అసెంబ్లీలో అరకు కాఫీ
ఎమ్మెల్యేలకు పంపిణీ
సాక్షి, విశాఖపట్నం : ఇప్పటికే పలు ప్రత్యేకతలు చాటుకుంటున్న అరకు వేలీ కాఫీ తాజాగా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) తయారు చేస్తున్న ఈ కాఫీ అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ ప్రత్యేకతను సాధించింది. విశాఖ ఏజెన్సీలో సహజసిద్ధంగా పండిన సేంద్రియ కాఫీ రుచిలో పెట్టింది పేరు. ఈ కాఫీ గింజలను పౌడరుగా చేసి జీసీసీ మార్కెట్‌లో విక్రయిస్తోంది. దీనికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.
ఇటీవల విశాఖలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో గవర్నర్, ముఖ్యమంత్రితో పాటు విదేశీ ప్రతినిధులు అరు కాఫీని రుచి చూసి మంత్రముగ్ధులయ్యారు. గత నెలలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లలో దీని పేరు మరింత ఇనుమడించింది. ఐఎఫ్‌ఆర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అరకు కాఫీని సేవించి రుచి అమోఘంగా ఉందని కితాబు నిచ్చారు.
స్మార్ట్ సిటీలో భాగంగా అమెరికా నుంచి విశాఖ వచ్చిన ప్రతినిధుల బృందం కూడా అరకు కాఫీ తాగడమే కాదు.. రుచిని మెచ్చుకుని తమ వెంట తీసుకెళ్లారు కూడా. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రముఖులకు ఈ కాఫీని గిఫ్ట్‌గానూ ఇస్తున్నారు. ఇలావుండగా ఈ అరకు కాఫీని మన ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఆలోచన ఆ శాఖ ఉన్నతాధికారులకు వచ్చింది. దీంతో జీసీసీ ఉన్నతాధికారులు సుమారు 200 కాఫీ ప్యాకెట్లను (200 గ్రాముల ప్యాక్) గిఫ్ట్ ప్యాక్ చేసి బుధవారం అసెంబ్లీకి, శాసనమండలికి పంపించారు.
వీటిని బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు పంపిణీ చేశారు. నేడో రేపో శాసనమండలిలో ఎమ్మెల్సీలకు అందజేయనున్నారు. అరకు కాఫీకి అనతికాలంలోనే అత్యంత ఆదరణ రావడం ఆనందంగా ఉందని జీసీసీ ఎండీ ఏఎస్‌పీఎస్ రవిప్రకాష్ ‘సాక్షి’కి తెలిపారు.