అయోమయమా, అతి లౌక్యమా? | Article on Chandrababu Role In TDP Defeat | Sakshi
Sakshi News home page

అయోమయమా, అతి లౌక్యమా?

Published Sun, Jun 16 2019 12:10 AM | Last Updated on Sun, Jun 16 2019 12:11 AM

Article on Chandrababu Role In TDP Defeat - Sakshi

నిజమే. ప్రజాతీర్పును అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు అమరావతిలో జరిగిన విస్తృత సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యం లేదు. మే 23న ఓట్ల లెక్కింపు జరగ డానికి ముందు టీడీపీ విజయం పట్ల చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు. తన పిలుపును పురస్కరించుకొనే మహిళలంతా పనికట్టుకొని అర్ధరాత్రి వరకూ క్యూలలో నిలబడి తన పార్టీకి ఓట్లు వేశారని ఆయన సంపూర్ణంగా విశ్వసించారు. ఆ మాట ఢిల్లీలో, అమరావతిలో పదేపదే చెప్పారు. ఎన్నికలలో ఘోరపరా జయం తాలూకు దిగ్భ్రాంతి నుంచి ఆయన ఇంకా కోలుకోలేదనటానికి మొన్న అసెంబ్లీ సమావేశంలో స్పీకర్‌ ఎన్నిక సన్నివేశంలో ఆయన ముఖారవిందమే నిదర్శనం. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పద వులు నిర్వహించిన వ్యక్తి చిరునవ్వుతో సభలో ప్రవేశించి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన యువనాయకులను అభినందించి, సభాపతి ఆసనం వైపు నడుస్తున్న తమ్మినేని సీతారాం వెంట ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు కదిలి ఉంటే హుందాగా ఉండేది. సభాపర్వం ఆదిలోనే సామరస్యపూరితమైన వాతావరణం నెలకొనేది. ప్రతిపక్ష నేత గౌరవం పెరిగేది. 

తల్లకిందులైన అంచనాలు
ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకునే వ్యవస్థ ఉండి ఉన్నట్లయితే చంద్ర బాబును ఓటమి ఇంతగా ఆశ్చర్యపరిచేది కాదు. తన చుట్టూ తనకు ఇష్టమైన అధికారులనూ, అనధికారులనూ పెట్టుకున్నారు. వారు అధినేతకు ఏది నచ్చు తుందో అదే చెబుతారు. సానుకూల మీడియా సైతం పరిస్థితులు చేజారిపోతు న్నాయని హెచ్చరించలేదు. విజయం తథ్యమంటూ ఆశ్వాసించింది. వందిమా గ«ధుల వల్ల ఎంత ప్రమాదమో తెలిసింది. ఫీజు చెల్లించినవారికి ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పటికీ నిజమైన  సర్వే ఫలితాలను వెల్లడించే సంస్థలు అరుదు. అశోక్‌ గజపతిరాజు వంటి నాయకులు నిర్మొగమాటంగా మాట్లాడగలరు కానీ వారికీ రాబోయే ఉపద్రవం సంగతి బొత్తిగా తెలిసినట్టు లేదు. ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులను నడిపించడంలో చంద్రబాబు శక్తిసామర్థ్యాల పట్లా, చాణక్యం పట్లా  సీనియర్‌ నాయకులకు మితిమీరిన విశ్వాసం ఉండటం కూడా పార్టీకి నష్టం కలిగించింది. దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడైన వెంటనే ‘ప్రజలను మనం అంత కష్టపెట్టామా?’అంటూ టీడీపీ అధ్యక్షుడు సహచరులతో వాపోయారంటే చుట్టూ ఉన్నవారు ఆయనను ఎంత మబ్బులో పెట్టారో, ఆయన ఎన్ని భ్రమలలో జీవిస్తూ ఉన్నారో ఊహించుకోవచ్చు. చంద్రబాబుకు అర్థం కాలే దేమో కానీ నాబోటి రాజకీయ పరిశీలకులకు ఆయన దారుణంగా ఓడిపోతున్నారని కొన్ని మాసాలుగా అర్థం అవుతూనే ఉంది. ఆ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా వెల్లడిస్తూనే ఉన్నాం.

నిజానికి, 2014లో టీడీపీ 1.6 శాతం ఓట్ల వ్యత్యాసంతో వైఎస్‌ఆర్‌సీపీపైన గెలుపొందిన క్షణం నుంచీ ఆ పార్టీ ఓటమికి అధినాయకుడే స్వయంగా బాటలు వేశారు. ఎన్నికల తంత్రంపైన ఆధారప డటం, డబ్బుతో ఎన్నికలలో విజయం సాధించవచ్చునని నమ్మడం, అందు కోసం అవధులు మించిన అవినీతిని అనుమతించడం, పశ్చిమబెంగాల్‌లో మార్క్సిస్టు కార్యకర్తలు వామపక్ష సంఘటన 33 సంవత్సరాలు అధికారంలో అప్రతిహతంగా కొనసాగడానికి తోడ్పడినట్టే జన్మభూమి కమిటీలు కూడా టీడీపీ అధికారాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తాయని అంచనా వేసుకోవడం, టీడీపీ పాల నలో ఒకే ఒక సామాజికవర్గం ప్రయోజనాలు నెరవేరుతున్నాయనే అభిప్రాయం జనసామాన్యంలో ప్రబలడం, పార్టీ అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా చంద్ర బాబులో విశ్వాసం కోల్పోవడమే కాకుండా తమను ఆయన మోసం చేస్తున్నారనే అనుమానం ప్రజలలో బలపడటం ఆయన ఓటమికి ప్రధాన కారణాలు. ప్రతిద్వంది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాకులాంటి యువకుడూ, ప్రతిభావం తుడూ, దీక్షాదక్షతలు కలిగిన నాయకుడూ కావడం, ఎన్నికల ప్రణాళికలో ప్రక టించిన హామీలనూ, పథకాలనూ టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిన తీరును తన 3648 కిలోమీటర్ల చారిత్రక పాదయాత్రలో అత్యంత సమర్థంగా ప్రజలకు వివరించడం, నవరత్నాల పేరుతో చిన్న పిల్లల నుంచీ వృద్ధుల వరకూ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం, బీసీ డిక్లరేషన్‌తోనూ, టిక్కెట్ల పంపిణీ లోనూ వెనుకబడిన వర్గాల ప్రజల హృదయాలను దోచుకోవడం ద్వారా జగన్‌ మోహన్‌రెడ్డి చంద్రబాబు ఓటమిని అనివార్యం చేశారు.

అన్నిటి కంటే మించి సామాన్య ప్రజల అనుభవం ప్రధానం. స్వానుభవం కంటే భిన్నంగా నాయకులు చెప్పినా, పత్రికలు రాసినా, టీవీ చానళ్ళు గ్రాఫిక్స్‌లో చూపినా ప్రయోజనం ఉండదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజలలో ఎంత విశ్వాసం, అభిమానం ఉన్నాయో  చంద్రబాబునాయుడి పట్ల అంత అవిశ్వాసం, ఆగ్రహం ఉన్నాయి. అభిమానం, ఆగ్రహం కలిసి సునామీని సృష్టించాయి.  2014 ఎన్నికల ప్రణాళికలో టీడీపీ పేర్కొన్న మొదటి మూడు అంశాలూ– వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం– సవ్యంగా అమలు జరగలేదు.  బీసీ డిక్లరేషన్‌లో వందమంది బీసీలను టీడీపీ టిక్కెట్టుపైన ఎన్నికల రంగంలో దించుతామనే పదో హామీ ఆదిలోనే ఆవిరై పోయింది. తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనే నిర్ణయానికి బీసీలు వచ్చారు. తమకు బీసీ హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారని కాపులు భావిం చారు. అవినీతిరహిత సుపరిపాలన అందిస్తామన్న పన్నెండవ వాగ్దానాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జన్మభూమి కమిటీల వరకూ సర్వత్రా అవినీతిని అందలం ఎక్కించారు.

‘మేనేజ్‌మెంట్‌’పై విశ్వాసం
అన్ని వ్యవస్థలనూ ‘మేనేజ్‌’ చేయడంలో తనకు తిరుగులేదనే విశ్వాసం చంద్ర బాబును దారుణంగా దెబ్బతీసింది. ప్రజలు అమాయకులనీ, వారిని తేలికగా మభ్యపెట్టవచ్చుననే ధోరణి కూడా టీడీపీ పతనానికి దారితీసింది. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు ఎన్నికల వాగ్దానాలు విస్మరించి, ఎన్నికలకు మూడు మాసాల ముందు వరాల జల్లు కురిపిస్తే ప్రజలు పొంగిపోయి ఓట్లతో ముంచెత్తుతారనే అంచనా తప్పింది. జగన్‌పైన చంద్రబాబునాయుడూ, కాంగ్రెస్‌ నేతలూ కలిసి పెట్టించిన సీబీఐ కేసులలో పసలేదనీ, అవి రాజకీయ ప్రతీకా రేచ్ఛతో బనాయించిన కేసులనీ ప్రజలలో అత్యధికులు విశ్వసించారు. పదేపదే నేరస్థుడంటూ జగన్‌ను అచ్చెన్నాయుడూ, బుచ్చయ్యచౌదరీ, బోండా ఉమా మహేశ్వరరావూ వంటి నాయకులు దూషించడాన్ని ప్రజలు సహించలేదు. జగన్‌ను అవినీతిపరుడంటూ, నేరస్తుడంటూ  సంబోధించిన చంద్రబాబు విశ్వస నీయతనే ప్రజలు శంకించారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నంత వరకూ, తాను కాంగ్రెస్‌లో కొనసాగినంత వరకూ తనపైన కేసులు లేవనీ, తనను గౌరవనీయుడుగానే పరిగణించారనీ, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాతనే తనపైన కేసులు పెట్టారంటూ జగన్‌ ఇచ్చిన వివరణను ప్రజలు మనస్పూర్తిగా నమ్మారు.

జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య బేరీజు వేసుకొని మోదీని రెండో విడత ప్రధానిగా ఎన్నుకోవాలని నిర్ణయించిన విధంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చంద్ర బాబునాయుడినీ, జగన్‌మోహన్‌రెడ్డినీ పోల్చుకొని వైఎస్‌ఆర్‌సీపీ అధినేతకు పట్టం కట్టాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలను అమలు పరచకపోగా ప్రణాళికలో ప్రస్తావించని పనులు చంద్రబాబునాయుడు చేశారు. విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ప్రణాళికను పక్కనపెట్టి సొంత అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. రాజధాని నిర్మాణం పేరుమీద 40 వేల ఎకరాలు సమీకరించడం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా అస్మదీయులకు లబ్ధి చేకూర్చడం, అనవసరమైన పట్టిసీమ నిర్మాణం పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం, కేంద్రం నిర్మించవలసిన పోలవరం బాధ్య తను అడిగి  నెత్తికి ఎత్తుకోవడం వంటి అనేక అక్రమాలూ, తప్పుడు నిర్ణయాలూ జరిగాయి. అధికారంలో ఉండిన అయిదేళ్ళలో రూ. 1.69 లక్షల కోట్లు అప్పు చేసి ఫలానా నిర్మాణం చేశామని చెప్పుకోలేని, చూపించలేని దుస్థితి.

ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నిర్మించి జగన్‌ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారనే ఆందో ళనతో చంద్రబాబునాయుడు ఎన్డీయే నుంచి నిష్క్రమించారు. అంతటితో ఆగ కుండా, ఏవో లెక్కలు వేసుకొని మోదీ వ్యతిరేక ప్రచారానికి నాయకత్వం వహించే ప్రయత్నం చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాలు సందర్శించి హడావిడి చేశారు. 35 సంవత్సరాలుగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి కండువా కప్పి వచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించారు. వ్రతం చెడినా ఫలం దక్కకపోవడం అంటే ఇదే. దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి మోదీ–అమిత్‌షా నాయ కత్వంలోని బీజేపీని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేసిన జాతీయ నాయకుడికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళడానికి ముఖం చెల్లని పరిస్థితి. మూడు లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ నేతకు హస్తినలో గౌరవం ఏముంటుంది? 

