Minister M. Venkaiah Naidu
-
వరంగల్ ఖిలా పునరుద్ధరణకు నిధులు
హృదయ్ పథకం కింద పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం సాక్షి, న్యూఢిల్లీ: హృదయ్ పథకం కింద వరంగల్, వారణాసి, అమృత్సర్, ద్వారక, పూరీ నగరాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ.114 కోట్లు మంజూరు చేసింది. ఆయా ప్రాజెక్టులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని ఆ శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారం ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఐదు నగరాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాజీవ్‌గాబా నేతృత్వంలోని కమిటీ ఆమోదించింది. వారణాసికి రూ.13.25 కోట్లు, అమృత్‌సర్‌కు రూ.57 కోట్లు, పూరీకి రూ.17 కోట్లు, ద్వారకకు రూ.10 కోట్లు, వరంగల్‌కు రూ.15.30 కోట్లు మంజూరు చేశారు. వరంగల్‌కు కేటాయించిన నిధులతో ఖిలాకు వెళ్లే మార్గాలు, ప్రవేశ ద్వారాల పునరుద్ధరణ...ఉత్తర ద్వారం వద్ద మౌలిక వసతుల వంటివి ఏర్పాటు చేస్తారు. రూ.350 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం హృదయ్ పథకం కింద దేశవ్యాప్తంగా 12 నగరాల్లోని వారసత్వ సంపద గల ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఏపీ నుంచి అమరావతి, తెలంగాణ నుంచి వరంగల్ నగరాలున్నాయి. మొత్తం 12 నగరాల్లో ఇప్పటివరకు రూ.350 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు వెంకయ్యనాయుడు తెలిపారు. హెరిటేజ్ నగరాలపై ఇక్కడ జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. -
‘సబర్బన్’ పనులకు కేంద్రం ఆమోదం
► బెంగళూరు-మైసూరు మధ్య రైల్వే పనులు ► కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడి ► వివిధ అభివృద్ధి పనుకుల శంకుస్థాపన ► తీరిన కన్నడిగుల కల ► సిటీ రైల్వే స్టేషన్‌కు క్రాంతివీర సంగూళి రాయణ్ణ పేరు బెంగళూరు (బనశంకరి) : బెంగళూరు-మైసూరు ఉపనగర మధ్య సబర్బన్ రైల్వే పనులకు కేంద్రం ఆమోద ముద్ర వేసిందని కేంద్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు వెల్లడించారు. నగరంలోని రైల్వే ఇన్స్టిట్యూట్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యలహంక- పెనుకొండ, అరిసికెరె-తుమకూరు, హుబ్లీ- చిక్కజాజూరు డబ్లింగ్ పనులు, కొప్పళ రైల్వేస్టేషన్ రోడ్డు ప్లైఓవర్ పనులకు ఆయన కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మాజీ ప్రధాని దేవేగౌడ తదితరులతో శంకుస్థాపన చేశారు. ఇదే కార్యక్రమంలో బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ పేరును లాంఛనంగా ‘క్రాంతివీర సంగొళ్లిరాయణ్ణ స్టేషన్’గా మార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... క్రాంతివీర సంగూళ్లి రాయణ్ణ పేరును నగర రైల్వే స్టేషన్‌కు పెట్టాలన్న కన్నడిగుల కోరిక నెరవేరిందన్నారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశం అన్ని రంగాల్లో ముందుంజలో ఉంటుందన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందన్నారు. సబర్బన్ రైల్వేతో పాటు మెట్రోరైల్వే సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే బెంగళూరులోని ట్రాఫిక్ సమస్య దాదాపుగా తగ్గిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేశ్‌ప్రభు మాట్లాడుతూ... బెంగళూరు-మైసూరు, బెంగళూరు-హుబ్లీ మధ్య సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రారంభించే ఆలోచన ఉందని వెల్లడించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బెంగళూరు నుంచి హుబ్లీ, మైసూరు మధ్య సెమీ హై స్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటుచేయడం వల్ల ఆయా ప్రాంతాల నుంచి ప్రతి రోజు బెంగళూరుకు వచ్చే ప్రజలకు ఉపయుక్తంగా ఉండటమే కాకుండా ఆయా మార్గాల్లో ట్రాఫిక్ సమస్యను కూడా తీరుతుందన్నారు. కేంద్ర ఎరువులు రసాయనశాఖ మంత్రి అనంతకుమార్ మాట్లాడుతూ... బెంగళూరు- హుబ్లీ రైల్వే డబ్లింగ్ పనులను మూడేళ్లలోగా పూర్తి చేస్తే రాష్ట్ర ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. పనులు పూర్తయితే ఈ మార్గంలో ప్రయాణం 7 గంటల నుంచి నాలుగన్నర గంటకు తగ్గుతుందన్నారు. -
