ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్‌లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్‌డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్‌వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్‌ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు.
ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్‌కీ బార్ చార్‌సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్‌సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం.
ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం
నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు.
హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక?
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు.
మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్‌గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్‌ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్‌లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్‌చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది.
వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత
చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్‌సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్‌ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్‌రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్‌లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్‌లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు.
కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment