సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నగరానికి ఐకానిక్‌గా నిలిచే భవన నిర్మాణానికి గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ (జీవీఎస్‌సీసీఎల్) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే నగరంలో వివిధ ప్రాంతాల్లో సరికొత్తగా రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు సాంకేతిక సహాయంతో ప్రజలకు సేవలందిస్తున్న స్మార్ట్ సిటీ కార్పొరేషన్.. మరో అడుగు ముందుకేసింది.
ఇందుకోసం సంపత్ వినాయక రోడ్డు మార్గంలో ఆశీలమెట్ట ప్రాంతంలో జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాలను నగర అభివృద్ధికి చిహ్నంగా(ఐకానిక్) మార్చేందుకు ప్రతిపాదనలు ఆహా్వనించింది. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయంపై ఈ నెల 12లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తుల(ఈవోఐ)ను కోరింది.
మొత్తం 2.7 ఎకరాల్లో ఏకంగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్‌తో పాటు రిక్రియేషన్ సెంటర్ అభివృద్ధి చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తం రూ.265 కోట్లతో ఏ విధంగా అభివృద్ధి చేస్తారనే విషయాన్ని పేర్కొంటూ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో..
ఆశీలమెట్ట.. నగరంలో వాణిజ్య ప్రాంతం. ఇక్కడ జీవీఎంసీకి చెందిన 2.7 ఎకరాల స్థలం ఉంది. ఈ ప్రాంతంలో 6.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనువుగా ఉంది. 2.16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో వాణిజ్య సముదాయంతో పాటు మాల్, మల్టీప్లెక్స్, హోటల్ టవర్, అర్బన్ రిక్రియేషన్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు.
అయితే.. ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే ప్రతిపాదనలతో సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను సమర్పించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య(పీపీపీ) పద్ధతిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తర్వాత వచ్చే ఆదాయంలో స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 33 ఏళ్ల పాటు లీజు పద్ధతిలో ఈ భూమిని కేటాయించేందుకు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నిర్ణయించింది. దీనిని సబ్‌లీజుకు ఇవ్వడం కానీ, స్థలాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం కానీ కుదరదని స్పష్టం చేసింది.
డీఎఫ్‌బీవోటీ పద్ధతిలో..!
వాణిజ్యానికి అనువుగా ఉండే ఈ ప్రాంతంలో మొత్తం 2.7 ఎకరాల్లో వాణిజ్య భవనాలను నిర్మించాల్సి ఉంటుందని స్మార్ట్ సిటీ కార్పొరేషన్ స్పష్టం చేస్తోంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చే ఈ భూమిలో వాణిజ్య భవనాల ద్వారా వచ్చే ఆదాయంలో జీవీఎంసీకి వాటా ఇవ్వాల్సి ఉంటుంది. వాటా ఇచ్చే శాతంతో పాటు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుని సంస్థ ఎంపిక ఉండనుంది.
అంతేకాకుండా స్థలాన్ని కేవలం లీజు పద్ధతిలో 33 ఏళ్ల పాటు అప్పగించనున్నారు. డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీఎఫ్‌బీవోటీ) పద్ధతిలో చివరకు 33 ఏళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ సిటీ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంటుంది. దీని అభివృద్దికి సుమారు రూ.265 కోట్ల మేర వ్యయం అవసరమవుతుందని అంచనా వేశారు.
ఇందుకు అనుగుణంగా తమ ప్రతిపాదనలతో ఆయా సంస్థలు ఎవరైనా ముందుకు వచ్చేందుకు ఈ నెల 12వ తేదీ నాటికి ఈవోఐలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిని పరిశీలించిన అనంతరం.. ఒక మంచి ప్రతిపాదనను ఓకే చేసి సంస్థ ఎంపిక ప్రక్రియ తర్వాత నిర్మాణాలు చేపట్టనున్నారు. రెండేళ్లలోనే ఐకానిక్ భవనం అందుబాటులోకి తీసుకురావాలన్నదే అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment