స్మార్ట్‌గా రూ.9 కోట్లకు ఎసరు | SMART CITY KAKINADA COURT STAY | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌గా రూ.9 కోట్లకు ఎసరు

Published Tue, Oct 4 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

స్మార్ట్‌గా రూ.9 కోట్లకు ఎసరు

స్మార్ట్‌గా రూ.9 కోట్లకు ఎసరు

  • రూ.2000 కోట్లపై ‘దేశం’ పెద్దల కన్ను 
  • వ్యూహాత్మకంగా చక్రం తిప్పిన అధికార పార్టీ నేతలు
  • కోర్టు స్టేతో బెడిసికొట్టిన వైనం
  • అవినీతి మరకలతో స్మార్ట్‌సిటీపై నీలినీడలు
  •  
    గొడ్డు పడిందంటే రాబందులకు సందడే సందడి. ఆ రాబందులు తపనలో ఓ అర్థం ఉంది . కానీ ఈ ‘పచ్చ’ రాబందులకు మాత్రం కాసులు గలగలలు వినిపిస్తే చాలు  రెక్కలను విదిల్చుకుంటూ వాలిపోతాయి. తుని నియోజకవర్గంలో పనులు చేపట్టాలంటే కమీషన్‌ కింద రూ.9 కోట్లు ఇస్తేనే అని అక్కడి టీడీపీ బడా నేతలు ‘పంచాయితీ’ పెట్టడంతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోయిన విషయం ‘సాక్షి’ బయటపెట్టింది. ఇక కాకినాడ కార్పొరేషన్‌ విషయానికి వద్దాం. దీన్ని స్మార్ట్‌ సిటీగా గుర్తించి అభివృద్ధి పనుల కోసం రూ.2 వేల కోట్లను ప్రకటించగానే అభివృద్ధి ముసుగులో తలో కొంత పంచుకోడానికి సమాయత్తమవుతున్నారు. ఓ వైపు తామంతా ‘నిప్పు’లమంటూనే వాటాలేసుకోవడానికి ప్రయత్ని స్తున్నారు. ఇలాంటి వారికి కార్పొరేషన్‌ పీఠం అప్పగిస్తే సర్వం స్వాహా చేసేస్తారని నగర ప్రజలు మండిపడుతున్నారు.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాకినాడ స్మార్ట్‌ సిటీకి వచ్చే రూ.2 వేల కోట్లపై అధికార పార్టీ పెద్దల కన్నుపడింది. రాబోయే నాలుగేళ్లలో ఈ నిధులతో చేపట్టే పనులపై పెత్తనం కోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు స్మార్ట్‌ సిటీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసింది. స్మార్ట్‌ సిటీలో చేపట్టే పనులన్నీ తమ గుప్పెట్లోకి రావాలంటే కీలకమైన ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ (పీఎంసీ)ని తమ వారికి కట్టబెట్టాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం తక్కువ మొత్తానికి కోడ్‌చేసిన కంపెనీని పక్కనబెట్టి అయినవాళ్ల కోసం ఖజానాకు రూ.9 కోట్లు నష్టం తెచ్చేందుకు కూడా వారు వెనుకాడటం లేదు. ఇందుకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు కూడా వత్తాసు పలకడం వివాదాస్పదమై చివరకు న్యాయస్థానం గడపతొక్కింది. ఈ కన్సల్టెన్సీ టెండర్ల బాగోతానికి సంబంధించిన పూర్వాపరాలిలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీ ఎంపికలో భాగంగా మొదటి విడతలో కాకినాడ ఎంపికైంది.

    ఎంపికైన వెంటనే తొలి విడతగా కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.382 కోట్లు విడుదలయ్యాయి. నిధులు విడుదలకావడంతో పనులు, డిజైనింగ్, పర్యవేక్షణ, బిల్లులు మంజూరు తదితర అంశాల పర్యవేక్షణకు  పీఎంసీ ఎంపిక కోసం టెండర్లు పిలిచారు. జాతీయ స్థాయిలో అనుభవం కలిగిన సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. కన్సల్టెన్సీ హక్కుల కోసం దేశంలో పలు ప్రాంతాల నుంచి వాడియా టెక్నాలజీస్, ఆర్‌వీ అసోసియేట్స్, ఎపిటీసా, లీ అసోసియేట్స్, రామబల్, ఫీడ్‌బ్యాక్‌ తదితర ఆరు కంపెనీలు పోటీపడ్డాయి. వీటిలో నాలుగు కంపెనీలను పలు కారణాలతో తిరస్కరించారు. చివరకు ఆర్‌వీ అసోసియేట్స్, వాడియా సంస్థల మధ్య పోటీ నెలకొంది.
     
    చక్రం తిప్పిన టీడీపీ ముఖ్యనేతలు...
    పీఎంసీ కోసం ప్రధాన పోటీదారులైన వాడియా టెక్నాలజీస్‌ రూ.19 కోట్లకు, ఆర్‌వీ అసోసియేట్స్‌ రూ.28 కోట్లకు కోడ్‌ చేసింది. టెండర్‌ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలుండి తక్కువకు కోడ్‌చేసిన కంపెనీకే కాంట్రాక్టు ఖరారు చేయాలి. కానీ కాకినాడ స్మార్ట్‌ సిటీలో మాత్రం అందుకు భిన్నంగా ఎక్కువకు కోడ్‌ చేసిన కంపెనీని ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. ఈ రెండు కంపెనీల్లో తమకు అనుకూలురైన ఆర్‌వీ అసోసియేట్స్‌కు కట్టబెట్టేందుకు అధికార పార్టీ పెద్దలు చక్రం తిప్పారు. పీఎంసీ ఎంపిక తుది దశకు చేరిన సమయంలో తూర్పు గోదావరి నుంచి ప్రాతినిధ్యంవహిస్తున్న ఒక మంత్రి, ఒక పార్లమెంటు సభ్యుడు ఈ వ్యవహారంలో తెరవెనుక చక్రం తిప్పారు. ఫలితంగా రూ.9 కోట్లు ప్రజాధనం అదనంగా ఎందుకు వెచ్చించాల్సి వస్తుందోనని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

    దీనిపై పలు విమర్శలు వస్తున్నా ఆర్‌వీ అసోసియేట్స్‌కు కట్టబెట్టేలా అధికార పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఒప్పించగలిగారు. పీఎంసీని దక్కించుకునేందుకు ఆర్‌వీ అసోసియేట్స్‌ నగరపాలక సంస్థకు తప్పుడు డాక్యుమెంట్లు దాఖలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌వీ అసోసియేట్స్‌కు టీమ్‌ లీడర్‌ పునీత్‌సేథీ టెండర్‌ఫారంలో జతచేసిన సమాచారమంతా మోసపూరితమైందంటూ పలు ఫిర్యాదులు కాకినాడ స్మార్ట్‌ సిటీ చైర్మన్‌గా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్‌ అలీంభాషాకు వెళ్లాయి.
     
    అడుగడుగునా తప్పతోవే..
    కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలోని ‘భూమి ఫోర్‌లైన్‌ హైవే సంస్థ’ ద్వారా 1994–2000 మధ్యలో జలంధర్‌ నుంచి పఠాన్‌ కోట్‌ హైవే పనులను పునీత్‌సేథీ పర్యవేక్షించినట్టు టెండర్‌ ఫారంలో అనుభవ పత్రాన్ని జత చేశారు. వాస్తవానికి ఆ హైవే పనులను 2001–2003 మధ్యన ‘నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా’ ఆధ్వర్యంలో జరిగాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కార్పొరేషన్‌ దృష్టికి వాడియా టెక్నాలజీస్‌ తీసుకువెళ్లింది. ఇదే పునీత్‌ సేథీ దుబాయ్‌ టవర్స్‌ నిర్మాణం 2003లోనే పూర్తయ్యాయి. అటువంటి టవర్స్‌ పనులను 2004–2008 మధ్యలో ఇదే పునీత్‌సేధీ చేసినట్టు ఇచ్చిన సమాచారం కూడా పూర్తిగా అవాస్త విరుద్ధమని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంస్థ టెండర్‌ దాఖలు చేసినా ఆయా సంస్థల టీమ్‌ లీడర్‌కు ఉండే అనుభవం ఆధారంగానే మార్కులు వేస్తారు. కోడ్‌ చేసిన మెుత్తం, సాంకేతిక పరిజ్ఞానం, టర్నోవర్‌ ఇలా అన్ని అంశాలకూ కలిపి 100 మార్కులు నిర్ణయించారు.

    అందులో భాగంగా వేసిన మార్కుల్లో ఎపిటీసాకు 80,వాడియా టెక్నాలజీస్‌ 81, ఆర్‌వీ అసోసియేట్స్‌కు 82, ఫీడ్‌బ్యాక్‌ 78   లీ అసోసియేట్స్‌కు 71, రామబల్‌కు 65 మార్కులు వేశారు. పాయింట్ల ప్రకారం చూసుకుంటే వాడియా టెక్నాలజీస్‌ కంటే ఆర్‌వీ అసోసియేట్స్‌కు ఒక మార్కు అదనంగా వేశారు. కానీ ఇక్కడకొచ్చే సరికి ఇన్ని అసత్యపు అనుభవ పత్రాలు దాఖలు చేసిన పునీత్‌సేథీ వాస్తవ పరిస్థితిని ఎంపిక కమిటీ కనీసం పరిశీలించ లేదు. పైపెచ్చు వాటి ఆధారంగానే ఆర్‌వీ అసోసియేట్స్‌కు ఒక మార్కు ఎక్కువ వేసిన అధికారుల అత్యు త్సాహం తేటతెల్లమవుతోంది. అధికారపార్టీ పెద్దల జోక్యంతో తొమ్మిది కోట్లు అదనంగా కోడ్‌ చేసినప్పటికీ ఆర్‌వీ అసోసియేట్స్‌కు పీఎంసీ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తున్నారు.  
     
    వ్యూహాత్మకంగా అడుగులు...
    అధికారపార్టీ పెద్దలు ఆ సంస్థ ఎంపిక చేయడం వెనుక పెద్ద వ్యూహమే నడిచింది. ఈ మొత్తం వ్యవహారంలో సీఆర్‌డీఏకు చెందిన ఒక ముఖ్యమైన అధికారితోపాటు మంత్రితో సాన్నిహిత్యం ఉన్న కాకినాడ కార్పొరేషన్‌లో ఓ ఇంజినీరింగ్‌ అధికారి అధికార పార్టీ పెద్దలు చెప్పినట్టుగా చక్రం తిప్పి ఆర్‌వీ అసోసియేట్స్‌ను ఎంపిక చేశారనే విమర్శలున్నాయి. ఈ విషయాలన్నీ స్మార్ట్‌ సిటీ కమిటీ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో వాడియా టెక్నాలజీస్‌ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. ఫలితంగా కాకినాడ స్మార్ట్‌సిటీకి పీఎంసీ ఎంపిక నియామక ప్రక్రియకు బ్రేక్‌ పడింది. వచ్చే ఐదేళ్లలో స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి  వందల కోట్లు వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిని కాసుల వేటలోపడి అధికారపార్టీ ముఖ్యనేతలు ఆదిలోనే  మోకాలడ్డుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement