స్మార్ట్‌సిటీకి ‘బ్రేక్‌’ | smart city break | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌సిటీకి ‘బ్రేక్‌’

Published Sat, Sep 17 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

స్మార్ట్‌సిటీకి ‘బ్రేక్‌’

స్మార్ట్‌సిటీకి ‘బ్రేక్‌’

  • కన్సల్టెన్సీ నియామకంపై హైకోర్టు స్టే
  • కాకినాడలో ఎక్కడిపనులు అక్కడే
  • కాకినాడ: 
    స్మార్ట్‌సిటీ పనులకు బ్రేక్‌ పడింది. కన్సల్టెన్సీ నియామకంలో ఎదురైన అభ్యంతరాలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కాకినాడ స్మార్ట్‌సిటీ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముంబాయికి చెందిన వాడియా టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ పరిస్థితి ఎదురైంది.  రానున్న నాలుగేళ్ళలో రూ.1500 కోట్ల విలువైన పనులకు సంబంధించి అన్ని ప్రక్రియలకు అవాంతరం ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే... స్మార్ట్‌సిటీ నిధులతో జరిగే పనులకు సంబంధించి పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టు, అంచనాల తయారీ, పనుల్లో లోటుపాట్లు, సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించేందుకు ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు కావాల్సి ఉంది. ఇందుకు ఆర్థిక, సాంకేతిక పరమైన అంశాల్లో అనుభవం కలిగిన సంస్థలను ఆహ్వానిస్తూ కొద్ది రోజుల క్రితం స్మార్ట్‌సిటీ పేరిట టెండర్‌ పిలిచారు. సుమారు ఏడు సంస్థలు టెండర్లలో పాల్గొన్నాయి. వీటిలో ఆరు సంస్థలు అర్హత కలిగినవిగా గుర్తించి ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఆర్‌వీ అసోసియేట్స్‌ అనే సంస్థను పరిగణనలోకి తీసుకోవాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం కలెక్టర్‌ అధ్యక్షతన కార్పొరేషన్‌ కమిషనర్‌తోపాటు వివిధశాఖలకు చెందిన తొమ్మిది మంది సీనియర్‌ అధికారులతో కూడిన కమిటీ ముందు ప్రతిపాదనలు ఉంచారు. కన్సల్టెన్సీ నియామకంపై తుది నిర్ణయం తీసుకునేలోపు వాడియా సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం కన్సల్టెన్సీ నియామకానికి ఖరారవుతున్న ఆర్‌వీ అసోసియేట్స్‌పై సాంకేతికపరమైన అభ్యంతరాలను లేవనెత్తింది. దీంతో కన్సల్టెన్సీ నియామకంపై స్టే ఇస్తూ రాష్ట్ర హైకోర్టు కాకినాడ నగరపాలక సంస్థకు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తొలి విడతగా విడుదలైన రూ.382 కోట్లతో వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న తరుణంలో కోర్టు ఉత్తర్వులు అందడంతో ప్రస్తుతం స్మార్ట్‌సిటీ పనులకు బ్రేక్‌ పడింది. స్మార్ట్‌సిటీ పనులు ముందుకు సాగాలంటే ప్రతిపాదిత పనులన్నీ  కన్సల్టెన్సీ ద్వారా మాత్రమే జరగాల్సి ఉంది. ఈ నియామకానికి బ్రేక్‌ పడడంతో స్మార్ట్‌సిటీ పనులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అయితే దీనిపై నగరపాలక సంస్థ రాష్ట్ర హైకోర్టుకు తన వాదనను వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇవన్నీ  క్లియర్‌ అయితే తప్ప స్మార్ట్‌సిటీ పనులు ముందుకు సాగే పరిస్థితి కనిపించడంలేదు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement