తగిన ప్రణాళికలు తయారుచేస్తున్నారు. ప్రతి పట్టణంలో చెత్త సేకరణను ఒక ఉద్యమంగా చేపట్టనున్నారు. గడపగడపకూ వెళ్లి చెత్తను సేకరించే విధానం ఇప్పటికే అమలవుతున్నా, దాన్ని మరింత పక డ్బందీగా నిర్వహించనున్నారు.

ఈ మేరకు అవసరమైన అదనపు సిబ్బంది, ఇతర సౌకర్యాలు ఏమిటన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక జిల్లాలోని అన్ని డంపింగ్ యార్డులను పార్కులుగా మార్చనున్నారు. మిర్యాలగూడ, భువనగిరి యార్డులను ఇప్పటికే ఆ దిశలో తయారుచేసే పనిలో ఉండగా, మిగిలిన మున్సిపాలిటీల్లోని యార్డులను కూడా పార్కులుగా తయారుచేయనున్నారు. ఇందుకోసం హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటే చెట్లను డంపింగ్ యార్డుల్లో కూడా పెట్టనున్నారు. ఏరోమాటిక్ (సువాసన వెదజల్లే), మెడిసినల్ (ఔషధ)మొక్కలను యార్డుల్లో నాటుతామని అధికారులు చెపుతున్నారు. ఏ డంప్ విస్తీర్ణం ఎంత ఉంది? ఎన్ని మొక్కలు అవసరం అవుతాయనే దానిపై కూడా జిల్లా యంత్రాంగం లెక్కలు కడుతోంది.

ప్రతి మూడో శనివారం ‘అర్బన్ డే’
చెత్తతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ఇతర మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లు, చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ల ఏర్పాటు, పునరుద్ధరణపై దృష్టి పెట్టారు. ప్రతి మార్కెట్‌లో రెండున్నర అడుగుల ప్లాట్‌ఫారాలు తప్పకుండా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

అయితే, ఈ మార్కెట్లకు సంబంధించి ఎలాంటి మార్పులు చేపట్టాలన్న దానిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులు డిజైన్లు తయారుచేస్తున్నారని, ఆ డిజైన్ల మేరకు మన జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మార్కెట్లను అభివృద్ధి పరుస్తామని జిల్లా ముఖ్య అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. మరోవైపు అన్ని పట్టణాలలో ఎల్‌ఈడీ లైటింగ్ ఏర్పాటు కోసం కూడా ఈ ప్రణాళికలో ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే పట్టణ ప్రాంతాల అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. అయితే, జిల్లాలోని పట్టణ ప్రాంతాల సమస్యలపై చర్చించేందుకు, సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రతి నెలా మూడో శనివారాన్ని ‘అర్బన్ డే’గా ప్రకటించనున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement