సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర సర్కారు వరాల వర్షం కురిపించింది. మరోసారి గెలుపే లక్ష్యంగా సాగిన ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు, రైతాంగానికి భారీగా తాయిలాలు ప్రకటించింది. ఆర్థిక మంత్రి పీయూష్‌గోయల్ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక చేయూత ఇచ్చింది. ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. గృహ కొనుగోళ్లపై జీఎస్‌టీ తగ్గింపు వంటి నిర్ణయాల పట్ల జిల్లా ప్రజల్లో సానుకూల స్పందన లభిస్తోంది. అసంఘటిత కార్మికులకు అండ అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం దిశగా అడుగులు పడ్డాయి.
60 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ ఇవ్వన్నుట్లు బడ్జెట్‌లో పొందుపర్చారు. అయితే ఈ కార్మికులు నెలకు రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వయసు 60 ఏళ్లు నిండినప్పటి నుంచి నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్ పొందవచ్చు. జిల్లాలో వందల సంఖ్యలో పరిశ్రమలు, కంపెనీలు ఉన్నాయి. రియల్ రంగం జోరుమీదుండటంతో భవన నిర్మాణ కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం మీద జిల్లాలోని సుమారు 1.60 లక్షల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూరనుంది.
ఐదు లక్షల మంది ఉద్యోగులకు ఊరట
వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పించింది. ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచింది. ఊహించనిరీతిలో పరిమితిని రూ.5 లక్షలుగా నిర్దేశించింది. వార్షిక ఆదాయం రూ.5లక్షల వరకూ ఉన్న వారు ఇకపై ఆదాయపుపన్ను చెల్లించనవసరం లేదు. పొదుపు, పెట్టుబడులతో కలిపి రూ.6.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వేతనజీవులకు వెసులుబాటు కలుగనుంది.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 20వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తుండగా..వీరందరికి తాజా నిర్ణయంతో ఐటీ చెల్లింపు బాధల నుంచి విముక్తి కలుగనుంది. జిల్లాలోని ఐటీ హబ్‌లో పనిచేస్తున్న దాదాపు లక్ష మందికిపైగా ఐటీ నిపుణులకు కూడా కొంతమేర పన్ను మినహాయింపు దక్కనుంది. వీరేగాకుండా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రక్షణసంస్థల్లో పనిచేస్తున్న మరో లక్ష మందికి కూడా ఆదాయ పన్ను పరిమితి పెంపుతో రాయితీ లభించనుంది. ఇంకోవైపు ప్రవేటు రంగ సంస్థల్లో పనిచేసే వేతన జీవులకు కూడా ఈ నిర్ణయం కలిసి రానుంది.
2.13లక్షల మంది రైతులకు ప్రయోజనం
వ్యవసాయానికి మంచిరోజులు వచ్చాయి. రైతుబంధు కింద రాష్ట్ర సర్కారు ఇప్పటికే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించగా.. తాజాగా కేంద్రం కూడా ఐదెకరాల్లోపు రైతులకు ఏడాదికి రూ.6,000 ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ ద్వారా చిన్నకారు రైతులకు ఈ సాయం అందనుంది. ఐదు ఎకరాల్లోపు భూమి ఉండే ప్రతి రైతుకు మూడు వాయిదాల్లో ఈ మొత్తం చెల్లించనున్నారు. నేరుగా వారి ఖాతాల్లోకి ఈ సొమ్మును బదిలీ చేయనున్నారు. ఈ పథకంతో జిల్లా వ్యాప్తంగా 2,13,208 మంది రైతులకు ప్రయోజనం చేకూరనుందని అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై రూ.127.92 కోట్ల ఆర్థిక భారం పడనుంది. 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
అంగన్‌వాడీలకు మేలు
మధ్యంతర బడ్జెట్‌లో అంగన్‌వాడీ టీచర్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామం. వారి వేతనాలను 50 శాతం పెంచారు. ప్రస్తుతం ప్రతి అంగన్‌వాడీ టీచర్‌కు నెలకు రూ. 10,500 గౌరవ వేతనాన్ని అందజేస్తున్నారు. ఇందులో కేంద్రం వాటా రూ.3 వేలు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 చెల్లిస్తోంది. బడ్జెట్‌లో పొందుపర్చిన మేరకు ఇకపై కేంద్రం వాటా రూ.6 వేలు ఉండనుంది. అంటే టీచర్లకు రూ.13,500 వేతనం అందనుంది. ఫలితంగా జిల్లాలో సుమారు 1,580 మంది అంగన్‌వాడీ టీచర్లకు మేలు ఒనగూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment