సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ స్థానాలకు టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు. ఈరోజు సాయంత్రం వరకు ఆశావహుల నుండి హస్తం పార్టీ అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను 140 మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు.
ఇక, అప్లికేషన్స్ ఇవ్వడానికి నేడు చివరిరోజు కావడంతో నిన్న(శుక్రవారం) భారీగా దరఖాస్తులు అందాయి. ఆశావహులు వందకుపైగా అప్లికేషన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కోసం ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో నేడు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలో చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ సీనియర్లు, కీలక నేతల కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి టికెట్ రేసులో ఉన్నారు.
కాగా, ఈరోజు ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మల్లు నందిని వెళ్లనున్నారు. మల్లు నందినికే టికెట్ ఇవ్వాలని విక్రమార్క్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఖమ్మం ఎంపీ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేయకపోతే.. అక్కడ తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రకటించారు. దీంతో, ఖమ్మం అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment