సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ మరింత అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో లైట్‌మెట్రోకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. 76 కిలోమీటర్ల మేర నాలుగు కారిడార్లతో నిర్మించనున్న తొలి విడత ప్రాజెక్టుకు రూ.14,309 కోట్లు వ్యయమవుతుందని తెలిపింది. పీపీపీ విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందించేందుకు కావల్సిన పూర్తి డాక్యుమెంట్లను సిద్ధంచేసే పనిలో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు.
76.90 కి.మీ. మేర ప్రాజెక్టు..
విశాఖ నగర ప్రజలకు భవిష్యత్తులో రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు మెట్రోపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తోంది. నెలరోజుల క్రితం సీఎం జగన్ ఆధ్వర్యంలో లైట్‌మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన జీఓను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 76.90 కిమీ మేర లైట్‌మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. హెవీ మెట్రోతో పోల్చిచూస్తే.. లైట్ మెట్రో ద్వారా నిర్మాణ వ్యయంలో 20 శాతం, వార్షిక నిర్వహణలో 15 శాతం భారం తగ్గనున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం లైట్‌మెట్రో వైపే మొగ్గు చూపింది. మెట్రో రైలు రాకతో ట్రాఫిక్ సమస్య తీరడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఒక మెట్రో రైలు వెళ్తే ఎనిమిది బస్సులు వెళ్లినట్లు సమానం. ఒకసారి వెళ్లే మెట్రోలో 400 మంది ప్రయాణించగలరు.
ప్రాజెక్టు గడువు ఎనిమిదేళ్లు..
పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ)–వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్లు జీఓలో స్పష్టంచేశారు. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.14,309 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. ఇక టెండర్లు దక్కించుకున్న సంస్థ ఎనిమిదేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు దక్కించుకున్న మూడేళ్లకు తొలిమార్గంలో ప్రయాణికులకు మెట్రో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుందని జీఓలో స్పష్టంచేశారు. 30 ఏళ్ల పాటు సదరు నిర్మాణ సంస్థకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్‌ఎం) ద్వారా నిర్వహించాల్సి ఉంటుందని, ఈ సమయంలో ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు సంస్థ ఆర్జిస్తుందని డీపీఆర్‌లో తెలిపారు.
17న కేంద్రానికి డీపీఆర్
ఇక విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. కేబినెట్ డీపీఆర్‌ను ఆమోదించినందున లైట్‌మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన జీఓ నెం.161ని ప్రభుత్వం విడుదల చేసింది. జీఓ, డీపీఆర్‌తో పాటు ఇతర డాక్యుమెంట్లన్నీ కలిపి రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పిస్తాం. కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కాపీలు అందిస్తాం. వీలైనంత త్వరగా ప్రాజెక్టును ఆమోదింపజేసి టెండర్లకు వెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు.
లైట్ మెట్రో ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఏపీలో కీలకంగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో శివారు ప్రాంతాలు కూడా కోర్ సిటీకి సమానంగా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు అవసరం. రాబోయే 35–40 ఏళ్లలో నగర ట్రాఫిక్ డిమాండ్‌కి అనుగుణంగా డీపీఆర్ సిద్ధంచేశాం. – యూజేఎం రావు, ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment