Three Column
-
అయోమయమా, అతి లౌక్యమా?
నిజమే. ప్రజాతీర్పును అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎందుకు ఓడిపోయిందో అర్థం కావడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారంనాడు అమరావతిలో జరిగిన విస్తృత సమీక్షా సమావేశంలో వ్యాఖ్యానించడంలో ఆశ్చర్యం లేదు. మే 23న ఓట్ల లెక్కింపు జరగ డానికి ముందు టీడీపీ విజయం పట్ల చంద్రబాబు చాలా ధీమాగా ఉన్నారు. తన పిలుపును పురస్కరించుకొనే మహిళలంతా పనికట్టుకొని అర్ధరాత్రి వరకూ క్యూలలో నిలబడి తన పార్టీకి ఓట్లు వేశారని ఆయన సంపూర్ణంగా విశ్వసించారు. ఆ మాట ఢిల్లీలో, అమరావతిలో పదేపదే చెప్పారు. ఎన్నికలలో ఘోరపరా జయం తాలూకు దిగ్భ్రాంతి నుంచి ఆయన ఇంకా కోలుకోలేదనటానికి మొన్న అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ ఎన్నిక సన్నివేశంలో ఆయన ముఖారవిందమే నిదర్శనం. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా, పదేళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పద వులు నిర్వహించిన వ్యక్తి చిరునవ్వుతో సభలో ప్రవేశించి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన యువనాయకులను అభినందించి, సభాపతి ఆసనం వైపు నడుస్తున్న తమ్మినేని సీతారాం వెంట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు కదిలి ఉంటే హుందాగా ఉండేది. సభాపర్వం ఆదిలోనే సామరస్యపూరితమైన వాతావరణం నెలకొనేది. ప్రతిపక్ష నేత గౌరవం పెరిగేది. తల్లకిందులైన అంచనాలు ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకునే వ్యవస్థ ఉండి ఉన్నట్లయితే చంద్ర బాబును ఓటమి ఇంతగా ఆశ్చర్యపరిచేది కాదు. తన చుట్టూ తనకు ఇష్టమైన అధికారులనూ, అనధికారులనూ పెట్టుకున్నారు. వారు అధినేతకు ఏది నచ్చు తుందో అదే చెబుతారు. సానుకూల మీడియా సైతం పరిస్థితులు చేజారిపోతు న్నాయని హెచ్చరించలేదు. విజయం తథ్యమంటూ ఆశ్వాసించింది. వందిమా గ«ధుల వల్ల ఎంత ప్రమాదమో తెలిసింది. ఫీజు చెల్లించినవారికి ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పటికీ నిజమైన సర్వే ఫలితాలను వెల్లడించే సంస్థలు అరుదు. అశోక్ గజపతిరాజు వంటి నాయకులు నిర్మొగమాటంగా మాట్లాడగలరు కానీ వారికీ రాబోయే ఉపద్రవం సంగతి బొత్తిగా తెలిసినట్టు లేదు. ఎన్నికల సమరంలో పార్టీ శ్రేణులను నడిపించడంలో చంద్రబాబు శక్తిసామర్థ్యాల పట్లా, చాణక్యం పట్లా సీనియర్ నాయకులకు మితిమీరిన విశ్వాసం ఉండటం కూడా పార్టీకి నష్టం కలిగించింది. దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడైన వెంటనే ‘ప్రజలను మనం అంత కష్టపెట్టామా?’అంటూ టీడీపీ అధ్యక్షుడు సహచరులతో వాపోయారంటే చుట్టూ ఉన్నవారు ఆయనను ఎంత మబ్బులో పెట్టారో, ఆయన ఎన్ని భ్రమలలో జీవిస్తూ ఉన్నారో ఊహించుకోవచ్చు. చంద్రబాబుకు అర్థం కాలే దేమో కానీ నాబోటి రాజకీయ పరిశీలకులకు ఆయన దారుణంగా ఓడిపోతున్నారని కొన్ని మాసాలుగా అర్థం అవుతూనే ఉంది. ఆ విషయం సందర్భం వచ్చినప్పుడల్లా వెల్లడిస్తూనే ఉన్నాం. నిజానికి, 2014లో టీడీపీ 1.6 శాతం ఓట్ల వ్యత్యాసంతో వైఎస్‌ఆర్‌సీపీపైన గెలుపొందిన క్షణం నుంచీ ఆ పార్టీ ఓటమికి అధినాయకుడే స్వయంగా బాటలు వేశారు. ఎన్నికల తంత్రంపైన ఆధారప డటం, డబ్బుతో ఎన్నికలలో విజయం సాధించవచ్చునని నమ్మడం, అందు కోసం అవధులు మించిన అవినీతిని అనుమతించడం, పశ్చిమబెంగాల్లో మార్క్సిస్టు కార్యకర్తలు వామపక్ష సంఘటన 33 సంవత్సరాలు అధికారంలో అప్రతిహతంగా కొనసాగడానికి తోడ్పడినట్టే జన్మభూమి కమిటీలు కూడా టీడీపీ అధికారాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తాయని అంచనా వేసుకోవడం, టీడీపీ పాల నలో ఒకే ఒక సామాజికవర్గం ప్రయోజనాలు నెరవేరుతున్నాయనే అభిప్రాయం జనసామాన్యంలో ప్రబలడం, పార్టీ అధ్యక్షుడుగా, ముఖ్యమంత్రిగా చంద్ర బాబులో విశ్వాసం కోల్పోవడమే కాకుండా తమను ఆయన మోసం చేస్తున్నారనే అనుమానం ప్రజలలో బలపడటం ఆయన ఓటమికి ప్రధాన కారణాలు. ప్రతిద్వంది వైఎస్ జగన్మోహన్రెడ్డి చాకులాంటి యువకుడూ, ప్రతిభావం తుడూ, దీక్షాదక్షతలు కలిగిన నాయకుడూ కావడం, ఎన్నికల ప్రణాళికలో ప్రక టించిన హామీలనూ, పథకాలనూ టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిన తీరును తన 3648 కిలోమీటర్ల చారిత్రక పాదయాత్రలో అత్యంత సమర్థంగా ప్రజలకు వివరించడం, నవరత్నాల పేరుతో చిన్న పిల్లల నుంచీ వృద్ధుల వరకూ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించడం, బీసీ డిక్లరేషన్‌తోనూ, టిక్కెట్ల పంపిణీ లోనూ వెనుకబడిన వర్గాల ప్రజల హృదయాలను దోచుకోవడం ద్వారా జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబు ఓటమిని అనివార్యం చేశారు. అన్నిటి కంటే మించి సామాన్య ప్రజల అనుభవం ప్రధానం. స్వానుభవం కంటే భిన్నంగా నాయకులు చెప్పినా, పత్రికలు రాసినా, టీవీ చానళ్ళు గ్రాఫిక్స్‌లో చూపినా ప్రయోజనం ఉండదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే, జగన్మోహన్రెడ్డి పట్ల ప్రజలలో ఎంత విశ్వాసం, అభిమానం ఉన్నాయో చంద్రబాబునాయుడి పట్ల అంత అవిశ్వాసం, ఆగ్రహం ఉన్నాయి. అభిమానం, ఆగ్రహం కలిసి సునామీని సృష్టించాయి. 2014 ఎన్నికల ప్రణాళికలో టీడీపీ పేర్కొన్న మొదటి మూడు అంశాలూ– వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికో ఉద్యోగం– సవ్యంగా అమలు జరగలేదు. బీసీ డిక్లరేషన్‌లో వందమంది బీసీలను టీడీపీ టిక్కెట్టుపైన ఎన్నికల రంగంలో దించుతామనే పదో హామీ ఆదిలోనే ఆవిరై పోయింది. తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనే నిర్ణయానికి బీసీలు వచ్చారు. తమకు బీసీ హోదా ఇస్తానని చెప్పి మోసం చేశారని కాపులు భావిం చారు. అవినీతిరహిత సుపరిపాలన అందిస్తామన్న పన్నెండవ వాగ్దానాన్ని అపహాస్యం చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జన్మభూమి కమిటీల వరకూ సర్వత్రా అవినీతిని అందలం ఎక్కించారు. ‘మేనేజ్మెంట్’పై విశ్వాసం అన్ని వ్యవస్థలనూ ‘మేనేజ్’ చేయడంలో తనకు తిరుగులేదనే విశ్వాసం చంద్ర బాబును దారుణంగా దెబ్బతీసింది. ప్రజలు అమాయకులనీ, వారిని తేలికగా మభ్యపెట్టవచ్చుననే ధోరణి కూడా టీడీపీ పతనానికి దారితీసింది. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు ఎన్నికల వాగ్దానాలు విస్మరించి, ఎన్నికలకు మూడు మాసాల ముందు వరాల జల్లు కురిపిస్తే ప్రజలు పొంగిపోయి ఓట్లతో ముంచెత్తుతారనే అంచనా తప్పింది. జగన్‌పైన చంద్రబాబునాయుడూ, కాంగ్రెస్ నేతలూ కలిసి పెట్టించిన సీబీఐ కేసులలో పసలేదనీ, అవి రాజకీయ ప్రతీకా రేచ్ఛతో బనాయించిన కేసులనీ ప్రజలలో అత్యధికులు విశ్వసించారు. పదేపదే నేరస్థుడంటూ జగన్‌ను అచ్చెన్నాయుడూ, బుచ్చయ్యచౌదరీ, బోండా ఉమా మహేశ్వరరావూ వంటి నాయకులు దూషించడాన్ని ప్రజలు సహించలేదు. జగన్‌ను అవినీతిపరుడంటూ, నేరస్తుడంటూ సంబోధించిన చంద్రబాబు విశ్వస నీయతనే ప్రజలు శంకించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నంత వరకూ, తాను కాంగ్రెస్‌లో కొనసాగినంత వరకూ తనపైన కేసులు లేవనీ, తనను గౌరవనీయుడుగానే పరిగణించారనీ, కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాతనే తనపైన కేసులు పెట్టారంటూ జగన్ ఇచ్చిన వివరణను ప్రజలు మనస్పూర్తిగా నమ్మారు. జాతీయ స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మధ్య బేరీజు వేసుకొని మోదీని రెండో విడత ప్రధానిగా ఎన్నుకోవాలని నిర్ణయించిన విధంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్ర బాబునాయుడినీ, జగన్మోహన్రెడ్డినీ పోల్చుకొని వైఎస్ఆర్సీపీ అధినేతకు పట్టం కట్టాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలను అమలు పరచకపోగా ప్రణాళికలో ప్రస్తావించని పనులు చంద్రబాబునాయుడు చేశారు. విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఎన్నికల ప్రణాళికను పక్కనపెట్టి సొంత అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. రాజధాని నిర్మాణం పేరుమీద 40 వేల ఎకరాలు సమీకరించడం, ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అస్మదీయులకు లబ్ధి చేకూర్చడం, అనవసరమైన పట్టిసీమ నిర్మాణం పేరుతో నిధులు దుర్వినియోగం చేయడం, కేంద్రం నిర్మించవలసిన పోలవరం బాధ్య తను అడిగి నెత్తికి ఎత్తుకోవడం వంటి అనేక అక్రమాలూ, తప్పుడు నిర్ణయాలూ జరిగాయి. అధికారంలో ఉండిన అయిదేళ్ళలో రూ. 1.69 లక్షల కోట్లు అప్పు చేసి ఫలానా నిర్మాణం చేశామని చెప్పుకోలేని, చూపించలేని దుస్థితి. ప్రత్యేకహోదా ఉద్యమాన్ని నిర్మించి జగన్ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారనే ఆందో ళనతో చంద్రబాబునాయుడు ఎన్డీయే నుంచి నిష్క్రమించారు. అంతటితో ఆగ కుండా, ఏవో లెక్కలు వేసుకొని మోదీ వ్యతిరేక ప్రచారానికి నాయకత్వం వహించే ప్రయత్నం చేసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాలు సందర్శించి హడావిడి చేశారు. 35 సంవత్సరాలుగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి కండువా కప్పి వచ్చారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలంగాణలో కాంగ్రెస్‌ను భ్రష్టుపట్టించారు. వ్రతం చెడినా ఫలం దక్కకపోవడం అంటే ఇదే. దేశంలోని ప్రతిపక్షాలన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి మోదీ–అమిత్‌షా నాయ కత్వంలోని బీజేపీని ఓడించేందుకు విశ్వప్రయత్నం చేసిన జాతీయ నాయకుడికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళడానికి ముఖం చెల్లని పరిస్థితి. మూడు లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ నేతకు హస్తినలో గౌరవం ఏముంటుంది? భిన్న వైఖరులు చంద్రబాబు, జగన్‌ల భిన్నమైన రాజకీయ ధోరణులను సైతం ప్రజలు జాగ్రత్తగా గమనించారు. ఎటువంటి కేసులు వచ్చినా ‘స్టే’లు తెచ్చుకునే చంద్రబాబు ఒకవైపు. చట్టాలనూ, న్యాయస్థానాలనూ గౌరవిస్తూ కోర్టుకు హాజరవుతూనే పాదయాత్ర కొనసాగించిన జగన్ మరోవైపు. వైఎస్ఆర్సీపీ టిక్కెట్లపై నెగ్గిన 23 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రిపదవులతో సత్కరించిన ముఖ్యమంత్రి ఒక వైపు. వైఎస్ఆర్సీపీ పెట్టడానికి ముందే కాంగ్రెస్‌నుంచి నిష్క్రమించి, వెంటనే పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయడమే కాకుండా తన పార్టీలో చేరదలచిన కాంగ్రెస్ శాసనసభ్యుల చేతా, పార్లమెంటు సభ్యుల చేతా, టీడీపీకి చెందిన ఎంఎల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చేతా రాజీనామా చేయిం చిన ప్రతిపక్ష నాయకుడు మరోవైపు. ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకుడు ఒకవైపు, నెరవేర్చడం సాధ్యం కాదనుకొన్న హామీని ఇవ్వడానికి నిరాకరించిన నేత మరోవైపు. మాయామర్మం చేసి, మసిపూసి మారేడుకాయ చేసి ఏదో విధంగా (చివరికి పాల్ వంటి విదూషకుడిని ప్రయోగించి) ఎన్నికలలో గెల వాలని ప్రయత్నించిన పార్టీ అధ్యక్షుడు ఒకవైపు. పారదర్శకంగా, ముక్కు సూటిగా వ్యవహరిస్తూ, మనసులో మాట నిస్సంకోచంగా చెబుతూ, ప్రజలతో మమేకమై, వారి విశ్వాసాన్ని చూరగొనడం ద్వారా ఎన్నికలలో విజయం సాధిం చాలని ప్రయత్నించిన ప్రతిపక్షనేత మరోవైపు. ఎవరిది నమ్మదగిన రాజకీయమో, ఎవరిది కపట రాజకీయమో, ఎవరిది నిజాయితీనో, ఎవరిది వంచనాశిల్పమో ప్రజలు అంచనావేసుకున్నారు. అందుకే, ఒక ప్రాంతం కాదు. ఒక కులం కాదు. ఒక మతం కాదు. రాష్ట్ర ప్రజలంతా కూడబలుక్కున్నట్టు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటు చేసి ఘనవిజయం చేకూర్చారు. ఈ పాటి విశ్లేషణ చంద్రబాబునాయుడికి తెలియకపోలేదు. వాస్తవాలను అంగీకరించడం, తప్పులు ఒప్పుకోవడం కష్టం. పరాజయాన్ని అంతుపట్టని పరిణామంగా చిత్రించి, ఓటమికి దారితీసిన కారణాలను అన్వేషించడం కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక కమిటీని వేసి, వాటి నివేదికలు తెప్పించుకొని, పార్టీ నాయకులను బీజేపీ వైపు చూడకుండా నిర్విరామంగా ఉంచడం చంద్ర బాబునాయుడికి ఇప్పుడు అవసరం. పార్టీని రక్షించుకోవాలి. తనయుడికి అప్ప గించాలి. 2004లో ఓడిపోయినప్పుడు అనుసరించిన పద్ధతులనే ఇప్పుడు కూడా అమలు చేస్తారు. అంతే కాని చంద్రబాబు ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చు కొని, రాజకీయ దృక్పథం మార్చుకొని, ధనబలం, కండబలంతో నిమిత్తం లేని పరిశుభ్రమైన రాజకీయాలవైపు అడుగులు వేసే ఆలోచన చేస్తున్న దాఖలా లేదు. ప్రశాంతంగా ఆలోచించి, ఓటమికి కారణాలను విశ్లేషించుకొని, నిర్మాణాత్మక రాజకీయాలవైపు దృష్టి సారిస్తే ఆయనకు చరిత్రలో స్థానం ఉంటుంది. నకారాత్మక (నెగెటివ్) రాజకీయాలకు స్వస్తి చెప్పి, సకారాత్మక (పాజిటివ్) రాజ కీయాలకు శ్రీకారం చుట్టినట్లయితే తనయుడు లోకేష్‌కు ఉత్తమమైన రాజకీయ వారసత్వం అందించిన సంతృప్తి మిగులుతుంది. డబ్బు రాజకీయంలోనే కొన సాగాలనుకుంటే, అదే బాటలో కుమారుడిని కూడా నడిపించాలనుకుంటే నాలుగు దశాబ్దాలకు పైబడిన రాజకీయ ప్రస్థానం అర్థరహితం అవుతుంది. ఇంతవరకూ అనుసరించిన చంద్రబాబు మార్కు రాజకీయాన్ని ప్రజలు తిరస్క రిస్తారనే విషయం మాత్రం స్పష్టం. ఓటమిని ఏ విధంగా అర్థం చేసుకుంటారనే అంశంపైన చంద్రబాబునాయుడి భవిష్య ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. నిర్మా ణాత్మక రాజకీయాలను ఆచరిస్తే టీడీపీకీ, ఆ పార్టీ అధినాయకుడికీ, ప్రజలకీ మేలు. కె. రామచంద్రమూర్తి -
మానవహక్కులకు దిక్కేది?
దాదాపు అర్ధశతాబ్దం కిందట ఆరంభమైన నక్సలైట్ ఉద్యమంతో పాటే మానవ హక్కుల నేతల కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. నక్సౖ ట్లు పోలీసులతో జరిగిన నిజమైన ఎన్కౌంటర్లో చనిపోతే మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నించేవారు కాదు. పట్టుకొని కాల్చి చంపడాన్ని నకిలీ ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించి దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పట్టుకున్న నక్సలైట్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి నిజమైన నక్సలైట్ అని నిర్ధారించి చట్టప్రకారం శిక్ష విధించమని వారు అడుగుతారు. నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమానికి మూలకారణం రాజకీయార్థికమనీ, దీనిని శాంతి,భద్రతల సమస్యగా పరిగణించకుండా మూలాలకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత ఉన్నవారు కోరుతూ వచ్చారు. మావోయిస్టులకు ఈ రాజ్యాంగంపైన విశ్వాసం లేదు, ఈ వ్యవస్థను కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించాలనేది వారి సిద్ధాంతం, అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వారికి ఎట్లా వర్తిస్తాయని ప్రశ్నించేవారు మొదటి నుంచీ ఉన్నారు. మావోయిస్టులకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు సరే, రాజకీయ నాయకులకూ, పోలీసు అధికారులకూ, సాధారణ పౌరులకూ రాజ్యాంగంపట్ల విశ్వాసం ఉన్నది కనుక ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్యా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. మావోయిస్టులపైన పోరాటం పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. హక్కులను కాలరాయకూడదు. రాజ్యాంగాన్ని ప్రభుత్వ నిర్వాహకులే ఉల్లంఘిస్తే వారికీ, మావోయిస్టులకూ తేడా ఏమున్నది? ఈ రకమైన ప్రశ్నలూ, సమాధానాలూ ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న 1960–90లలో రాష్ట్రం అంతటా వినిపించేవి. వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ ఉద్యమం తగ్గుముఖం పట్టి ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనూ, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ కేంద్రీకృతమైంది. ఈ లోగా దేశంలో అసహన వాతావరణం ప్రబలింది. మావోయిస్టులను పట్టుకొని కాల్చిచంపడాన్ని (‘ఎన్కౌంటర్’ చేయడాన్ని) ప్రశ్నించేవారి నోరు మూయించే వాతావరణం వచ్చింది. మానవ హక్కుల కార్యకర్తలని మావోయిస్టుల సానుభూతిపరులుగానో లేదా మావోయిస్టులుగానో అభివర్ణించడం, ‘సో కాల్డ్ హ్యూమన్‌రైట్స్ యాక్టివిస్ట్స్’ అంటూ ఎద్దేవా చేయడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ‘రొమాన్సింగ్ విత్ మావోయిజం’ అంటూ ఒక వ్యాసాన్ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో రాశారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపినప్పుడు మానవ హక్కుల నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు నందినీ సుందర్, సామాజిక కార్యకర్త స్వామీ అగ్నివేష్, మానవ హక్కుల నేతలు హిమాన్షు కుమార్, సోనీ సోరీ, బేలాభాటియా సుక్మా ఘటనను ఖండించారు. చనిపోయిన జవాన్ల గౌరవార్ధం బిలాస్పూర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సన్నగిల్లిన సామాజిక స్పృహ 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత, విదేశాలలో చదివే అవకాశాలు పెరిగిన అనంతరం యువత దృష్టి చదువుల మీదికీ, వ్యాపారంపైకీ మళ్ళింది. సామాజిక స్పృహ క్రమంగా సన్నగిల్లింది. విద్యాసంస్థల నుంచి నేరుగా నక్సలైట్ ఉద్యమంలోకి చేరే యువతీయువకుల సంఖ్య తగ్గిపోయింది. నాయకుల నేపథ్యం ఏమైనప్పటికీ దళసభ్యులు అధికంగా ఆదివాసీలూ, దళితులే. పోరాటం సైతం వారిదే. ఉద్యమం ఉనికి అడవి ప్రాంతాలకే పరిమితమైపోయింది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వానికీ, మావోయిస్టు పార్టీకీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఈ వ్యవహారంలో రాజీకి ఆస్కారం లేదనీ, ఉత్తరదక్షిణ ధ్రువాలను కలపాలనే ప్రయత్నం వ్యర్థమనే అభిప్రాయం ఏర్పడింది. మావోయిస్టు నాయకులకు ఆశ్రయం ఇచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. పోలీసులు వ్యూహం మార్చారు. మావోయిస్టుల ఆచూకీ తెలియగానే గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామీణులను హింసించే ప్రక్రియకు స్వస్తి చెప్పారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను పటిష్ఠం చేసుకొని మావోయిస్టుల గుట్టుమట్టులు తెలుసుకొని ‘ఎన్కౌంటర్’ చేయడం ద్వారా ఏరివేయడం ఆరంభించారు. ఆ దశ కూడా ముగిసింది. ఛత్తీస్‌గడ్‌లోనూ, మహారాష్ట్రలోనూ దాడులూ, ప్రతిదాడులూ సాగుతున్నాయి. చంపుడు పందెం సాగుతోంది. ఎవరి లెక్కలు వారు సరి చూసుకుంటున్నారు. సాధించే అవకాశం లేని లక్ష్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్న మావోయిస్టులను సమర్థించేవారు సమాజంలో కొందరు ఉంటారు. దానిని రాజకీయార్థిక సమస్యగా గుర్తించి పరిష్కరిస్తే సంతోషించేవారే ఎక్కువ మంది. మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులనూ, 1993 మానవ హక్కుల చట్టాన్నీ ఉల్లంఘించరాదనే నియమాన్ని ప్రభుత్వాలు తు.