సాక్షి, విజయవాడ : కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. విజయవాడలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయన దృష్టి సారించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.152 కోట్లతో నిర్మిస్తున్న స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా) భవన సముదాయాలను ఆయన పరిశీలించారు. వేగవంతంతో, నైపుణ్యంతో, నిర్ధిష్ట సమయంలో నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు.
నాణ్యత విషయం ఏ మాత్రం రాజీ పడవద్దని అధికారులను హెచ్చరించారు. జమ్మి చెట్టు సెంటర్‌లో హడ్‌కో ప్రాంతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తూ దేశంలోని అందరికి 2022 నాటికి సొంత ఇల్లు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. హోటల్‌పార్చున్ మురళీపార్కులో జాతీయ జలరవాణా అభివృద్ధిపై 13 జిల్లాల ఎంపీలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కేంద్ర ఉపరితల శాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణ పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు జలరవాణాకు సర్వేలు జరుగుతున్నాయని, పార్లమెంట్‌లోఆమోదం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా సంఘటితంగా కృషి చేయాలన్నారు. ఆకాశవాణి కేంద్రంలో జాతీయపతాకం రూపశిల్పి, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ దేశసేవకు అంకితమైన మహానీయుల స్ఫూర్తితో శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సాయంత్రం బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన పుస్తకప్రియుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని తెలుగులో మంచి రచయితలు ఉన్నారని, వాటి రచనలు ఇతర భాషల్లోకి అనువదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదిశగా తాను కృషి చేస్తానని అన్నారు. బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వాహకులు ఎన్.శ్రీధరన్ మాట్లాడారు.
అభివృద్ధే టార్గెట్
Published Mon, Jan 5 2015 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM
Advertisement