స్మార్ట్ కళ వచ్చేసింది
సుందర నగరంగా తిరుపతి
ఏటా రూ.500 కోట్లు సమకూరే అవకాశం
పరిష్కారం కానున్న తాగునీటి సమస్య
ఆనందంలో స్థానిక ప్రజానీకం
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తిరునగరికి కొత్త యోగం దక్కింది. అత్యాధునిక హంగులతో.. వడివడిగా అభివృద్ధి చెందనున్న స్మార్ట్ సిటీ జాబితాల్లో చోటు సంపాదించింది. ఇక తమ సమస్యలు పరిష్కారమవుతాయని తిరుపతి వాసులు ఊహాలోకాల్లో తేలిపోతున్నారు.
తిరుపతి : కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఢిల్లీలో గురువారం సహచర మంత్రి అనంతకుమార్‌తో కలసి స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించారు. అందులో తిరుపతి నగ రం ఉండడం స్థానికులను ఆనందంలో ముంచెత్తింది. స్మార్ట్ ప్రకటనతో నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. నిధుల వరద పారనుంది.
‘అమృత’ హరివిల్లు!
ఇప్పటికే అమృత్ పథకం కింద తిరుపతి నగరం ఎంపికైంది. ప్రభుత్వం రూ.25 లక్షల వరకు నిధులు విడుదల చేసింది. తిరుపతి నగరం అన్ని హంగులతో అభివృద్ధి చెంది కొత్త శోభ సంతరించుకోనుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా ఎలాంటి పథకానికైనా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు అందే అవకాశం ఉంది.
‘స్మార్ట్’ఎంపికతో లాభాలివి
{పతి ఏడాదీ కేంద్రం నుంచి రూ. 500 కోట్ల నిధులు
నీటి సమస్య పరిష్కారం
నిరంతర విద్యుత్ సరఫరా
పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
{పజారవాణా వ్యవస్థకు పెద్ద పీఠ
పేదలకు గృహ వసతి
ఐటీ కనెక్టివిటీ సుపరిపాలనతో పాటు అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యం
నగరపాలక మ్యాచింగ్ గ్రాంట్లతో అభివృద్ధి
ఎంపికకు కొలమానం
స్మార్ట్ సిటీ ఎంపికకు సంబంధించి సుమారు 15 అంశాలను కొలమానంగా తీసుకున్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, ఇ- గవర్నర్స్, గ్రీవెన్స్ పరిష్కారం, ఆదాయ వ్యయాలు, ఖర్చుకు తగ్గ ఆదాయం అంశాలను ఇందులో పొందుపరిచారు. ప్రధానంగా 90 శాతం పైగా ఆడిట్ సకాలంలో జీతాల చెల్లింపులను పరిగణనలోనికి తీసుకున్నారు.
టాస్క్‌ఫోర్సు కమిటీ ఏర్పాటు
స్మార్ట్‌సిటీ ఎంపికకు ముందే టాస్క్‌ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్ మెంబర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఎస్పీ జాతీయ రహదారుల భవనాల శాఖ, ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ, రవాణా, రహదారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తిరుపతి నగరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమయ్యింది.