చ. తప్పకుండా పాటించాలనే హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. హక్కుల నాయకులలో సైతం వ్యత్యాసం ఉంటుంది. ఎటువంటి హింసనైనా నిర్ద్వంద్వంగా ఖండించేవారు ఒక బాపతు. రాజ్యం బలమైనదీ, రాజ్యాంగానికి కట్టుబడి నడవవలసిందీ కనుక రాజ్యహింసకు ప్రతిగానే మావోయిస్టుల హింస ఉంటుందని భావించేవారూ ఉన్నారూ. వారు వ్యక్తిగతంగా హింసావాదులు కారు. మావోయిస్టుల హింసను సైతం ఖండిస్తారు. ప్రముఖ హక్కుల నాయకుడు కె బాలగోపాల్ నక్సలైట్ల హింసావాదాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించారు. హక్కుల నేతల పట్ల యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో హక్కుల కార్యకర్తలపైన ఒత్తిడి పెరిగింది. మావోయిజాన్ని రూపుమాపడం బదులు మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ దేశీయాంగ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్ ప్రకటిస్తున్నారు. అండాసెల్‌లో సాయిబాబా ఈ ధోరణికి నిదర్శనమే పన్సారే, కల్బుర్గీ, దభోల్కర్, గౌరీ లంకేశ్ వంటి హక్కుల నాయకుల అమానుష హత్యలు. ఢిల్లీ విశ్వవిద్యాయం మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకూ, మరి కొందరికీ యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్‌లో నిర్బంధించారు. తొంభై శాతం శారీక నిస్సత్తువ కలిగి, వీల్‌చైర్‌కే పరిమితమైన వ్యక్తిని ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర చేసినవాడిగా పరిగణించి కనీస సౌకర్యాలు లేని సెల్లో నిర్బంధించి నరకం చూపిస్తున్నారు. మహారాష్ట్ర హైకోర్టు బెయిల్ దరఖాస్తును తిరస్కరించినప్పుడు సాయిబాబా తరఫున సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుప్రీంకోర్టు 2016 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్‌కు తలంటింది. ‘నిందితుల పట్ల మీరు చాలా అన్యాయంగా వ్యవహరించారు,’ అంటూ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. తర్వాత మరో కేసు బనాయించి జైలులో పెట్టారు. సాయిబాబా ఆరోగ్యం క్షిణించిందనీ, వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కవనీ భార్య వసంత చేసిన విజ్ఞప్తులు పాలకుల చెవికి ఎక్కలేదు. ఆయనను తక్షణం విడుదల చేసి, వైద్య సదుపాయం సమకూర్చాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి ప్రవీణులు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రచురించే ‘డీయూ బీట్’ పత్రికలో ‘కలిసే నేరస్థులుగా ఉందాం సార్’ (డియర్ ప్రొఫెసర్, లెట్స్ బి క్రిమినల్స్ టుగెదర్) అనే శీర్షికతో సంపాదకీయం రాశారు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు (వీవీ) ఇంటిలో, ఆయన బంధువుల ఇళ్ళలో పోదాలు జరిపి, ఆయనను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించిన సంగతి విదితమే. భీమా కోరేగాం హింసకు కారకులని చెబుతూ ఒక కేసు పెట్టారు. తర్వాత మోదీ హత్యకు కుట్ర చేశారని మరో కేసు పెట్టారు. ఈ కుట్రలో ఎం–4 రైఫల్ కొనుగోలు చేయడానికి అవసరమైన ఎనిమిది కోట్ల రూపాయలు సమకూర్చే బాధ్యత వీవీ స్వీకరించారని ఆరోపణ. ఆయనకు బెయిల్ ఇప్పించాలనే ప్రయత్నం ఫలించడం లేదు. 79 సంవత్సరాల వీవీ అనారోగ్యం కారణంగాæ జైలులో ఉండలేకపోతున్నారనీ, ఆరోపణలు నిరాధారమైనవనీ చెబుతూ వీవీ శ్రీమతి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కి బహి రంగ లేఖ రాశారు. కడచిన 45 సంవత్సరాలలో వీవీపైన 25 కేసులు బనాయించారనీ, వాటిలో 13 కేసులలో సుదీర్ఘమైన విచారణ తర్వాత వీవీని నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయనీ, తక్కిన 12 కేసులనూ సాక్ష్యాధారాలు బొత్తిగా లేనికారణంగా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయనీ హేమలత వివరించారు. జస్టిస్ గొగోయ్ నుంచి స్పందన లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు కూడా బహిరంగ లేఖ రాశారు. 1968 నుంచి యాభై సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ వాదనను వీవీ బలపరిచారని గుర్తు చేశారు. 2005 సెప్టెంబర్‌లో చంచల్గూడా జైలులో ఉన్న వీవీని చూసేందుకు కేంద్ర మంత్రిగా ఉండిన కేసీఆర్ నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను లెక్క చేయకుండా వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేశారు. ఫలితం లేదు. ఈ హక్కుల నేతల గురించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ప్రస్తావించలేదు. సమాజం స్పందించడం లేదు. ఎవరి గొడవ వారిది ‘మీరు చెప్పేదానిని నేను ఆమోదించను కానీ మీకు చెప్పడానికి ఉన్న హక్కును చనిపోయేవరకూ కాపాడతా (I disapprove of what you say, but I will defend to death your right to say it) అంటూ ఫ్రెంచ్ తత్వవేత్త వోల్తేర్ చెప్పిందే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు బలగాలనూ, నక్సలైట్ల వ్యతిరేక ప్రైవేటు సాయుధ బలాలనూ (సల్వాజుడుం) వినియోగించింది. మానవ హక్కులను హరించడాన్ని ప్రశ్నించిన చరిత్రకారుడు రామచంద్రగుహా, నందినీ సుందర్, స్వామీ అగ్నివేష్, మాజీ ఉన్నతాధికారి ఇఏఎస్ శర్మలను మావోయిస్టు సానుభూతిపరులుగా అభివర్ణించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ 2011లో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్ బి సుదర్శనరెడ్డి, ఎస్ఎస్ నిజ్జర్‌తో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ నక్సలైట్ లేదా మావోయిస్టు ఉద్యమం మూలాలలోకి వెళ్ళింది. మానవ హక్కులకోసం ప్రశ్నించే ప్రతి వ్యక్తినీ అనుమానించి మావోయిస్టుల సానుభూతిపరులుగా ముద్రవేయడం, వారిపైన ఉక్కుపాదం మోపడం తప్ప మరో మార్గం లేదని ఛత్తీస్‌గఢ్ సర్కార్ తరఫున వాదించడం తమకు విస్మయం కలిగిస్తోందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు మూలం, అందువల్లనే పరిష్కారం, వేరే చోట ఉన్నది (The root cause of the problem, and hence its solution, lies elsewhere)అని స్పష్టం చేశారు. మానవ హక్కుల గురించి మాట్లాడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశద్రోహంగా పరిగణిస్తున్న ఈ రోజులలో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? హేమలత లేఖకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వెంటనే స్పందించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల జాతర జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు లక్ష్మణరేఖ దాటి ఒకరిపైన ఒకరు యధాశక్తి బురద చల్లుకుంటున్నారు. ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చెప్పకపోయినా, చెప్పిన నిర్ణయం తమకు నచ్చకపోయినా సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. దీనికి తోడు ప్రధాన న్యాయ మూర్తిపైనే లైంగికవేధింపుల ఆరోపణ (లేదా కుట్ర)పైన విచారణ. సర్వోన్నత న్యాయస్థానంలో ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేదు. ఎన్నికల సంఘం నియంత్రణ, సుప్రీంకోర్టు అభిశంసనలను ఖాతరు చేయకుండా ప్రచారాంకంలో అమీతుమీ తేల్చుకునే అంతిమ ఘట్టంలో ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, మరో వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోహరించి వాగ్బాణాలు సంధిస్తూ, పరస్పరం గాయపరుచుకుంటూ, రక్తం కళ్ళజూస్తూ పోరాటాన్ని రక్తికట్టిస్తు న్నారు. పాకిస్తాన్‌పైన సర్జికల్ స్ట్రయిక్స్ మేము చేశామంటే మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రంధిలో మానవ హక్కులను ఎవరు పట్టించుకుంటారు? సాయిబాబానూ, వరవరరావునీ విడుదల చేయాలన్న లేదా కనీసం బెయిలు ఇప్పించాలన్న న్యాయమైన విన్నపాలను ఎవరు వినిపించుకుంటారు? కె. రామచంద్రమూర్తి -
ఇంతలా దిగజారాలా?!
మరణ వార్త చెవిన పడినప్పుడు మనస్సు చివుక్కుమంటుంది. తెలిసిన వ్యక్తి ఈ లోకం వీడినట్టు వర్తమానం రాగానే అయ్యో అంటూ మనసు మూలుగు తుంది. మరణం సహజమైనది కానప్పుడు, జరిగింది రాజకీయ హత్య అయి నప్పుడు గుండె బరువెక్కుతుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి మరణవార్త అనేకమంది లాగానే నాకూ అశనిపాతంలాగా తాకింది. కలలో కూడా ఎవ్వరికీ అపకారం తలపెట్టని మనిషి, ప్రత్యర్థులతో సైతం స్నేహంగా, ప్రేమగా, మృదువుగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి, తనకంటే వయస్సులో చిన్నవారినైనా విధిగా ‘మీరు’ అంటూ సంబోధించే సంస్కారం కలిగిన రుజువర్తనుడు, నిగర్వి, నిరాడంబరుడైన వివేకానందరెడ్డిని ఎవరైనా హత్య చేస్తారని ఊహించడం కూడా కష్టమే. వివేకానందరెడ్డి ఎన్నడూ తనకు ప్రాణహాని ఉన్నదని భావించలేదు. అందుకే ఎక్కడికైనా అంగరక్షకులు లేకుండా ఒంటరిగానే వెళ్ళడం, కార్యక్రమాలలో పాల్గొనడం. గురువారంనాడు కూడా జమ్మలమడుగులో పర్యటించి, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసి, దొంగ ఓట్లు చేర్చడాన్ని నిరసిస్తూ ధర్నా చేసి, పొద్దుపోయిన తర్వాత పులి వెందులలో స్వగృహానికి వెళ్ళి నిద్రపోయారు. అర్ధరాత్రికీ, ఉదయం 5 గంట లకూ మధ్య హంతకులు ఆయనపైన పదునైన ఆయుధాలతో దాడి చేసి ప్రాణాలు తీశారని కడప జిల్లా ఎస్పి రాహుల్‌దేవ్‌శర్మ ధ్రువీకరించారు. ఆ తర్వాత రాజకీయ దుమారం మొదలు. అధికారపార్టీ నాయకులపైన, ప్రధా నంగా జమ్మలమడుగు శాసనసభ్యుడు, మంత్రి ఆదినారాయణరెడ్డిపైన వైఎస్సా ర్సీపీ నాయకులు ఆరోపణలు చేశారు. టీడీపీ ఎంఎల్సీ బుద్ధా వెంకన్న ప్రత్యారో పణలు చేస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. అంతలో పులివెందులకు వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చేరుకున్నారు. ఆయనకు ఎస్పీ శర్మ ఒక లేఖ చూపించారు. తొందరగా రమ్మన్నందుకు తనను తన డ్రైవర్ చావకొట్టాడనీ, అతడిని వదలవద్దనీ చెబుతూ వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖ వివా దాస్పదమైనది. ఒకవైపు గొడ్డలితో దాడి జరుగుతుంటే ఉత్తరం ఎట్లా రాస్తా రంటూ జగన్మోహన్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. సార్వత్రిక ఎన్ని కలలో పోలింగ్ మరి 25 రోజులకు ముందు ఈ హత్య జరిగింది కనుక రాజకీయ వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కడం సహజం. విరుద్ధమైన వార్తలు ముందు గుండెపోటు అన్నారనీ, తర్వాత హత్య అన్నారనీ వార్తాకథనాలు న్యూస్ చానళ్ళలో, పత్రికలలో వెలువడినాయి. వివేకానందరెడ్డిని ఎవరైనా హత్య చేస్తా రని ఎన్నడూ ఊహించలేదు కనుక గుండెపోటు వచ్చి, కళ్ళు తిరిగి, మరుగుదొ డ్డిలో కమోడ్‌పైన పడి దెబ్బతగిలి మరణించారని ఆ సమయంలో అక్కడ ఉన్న వారు భావించారేమో. అదే ప్రాథమికంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసుల పరిశీలనలో అది హత్య అని తెలిసింది. హత్య జరగడానికీ, పోలీసులు హత్య అని నిర్ధారించడానికీ మధ్య ఏమి జరిగిందో, ఎందుకు జరిగిందో పరిశోధనలో వెల్లడి కావాలి. హంతకులు ఎవరో, సాక్ష్యాధారాలు మార్చింది ఎవరో, వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖ నిజంగా రాసింది ఎవరో నిర్ధారించవలసింది దర్యాప్తు చేసే అధికారులే. వివేకానందరెడ్డి సమీప బంధు వులు అందరూ హైదరాబాద్‌లో ఉన్నారు. బాబాయి హత్య జరిగినట్టు తెలిసినా పదకొండు గంటల వరకూ లోటస్‌పాండ్ నివాసంలో జగన్ రాజకీయాలు చేస్తూ కూర్చున్నారని ఒక టీడీపీ నాయకుడు శుక్రవారం ఉదయమే వ్యాఖ్యానించారు. ఆ రోజు ఉదయం కోర్టులో హాజరు కావలసి ఉండటంతో న్యాయమూర్తి అను మతి తీసుకొని బయలుదేరేవరకు అంత సమయం పట్టిందని పార్టీకి సంబం ధించినవారిని ఎవరిని అడిగినా చెప్పేవారు. వాస్తవాలు తెలుసుకోవాలనే అభి లాష ఉంటే అటువంటి ప్రయత్నం జరిగేది. ఆరోపించాలనే ఆత్రంలో ఉన్న వారికి వాస్తవం తెలుసుకోవాలన్న ఆలోచన రాదు. బుద్ధా వెంకన్న, కనకమేడల రవీంద్రకుమార్ వంటి టీడీపీ నాయకులు ఒక మాట ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్ర బాబునాయుడు ప్రతి అక్షరం ఆచితూచి మాట్లాడాలి. జగన్‌పైన విశాఖపట్టణం విమానాశ్రయం విఐపీ లాంజ్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేసి నప్పుడూ ఇదే వరుస. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల దాడి చేయించారంటూ టీడీపీ శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్ ఆరోపిం చారు. అటువంటి అన్యాయమైన, అమానవీయమైన ఆరోపణ చేసినందుకు ఆయనను ముఖ్యమంత్రి మందలించిన దాఖలా లేదు. లోగడ ప్రచారంలో పెట్టిన వదంతులను మరోసారి ప్రచారం చేసి ఆనందించే పనిలో కొంతమంది ఉన్నారు. వారు మాట్లాడిన స్థాయికీ చంద్రబాబు మాట్లాడిన స్థాయికీ పెద్దగా భేదం లేదు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసినంత ఉదాత్తంగా లేదు. రాజకీయ ప్రయోజనాలకోసం ఇంత నైచ్యం అవసరమా? చంద్రబాబు ఆవేశంతోనే ప్రశ్నించాలంటే, ‘వేర్ ఆర్ వుయ్ గోయింగ్ (ఎక్కడికి పోతున్నాం)?’ రాజకీయరంధి చంద్రబాబు ఇరవై నాలుగు గంటల రాజకీయనాయకుడు. వేరే రంగాల పట్ల, అంశాల పట్ల ఆయనకు ఆసక్తి లేదు. పూర్తి సమయాన్ని రాజకీయాలకు వినియోగించడం తప్పుకాదు. ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రయోజనం ఆశించడం, అందుకోసం అడ్డదారులు తొక్కడం, మానవీయ విలువలను తుంగలో తొక్కడం మాత్రం అభ్యంతరకరం. ఇటువంటి సందర్భాలలో ముఖ్య మంత్రి వ్యవహరించే తీరు విచిత్రమైనది. ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటలు మౌనంగా ఉంటారు. ఆ సమయంలో పోలీసుల ద్వారా సమాచారం తెప్పిం చుకుంటారు. ఏ విధంగా ముందుకు పోవాలో పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంటారు. ఎదురుదాడికోసం ఒక కథనం అల్లి పెట్టుకుంటారు. ఆ తర్వాత తాపీగా తనకు విధేయంగా ఉండే మీడియా ప్రతినిధులను పిలిపించుకుంటారు. గంట నుంచి రెండు గంటల సేపు మాట్లాడతారు. నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తారు. బాధితులే దోషులని నిరూపించే ప్రయత్నం చేస్తారు. టీవీ చానళ్ళు వాణిజ్య కార్యక్రమాలూ, ప్రకటనలూ రద్దు చేసుకొని విధిగా సకల ఆరోపణలూ ఆసాంతం ప్రసారం చేస్తాయి. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పైన దాడి జరిగినప్పుడు జరిగింది అదే. ఆయనే కావాలని శ్రీనివాస్‌తో దాడి చేయించుకొని ప్రజల సానుభూతి సంపాదించాలని ప్రయత్నించినట్టు పదేపదే ఆరోపిస్తూ దబాయించడం, ప్రశ్నించడం, కోపగించడం చూశాం. ఇప్పుడూ అదే దృశ్యం. ఒక ముఖ్యమైన రాజకీయ కుటుంబం పెద్ద హత్య జరిగితే కొన్ని గంటల పాటు సంతాపం ప్రకటించలేదు. దిగ్భ్రాంతి వెల్లడించలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ముసిముసి నవ్వులు నవ్వుతూ, కళ్ళు ఎగరేస్తూ, చేతులు ఆడిస్తూ నాటకీయంగా మాట్లాడారు. ఆరంభంలో మాట వరుసకు వివేకానందరెడ్డి హత్య పట్ల బాధ వెలిబుచ్చారు. ఆ వాక్యం తర్వాత అంతా జగన్‌పైన దాడే. అన్నీ భయంకరమైన ఆరోపణలే. తన వాదన బలంగా ఉన్నదనీ, తనకు లభించిన సాక్ష్యాధారాలను సమర్థంగా వినియోగించుకొని తిరుగులేని విధంగా దాడి చేస్తున్నాననీ, రాజకీయంగా ప్రయోజనం పొందే విధంగా వ్యవహరిస్తున్నాననే ఆనందం ముఖ్యమంత్రి కళ్ళలో కనిపించిందే కానీ ఒక సీనియర్ రాజకీయ నాయకుడూ, ఒక సౌమ్యుడూ, ఒక అజాతశత్రువూ నిష్కారణంగా హతుడయ్యాడనే బాధ రవ్వంతైనా కనిపించలేదు. ముఖ్యమంత్రి చేసిన సవాళ్ళు అన్నీ ఆ రోజు ఉదయం బుద్దా వెంకన్న, మధ్యాహ్నం కనకమేడల చేసినవే. విశాఖ విమానాశ్రయం ఉదంతంలో వెనువెంటనే డీజీపీ ఆర్పీ ఠాకూర్ మొబైల్లో వచ్చిన మెసేజ్‌లు చూసుకుంటూ దాడి చేసిన వ్యక్తి జగన్ అభిమాని అనీ, సానుభూతి కోసం చేశాడనీ చెప్పడం ప్రజలందరికీ తెలుసు. అటువంటి డీజీపీ నాయకత్వంలోని పోలీసు వ్యవస్థపైన విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ పోలీసులపైన నమ్మకం లేదని జగన్ అంటే అది అపరాథం. తనపైన కానీ తన కుమారుడిపైన కానీ ఎటువంటి చర్యలకూ ఉపక్రమించని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)నీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ)నీ, ఆదాయపన్ను శాఖ అధికారులనూ రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని హుంక రించడం మాత్రం సమాఖ్య స్పూర్తి. అక్రమార్కులైన తస్మదీయుల కంపెనీలను సోదా చేయడం ఈ సంస్థలు చేసిన నేరం. వారిని నాలుగేళ్ళు ఎన్డీఏ భాగస్వామిగా ఉండి కాపాడారు. టీడీపీ ఎంఎల్ఏల ఫిరాయింపులను తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ప్రోత్సహిస్తే అది ఘోరం. చంద్రబాబు 23 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలకు కోట్లు ముట్టజెప్పి టీడీపీ తీర్థం ఇవ్వడమే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం మాత్రం రాజకీయపుటెత్తుగడ. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులలో సెక్యూరిటీ గార్డు చనిపోయిన కేసును రాజకీయంగా వినియోగించుకోవాలని వైఎస్ రాజ శేఖరరెడ్డి భావించి ఉంటే ఏమయ్యేది? పరిటాల రవి హత్య జరిగినప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌పైన ఆరోపణలు చేసినప్పుడు అప్పటికప్పుడే సీబీఐ దర్యాప్తునకు అంగీకరించారు. ఇప్పుడు వివే కానందరెడ్డి హత్యపైన సీబీఐ దర్యాప్తు చేయించేందుకు చంద్రబాబుకి అభ్యం తరం ఎందుకు ఉండాలి? అప్పుడు చంద్రబాబు శాసనసభలో వేసిన వీరం గంతో పోల్చితే ఇప్పుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేసిన విధం చాలా సౌమ్యంగా ఉంది. ‘సిట్’ సాధించింది పూజ్యం ఇక చంద్రబాబు వేసే ప్రత్యేక దర్యాప్తు బృందాల(సిట్) నిర్వాకం ప్రజలకు తెలియదా? అధికారంలోకి వచ్చిన కొత్తల్లో శేషాచలం అడవులలో ఎర్రచందనం అపహరిస్తున్నారనే ఆరోపణపైన ఒకానొక దుందుడుకు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పులలో 20 మంది నిరుపేద కూలీలు దర్మరణం పాలైనారు. దానిపైన సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్ నాయ కత్వంలో ‘సిట్’ను నియమించారు. ఫలితం శూన్యం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ చక్రం తిప్పాలనే దురాశతో టీడీపీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని రూ. 50 లక్షలతో టీఆర్ఎస్ శాసనసభ్యుడు స్టీవెన్సన్ దగ్గరికి పంపించి, పట్టుబడి, హైదరాబాద్ నుంచి విజయవాడకు పలాయనం చిత్తగించి, ఆ కేసులో రాజీ చేసుకొని ఊరట పొందారు. ఓటుకు కోట్ల కేసు కొనసాగింపుగా ‘యూ హేవ్ పోలీస్. ఐ హేవ్ పోలీస్. యూ హేవ్ ఏసీబీ. ఐ హేవ్ ఏసీబీ’ అంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైన నియమించిన ‘సిట్’ సైతం ఒరగబెట్టింది ఏమీ లేదు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో తాను షూటింగ్లో పాల్గొన్న సమయంలో విధించిన నిబంధనల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం పాలైతే దాని విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి సోమయాజులును నియమిస్తే మీడియాదీ, భక్తులదే అపరాధమంటూ ఆయన తేల్చారు. చంద్రబాబుకి ‘క్లీన్చిట్’ ఇచ్చారు. నాటి దృశ్యాలను టీవీ చానళ్ళలో చూసిన ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టారు. విశాఖ భూకుం భకోణంపైనా, కాల్‌మనీ సెక్స్రాకెట్పైనా, విజయవాడలో టీడీపీ శాసనస భ్యుడు బోండా ఉమామహేశ్వరరావుపైన వచ్చిన భూకబ్జా ఆరోపణలపైనా, విశాఖ మన్యంలో పోలీసులు చేసిన జంట హత్యలపైనా దర్యాప్తునకు నియ మించిన ‘సిట్’లు సాధించిన ఫలితం ఏమిటి? వివేకానందరెడ్డి హత్యపైన దర్యాప్తు చేసేందుకు వేసిన ‘సిట్’ ఏమి చేస్తుందో, ఏమని నిర్ణయిస్తుందో ఊహిం చడం కష్టమా? ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికీ, డీజీపీకీ జవాబుదారీ కాని కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరడం అసమంజసం ఎట్లా అవుతుంది? సీబీఐ దర్యాప్తునకు అంగీకరించకపోగా, ‘సొంత చిన్నాన్న హత్య జరిగితే సాక్ష్యాధారాలు మార్చివేశారు,’ అంటూ జగన్మోహన్రెడ్డి స్వయంగా సాక్ష్యాధారాలు మార్చినట్టు శనివారం సాయంత్రం ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబునాయుడు నిస్సంకోచంగా ఆరోపించడం దిగజారుడు రాజకీయాలకి ప్రబల నిదర్శనం. ‘సిట్’ దర్యాప్తులో ఏమి తేల్చాలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే చెప్పారు. వారి నిర్ణయం భిన్నంగా ఎందుకు ఉంటుంది? నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయం చేసి, పద్నాలుగు సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పని చేసి తెలుగు రాష్ట్రాలలో రికార్డు సృష్టించిన సీనియర్ నాయకుడికి కాస్త మనసు కూడా ఉండాలనీ, యంత్రంలాగా స్పందించరాదనీ ఆశించడం అత్యాశ కాదు కదా! కె. రామచంద్రమూర్తి -
నేతల జాతర–విలువల పాతర!