చట్టసభల్లో నియమావళి అవసరం
- కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్య - విశాఖలో అఖిల భారత విప్ల సదస్సు ప్రారంభం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలో చట్టసభలు, సభ్యుల విశ్వసనీయత సంక్షోభంలో చిక్కుకుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చట్టసభల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రవర్తనా నియామావళి రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు విభేదాలకంటే జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తేనే దేశ ప్రగతి సాధ్యమని చెప్పారు. 17వ అఖిల భారత విప్ల రెండురోజుల సదస్సును విశాఖపట్నంలో మంగళవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణాత్మక పాత్ర పోషించాలి.. ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా నిలిచేలా మన చట్టసభలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైన రాజకీయ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత విప్ల మీద ఉందన్నారు. అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై విప్ల సదస్సు చర్చించి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు. సభ్యుల స్వీయ క్రమశిక్షణే అన్నింటికంటే ఉత్తమమైందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేల జీతభత్యాలు హేతుబద్ధంగా పెంచే విషయంపై చర్చించి సిఫార్సులు చేయాలన్నారు. ‘నో వర్క్.. నో పే’ పేరిట నెటిజన్లు ప్రతిపాదిస్తున్న అంశంపైనా చర్చించాలని ఆయన చెప్పారు. సమన్వయలోపమే సమస్య..: చంద్రబాబు అన్ని పార్టీలకూ అజెండాలు ఉన్నప్పటికీ అందరి అంతిమ లక్ష్యం దేశ ప్రయోజనాలే కావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. చట్టసభల్లో సభ్యుల మధ్య సమన్వయలోపం ప్రజాస్వామ్య వ్యవస్థకు పెద్ద సవాలుగా మారిందన్నారు. శాసనమండలి చైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ చట్టసభల సక్రమ నిర్వహణకు సభ్యులకు ప్రవర్తనా నియామవళి, సభాధ్యక్షుల విసృ్తత అధికారాల మీద చర్చించాలన్నారు. ఈ సమావేశాల్లో పార్లమెంటరీ కార్యదర్శి అజ్మల్ అమానుల్లా, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణలతోపాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రులు, చీఫ్ విప్‌లు, వివిధ పార్టీల విప్‌లు పాల్గొన్నారు. -
ఎంపీల వేతన సిఫార్సులపై కమిటీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల వేతనాల సవరణలకు సంబంధించి ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఎంపీల వేతనాలతో పాటు ఇతర అలవెన్సులపై త్రిసభ్య కమిటీ కేంద్రానికి సిఫార్సులను చేయనుంది. చివరిసారిగా ఎంపీల వేతనాల సవరణ 2010లో జరిగింది. ప్రస్తుతం ఎంపీలు రూ.50 వేల మూలవేతనం పొందుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అధ్యక్షతన వైజాగ్‌లో 29వ తేదీన ప్రారంభమవనున్న రెండు రోజుల అఖిల భారత విప్ల సమావేశంలో త్రిసభ్య కమిటీ ఏర్పాటు ప్రతిపాదనపై చర్చ జరగనుంది. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడానికి ఎంపీలు, అలానే అసెంబ్లీలో శాసనసభ్యుల మధ్య సమన్వయం కోసం అంతర్ పార్టీల ఫోరం ఏర్పాటు అంశంపై కూడా చర్చ జరుగుతుంది. -
స్మార్ట్ కళ వచ్చేసింది
సుందర నగరంగా తిరుపతి ఏటా రూ.500 కోట్లు సమకూరే అవకాశం పరిష్కారం కానున్న తాగునీటి సమస్య ఆనందంలో స్థానిక ప్రజానీకం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తిరునగరికి కొత్త యోగం దక్కింది. అత్యాధునిక హంగులతో.. వడివడిగా అభివృద్ధి చెందనున్న స్మార్ట్ సిటీ జాబితాల్లో చోటు సంపాదించింది. ఇక తమ సమస్యలు పరిష్కారమవుతాయని తిరుపతి వాసులు ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. తిరుపతి : కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఢిల్లీలో గురువారం సహచర మంత్రి అనంతకుమార్‌తో కలసి స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించారు. అందులో తిరుపతి నగ రం ఉండడం స్థానికులను ఆనందంలో ముంచెత్తింది. స్మార్ట్ ప్రకటనతో నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. నిధుల వరద పారనుంది. ‘అమృత’ హరివిల్లు! ఇప్పటికే అమృత్ పథకం కింద తిరుపతి నగరం ఎంపికైంది. ప్రభుత్వం రూ.25 లక్షల వరకు నిధులు విడుదల చేసింది. తిరుపతి నగరం అన్ని హంగులతో అభివృద్ధి చెంది కొత్త శోభ సంతరించుకోనుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా ఎలాంటి పథకానికైనా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు అందే అవకాశం ఉంది. ‘స్మార్ట్’ఎంపికతో లాభాలివి {పతి ఏడాదీ కేంద్రం నుంచి రూ. 500 కోట్ల నిధులు నీటి సమస్య పరిష్కారం నిరంతర విద్యుత్ సరఫరా పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం {పజారవాణా వ్యవస్థకు పెద్ద పీఠ పేదలకు గృహ వసతి ఐటీ కనెక్టివిటీ సుపరిపాలనతో పాటు అన్ని రంగాల్లో ప్రజల భాగస్వామ్యం నగరపాలక మ్యాచింగ్ గ్రాంట్లతో అభివృద్ధి ఎంపికకు కొలమానం స్మార్ట్ సిటీ ఎంపికకు సంబంధించి సుమారు 15 అంశాలను కొలమానంగా తీసుకున్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, ఇ- గవర్నర్స్, గ్రీవెన్స్ పరిష్కారం, ఆదాయ వ్యయాలు, ఖర్చుకు తగ్గ ఆదాయం అంశాలను ఇందులో పొందుపరిచారు. ప్రధానంగా 90 శాతం పైగా ఆడిట్ సకాలంలో జీతాల చెల్లింపులను పరిగణనలోనికి తీసుకున్నారు. టాస్క్ఫోర్సు కమిటీ ఏర్పాటు స్మార్ట్‌సిటీ ఎంపికకు ముందే టాస్క్ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్‌గా నగరపాలక సంస్థ కమిషనర్ మెంబర్ గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఎస్పీ జాతీయ రహదారుల భవనాల శాఖ, ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ, రవాణా, రహదారులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే తిరుపతి నగరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సమావేశమయ్యింది. -
సమస్యల కొల్లేరు ఆశల సెలయేరు
నెరవేరేనా ఈ మారు రేపు కొల్లేటికోటకు కేంద్రమంత్రుల రాక కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలతో సమావేశం ఆశలన్నీ కాంటూరు కుదింపుపైనే.. కోల్లేటివాసుల జీవనప్రదాయినిగా.. అంతులేని మత్స్యసంపదకు ఆలవాలంగా.. ప్రకృతి రమణీయతకు పట్టుకొమ్మగా విలసిల్లుతున్న కొల్లేరు సిరుల సెలయేరు. ప్రశాంతతకు చిహ్నంగా.. శాంతికపోతంగా పైకి కనిపించే ఈ సరస్సు వెనుక ఏళ్ల తరబడి కన్నీరు ప్రవాహమై ఉరకలేస్తోంది. ఎన్నో సమస్యలు.. ఎంతోమంది పాలకులు.. వచ్చిపోయే వారే గానీ పరిష్కారం చూపేవారే లేక.. కొల్లేరు కన్నీటి ఏరై నెమ్మదిగా కదులుతోంది. ఆ కన్నీళ్లను తుడుస్తానంటూ.. ఆశల పల్లకీని మోసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం కోసం కొల్లేరువాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం హెలికాప్టర్లో కొల్లేరులో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలతో బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. కొల్లేటి సమస్యల పరిష్కారానికి ఈ సమావేశం కీలకం కానుంది. - కైకలూరు కొల్లేటి సమస్య ఎప్పుడూ ప్రభుత్వాలకు సవాల్‌గానే మారుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 77వేల 131 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయార ణ్యం విస్తరించి ఉంది. ఇక్కడి ఆక్రమిత చెరువుల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని సుప్రీంకోర్టులో పర్యావరణవేత్తలు పిల్ వేయడంతో 2006లో ఇరు జిల్లాల్లోనూ 31వేల 125.75 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమిత చేపల చెరువులను ధ్వంసం చేశారు. అప్పటి నుంచి కొల్లేరు వాసులు కొల్లేరు కాంటూరు పరిధిని +5 నుంచి +3 వరకు కుదించాలని కోరుతున్నారు. అదేవిధంగా కృష్ణాజిల్లాలో కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలని చెబుతున్నారు. ఆ ఆశలు నెరవేరేనా.. కొల్లేరు ప్రజల చిరకాల ఆశలు ఈసారైనా