Bhajan Lal
-
ముఖ్యమంత్రి తండ్రి ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స!
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం కిషన్ స్వరూప్ శర్మ.. జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో శుక్రవారం అర్థరాత్రి ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు చేసి, చికిత్సనందిస్తోంది. శుక్రవారం సీఎం భజన్‌లాల్ శర్మ పుట్టినరోజు.. అదే రోజు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా సీఎం భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ శుక్రవారం తన కుమారుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం ఆయన భరత్పూర్ నుంచి జైపూర్ వచ్చారు. అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇది కూడా చదవండి: ‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్ భరోసా! -
రాజస్థాన్ నూతన సీఎంగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం
జైపూర్: రాజస్థాన్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ భైర్వ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. భజన్ లాల్ శర్మ తన 56వ పుట్టిన రోజే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జైపూర్‌లో ఆల్బర్ట్ హాల్లో జరిగింది. గోవా సీఎం ప్రమోద్ సావంత్, త్రిపుర సీఎం మాణిక్ సాహా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణస్వీకారోత్సవానికి అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భజన్ లాల్ శర్మ సంగనీర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై దాదాపు 50 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. భజన్ లాల్ ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి నాలుగు సార్లు జనరల్ సెక్రటరీగా పనిచేశారు. రాజస్థాన్‌లో విడుదలైన ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ 115 సీట్లను గెలుచుకుంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి 69 సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో మొత్తంగా 200 సీట్లకు గాను 199 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. బీజేపీ విజయం సాధించిన తర్వాత కేంద్ర అధిష్ఠానం భజన్ లాల్ శర్మ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఇదీ చదవండి: Bjp: ఆ మాజీ సీఎంల పని ఏమిటి? జేపీ నడ్డా ఏమన్నారు? -
Bhajanlal: ఓడిపోతారనుకున్నారు.. కానీ సీఎంగా ఎంపిక!
జైపూర్: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోనే కాదు.. ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపికలోనూ బీజేపీ కొత్త స్ట్రాటజీని ప్రదర్శించింది. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుడ్ని, మధ్యప్రదేశ్‌లో బీసీ(యాదవ్)ని, అలాగే.. తాజాగా రాజస్థాన్‌లో ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మను సీఎంగా ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది. తద్వారా సీనియర్లకు షాక్ ఇవ్వడంతో పాటు కొత్త తరహా రాజకీయానికి తెర లేపింది బీజేపీ. అయితే.. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. భజన్‌లాల్ మొదటిసారి ఎమ్మెల్యేగా నెగ్గారు. పైగా ఆయన గెలుస్తారని బీజేపీ శ్రేణులు కూడా అనుకోలేదట!. భజన్‌లాల్ శర్మ.. మొదటిసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. చివరి నిమిషంలో సీఎం అభ్యర్థుల జాబితాలో ఆయన పేరును చేర్చి.. అదే పేరును ప్రకటించింది బీజేపీ. అయితే ఆయన గెలవరని పార్టీ భావించిందట. అందుకు కారణం లేకపోలేదు. ► భజన్‌లాల్ స్వస్థలం భరత్పూర్. కానీ, ఆయనకు ఆ టికెట్‌ను బీజేపీ ఇవ్వలేదు. అక్కడి నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఆయన ఓడిపోతారని బీజేపీ భావించింది. అందుకే సంగనేర్ టికెట్ ఇచ్చింది. అక్కడా ఆయన నెగ్గుతారని ఊహించలేదట. అయితే.. సంగనేర్ టికెట్ మీద పోటీ చేసి భజన్‌లాల్ 48వేలపైగా మెజారిటీతో నెగ్గారు. ► భజన్‌లాల్ మొదటి నుంచి బీజేపీ పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా పాల్గొనేవారు. అత్యంత ఎక్కువ కాలం బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా పనిచేశారు. ► రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడి పనిచేశారు. ► ఓసీ సామాజికవర్గానికి చెందిన భజన్ లాల్ రాజస్థాన్ వ్యాప్తంగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు. పార్టీలో ఉన్న అన్ని వర్గాల కార్యకర్తలతో సన్నిహితంగా మెలిగేవారు. ► 56 ఏళ్ల భజన్‌లాల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో రూ. 1.5కోట్ల ఆస్తులను చూపించారు. ఇదీ చదవండి: రాజస్థాన్ సీఎంగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే -
రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ శర్మ
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా భజన్‌లాల్ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్‌లాల్ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని ఎంపిక చేసిదంది. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్‌లాల్ శర్మ పేరును రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు. ఇక రాజస్థాన్ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్‌రామ్, గజేంద్ర షెకావత్, అశ్విని వైష్ణవ్ లాంటి సీనియరల పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్‌లాల్ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తరహాలోనే రాజస్థాన్ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 56 ఏళ్ల భజన్ లాల్ శర్మ.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివారు. భజన్ లాల్ రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్లతో విజయం సాధించారు. చదవండి: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీ కౌంటర్ -
మాజీ సీఎం మనువడితో హీరోయిన్ పెళ్లి
తెలుగు చిత్ర పరిశ్రమకు ‘కృష్ణగాడి వీర ప్రేమకథ’లో నానికి జోడీగా నటించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. బాగా రాజకీయ పలుకుబడి ఉన్న ఓ కుటుంబంలోకి కోడలిగా మెహ్రీన్ వెళ్లనుంది. ఎఫ్ 2లో హనీ పాపగా కనిపించిన మెహ్రీన్ మాజీ ముఖ్యమంత్రి మనువడిని మనువాడనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే మెహ్రీన్ కొత్త జీవితం ప్రారంభించనుంది. హరియాణా ముఖ్యమంత్రిగా భజన్ లాల్ బిష్ణోయ్ పని చేశారు. మూడు పర్యాయాలు ఆయన సీఎంగా ఉన్నారు. అతడి మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఆమె వివాహం నిశ్చయమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్. హర్యానాలో రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం వీరిది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలపడంతో మెహ్రీన్, భవ్య కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా వీరి నిశ్చితార్థం మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ వేడుకకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ విల్లా ప్యాలస్ వేదిక కానుంది. ఈ వేడుకకు చాలా తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిగా తెలుస్తోంది. ఎఫ్ 2, కవచం సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఎఫ్ 3 సినిమాతో బిజీగా ఉంది. -
చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా కుటుంబానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చౌతాలా కుమారుడు అభయ్ చౌతాలా, కోడలు నైనా చౌతాలా గెలుపొందారు. ఓంప్రకాష్ మనవడు దుష్యంత్ చౌతాలా ఓటమి చవిచూశారు. మరో మాజీ సీఎం భజన్‌లాల్ బిష్ణోయి కుమారుడు కులదీప్, కోడలు రేణుక విజయం సాధించారు. మరో మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కుమారుడు, బీసీసీఐ మాజీ చీఫ్ రణబీర్ సింగ్, బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరి గెలుపొందారు. మాజీ డిప్యూటీ సీఎం చందర్ మోహన్ ఓడిపోయారు. హర్యానా లోక్‌హిత పార్టీ అధ్యక్షుడు గోపాల్ కందా, ఆయన సోదరుడు గోవింద్ కందా పరాజయం పాలయ్యారు.