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సామాన్య ప్రజలలో రాజకీయాల పట్ల ఆసక్తి పెరగడం సహజం. దృశ్యశ్రవణ ప్రధానంగా రాజకీయాలు నడుస్తున్నప్పుడు సమయం సందర్భం వచ్చినప్పుడు కనిపించవలసిన చోట కనిపించాలనీ, మాట్లాడవలసిన మాట మాట్లాడాలని రాజకీయ నాయకులు తాపత్రయ పడతారు. కొందరు రాజకీయ నాయకులు తమకు ప్రయోజనం కలిగిస్తుందని భావించే దృశ్యాన్ని వదిలిపెట్టరు. లాభసాటి దృశ్యాలలో ఉనికి కోసం ఎంత దూరమైనా వెడతారు. ప్రత్యర్థులపై దారుణాఖండల శస్త్రతుల్యమైన పదజా లంతో దాడి చేస్తారు. నిన్న పొగిడిన నోటితోనే నేడు తెగుడుతారు. సంవత్సరం కిందట సంజీవని కానిది ఈ రోజు ప్రాణప్రదమైన ఔషధి అవుతుంది. పొత్తు ఉన్నప్పుడు ఇంద్రుడూచంద్రుడూ అంటూ నెత్తికెత్తుకొని ఊరేగినవారే పొత్తు రద్దయిన తర్వాత దుష్టుడూ దుర్మార్గుడూ అంటూ నేలకేసి కొడతారు. ఒకటి, రెండు మినహాయింపులు తప్పిస్తే అన్ని పార్టీల నాయకులదీ ఇదే వరుస. ఎన్నికల బరిలో దిగే ముందు మాటల ఈటెలకు పదును పెడుతున్నారు. ఇటు వంటి రాజకీయంలో నిజానిజాలతో నిమిత్తం లేదు. ధర్మాధర్మ విచక్షణ లేదు. రాజ్యాంగస్ఫూర్తి అసలే లేదు. తాము నిన్నామొన్నా ఏమని చెప్పామో, ఇప్పుడు ఏమి చెబుతున్నామో అన్న స్పృహ బొత్తిగా లేదు. ప్రతిపక్షాలపై దాడే వ్యూహమా? అధికార పార్టీలు వ్యవహరించిన రీతినీ, ఎన్నికల ప్రణాళికలలో చేసిన వాగ్దానాలను అమలు చేసిన తీరునీ ఎన్నికల సమయంలో చర్చించడం సంప్రదాయం. తమ సాఫల్యవైఫల్యాలను అధికార పార్టీలు గుర్తించి ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయిందీ వివరించే రోజులు పోయాయి. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షాలపై దాడి చేయడం ద్వారా, సరికొత్త సంక్షేమపథకాలు పదవీకాలం ముగియనున్న తరు ణంలో అట్టహాసంగా ఆరంభించడం ద్వారా, లక్షల కోట్లు ఖర్చు చేయవలసిన ప్రాజెక్టులకు అలవోకగా శంకుస్థాపనలు చేయడం ద్వారా ప్రజలను మెప్పించి మళ్ళీ గెలిచి అధికారంలో కొనసాగాలని కలలు కంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఈ విన్యాసాలు ఫలించవు. 2014 ఎన్నికలలో పొత్తు పెట్టుకొని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారం పంచుకొని నాలుగు సంవత్సరాలు చెట్టా పట్టాలేసుకొని యుగళగీతాలు ఆలపించిన విషయాన్ని ప్రజలు మరచిపోవాలని మోదీ, బాబూ కోరుకుంటున్నారు. ప్రత్యేకహోదాపైన మోదీ, బాబూ ఇద్దరూ ఆడిన నాటకాన్ని ప్రజలు విస్మరించాలనీ, తాజా డ్రామాను మాత్రమే వీక్షించి మైమరచిపోవాలనీ వారి ఆకాంక్ష. రఫేల్ వివాదంపై రగడ చేస్తున్న కాంగ్రెస్ నాయకులనూ, ఆ వివాదాన్ని ప్రస్తావిస్తున్న కొద్దిమంది మీడియా ప్రతినిధులనూ దేశద్రోహులుగా, దేశ సైన్యాన్ని బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్న దుర్మార్గులుగా చిత్రించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. తమ హయాంలో బోఫోర్స్ సహాlఅనేక కుంభకోణాలు జరిగిన వాస్తవాన్ని ప్రస్తావించ కుండా రఫేల్‌ను మాత్రమే ప్రజల ముందుకు ప్రముఖంగా నిలబెట్టాలని కాంగ్రెస్ నాయకుల ఆరాటం. చిట్‌ఫండ్ అక్రమార్కుల కొమ్ముకాయడానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగసంక్షోభం సృష్టిస్తు న్నారని బీజేపీ ప్రవక్తల వాదన. ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపైన కేసులు బనాయించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించి అప్రదిష్టపాలు చేయాలని మోదీ కంకణం కట్టుకున్నారని మమతాదీదీ, తదితర ప్రతిపక్ష నేతల ఆరోపణ. ‘ఏమిటి నన్ను జైల్లో పెడతారా?’ అంటూ చంద్రబాబు బీజేపీ శాస నసభ్యులవైపు చూస్తూ హుంక రిస్తారు. ప్రజాధనాన్ని దుబారా చేశారనీ, నిధులు కాజేయడం కోసమే అవసరం లేని ప్రాజెక్టులు కట్టారనీ, పోలవరం నిధులకు లెక్క చెప్పడం లేదనీ, ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తున్నదనీ వస్తున్న ఆరోపణలపైన కేంద్రం విచారించలేదు. బీజేపీ నాయకులే స్వయంగా చేస్తున్న విమర్శలు గాలిలోకి కలసిపోతున్నాయి కానీ వాటిలోని నిజానిజాలు తేల్చే బాధ్యత కేంద్రం తీసుకోవడం లేదు. ఇంతటి అనుకూల పరిస్థితులలో సైతం చంద్రబాబుకి జైలుభయం పట్టుకోవడం ఆశ్చర్యం. భయంలోనుంచి బుకాయింపు పుట్టుకొచ్చింది. సీబీఐ గీబీఐ జాన్తానై అంటున్నారు. ఈడీ లేదూ గీడీ లేదూ అంటున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేస్తానంటున్నారు. కేంద్రంపైన ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ధ్వజమెత్తినా, మమతా బెనర్జీ తిరుగు బాటు బావుటా ఎగరవేసినా వారి పక్కన దృశ్యంలో కనిపించేందుకు చంద్ర బాబు అన్ని పనులూ వదులుకొని శ్రమకోర్చి ప్రత్యేక విమానంలో ఢిల్లీకీ, కోల్‌కతాకీ వెడుతున్నారు. మోదీ కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కానీ చంద్రబాబుని ఇరకాటంలో పెట్టాలని అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. అందుకు అవసరమైన సామగ్రి వారి దగ్గర ఉన్నది. కానీ వారికి ఆ ఉద్దేశం లేదు. చంద్రబాబుని తమ ప్రధాన ప్రత్యర్థిగా మోదీ భావించడం లేదు. ఈ రోజు గుంటూరు సభలో చంద్రబాబుపై నరేంద్రమోదీ అమిత్‌షా లాగానే విమర్శలు చేయవచ్చు. మామూలు విమర్శలతో సరిపెట్టకుండా మమతాబెనర్జీపై చేసినంత కరకుగా మోదీ తనపైన కూడా వాగ్దాడి చేయాలని చంద్రబాబు కోరు కుంటున్నారు. అందుకే ‘ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కి వస్తారు మోదీ?’, అంటూ రెచ్చగొడుతున్నారు. మోదీకి తానే ప్రధాన ప్రత్యర్థిగా తేలాలని తాపత్రయం. ఆంధ్రప్రదేశ్‌లో అంతటి దృశ్యం లేదు. పశ్చిమబెంగాల్లో 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే అమిత్‌షా, నరేంద్రమోదీ, యోగీ ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్ తదితరులు పర్యటించి, దీదీని రకరకాల విమర్శలు చేసి వాతావరణం వేడెక్కించారు. బెంగాల్‌పైన ఎందుకు దృష్టి పెట్టారు? సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ), బహుజన సమా జ్పార్టీ (బీఎస్పీ)ల ఎన్నికల పొత్తు కారణంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ సారి తమ పప్పులు ఉడకవని బీజేపీ నాయకత్వానికి తెలుసు. 2014లో గెలుచుకున్న 71 స్థానాలలో సగం దక్కితే ధన్యులమనుకునే పరిస్థితి. యూపీలో కోల్పోయే స్థానా లను బెంగాల్లో సంపాదించాలని మోదీ, షా ప్రయత్నిస్తున్నారు. బెంగాల్లో జనాదరణ రీత్యా తృణమూల్ కాంగ్రెస్ తర్వాత స్థానం బీజేపీదే. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి విజ యావకాశాలు లేవు. అందుకే ఇక్కడికి మాటవరుసగా పర్యటనకు వచ్చి ఒకట్రెండు ఉపన్యాసాలు ఇచ్చి వెడతారు కానీ ఆంధ్రప్రదేశ్‌పైనా, చంద్ర బాబుపైనా దృష్టి కేంద్రీకరించే దండగమారి పని బీజేపీ అధినేతలు చేయరు. చంద్రబాబు తన అనుయాయులతో కుండల ప్రదర్శన చేయించినా, నల్ల బ్యాడ్జీలు ధరింపజేసినా, ‘మోదీ గోబ్యాక్’ అంటూ టీవీ చానళ్ళ కేమేరాల ముందు విచిత్ర విన్యాసాలు వేసినా, తానే స్వయంగా ఢిల్లీలో దీక్ష చేపట్టినా ప్రయోజనం శూన్యం. ఎందుకంటే ప్రజలు నమ్మరు. ఇదే గుంటూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీతో చంద్రబాబు వేదిక పంచుకున్నారు. భావి ప్రధాని అంటూ పొగిడారు. అనంతరం శాసనసభలో మోదీ అత్యున్నతమైన ప్రధాని అంటూ కీర్తించారు. వాజపేయి కంటే ఉన్నతుడనే విధంగా ప్రశంసల వర్షం కురిపించారు. వైఫల్యాలను ఒప్పుకుంటే మేలు అధికారంలో ఉన్నవారికి ఇది పరీక్షాసమయం. సాధించిన విజయాలు ఉంటే ప్రజలకు చెప్పుకోవాలి. వైఫల్యాలు ఉంటే ఒప్పుకోవాలి. దొంగలను ఉపే క్షించనంటూ, అందుకే ఈ చౌకీదార్‌ను ప్రజలు నియమించారంటూ పార్లమెంటు లోనూ, వెలుపలా మోదీ మిడిసిపడుతూ గంభీరమైన ప్రసంగాలు చేయడం వల్ల ప్రజలు ప్రభావితులై మూకుమ్మడిగా మళ్ళీ బీజేపీకి ఓట్లు కుమ్మరిస్తారనుకుంటే అంతకంటే భ్రమ మరొకటి ఉండదు. లక్షల కొద్దీ ఉద్యోగాలను ఏన్డీఏ ప్రభుత్వం కల్పించిందంటూ ఎంత గట్టిగా మోదీ దబాయించినా ప్రజలు విశ్వ సించరు. అనుకున్న విధంగా ఉద్యోగాలు సృష్టించడం సాధ్యం కాలేదో, స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకొని రావడంలో ఎందుకు విఫలమైనారో, గోరక్షకుల హింసాత్మక ధోరణిని ఎందుకు అరికట్టలేకపోయారో సవినయంగా వివరిస్తే ప్రజలు మన్నిస్తారు. రంకెలు వేసినంత మాత్రాన వైఫల్యాలు విజయాలుగా మారవు. పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ ప్రసంగాలు చేసినా, సీబీఐని దుర్వినియోగం చేయడం లేదంటూ ఎంత గట్టిగా చెప్పినా లాభం లేదు. ఈ విషయం ప్రస్తావించే నైతిక హక్కు కాంగ్రెస్‌కి లేదు. చంద్రబాబు చరిత్రా అటువంటిదే. కాంగ్రెస్‌తో చేతులు కలిపి సీబీఐతో ప్రధాన ప్రత్యర్థి వ్యక్తిత్వహననం చేయడానికి ప్రయత్నించిన ఘనుడాయన. విపక్షానికి చెందిన ఎంఎల్ఏలను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చరిత్ర ఆయనది. స్థానిక సంస్థలకూ, పంచాయతీరాజ్ వ్యవ స్థకూ తాను నిధులూ, విధులూ వికేంద్రీకరించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ఆయనకు ఇతరులను తప్పుపట్టే యోగ్యత ఉంటుందా? నామినేషన్లపైన వందల కోట్ల రూపాయల పనులు అస్మదీయులకు కట్టబెట్టే వారికీ, వారి ప్రయోజనం కోసమే అమరావతి నగర నిర్మాణం విషయంలో రకరకాల ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించినవారికీ ఇతరులను ప్రశ్నించే నైతికత ఉంటుందా? ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం మోదీ చంద్ర బాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం. అందుకు మోదీని ప్రతిపక్షాలు విమర్శించవచ్చు. ప్రధాని పర్యటలను ప్రజలు వ్యతిరేకించవచ్చు. కానీ బీజేపీతో మొన్నటివరకూ అంటకాగిన టీడీపీ నిరసన ప్రదర్శనలు చేయడం విడ్డూరం. తమ స్వానుభవానికి విరుద్ధంగా నేతలు ఏమి చెప్పినా ప్రజలు విశ్వసించరు. ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ మధ్య సన్నని విభజన రేఖ ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి అది కనిపించదు. చుట్టూ ఉన్న వందిమాగధులు కనిపించనీయరు. ఇందిర ఘోరపరాజయం ఉదాహరణకు ఇందిరాగాంధీ 1975 జూన్ 25న అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ప్రకటించారు. 19 మాసాలు దేశాన్ని నిరంకుశంగా ఏలిన తర్వాత అంతే అకస్మాత్తుగా ఆత్యయిక పరిస్థితిని ఎత్తివేయాలనీ, రెండు మాసాలలోగా ఎన్నికలు నిర్వహించాలనీ ఆమె 1977 జనవరి 18న ప్రకటించారు. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ఓడిపోతుందని ఆనాడు అత్యధికులు ఊహిం చలేదు. అంతవరకూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కి పరాజయం లేదు. చుట్టూ ఉన్నవారు అదే ఎన్నికలకు అనువైన సమయం అంటూ ఊదరకొట్టబట్టే ఆమె ఎన్నికలు జరిపించడానికి నిర్ణయించారు. జైళ్లలో బంధించిన వందలాదిమంది ప్రతిపక్ష నాయకులకు అనూహ్యంగా స్వేచ్ఛ లభించింది. ఎన్నికల ప్రచారానికి రెండు మాసాలే వ్యవధి. నిధుల సేకరణ సాధ్యం కాదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఎదురు నిలిచే సత్తా కలిగిన పార్టీ లేదు. ఆత్యయిక పరిస్థితిలో దేశం అభివృద్ధి చెందిందనీ, ప్రతిపక్షాల ఆందోళనలను అరికట్టగలిగామనీ, ప్రజలు సంతోషంగా ఉన్నారనీ ఇందిరాగాంధీ భావించారు. సంజయ్‌గాంధీకి పూర్తిగా పగ్గాలు అప్పగించాలా లేక అర్ధసింహాసనం ఇవ్వాలా అన్నదే ఆలోచన కానీ పరాజయం గురించి ఆమెకు చింత లేదు. తనకు పోటీ ఎవరున్నారు? ‘తాను తప్ప దేశానికి వేరే దిక్కు ఎవ్వరూ లేరని ఆమె గట్టిగా విశ్వసించింది,’ అంటూ ఇందిర మేనత్త కూతురు, ప్రఖ్యాత రచయిత నయనతార సెహగల్ అప్పట్లో వ్యాఖ్యానించారు. నాటి ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. ఇందిరాగాంధీపై రాజ్‌నారాయణ్ గెలుపొందారు. వివిధ భావజాలాలకు చెందిన ప్రతిపక్ష నాయకులను జైలు జీవితం కలిపింది. రైతు నాయకుడూ, భారతీయ లోక్‌దళ్ అధినేత చరణ్ సింగ్, జనసంఘ్ నాయకులు అడ్వాణీ, వాజపేయి, సోషలిస్టు నాయకులు జార్జి ఫెర్నాండెజ్, రాజ్‌నారాయణ్, కరడుకట్టిన మితవాది, కాంగ్రెస్ (వో) నాయకుడు మొరార్జీ దేశాయ్ వంటి నానాగోత్రీకులను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఒక్క తాటిపైకి తెస్తారని ఎవరు ఊహించారు? మొరార్జీ దేశాయ్‌ని ప్రధానిగా వీరంతా అంగీకరిస్తారని ఎవరు కలగన్నారు? తనకు ప్రత్యామ్నాయం లేరని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ నాయకుడు అనుకున్నా అది శ్రుతిమించిన స్వాను రాగమే. ఇప్పుడు మోదీకీ, చంద్రబాబుకీ భజన చేసినట్టే అప్పుడు ఇందిరా గాంధీకి పత్రికలు ఊడిగం చేశాయి (ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని పత్రికలు తప్ప). ఇందిరమ్మకు అన్నీ సకారాత్మక ఊహా చిత్రాలే కనిపించాయి. పరాజయ సూచనలు కానరాలేదు. అప్పటికింకా ప్రైవేటు టీవీ న్యూస్ చానళ్ళు రాలేదు. ఇప్పుడు టీవీల హంగామా అధికారంలో ఉన్న వారిని భ్రమలలో ముంచెత్తు తుంది. ఆకాశవీధిలో విహరింపజేస్తుంది. నేల విడవకుండా నిజాయతీగా సాము చేసేవారిదే విజయం. -కె. రామచంద్రమూర్తి -
సాగు విడిచి సాము!
ఎన్నికలకు మూడు మాసాల ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లేదా ఓట్ ఆన్ అకౌంట్ (అనామతు పద్దు)పట్ల సాధారణంగా ఎవ్వరికీ ఆసక్తి ఉండదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే ప్రభుత్వం ప్రాధామ్యాలను బట్టి వార్షిక బడ్జెట్ ఉంటుంది కనుక అంతవరకూ జమాఖర్చుల తబ్శీళ్ళను తెలి యజేసి ఖర్చుకు ఆమోదం తీసుకోవడం ఆనవాయితీ. తాత్కాలిక బడ్జెట్లో తాత్కాలిక అంచనాలే ఉండాలి కానీ ఆర్థిక సంవత్సరం అంతటికీ వర్తించే ప్రతిపాదనలు చేయకూడదన్నది మొన్నటి దాకా ఆర్థికమంత్రులందరూ విధిగా పాటించిన నియమం. కానీ శుక్రవారంనాడు తాత్కాలిక ఆర్థికమంత్రి పీయూష్ గోయల్ చేసింది రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైనది. సంప్రదాయ ఉల్లంఘన. ఎన్డీఏ అధికారంలో కొనసాగితే ఎటువంటి ఆర్థికవిధానాలు అవలంబిస్తుందో సూచించడమే కాకుండా ఎన్నికలలో కొనసాగడానికి అవసరమైన తాయిలాలను ప్రజలకు విచ్చలవిడిగా పంచడానికి తాత్కాలిక బడ్జెట్‌ను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం మేరకు గోయల్ దుర్వినియోగం చేశారు. రాజ్యాంగధర్మానికి విరుద్ధంగా మోదీ సర్కార్ వ్యవహరించినప్పటికీ బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలించి విశ్లేషించడం అనివార్యం. అసంఘటిత రంగంలో పనిచేసిన కార్మికులకు పింఛన్లు ఇవ్వడానికీ, అంగన్వాడీ ఉద్యోగినుల ఆదాయం రెట్టింపు చేయడానికీ, ఆదా యంపన్ను లెక్కింపులో రిబేట్ స్థాయిని అయిదు లక్షల రూపాయలకు పెంచడానికీ, ఈఎస్ఐ వర్తించే ఉద్యోగుల జీతం పరిమితిని 15 నుంచి 21 వేలకు పెంచడానికీ, ఇటువంటివే అనేక ప్రయోజనాలు ఉద్యోగులకూ, ఇతర వర్గాలకూ కలిగించడానికీ చేసిన ప్రతిపాదనల విషయంలో ఎవ్వరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వ్యవసాయ కుటుం బానికి ఏటా ఆరు వేల రూపాయల చొప్పున నగదు సహాయం చేసే ‘ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన’ను ఆర్థికమంత్రి ప్రకటించారు. వ్యవసాయ రుణం నేరుగా మాఫ్ చేయడం, రైతుకే నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమం వంటివి పాలకులు చేస్తున్నారు. కానీ వ్యవసాయరంగాన్ని పట్టిపల్లార్చుతున్న, రైతులను కుంగదీస్తున్న మౌలికమైన సమస్యల పరిష్కారానికి చేయవలసింది చేయలేకపోతున్నారు. ఎన్నికలు సమీపించిన తరుణంలోనే రైతుల గురించి ఆలోచించడం, తాత్కాలిక ఉపశమనం కలిగించే ఉపాయాలను ఆశ్రయిం చడంతో బడుగు రైతుల బతుకులు తెల్లవారిపోతున్నాయి. ఆరువేల రూపా యలు సంవత్సరానికి సన్నకారు రైతుల ఖాతాలలో జమచేయడమే మహో పకారమంటూ మోదీని కీర్తించేవారికి చెప్పేది ఏమీ లేదు. ఏదో గట్టి మేలు చేసినట్టు ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ (ఈ దెబ్బతో నాలుగు వందలకు మించి లోక్‌సభ స్థానాలు బీజేపీకి దక్కుతాయి) అంటూ సంబరం చేసుకునేవారికి నమస్కారం. ఏకపక్ష నిర్ణయాలు నిష్ప్రయోజనం నిజంగా వ్యవసాయం గిట్టుబాటు కావాలనీ, ఫలప్రదమైన, లాభదాయకమైన, గౌరవప్రదమైన వ్యాసంగం కావాలనీ కోరుకునేవారు రైతుల గోడు ఆలకించాలి. పాలకులకి తోచిన చర్యలు ఏకపక్షంగా ప్రకటించడం కాకుండా రైతులు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దాదాపు రెండు దశాబ్దాలుగా నేను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొని ఒక విన్నపం చేస్తూ వచ్చాను. వ్యవసాయసంక్షోభం పరిష్కారానికి మార్గం కనుక్కోవడం ఒక్కటే ఎజెండాగా పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలనీ, పార్లమెంటు సభ్యులూ, మంత్రిమండలి సభ్యులతో పాటు రైతు సంఘాల ప్రతినిధులూ, డాక్టర్ స్వామినాధన్ వంటి వ్యవసాయశాస్త్రజ్ఞులూ, ప్రవీణులూ, రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థల సభ్యులూ చర్చలో పాల్గొనాలనీ నా సూచన. ఈ చర్చలో ఇప్పటికే ఈ దిశగా చొరవ ప్రదర్శించిన తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు కూడా పాల్గొనాలి. రెండేళ్ళ కిందటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కింద ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 ల వంతును ఆర్థిక సహాయం అందిస్తామంటూ ప్రకటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వంటి నాయకులను సైతం చర్చకు ఆహ్వానించి మాట్లాడించాలి. సంక్షోభానికి పరిష్కారం లభించేవరకూ, అది అందరికీ లేదా మెజారిటీ సభ్యులకు ఆమోదయోగ్యమని నిర్ధారించే వరకూ ఈ ప్రత్యేక సమావేశం ఎన్ని రోజులైనా కొనసాగాలి, శాశ్వత పరిష్కారం సాధించాలి. పార్టీల ప్రయోజనాలకూ, ఎన్నికలలో లాభనష్టాలకూ అతీతంగా వ్యవహరించి సమష్టిగా సమాలోచన జరిపితే కానీ దారి దొరకదు. హరితవిప్లవం తర్వాత ఏదీ పూనిక? ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1960లలో హరితవిప్లవ సాధనకోసం విశేషమైన ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు వచ్చాయి. 1950లలో, 60లలో ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఇప్పుడు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఆహారభద్రతపైన దృష్టి పెట్టామే కానీ రైతు సంక్షేమం పట్టిం చుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆహారాధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ధరలు తగ్గిపోయాయి. అదే సమయంలో వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం హెచ్చింది. రైతు కుదేలైనాడు. కుప్పకూలిపోయాడు. ఇంతవరకూ కోలుకోలేదు. ఆహారధాన్యాల కొరత లే నేలేదు. ప్రకృతి సహకరించి, వానలు పడితే పంటలు పుష్కలంగా పండుతున్నాయి. రైతుల జీవన ప్రమాణాలు మాత్రం దిగ జారుతున్నాయి. రైతు తెప్పరిల్లడానికి అనువైన పరిస్థితులు కల్పించడంలో ప్రభుత్వాలు వరుసగా విఫలమైనాయి. అరకొరగా అక్కడక్కడా కొన్ని ప్రయ త్నాలు జరగకపోలేదు. వాజపేయి హయాం (2003)లో చేసిన అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) యాక్ట్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలలో అదే పద్ధతిలో చట్టాలు చేసుకొని మార్కెటింగ్ వ్యవస్థను బలంగా నిర్మించి ఉంటే, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలలోని కమిటీలనూ సమన్వయం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఆహారధాన్యాలకు గిట్టుబాటు ధర సాధించడానికి తగిన యంత్రాంగం ఉండేది. కేవలం 18 రాష్ట్రాలు మాత్రమే ఏపీఎంసీ చట్టాన్ని పురస్కరించుకొని చట్టాలు చేశాయి. తక్కిన రాష్ట్రాలు పట్టించుకోలేదు. మోదీ సర్కార్ ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయీ యోజనా వంటి పథకాలు అమలు చేస్తున్నది. