జైపూర్: రాజస్థాన్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ రాష్ట్ర గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. భజన్ లాల్ శర్మ తన 56వ పుట్టిన రోజే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జైపూర్‌లో ఆల్బర్ట్ హాల్‌లో జరిగింది. గోవా సీఎం ప్రమోద్ సావంత్, త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భజన్ లాల్ శర్మ సంగనీర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భజన్ లాల్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
రాజస్థాన్‌లో విడుదలైన ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ 115 సీట్లను గెలుచుకుంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి 69 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తంగా 200 సీట్లకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. బీజేపీ విజయం సాధించిన తర్వాత కేంద్ర అధిష్ఠానం భజన్ లాల్ శర్మ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.
ఇదీ చదవండి: Bjp: ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు?
Comments
Please login to add a commentAdd a comment