నెరవేరుతాయా అనే అనుమానం ఇక్కడి ప్రజల్లో నెలకొంది. ప్రతిసారీ నాయకులు రావడం.. వాగ్దానాలు చేసి వెళ్లడం పరిపాటిగా మారింది. అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ 2010 ఫిబ్రవరిలో కొల్లేటికోటలో సమావేశం నిర్వహించారు. కాంటూరు కుదింపుపై సానుకూలంగా మాట్లాడారు. అంతా బాగుంటుందనే సమయానికి 2010 మే 21న చిత్తడి నేలల చట్టం పరిధిలోకి కొల్లేరును చేరుస్తూ కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ముసాయిదా విడుదల చేసింది. దేశంలోని 25 చిత్తడి ప్రాంతాల్లో కొల్లేరును చేర్చింది. అనంతరం 2010 సెప్టెంబరు 19 నుంచి 24వ తేదీ వరకు ప్రముఖ పర్యావరణవేత్త ఆజీజ్ నేతృత్వంలో కమిటీ కొల్లేరులో పర్యటించి నివేదిక అందించింది. ఆ నివేదికలో కూడా పర్యావరణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్ మరణాంతరం 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొల్లేరుపై సబ్‌కమిటీ వేస్తానని చెప్పారు. ఆ హామీలన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుతం వస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు ఏ మేరకు న్యాయం చేస్తారా అని కొల్లేరు ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొల్లేరు ప్రజలు వలసపోతున్నారు కొల్లేరు ప్రజలు ఉపాధిలేక వలస పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు 5 నుంచి 3వ కాంటూరు వరకు కుదించాలి. పేదలకు భూములు పంచాలి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. కొల్లేరు మత్స్యకారుల వేటకు ఉపయోగించే వలలను శుక్రవారం జరిగే కేంద్రమంత్రుల సమావేశంలోనైనా పంపిణీ చేయాలి. - దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ కైకలూరు సమన్వయకర్త మిగులు భూములు పంచాలి కొల్లేరు కాంటూరును కుదించి మిగులు భూములను ప్రజలకు పంపిణీ చేయాలి. కాంటూరు కుదింపు అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో జిల్లాలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఈ భూములను ముందుగా పంపిణీ చేస్తే కొల్లేరు ప్రజలకు ఊరట కలుగుతుంది. - జయమంగళ వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే, కైకలూరు కాంటూరు కుదింపు ప్రమాదం కాంటూరు కుదింపు కొల్లేరు మనుగడకే ప్రమాదం. ఇప్పటికే కొల్లేరుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను పంపిణీ చేయాలి. గోదావరి నది నుంచి కొల్లేరుకు నీరు చేరేలా ప్రణాళిక రూపొందించాలి. కొల్లేరులో రెగ్యులేటర్ నిర్మించాలి. దీనివల్ల కొల్లేరులో నీరు ఎప్పుడూ నిల్వ ఉంటుంది. - ఎర్నేని నాగేంద్రనాథ్, కొల్లేరు సరస్సు పునరుద్ధరణ సమితి అధ్యక్షుడు ఆశలు అడియాసలు చేయొద్దు కొల్లేరు ప్రజలు కాంటూరు కుదింపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో మంత్రులు ఇచ్చిన వాగ్దానాలు అమలు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. కొల్లేరు ఆపరేషన్ సమయంలో చెరువులు కోల్పోయిన జిరాయితీ రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరు సమస్యలపై సానుకూలంగా స్పందించాలి. - నబిగారి రాంబాబు, కొల్లేరు అభివృద్ధి సంఘ జిల్లా అధ్యక్షుడు -
పనులు చేస్తేనే పన్నులు చెల్లిస్తారు
సొంతగా వనరుల సేకరణపై దృష్టిపెట్టండి శ్వేతపత్రాలు విడుదల చేయండి ‘స్వచ్ఛ భారత్’ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ సెంట్రల్ : పనులు సరిగా చేస్తే ప్రజలు పన్నులు సక్రమంగా చెల్లిస్తారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. సొంత వనరుల సేకరణపై మున్సిపల్ యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు. రాష్ట్రస్థాయి స్వచ్ఛ భారత్ వర్క్‌షాపును శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పారు. ఆదాయ వనరులను ప్రజలకు తెలియజేసి ఆర్థిక పరిపుష్టికి సహకారం కోరాలని సూచించారు. ప్రజల ఆలోచనల్లో మార్పు చోటు చేసుకుంటుందన్నారు. ఎక్కువ సౌకర్యాలు కావాలని కోరుకున్నప్పుడు పన్నుల భారాలు తప్పవని పేర్కొన్నారు. విద్యుత్, నీరు, గృహ వసతి పేదలకు కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని చెప్పారు. ప్రజలకు వాస్తవాలు చెప్పి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా వారిని నడిపించగలిగినవాడే నిజమైన నాయకుడన్నారు. స్వచ్ఛభారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాలు, నగరాల్లో హోటళ్లు, ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థల నుంచి వెలువడే చెత్తను ఆయా సంస్థలే పరిష్కరించుకొనే విధంగా నిబంధనలను కఠినతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. పారిశుధ్యం, చెత్త తొలగింపులో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ నుంచి కేంద్రం వ్యక్తిగత టాయ్లెట్ల నిర్మాణానికి రూ.4 వేలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,333 అందజేస్తుందని, కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా రెండు శాతం సొమ్మును చెల్లించాలని కోరారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను సొంతబిడ్డలా ప్రతి ఒక్కరూ భావించాలన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మరుగుదొడ్లు రాష్ట్ర మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ఐదు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. కేంద్రం అందించే రూ.4 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.11 వేలు అందిస్తోందన్నారు. పట్టణాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లకు అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరాయిస్తోందన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ డెరైక్టర్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జాయింట్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ వాణీమోహన్, నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ డెరైక్టర్ అనిమేష్ భార్తి, సెంటర్ పబ్లిక్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ జాయింట్ అడ్వయిజర్ వీకే చౌరాసియా, డెప్యూటీ సలహాదారు రోహిత్ కక్కుర్, ఉపాధ్యక్షుడు సుమన్ చహర్, రాంకీ ఎన్విరాన్ ఇంజినీర్స్ సంస్థ జాతీయ ప్రతినిధి ఆర్.మోహనరావు, 13 జిల్లాలకు చెందిన 99 మంది మున్సిపల్ కమిషనర్లు, 47 మంది మేయర్లు, చైర్పర్సన్లు హాజరయ్యారు. మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అభివృద్ధే టార్గెట్
సాక్షి, విజయవాడ : కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.152 కోట్లతో నిర్మిస్తున్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) భవన సముదాయాలను ఆయన పరిశీలించారు. వేగవంతంతో, నైపుణ్యంతో, నిర్ధిష్ట సమయంలో నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. నాణ్యత విషయం ఏ మాత్రం రాజీ పడవద్దని అధికారులను హెచ్చరించారు. జమ్మి చెట్టు సెంటర్లో హడ్కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తూ దేశంలోని అందరికి 2022 నాటికి సొంత ఇల్లు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. హోటల్పార్చున్ మురళీపార్కులో జాతీయ జలరవాణా అభివృద్ధిపై 13 జిల్లాల ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణ పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జలరవాణాకు సర్వేలు జరుగుతున్నాయని, పార్లమెంట్లోఆమోదం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా సంఘటితంగా కృషి చేయాలన్నారు. ఆకాశవాణి కేంద్రంలో జాతీయపతాకం రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దేశసేవకు అంకితమైన మహానీయుల స్ఫూర్తితో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకప్రియుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని తెలుగులో మంచి రచయితలు ఉన్నారని, వాటి రచనలు ఇతర భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశగా తాను కృషి చేస్తానని అన్నారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వాహకులు ఎన్.శ్రీధరన్ మాట్లాడారు.