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఏర్పాటు చేసింది. కానీ ఆశించిన ప్రయోజనం సిద్ధించడం లేదు. ప్రభుత్వ చర్యలు కొన్ని సందర్భాలలో రైతుకు శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నది. ద్రవ్యోల్బణం హద్దు మీరకుండా చూసే క్రమంలో ఆహారధాన్యాల మద్దతు ధరను తగినంత పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించింది. 1995 నుంచి 2016 వరకూ దేశ వ్యాప్తంగా 3,18,528 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలియజేసింది. 2016 నుంచి ఆ బ్యూరో తాజా వివరాలు నమోదు చేయకుండా, వెల్లడించకుండా ప్రభుత్వం కట్టడి చేసింది. ఈ కారణంగా దేశంలో రైతుల బలవన్మరణాల గురించి చర్చ జరగదు. సమస్య పరిష్కరించవలసింది పోయి సమస్య ప్రజల దృష్టికి రాకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందనీ, అప్పటికల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని సంకల్పించామనీ మోదీ చాలా సందర్భాలలో ప్రకటించారు. మొన్న పీయూష్ గోయల్ కూడా చెప్పారు. ఈ సంకల్పం నెరవేరాలంటే వ్యవ సాయరంగం 2017 నుంచి 2022 వరకూ సంవత్సరానికి 14 శాతం చొప్పున వృద్ధి చెందాలని వ్యవసాయరంగ ప్రవీణుడు అశోక్‌గులాటీ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్–ఐసీఆర్‌ఐఇఆర్–సభ్యుడు) చెప్పారు. పీయూష్ గోయల్ ప్రతిపాదనలో కౌలురైతు ప్రస్తావన లేదు. వ్యవసాయకూలీల ఊసు లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ రెండు వర్గాలనూ పట్టించుకోలేదు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వ్యవసాయ కుటుంబానికి లేదా కౌలు రైతు కుటుంబానికి సాలీనా రూ 10,000 నగదు సాయం చేస్తూ ఇల్లు లేని వ్యవసాయ కూలీలకు రూ.12,000 నగదు చెల్లించే ‘కాలియా పథకం’ అమలు చేస్తున్నారు. కౌలు రైతుకు నగదు బదిలీ చేస్తే భూమి యజమానికి అభద్రతాభావం ఏర్పడుతుందనీ, భూమిపైన హక్కు పోతుందనే భయం పీడిస్తుందనీ, అందువల్ల కౌలు రైతులకు ఆసరా ఇచ్చే అవకాశం లేదనీ తెలంగాణ ప్రభుత్వం వివరించింది. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్‌చంద్ నేతృత్వంలో భూమి కౌలును న్యాయబద్ధం చేయడానికి ఒక నమూనా శాసనాన్ని (మోడల్ ల్యాండ్ లీజింగ్ లా) రూపొందించింది. భూమి యజమానులకు భూమిపైన హక్కు పదిలంగా ఉంటూనే కౌలురైతుకు చట్టబద్ధంగా గుర్తింపు ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ నమూనా అమలు చేసినట్లయితే కౌలు రైతుకు వ్యవస్థాగత రుణాలు అందు బాటులోకి వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. భూమి సాగు చేసుకునే యజమానులూ, సాగు చేయకుండా కౌలుకు ఇచ్చే యజమానులూ (ఆబ్సెంటీ ల్యాండ్‌లార్డ్స్), కౌలు రైతులూ, వ్యవసాయకూలీలూ అంటూ నాలుగు రకాల వ్యక్తులు భూమిపైన ఆధారపడి ఉంటారు. భూమి యజమానులకు నగదు బదిలీ చేయడం కంటే కౌలు చెల్లిస్తూ, పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందడం న్యాయం. దున్నేవాడికే వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. ఈ ఉద్దేశంతోనే రమేశ్‌చంద్ నమూనా బిల్లును తయారు చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే ఈ నమూనాను ఆధారం చేసుకొని కౌలు రైతులకు ఉపయోగపడే చట్టం చేసింది. బీజేపీ పాలనలో 19 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మధ్యప్రదేశ్ మినహా తక్కిన రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం. న్యాయభావన పాలకులలో అంతంతమాత్రమే ఉన్నదనడానికి ఇది నిదర్శనం. వ్యవసాయశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో కూడా ఇది స్పష్టం చేస్తున్నది. వ్యవసాయ సంస్కరణల ఆవశ్యకత చిన్నచిన్న కమతాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం బలంగా ఉన్నది. సహకార వ్యవస్థలోకి సన్నకారు రైతులను తీసుకువచ్చే ప్రయత్నం చేయవచ్చు. భూసార కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఆరంభించి, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి ఆనక వదిలేసింది. దాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరించి ఏ నేల సారం ఏమిటో, ఏ పంట పండుతుందో, ఏ పంట పండిస్తే రైతులకు లాభాలు వస్తాయో వివరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ విస్తరణాధికారులు ఇది వరకూ ఈ పని చేసేవారు. మలేసియాకు చెందిన డాక్టర్ లిమ్సియోజిన్ పాతికేళ్ళుగా చేస్తున్న కృషిని గమనించాలి. అతడు డీఎక్స్ఎన్ అనే కంపెనీని నెలకొల్పి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకొని ఆహారపదార్థాలను తయారు చేసి 180 దేశాలలో విక్రయిస్తున్నాడు. ఇటీవలే తెలంగాణలో సిద్ధిపేట వ్యవసాయ క్షేత్రంలో సాగుకూ, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించి ఆహారపదార్థాలను తయారు చేసే యంత్రాల స్థాపనకూ ఆయన ఉపక్రమించాడు. మాజీ మంత్రి హరీష్‌రావు చొరవతో ఇది సాధ్యమైంది. తన కంపెనీకి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అవసరమో లిమ్ చెబుతారు. ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి ఆహారపదార్థాలు తయారు చేసే ప్రాసెసింగ్‌లో అదే రైతు కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగావకాశం ఉంటుంది. ఆ విధంగా తయారైన పదార్థాలను విక్రయించడం (మార్కెటింగ్) లోనూ రైతు కుటుంబానికి చెందిన మరో సభ్యుడు లేదా సభ్యురాలు పని చేయవచ్చు. ఇటువంటి వ్యవసాయాధార పరిశ్రమలను ప్రభుత్వాలు ప్రోత్సహించడం ద్వారా రైతు కుటుంబాలకు ఆదాయం సమకూర్చవచ్చు. గ్రామస్థాయిలోనే వ్యవసాయ పరిశ్రమలు నెల కొల్పి కుటీర పరిశ్రమలను ప్రోత్సహించి వ్యవసాయ పేదరికాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్న చైనా నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. పాలకులూ, సమాజం మనస్ఫూర్తిగా పట్టించుకోవలసిన సమస్య ఇది. గట్టిగా ప్రయత్నిస్తే పరిష్కరించడం అసాధ్యం కానేకాదు. సృజనాత్మకంగా ఆలోచించకుండా బడ్జెట్లలో అరకొర ప్రయోజనాలు విదిలించడం వల్ల పాలకులకు ఓట్లు వస్తా యేమో కానీ రైతుల బతుకులు బాగుపడవు. కె. రామచంద్రమూర్తి -
లక్ష్యం నెరవేరేనా?
-
లక్ష్యం నెరవేరేనా?
త్రికాలమ్ పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెనుదుమారమే లేపింది. సాధారణ పౌరులు నాలుగు రోజులుగా నానాయాతనా పడుతున్నారు. ఈ కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో తెలియదు. తమ నేరం లేకుండానే జీవితాలలో ఇంతటి సంక్షోభం ఏర్పడటం వారికి దిగ్భ్రాంతి కలిగించింది. వివాహాది శుభకార్యాలు తలపెట్టినవారూ, ఇల్లు, పొలం అమ్మిన డబ్బును బ్యాంకులో జమకట్టకుండా బద్ధకించినవాళ్ళూ, అటు వంటి అలవాటు లేనివాళ్ళూ, క్యూలో గంటల తరబడి నిలబడలేనివాళ్ళూ, బ్యాంకు ఖాతాలు లేనివాళ్ళూ, డెబిట్ కార్డు తెలియనివాళ్ళూ, క్రెడిట్‌కార్డు చూడని వాళ్ళూ, వారాంతంలో కూలీలకు డబ్బు చెల్లించవలసిన ఛోటా కాంట్రాక్టర్లూ, చిన్న దుకాణాలు నడుపుకునే చిరువ్యాపారులూ పడుతున్న అవస్థలు వర్ణనా తీతం. ఇవన్నీ తాత్కాలికమైనవేననీ, నల్లధనాన్నీ, దొంగనోట్లనూ నిర్మూలించాలన్న మహత్తర లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు ఈ మాత్రం త్యాగం చేయాలనీ పాలకులు అంటున్నారు. నల్లధనం, నకిలీ నోట్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు తీరని హాని కలగడమే కాకుండా హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులకూ, సంఘవ్యతిరేక శక్తులకూ హవాలా డబ్బు అందుతున్నదనీ, సరిహద్దు దాటి నకిలీ నోట్లు దేశంలో ప్రవేశించి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయనీ ప్రజలకు తెలుసు. ఈ అరిష్టాలని అరికట్టాలంటే మెరుపుదాడి (బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాటలలో చెప్పాలంటే నల్లధనంపైన మెరుపుదాడి–సర్జికల్ స్ట్రయిక్) అవసరమే. ఇది చాలా కష్టభూయిష్టమైన వ్యవహారమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్వయంగా చెబుతున్నారు. ఇంతటి క్లిష్టమైన నిర్ణయాన్ని ముందస్తు సన్నాహాలు లేకుండా అకస్మాత్తుగా ప్రకటించి, ‘తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి’ అన్నట్టు వ్యవహరిస్తే ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి? గంటల తరబడి బ్యాంకుల ఎదుటా, ఏటీఎంల ఎదుటా నిలబడి క్యూలో తనవంతు రాక ముందే బ్యాంకు పనిగంటలు అయిపోతే, ఏటీఎంలు ఒట్టిపోతే నిరాశా నిస్పృహలతో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళినవారిని అభినందిస్తూ టీవీలో ప్రధాని నరేంద్రమోదీ చిద్విలాసంతో దర్శనమిస్తారు. గొప్ప సంస్క రణ విజయం సాధించేందుకు సహకరిస్తున్న ప్రజానీకానికి ధన్యవాదాలంటూ జపాన్‌లో భారత సంతతి ప్రజల సభలో కరతాళాల ధ్వనుల మధ్య మోదీ నాట కీయంగా చెప్పడం చూసిన నిస్సహాయులు ఏడవలేక నవ్వక తప్పని పరిస్థితి. ముందు జాగ్రత్త చర్యలేవీ? నరేంద్రమోదీ రాజకీయ కౌశలాన్ని తక్కువ అంచనా వేయలేం. మాటల మాంత్రి కుడు ఆయన. అరచేతిలో స్వర్గం చూపించగల ఘనుడు. ఇంతటి ప్రభావశీల మైన సంస్కరణను ప్రవేశపెట్టే ముందు పూర్వాపరాలు పరిశీలించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని, సామాన్య ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడగలిగితే బాగుండేది. నరేంద్రమోదీ మెరుపుదాడిని ప్రతిపక్షాలు నిర్ద్వం ద్వంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ పశ్చి మబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ఉద్ఘోషించారు. రెండు మాసాలలో ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్షనేతలందరూ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. బీజేపీ నాయకులకూ, కేంద్ర మంత్రులకూ రెండున్నర సంవత్సరాలుగా అలవాటైన యుద్ధనీతి ఉంది. ప్రభుత్వ చర్యను వ్యతిరేకించినవారిని దేశద్రోహులుగా, నల్ల« దనంలో మునిగితేలుతున్నవారిగా, ఉగ్రవాదులతో షరీకైనవారుగా, పాకిస్తాన్ ఏజెంట్లుగా అభివర్ణించే అదరగండపు రాజకీయాలలో వారు ఆరితేరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపైన మెరుపుదాడులు జరిగినట్టు దాఖలా చూపించమని అడిగినవారినీ, దాడులు జరిగాయో లేదో అంటూ సంశయం వెలి బుచ్చినవారినీ పచ్చి దేశద్రోహులంటూ ప్రధాని, దేశీయాంగమంత్రి, రక్షణ మంత్రి నిందించారు. మొన్ననే గుండెలో గునపం దిగిన చందంగా ముగిసిన అమెరికా ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్, డెమాక్రాటిక్ పార్టీల అభ్యర్థులు ఉపయోగించిన పదజాలం, లేవనెత్తిన వ్యక్తిగత వివాదాలూ చూసిన తర్వాత అమిత్ షా, కపిల్ శిబ్బల్ అమిత సౌమ్యులుగా, కడుంగడు సంస్కారవంతు లుగా కనిపిస్తారు. అమిత్ షా, అరుణ్‌జైట్లీలు మాట్లాడుతుంటే వారు పరమపవి త్రులుగా, అమలిన రాజకీయ ధురంధరులుగా ప్రకాశిస్తారు. ప్రతిపక్షాలలో ఉన్నవారు అంతులేని అవినీతిలో కూరుకుపోయి, సమాజానికి కీడు చేసే పాడు బుద్ధితో, దేశమంటే లవలేశమైనా ప్రేమలేని స్వార్థపరులుగా కనిపిస్తారు. పెద్దనోట్ల రద్దు అతి పెద్ద సామ్యవాద నిర్ణయమంటూ ‘బిజినెస్ స్టాండర్డ్’ సంపాదకీయం అభివర్ణించింది. ప్రజల దగ్గర, ముఖ్యంగా సంపన్నుల లోగి ళ్ళలో, మూలుగుతున్న అవినీతి సొమ్మును బ్యాంకులకు తరలించి ప్రజల సంక్షేమం కోసం వినియోగించడానికి మించిన సామ్యవాదం ఏముంటుందని ఆ పత్రిక ప్రశ్నించింది. లెనిన్ బతికుంటే ఈ నిర్ణయాన్ని మనస్పూర్తిగా హర్షించే వాడు. మన కమ్యూనిస్టులకు అభ్యంతరం ఎందుకో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా సమర్థించేవారూ, అంతే గుడ్డిగా వ్యతిరేకించేవారూ సమాజంలో బలంగా ఉన్నారు. మధ్యేవాదులూ, హేతువాదులూ బలహీనపడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం నిర్మూ లనం జరిగిపోతుందనీ, నకిలీనోట్లు అంతర్థానమైపోతాయనీ, ఆర్థిక వ్యవస్థ దేదీప్యమానంగా వెలిగిపోతుందనీ, ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం నరేంద్రమోదీ వంటి మహానాయకుడు మినహా మరెవ్వరూ తీసుకోలేరని వాదిం చేవారు ఒక వైపు (తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీదేశాయ్ 1978లోనే ఇటు వంటి నిర్ణయం తీసుకొని అభాసుపాలైన సంగతి విస్మరిస్తారు). ఇది పాలకులకు అనుకూలురైన ఆశ్రిత వ్యాపారవేత్తల ప్రయోజనాలను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని అంతే బలంగా వాదించేవారు మరో వైపు. నల్లధనం కూడబెట్టడానికి దోహదం చేస్తున్నాయనే కారణంతో పెద్దనోట్లు రద్దు చేసిన సర్కార్ అంత కంటే పెద్దదైన రెండు వేల రూపాయల నోట్లు జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటంటూ కేజ్రీవాల్ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అస్మదీయులకు ముందు గానే తెలుసంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టివేయడానికీ వీలులేదు. చంద్ర బాబు వంటివారికి ముందే ఉప్పు అందిందని నమ్ముతున్నవారూ ఉన్నారు. రాజకీయ ప్రయోజనమే ప్రధానమా? ఈ చర్య ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ నాయకులు సిద్ధమైనారు కానీ పర్యవసానాలను ఎదుర్కోటానికి మాత్రం సిద్ధంగా లేరు. వారు ఆశించిన రాజకీయ ఫలం అందుతుందో లేదో అనుమానమే. పెద్దనోట్ల రద్దు వెనుక ఉన్న ఉత్కృష్టమైన లక్ష్యం సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు. వారం, పది రోజులు పడిన కష్టాలు మాత్రం గుర్తుంటాయి. ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన శక్తియుక్తులు బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రభుత్వ వ్యవస్థలో కానీ లేవు. ప్రధానమంత్రి సంకల్పం కూడా అంత బలంగా లేదు. ఉదాహరణకు, నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో ‘ప్రధానమంత్రి జనధన యోజన’ను ప్రకటించారు. ప్రతి కుటుంబం పేరు మీదా ఒక బ్యాంకు ఖాతా తెరవాలని బ్యాంకులను ఆదేశించారు. ఈ నెల రెండో తేదీ వరకూ దేశవ్యాప్తంగా 23.37 కోట్ల ఖాతాలు తెరిచారు. కొన్ని రాష్ట్రాలలో అయితే ప్రతి ఇంటికీ ఒక ఖాతా ఉంది. కానీ వీటిలో 23 శాతం ఖాతాలలో నయాపైసా లేదు–జీరో బ్యాలెన్స్. ఇటువంటి ఖాతాల సంఖ్యను తగ్గించాలంటూ కేంద్రం నుంచి బ్యాంకులపై ఒత్తిడి వచ్చింది. బ్యాంకుల బ్రాంచి మేనేజర్లు జనధన్ ఖాతాలో రూపాయి, రెండు రూపాయలు జమచేసి జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తగ్గించారంటూ ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనం ప్రకటించింది. పనామా పత్రాలు విదేశీ బ్యాంకులలో అవినీతిపరులు పోగేసిన లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకు వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేస్తానంటూ సార్వత్రిక ఎన్ని కల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ వాగ్దానం చేశారు. అధికారం లోకి వచ్చిన తర్వాత జస్టిస్ షా ఆధ్వర్యంలో నల్లధనంపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను నియమించారు. అది చేసింది తక్కువ. పనామా పేపర్ల ఉదం తంలో లీక్వీరుడు హెర్ ఫాల్సియానీతో జస్టిస్ షా సహకరించలేదనే ఆరోపణ ఉంది. ఇండియా రావడానికి తనకు రక్షణ కల్పించాలన్న ఫాల్సియానీ అభ్య ర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వా నికి ఇవ్వాలి కానీ షరతులు పెట్టకూడదని అరుణ్‌జైట్లీ వాదించారు. నల్లధనం ఎవరి పేరు మీద ఉన్నదో తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని ప్రభుత్వం చేయలేదు. చాలా దేశాలు ఫాల్సియానీ చెప్పిన పద్ధతిలో దర్యాప్తు చేసి కొన్ని లక్షల యూరోలు రాబట్టుకున్నాయి. ఖాతాదారుల వివరాలు తెలుసుకునే కిటుకు చెబుతాను ఎవరినైనా బార్సిలోనాకు పంపించమంటూ ఫాల్సియానీ చేసిన ప్రతిపాదనకు సైతం మోదీ సర్కార్ స్పందించలేదు. నల్లధనం వెలికి తీతలో ఇతర దేశాలలోని ప్రభుత్వాలకు ఉన్న పట్టుదల మనకు లేదన్నది అంత ర్జాతీయ ప్రవీణుల అభిప్రాయం. రెండున్నర సంవత్సరాలలో నల్లధనం రాబ ట్టడానికి ఏమీ చేయలేదనే చెడ్డపేరును మాపుకోవడానికి మోదీ ఈ మెరుపుదాడి చేసినట్టు కొందరి అభిప్రాయం. పెద్దనోట్ల రద్దు కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే శనివారం మధ్యాహ్నం వరకూ రూ. 47,868 కోట్లు జమ అయి నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఇందులో అనుమానం ఉన్న ఖాతాలపైన ఆదా యపన్ను శాఖ దృష్టి సారిస్తుంది. దేశంలోని బ్యాంకులు ఇచ్చిన తిరిగి రాని రుణాల మొత్తం రూ.6,00,000 కోట్లు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు దయనీయ స్థితిలో ఉన్నాయి. బ్యాంకుల పరపతి స్థాయిని నిర్ణయించే సంస్థ ‘మూడీ’ లెక్కల ప్రకారం దేశంలోని బ్యాంకులలో రూ. 625 కోట్ల మేరకు కొత్త డిపాజిట్లు జమ అయితేనే మూలధనం స్థాయి పెరిగి అవి ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులలోనూ కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్ళలో రూ. 23,000 కోట్లు జమ చేసింది. 2019లోగా ఈ బ్యాంకులలో ప్రభుత్వం రూ. 70,000 కోట్ల మేరకు డిపాజిట్లు సమకూర్చుతుందని నిరుడు జైట్లీ అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా వందలాదికోట్ల రూపాయలు ప్రజల నుంచి బ్యాంకులకు వచ్చి పడుతున్నాయి. ఇటీవల ఆదాయం వెల్లడి పథకం (ఇన్‌కం డిస్క్లోజర్ స్కీం) కింద రూ. 65 వేలకోట్లు సమకూరాయి. ఇందులో నలభై శాతం, అంటే దాదాపు రూ. 30 వేల కోట్ల ప్రభుత్వం చేతుల్లోకి వెడతాయి. పెరిగిన పాజిట్లను బ్యాంకులు ఏ విధంగా వినియోగిస్తాయన్నది కీలకమైన అంశం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణ నిజమైతే ఆశ్రిత వ్యాపారుల కోసం ఈ ద్రవ్యాన్ని వినియోగి స్తారు. దేశంలో బ్యాంకులకు బాకీ ఉన్న బడా పెట్టుబడిదారుల జాబితా పరి శీలిస్తే మొదటి స్థానంలో రిలయన్స్ బ్రదర్స్‌లో చిన్నవాడు అనీల్ అంబానీ ఉంటారు. వివిధ బ్యాంకులకు ఆయన చెల్లించవలసిన మొత్తం రూ. 1,25,000 కోట్లు. వేదాంత గ్రూపు అధినేత అనీల్ అగర్వాల్ (రూ. 1,03,000 కోట్లు), ఎస్సార్ గ్రూప్ అధిపతి శశి రుయా, రవి రుయాలు(రూ.1,01,000 కోట్లు) తర్వాత స్థానాలలో ఉన్నారు. అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ రూ. 96,031 కోట్లు, జేపీ గ్రూప్ అధినేత మనోజ్ గౌర్ రూ. 75,163కోట్లు, జేఎస్ డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ రూ. 58,171 కోట్లు బ్యాంకులకు చెల్లించవలసి ఉంది. గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్ గ్రూప్) రూ. 47,976 కోట్లు, లగడపాటి మధుసూదనరావు (ల్యాంకోగ్రూప్–లగడపాటి రాజగోపాల్ అన్న గారు) రూ. 47,102కోట్లు, వేణుగోపాల్ ధూత్ (విడియోకాన్) రూ. 45,405 కోట్లు, జీవీకే రెడ్డి (జీవీకే గ్రూప్) రూ. 33, 933 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. వీరంతా అప్పులపైన వడ్డీలు చెల్లిస్తున్నారు. ఎగవేతదారులుగా వీరిని పరిగణించడానికి వీలు లేదు. వీళ్ళందరికీ కానీ, వీరిలో కొందరికి కానీ, వీరిని పోలిన ఇతర వ్యాపారస్థులకు కానీ ఇప్పుడు వచ్చి చేరుతున్న డిపాజిట్లను కొత్త రుణాల రూపంలో ఇస్తారా? బ్యాంకులను వేధిస్తున్న మొండి బకాయిలను రైటాఫ్ (మాఫ్) చేయడానికి ఈ అదనపు నిధులను వినియోగిస్తారా? కేంద్ర ప్రభుత్వం బాండ్ల స్థాయి పెంచి బ్యాంకుల నుంచి నిధులు సేకరించి వచ్చే బడ్జెట్లో ‘జనధన్ యోజన’ కింద పేదవారి బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బు జమచేసి ఎన్నికల వాగ్దానం ఎంతో కొంత నిలబెట్టుకుంటారా? ఒక్కొక్క ఖాతాలో రూ. 15 లక్షలు రాకపోయినా పదివేల రూపాయలు పడినా వాగ్దాన భంగం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారనే మంచి పేరు మోదీకి వస్తుంది. ఏమి చేస్తారో చూడాలి. -కె. రామచంద్రమూర్తి