అంతర్జాతీయ నౌకాయాన ముఖద్వారంగా వెలుగొందుతున్న విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు.
స్మార్ట్ సిటీ రూపకల్పనకు ప్రజలు సహకరించాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విశాఖపట్నం సిటీ : అంతర్జాతీయ నౌకాయాన ముఖద్వారంగా వెలుగొందుతున్న విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తెలిపారు. వైజాగ్ పటం చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, స్మార్ట్ విశాఖ ఫోరం సంయుక్తంగా ఓ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సిటిజన్ కనెక్ట్ ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే స్మార్ట్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందే అవకాశం లేదని చెప్పారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపంలా క్షణాల్లో స్మార్‌ట సిటీ రూపుదాల్చుకోదని స్పష్టం చేశారు. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు. విశాఖను సుందర నగరంగా తీర్చి దిద్దడానికి ఎంతో మంచి ఆలోచన, ఉద్దేశం, కోరిక ఉన్నప్పటికీ కొంత సమయం పడుతుందన్నారు.
త్వరలో మెట్రో పరుగులు
నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖలో త్వరలోనే మెట్రో రైలు పరుగులు తీయనుందని చెప్పారు. నిన్ననే మెట్రో అధినేత శ్రీధరన్ కలిసి విజయవాడ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇచ్చారని చెప్పారు. విశాఖ డీపీఆర్ కూడా త్వరలోనే ఇస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుందన్నారు. సామాన్యులు కూడా మెట్రోలో హాయి గా ప్రయాణించే వీలుంటుందని చెప్పారు.
హౌసింగ్‌లో పేదలకు స్థానం
హౌసింగ్ ప్రాజెక్టుల్లో పేదలకు సముచిత స్థానం కల్పించాలని అధికారులకు సూచించారు. పేదలు లేకుండా హౌసింగ్ ప్రాజెక్టులు ఉండకూడదన్నారు. ఈ ఊరిపై మొదటి హక్కు పేదలదేనని స్పష్టం చేశారు. పేదలు లేకుండా ధనికులుండగలరా అని ప్రశ్నించారు. పురాతన నాగరికతను మర్చిపోకూడదన్నారు. క్రీస్తుపూర్వం నాటి హరప్పా, మొహంజదారో నగరాల అభివృద్ధితో పోల్చుకుని పయనించాలని సూచించారు.
రాష్ట్రంలో 12 ప్రఖ్యాత విద్యా సంస్థలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. ఈ నెల 11న హిందూపురంలో కస్టమ్స్ ట్రైనింగ్ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. సెంట్రల్ యూనివర్సిటీని అనంతపూర్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విశాఖలోని ఐఐఎంకు, తిరుపతిలోని ఐఐటీ, ఐఈఎస్‌ఆర్‌లకు రూ.2300 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హరిబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బాబూరావు నాయుడు, విశాఖ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కె.రామబ్రహ్మం, స్మార్ట్ విశాఖ ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.