భిన్న వైఖరులు
చంద్రబాబు, జగన్‌ల భిన్నమైన రాజకీయ ధోరణులను సైతం ప్రజలు జాగ్రత్తగా గమనించారు. ఎటువంటి కేసులు వచ్చినా ‘స్టే’లు తెచ్చుకునే చంద్రబాబు ఒకవైపు. చట్టాలనూ, న్యాయస్థానాలనూ గౌరవిస్తూ కోర్టుకు హాజరవుతూనే పాదయాత్ర కొనసాగించిన జగన్‌ మరోవైపు. వైఎస్‌ఆర్‌సీపీ టిక్కెట్లపై నెగ్గిన 23 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రిపదవులతో సత్కరించిన ముఖ్యమంత్రి ఒక వైపు. వైఎస్‌ఆర్‌సీపీ పెట్టడానికి ముందే కాంగ్రెస్‌నుంచి నిష్క్రమించి, వెంటనే పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయడమే కాకుండా తన పార్టీలో చేరదలచిన కాంగ్రెస్‌ శాసనసభ్యుల చేతా, పార్లమెంటు సభ్యుల చేతా, టీడీపీకి చెందిన ఎంఎల్‌సీ శిల్పా చక్రపాణిరెడ్డి చేతా రాజీనామా చేయిం చిన ప్రతిపక్ష నాయకుడు మరోవైపు. ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకుడు ఒకవైపు, నెరవేర్చడం సాధ్యం కాదనుకొన్న హామీని ఇవ్వడానికి నిరాకరించిన నేత మరోవైపు. మాయామర్మం చేసి, మసిపూసి మారేడుకాయ చేసి ఏదో విధంగా (చివరికి పాల్‌ వంటి విదూషకుడిని ప్రయోగించి) ఎన్నికలలో గెల వాలని ప్రయత్నించిన పార్టీ అధ్యక్షుడు ఒకవైపు. పారదర్శకంగా, ముక్కు సూటిగా వ్యవహరిస్తూ, మనసులో మాట నిస్సంకోచంగా చెబుతూ, ప్రజలతో మమేకమై, వారి విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా ఎన్నికలలో విజయం సాధిం చాలని ప్రయత్నించిన ప్రతిపక్షనేత మరోవైపు. ఎవరిది నమ్మదగిన రాజకీయమో, ఎవరిది కపట రాజకీయమో, ఎవరిది నిజాయితీనో, ఎవరిది వంచనాశిల్పమో ప్రజలు అంచనావేసుకున్నారు. అందుకే, ఒక ప్రాంతం కాదు. ఒక కులం కాదు. ఒక మతం కాదు. రాష్ట్ర ప్రజలంతా కూడబలుక్కున్నట్టు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులకు ఓటు చేసి ఘనవిజయం చేకూర్చారు.

ఈ పాటి విశ్లేషణ చంద్రబాబునాయుడికి తెలియకపోలేదు. వాస్తవాలను అంగీకరించడం, తప్పులు ఒప్పుకోవడం కష్టం. పరాజయాన్ని అంతుపట్టని పరిణామంగా చిత్రించి, ఓటమికి దారితీసిన కారణాలను అన్వేషించడం కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీని వేసి, వాటి నివేదికలు తెప్పించుకొని, పార్టీ నాయకులను బీజేపీ వైపు చూడకుండా నిర్విరామంగా ఉంచడం చంద్ర బాబునాయుడికి ఇప్పుడు అవసరం. పార్టీని రక్షించుకోవాలి. తనయుడికి అప్ప గించాలి. 2004లో ఓడిపోయినప్పుడు అనుసరించిన పద్ధతులనే ఇప్పుడు కూడా అమలు చేస్తారు. అంతే కాని చంద్రబాబు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చు కొని, రాజకీయ దృక్పథం మార్చుకొని, ధనబలం, కండబలంతో నిమిత్తం లేని పరిశుభ్రమైన రాజకీయాలవైపు అడుగులు వేసే ఆలోచన చేస్తున్న దాఖలా లేదు. ప్రశాంతంగా ఆలోచించి, ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, నిర్మాణాత్మక రాజకీయాలవైపు దృష్టి సారిస్తే ఆయనకు చరిత్రలో స్థానం ఉంటుంది.  నకారాత్మక (నెగెటివ్‌)  రాజకీయాలకు స్వస్తి చెప్పి, సకారాత్మక (పాజిటివ్‌) రాజ కీయాలకు శ్రీకారం చుట్టినట్లయితే తనయుడు లోకేష్‌కు ఉత్తమమైన రాజకీయ వారసత్వం అందించిన సంతృప్తి మిగులుతుంది. డబ్బు రాజకీయంలోనే కొన సాగాలనుకుంటే, అదే బాటలో కుమారుడిని  కూడా నడిపించాలనుకుంటే  నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ ప్రస్థానం అర్థరహితం అవుతుంది. ఇంతవరకూ అనుసరించిన చంద్రబాబు మార్కు రాజకీయాన్ని ప్రజలు తిరస్క రిస్తారనే విషయం మాత్రం స్పష్టం. ఓటమిని ఏ విధంగా అర్థం చేసుకుంటారనే అంశంపైన చంద్రబాబునాయుడి భవిష్య ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. నిర్మా  ణాత్మక రాజకీయాలను ఆచరిస్తే టీడీపీకీ, ఆ పార్టీ అధినాయకుడికీ, ప్రజలకీ మేలు.


కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement