రెండు స్మార్ట్‌సిటీలు మన అదృష్టం
మంత్రి నారాయణ
విజయవాడ బ్యూరో: ఐదేళ్లలో అభివృద్ధి చేసేలా దేశంలో 92 స్మార్ట్ సిటీలు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీలో మూడు నగరాలకే అవకాశం ఇచ్చిందని అప్పట్లో బాధపడ్డానని, ఇప్పుడు తొలి దశలోని 20 స్మార్ట్ సిటీల్లో ఏపీకి రెండు ఇవ్వడం ఆనందంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు. విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో మూడు స్మార్ట్ సిటీలను ఎంపికచేయగా తొలిదశలో తిరుపతిని మినహాయించి విశాఖ, కాకినాడలను అభివృద్ధి చేయనున్నట్టు గురువారం కేంద్రంప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని అన్నారు. విశాఖలో 1,620 ఎకరాల్లో విస్తరించిన రుషికొండ, ఆర్కే బీచ్, కైలాసగిరి ప్రాంతాల్లో రూ.1,602 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
కాకినాడలో 1,375 ఎకరాల్లో విస్తరించిన గాంధీనగర్, రామారావుపేట, రామకృష్ణారావుపేట, సూర్యారావుపేట, ఎల్వీన్‌పేట, మెయిన్‌రోడ్డు, బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్, పోర్టు, కచేరినగర్, ఏటిమొగ, వెంకటేశ్వరకాలనీలను రూ.1,993 కోట్లతో అభివృద్ధి చేస్తారన్నారు. వీటి అభివృద్ధికి కేంద్రం రూ.500, రాష్ట్రం రూ.500కోట్లు కేటాయిస్తుందని, మిగిలిన మొత్తాన్ని ప్రైయివేటు, పబ్లిక్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్దతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన రెండు స్మార్ట్ సిటీలతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలను స్మార్ట్ సిటీలుగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. మూడు నెలల్లో వాటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించాలని సీఎం చెప్పారన్నారు.