
న్యూఢిల్లీ: విద్యారంగానికి 2019–20 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.93,847.64 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్ కంటే 10 శాతం అధికం. ఈ బడ్జెట్‌లో ఉన్నత విద్యకు రూ.37,461.01 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 56,386.63 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.85,010 కోట్లు విద్యారంగానికి కేటాయించారు. వైద్య సంస్థలతోపాటు ప్రధాన విద్యాసంస్థల్లో పరిశోధనల రంగంలో పెట్టుబడులు, సంబంధిత మౌలిక వసతుల కోసం ‘రివైటలైజింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ (రైజ్)’అనే కొత్త పథకాన్ని తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇందులో 2022నాటికల్లా రూ. లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతారు.
కొత్తగా ఎస్పీఏలు..
►‘స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ)’పేరుతో రెండు పూర్తిస్థాయి సంస్థలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించారు. దీనికి అదనంగా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో 18 ఎస్పీఏలను స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా ఏర్పాటుచేస్తారు. దీనికోసం ఐఐటీ/ఎన్‌ఐటీల డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ప్రతిపాదనలను సమర్పించాలని గోయల్ కోరారు.
►ఈసారి ప్రభుత్వం పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.608.87 కోట్లు కేటాయించింది. ఇది గత బడ్జెట్‌లో రూ.350.23 కోట్లుగా ఉంది.
►విద్యలో నాణ్యత పెరగాలంటే సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్లాలని, ‘బ్లాక్‌బోర్డు’నుంచి ‘డిజిటల్ బోర్డుకు’మారాలని చెప్పారు. టీచర్లు అధునాతన సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు సాధించేందుకు, వారికి డిజిటల్ సౌకర్యాలు కల్పించేందుకు ‘దిక్షా’ను అభివృద్ధి చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment