సాక్షి, విశాఖపట్నం : ఐటీ పరిశ్రమలకు విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే పలు సంస్థలు తమ శాఖల్ని ఇక్కడ విస్తరిస్తున్నాయి. తాజాగా ఈ వరుసలో దిగ్గజ ఐటీ సంస్థ విప్రో చేరింది. విశాఖలో ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని విస్తరిస్తున్నట్టు ఆ సంస్థ ‘ప్రాజెక్ట్ లావెండర్’ పేరు తో ప్రకటించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న తమ డేటా సెంటర్లలో విశాఖ వెళ్లేందుకు ఉన్న ఉద్యోగుల వివరాల్ని ఈ మెయిల్స్ ద్వారా సేకరించే పనిలో విప్రో నిమగ్నమైంది. ఈ ఏడాది చివరి నాటికి సంస్థను 1000 సీట్లకు విస్తరించే విషయంపై ఇప్పటికే సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం, ఎపిటా జరిపిన చర్చల్లో విప్రో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సంస్థ ప్రకటనతో విశాఖ ఐటీలో కొత్త ఉత్సాహం నెలకొంది.
ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి
అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఇప్పుడు మహా నగరాల నుంచి టైర్–2 సిటీల వైపు చూస్తున్నాయి. టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్‌ఎస్ మొదలైన ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులేస్తున్నాయి. ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
తాజాగా విప్రో కూడా అదే బాటలో విశాఖలో విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. కోవిడ్ సమయంలో వర్క్‌ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడిన ఉద్యోగులు.. తిరిగి కార్యాలయాలకు వచ్చేందుకు ఆసక్తి చూపించని నేపథ్యంలో వారి వద్దకే వెళ్లేందుకు ఐటీ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ వ్యయాల్ని తగ్గించుకునేందుకు ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా విప్రో కూడా విశాఖలో కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చింది.
ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో..
విశాఖలో కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా తమ డెవలప్‌మెంట్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న వారికి విప్రో సంస్థ లేఖలు రాసింది. విశాఖ కేంద్రంగా పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న వారి వివరాలు సేకరిస్తోంది. ఈ తరుణంలో తాజాగా విశాఖలో డేటా సెంటర్ విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వృద్ధి చెందుతున్న నగరాల్లో తమ సంస్థ డెవలప్‌మెంట్ సెంటర్‌ను విస్తరించేందుకు ప్రాజెక్ట్ లావెండర్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా తొలి అడుగు విశాఖలో వేస్తున్నట్టు విప్రో స్పష్టం చేసింది.
వైఎస్సార్ హయాంలో నాంది
సత్యం జంక్షన్‌లో వైఎస్సార్ హయాంలో 2006 మేలో విప్రో క్యాంపస్‌కు ఏడెకరాల స్థలాన్ని కేటాయించారు. అనంతరం మూడున్నరేళ్ల తర్వాత విప్రో తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. 750 మందితో ప్రారంభించాలని భావించినా.. తొలుత 300 మందితో ప్రస్థానం మొదలు పెట్టింది. అయితే కోవిడ్ సమయంలో క్రమంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. పరిస్థితులు చక్కబడటంతో మళ్లీ కార్యకలాపాల జోరు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విప్రో ప్రతినిధులతో చర్చించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఏపీ ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(ఎపిటా) గ్రూప్ సీఈవో కిరణ్‌రెడ్డి విప్రో ప్రతినిధి శశికుమార్‌తో పలు దఫా లుగా చర్చలు జరిపి.. విస్తరించేందుకు ఆహా్వనించారు. దీనిపై సుముఖత వ్యక్తం చేసిన విప్రో.. కా ర్యకలాపాలు ప్రారంభించింది. దశల వారీగా 1000 సీట్లకు విస్తరించేందుకు సిద్ధమని ప్రకటించింది.
మౌలిక సదుపాయాల పనులు పూర్తి
విశాఖలో విస్తరణకు విప్రో సరికొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తోంది. గత క్యాంపస్‌లో కొంత భాగం ఇప్పటికే అద్దెకు ఇచ్చిన విప్రో.. ముందు భవనంలో ఇప్పటికే సేవలు ప్రారంభించింది. ఈ భవనంలోని అన్ని ఫ్లోర్లలోనూ తమ సంస్థ మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఇందులో అద్దెకు ఇచ్చిన వారిని ఖాళీ చేయించారు. వర్చువల్ డెస్క్‌టాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(వీడీఐ), క్లౌడ్ ప్రాజెక్టులకు కేంద్రంగా విశాఖ క్యాంపస్‌ను మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే వీడీఐ ప్రాజెక్టులతో కార్యకలాపాలు ప్రారంభించారు. ఇప్పటికే 1000 మందికి సరిపడా మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనుల్ని దాదాపు పూర్తి చేసింది.
మానవ వనరుల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం
సంస్థ సేవల్ని విశాఖలో విస్తరిస్తామని ప్రభుత్వంతో విప్రో స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి కల్లా 1000 సీట్లకు పెంచుతామని చెప్పారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు విప్రో ప్రతినిధులు హామీ ఇవ్వడం శుభపరిణామం. వైజాగ్‌లో టాలెంట్, అప్‌స్కిల్లింగ్, అనుభవజు్ఞలైన నిపుణుల్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేశాం. భవిష్యత్తులో ఏ క్‌లైయింట్ వచ్చినా.. ఇక్కడికే తీసుకురావాలని సూచించాం. దానికి కావాల్సిన మానవ వనరుల్ని అందిస్తామన్నాం. దానికి విప్రో ప్రతినిధులు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫు నుంచి పూర్తి సహకారంతో పాటు విప్రో ప్రాజెక్టులకు అవసరమైన రిక్రూట్‌మెంట్‌కు కూడా సహకారం అందిస్తామని హామీ ఇచ్చాం. – కిరణ్‌రెడ్డి, ఎపిటా గ్రూప్ సీఈవో
Comments
Please login to add a commentAdd a comment