2016-17 బడ్జెట్ రూ.2500-రూ.3000 కోట్లమధ్య ఉండే అవకాశం
కనీసం 20 శాతం వృద్ధి అంచనాతో అధికారుల కసరత్తు
కేంద్ర పథకాలు, పన్ను ఆదాయం పెరుగుతుందని అంచనా
తుదిరూపు ఇచ్చేందుకు నేడు కీ లక భేటీ
ఎన్నికల దృష్ట్యా టీడీపీకి మేలు చేకూర్చేలా కేటాయింపులు?
విశాఖపట్నం : స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) వార్షిక బడ్జెట్‌ను కూడా అదేస్థాయిలో రూపొందించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కోణం కూడా అంతర్లీనంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి రాష్ట్రానికి అనధికార రాజధానిగా ఉన్న విశాఖలో పాగా వేయాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. ఈ ఏడాదిలోనే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతోంది. ఈ లోగా భారీ బడ్జెట్ కేటాయింపులతో ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకు అనుగణంగానే 20 శాతం పెంపుదలతో సుమారు రూ.2700 కోట్లతో అంచనా బడ్జెట్ ప్రవేశపెట్టాలని అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు జీవీఎంసీలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో మంగళవారం కీలక భేటీ జరగనుంది.
20 శాతం వృద్ధి అంచనా
ఆదాయం వృద్ధి రేటు 20 శాతం ఉందని చెబుతున్న అధికారులు ఆ మేరకు 2016-17 ఆర్థిక సంవత్సరానికి జీవీఎంసీ బడ్జెట్‌ను పెంచాలని దాదాపు నిర్ణయించారు. 2014-15లో రూ. 1701 కోట్లుగా ఉన్న నగరపాలక సంస్థ ఆదాయం 2015-16లో రూ.2194 కోట్లకు పెరిగింది. 2016-17లో ఈ మొత్తం రూ.2700 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం వృద్ధి రేటు కనీసం 20 శాతం(రూ.600 కోట్ల మేరకు) పెరగవచ్చని అంటున్నారు. కాగా గత ఏడాది రూ.200 కోట్ల మిగులు బడ్జెట్ ఆమోదించగా.. ఈ ఏడాది కనీసం రూ.300 కోట్ల మిగులు ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కలకు కేంద్ర పథకాల ద్వారా అందే నిధులు ఊతమిస్తున్నాయి. స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి తొలి ఏడాది రూ.100 కోట్లు వస్తాయని, అలాగే అమృత్ పథకం కింద రూ.139 కోట్లు, స్వచ్ఛ భారత్‌కు రూ.140 కోట్లు, ఐఎఫ్‌ఆర్‌కు రూ.90 కోట్లు, విపత్తుల నిర్వహణ కింద మరో రూ.100 కోట్లు అందుతాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.
ఇతర ఆదాయాల్లోనూ వృద్ధి
కొత్త పన్నుల అసెస్‌మెంట్, నాన్‌అసెస్‌మెంట్, అనధికార నిర్మాణాలు, నీటి పన్ను, అడ్వర్టైజ్‌మెంట్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లు, కల్యాణ మండపాలు, లీజు రెన్యువల్స్, ట్రేడ్ లెసైన్సుల ద్వారా గత ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంటింటి సర్వే ద్వారా అండర్ అసెస్‌మెంట్, నాన్‌అసెస్‌మెంట్ భవనాలు, నిర్మాణాలను గుర్తించి పన్నులు విధించడం ద్వారా అదనపు ఆదాయం సమకూరినట్టుగా చెబుతున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ , ప్రభుత్వ స్థలాలల్లోని కట్టడాల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 296 ద్వారా భారీగా ఆదాయం ఆర్జించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే శాఖలవారీగా అందిన అంచనాలకు తుదిమెరుగులు దిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం కీలక సమావేశం జరుగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో శాఖల వారీగా ఆదాయ అంచనాలపై ఈ సమావేశంలో చర్చించి బడ్జెట్ అంచనాలు ఖరారు చేస్తారు. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనలో జాప్యం జరిగినట్టుగా చెబతున్నారు. సాధారణంగా నవంబర్ 10లోగా స్టాండింగ్ కమిటీకి బడ్జెట్ సమర్పించాల్సి ఉంది. డిసెంబర్ 10 నాటికి జీవీఎంసీ ఆమోదం పొందిన తర్వాత కౌన్సిల్ లేదా స్పెషల్ ఆఫీసర్ ఆమోదంతో ప్రభుత్వానికి ఫిబ్రవరి 25 కల్లా సమర్పించాలి. మార్చి 1లోగా రాష్ర్ట ప్రభుత్వంతో ఆమోదింపజేయాలి. ఇలా అయితేనే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు, గ్రాంట్లు అందుతాయి. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులు రూ.2500 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల మధ్య ఉంటాయని, మంగళవారంనాటి భేటీలో తుదిరూపునిచ్చి ప్రభుత్వామోదానికి పంపిస్తామని జీవీఎంసీ ఏడీసీ(ఫైనాన్స్) వర్మ ‘సాక్షి’కి తెలిపారు.
జీవీఎంసీ బడ్జెట్.. సైజ్ భారీ!
Published Mon, Jan 18 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM
Advertisement