కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం
జీవీఎంసీ బడ్జెట్ తయారు
ఖర్చు రూ. 2010 కోట్లు
మిగులు బడ్జెట్ రూ. 100 కోట్లు
ఇంజినీరింగ్‌కే అగ్రస్థానం
విశాఖపట్నం సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థ భారీ అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. రూ. 2110 కోట్ల మొత్తంతో 2015-16 సంవత్సర బడ్జెట్‌ను తయారు చేసింది. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు రూ.174 కోట్ల అంచనాలను పెంచింది. అందులోనూ రూ. 100 కోట్ల మిగులు బడ్జెట్‌తో జీవీఎంసీ పనులు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. గతంతో పోల్చుకుంటే కొత్త ఇంజనీరింగ్ ప్రాజెక్టులకే పెద్ద పీట వేస్తోంది. స్మార్ట్ సిటీ అభివృద్దికి తగ్గట్టుగానే కొత్త బడ్జెట్ రూపకల్పన చేశారు. ప్రాజెక్టుల కోసం రూ. 15 కోట్లే కేటాయించినా నాలుగో వంతు ఇంజినీరింగ్ పనులకే కేటాయించారు. వర్కింగ్ బ్యాలెన్స్‌గా రూ. 100 కోట్ల నికర మొత్తాన్ని వుంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది. రూ. 2110 కోట్ల ఆదాయం వస్తుంటే అందులో రూ.2010 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేసింది. ఇంజనీరింగ్ విభాగానికి కేటాయించిన రూ. 570 కోట్లలో కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు రూ.415 కోట్లు కేటాయించారు. పాత ఇంజనీరింగ్ పనుల నిర్వహణకు రూ. 154 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు.
కొత్త పన్నులు లేనట్టే..!
ఏప్రిల్ నుంచీ అమల్లోకి వచ్చే బడ్జెట్‌లో కొత్త పన్నుల భారం వుండకపోవచ్చని తెలిసింది. కొత్త ప్రాజెక్టులు వస్తున్నందున ఆదాయం కాస్త పెరిగే ఛాన్స్ వుందంటున్నారు. కౌన్సెల్ లేనందున ఈ బడ్జెట్ నివేదిక పట్టుకుని పట్టణ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎ. గిరధర్ వద్దకు వెళ్లి బడ్జెట్‌ను ఆమోదించుకుని తేవడం ఒక్కటే మిగిలి వుంది. జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌తోబాటు ఫైనాన్స్ అధికారుల బృందం ఈ మేరకు హైదరాబాద్ వెళ్లి ఆమోదింపజేసుకుని రావాల్సి వుంది.