
అన్ని ప్రాంతాలూ ‘మెట్రో’తో అనుసంధానం
సాక్షి,సిటీబ్యూరో: నగర సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా మెట్రో స్టేషన్లను తీర్చిదిద్దనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో స్టేషన్లను బస్టాపులు, రైల్వే, ఎంఎంటీఎస్ స్టేషన్లతోపాటు సమీప కార్యాలయాలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్‌కు సైడ్‌వాక్స్, స్కైవాక్స్ (నడిచే దారులు,ఆకాశ వంతెనలు)తో అనుసంధానిస్తామన్నారు. నూతన తరం స్మార్ట్‌సిటీస్ అన్న అం శంపై నగరంలోని మారియట్ హోటల్‌లో బుధవారం నిర్వహించిన ఓ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు చేరుకునేందుకు వీలుగా మెర్రీ గో అరౌండ్ బస్సులను నడపనున్నామని చెప్పారు.
ప్రధాన రహదారులపై 8 అడుగుల విస్తీర్ణంలో స్థలాన్ని వినియోగించుకొని అదే స్థలంలో పిల్లర్లు, వయాడక్ట్ సెగ్మెంట్లు, మెట్రో కారిడార్లు, స్టేషన్లు ఏర్పాటు చేయడం ఇంజినీరింగ్ అద్భుతమన్నారు. ఒక్కో మెట్రో ట్రాక్ ఏడు బస్సు మార్గాలు, 24 కారు మార్గాలతో సమానమన్నారు. నిత్యం 35 లక్షల వాహనాలు నగర రహదారులను ముంచెత్తుతున్నాయని, ఏటా మరో నాలుగు లక్షల వాహనాలు ఈ జాబితాలో చేరుతుండడంతో ట్రాఫిక్ నరకంతో నగరవాసులు విలవిల్లాడుతున్నారన్నారు. మెట్రో ప్రాజెక్టుతో ట్రాఫిక్ ఇక్కట్లు సమూలంగా తీరనున్నాయని తెలిపారు.