సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆది వారం ఖమ్మం జిల్లాలో పాల్గొనే బహిరంగ సభకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అధికార బీఆర్‌ఎస్ విషయంలో బీజేపీ అనుసరించబోయే కఠిన వైఖరి గురించి, వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పై సాగించబోయే పోరాటం గురించి స్పష్టతనిస్తారని తెలుస్తోంది.
బీజేపీ, ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ చేస్తున్న విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు ఇప్పటిదాకా లేనంత తీవ్రస్థాయిలో విమర్శలు సంధించడం ద్వారా అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారనే విశ్వాసాన్ని పార్టీనేతలు వ్యక్తంచేస్తున్నారు. కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్దతను బద్దలుకొట్టడంతోపాటు రాష్ట్ర నాయకత్వాన్ని, కేడర్‌ను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి పార్టీని ఎన్నికల కదనరంగంలోకి దూకేలా చేస్తారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
కేసీఆర్ సర్కార్ అప్రజాస్వామిక పోకడలు, నియంతృత్వ విధానాలను తీవ్రస్థాయిలో ఎండగట్టడంతోపాటు అవినీతి, అక్రమాలపై చర్యలు తప్పవని అమిత్ షా స్పష్టం చేస్తారని అంచనావేస్తున్నారు. వారసత్వ రాజకీయాలు, మైనారిటీ సంతుష్టికరణ విధానాలు, అవినీతి, కుంభకోణాలకు ఊతమిచ్చేలా సాగుతున్న పరిణామాలపై గట్టిగా నిలదీస్తారని భావిస్తున్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారానే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జరుగుతుందనే సందేశాన్ని ప్రజలకు ఇస్తారని అంటున్నారు.
బీఆర్‌ఎస్ వైఖరిపై స్పష్టత
ప్రస్తుతం జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా అమిత్‌షా ప్రసంగం ఎలా ఉండబోతున్నదన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. మరీ ముఖ్యంగా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఈ రెండింటి మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందంటూ సాగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా కేసీఆర్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు సంధిస్తారని చెబుతున్నారు. గత నెల 8న వరంగల్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత దాదాపు 50 రోజుల తర్వాత జరుగుతున్న ఈ సభ ద్వారా అమిత్ షా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ అమిత్ షా షెడ్యూల్
ఈనెల 27న ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం చేరుకుంటారు. భద్రాద్రి ఆలయంలో సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత హెలికాప్టర్‌లో భద్రాచలం నుంచి ఖమ్మంకు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం బీజేపీ రాష్ట్రకోర్ కమిటీ, ముఖ్యనేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment