మానవహక్కులకు దిక్కేది? | K Ramachandra Murthy Article On Human Rights | Sakshi
Sakshi News home page

మానవహక్కులకు దిక్కేది?

Published Sun, May 5 2019 12:24 AM | Last Updated on Sun, May 5 2019 12:25 AM

K Ramachandra Murthy Article On Human Rights - Sakshi

దాదాపు అర్ధశతాబ్దం కిందట ఆరంభమైన నక్సలైట్‌ ఉద్యమంతో పాటే మానవ హక్కుల నేతల కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. నక్సౖ ట్లు పోలీసులతో జరిగిన నిజమైన ఎన్‌కౌంటర్‌లో చనిపోతే  మానవ హక్కుల కార్యకర్తలు ప్రశ్నించేవారు కాదు.  పట్టుకొని కాల్చి చంపడాన్ని నకిలీ ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించి దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు. పట్టుకున్న నక్సలైట్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచి నిజమైన నక్సలైట్‌ అని నిర్ధారించి చట్టప్రకారం శిక్ష విధించమని వారు అడుగుతారు. నక్సలైట్‌ లేదా మావోయిస్టు ఉద్యమానికి మూలకారణం రాజకీయార్థికమనీ, దీనిని శాంతి,భద్రతల సమస్యగా పరిగణించకుండా మూలాలకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేయాలనీ రాజ్యాంగం పట్ల విశ్వాసం, విధేయత ఉన్నవారు కోరుతూ వచ్చారు. మావోయిస్టులకు ఈ రాజ్యాంగంపైన విశ్వాసం లేదు, ఈ వ్యవస్థను కూలదోసి నూతన వ్యవస్థను నిర్మించాలనేది వారి సిద్ధాంతం, అటువంటప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు వారికి ఎట్లా వర్తిస్తాయని ప్రశ్నించేవారు మొదటి నుంచీ ఉన్నారు. మావోయిస్టులకు రాజ్యాంగం పట్ల విశ్వాసం లేదు సరే, రాజకీయ నాయకులకూ, పోలీసు అధికారులకూ, సాధారణ పౌరులకూ రాజ్యాంగంపట్ల విశ్వాసం ఉన్నది కనుక ప్రభుత్వం తీసుకునే ప్రతిచర్యా రాజ్యాంగబద్ధంగానే ఉండాలి. మావోయిస్టులపైన పోరాటం పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించకూడదు. హక్కులను కాలరాయకూడదు. రాజ్యాంగాన్ని ప్రభుత్వ నిర్వాహకులే ఉల్లంఘిస్తే వారికీ, మావోయిస్టులకూ తేడా ఏమున్నది? ఈ రకమైన ప్రశ్నలూ, సమాధానాలూ ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్‌ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న 1960–90లలో రాష్ట్రం అంతటా వినిపించేవి.
 
వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్‌ ఉద్యమం తగ్గుముఖం పట్టి ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ, ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనూ, మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలోనూ కేంద్రీకృతమైంది. ఈ లోగా దేశంలో అసహన వాతావరణం ప్రబలింది. మావోయిస్టులను పట్టుకొని కాల్చిచంపడాన్ని (‘ఎన్‌కౌంటర్‌’ చేయడాన్ని) ప్రశ్నించేవారి నోరు మూయించే వాతావరణం వచ్చింది. మానవ హక్కుల కార్యకర్తలని మావోయిస్టుల సానుభూతిపరులుగానో లేదా మావోయిస్టులుగానో అభివర్ణించడం, ‘సో కాల్డ్‌ హ్యూమన్‌రైట్స్‌ యాక్టివిస్ట్స్‌’ అంటూ  ఎద్దేవా చేయడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుత రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో ‘రొమాన్సింగ్‌ విత్‌ మావోయిజం’ అంటూ ఒక వ్యాసాన్ని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’లో రాశారు. చత్తీస్‌గఢ్‌లోని సుక్మాలో 25 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్టులు మందుపాతర పేల్చి చంపినప్పుడు మానవ హక్కుల నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు నందినీ సుందర్, సామాజిక కార్యకర్త స్వామీ అగ్నివేష్, మానవ హక్కుల నేతలు హిమాన్షు కుమార్, సోనీ సోరీ, బేలాభాటియా సుక్మా ఘటనను ఖండించారు. చనిపోయిన జవాన్ల గౌరవార్ధం బిలాస్‌పూర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.  

సన్నగిల్లిన సామాజిక స్పృహ
1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత, విదేశాలలో చదివే అవకాశాలు పెరిగిన అనంతరం యువత దృష్టి చదువుల మీదికీ, వ్యాపారంపైకీ మళ్ళింది. సామాజిక స్పృహ క్రమంగా సన్నగిల్లింది. విద్యాసంస్థల నుంచి నేరుగా నక్సలైట్‌ ఉద్యమంలోకి చేరే యువతీయువకుల సంఖ్య తగ్గిపోయింది. నాయకుల నేపథ్యం ఏమైనప్పటికీ దళసభ్యులు అధికంగా ఆదివాసీలూ, దళితులే. పోరాటం సైతం వారిదే. ఉద్యమం ఉనికి అడవి ప్రాంతాలకే పరిమితమైపోయింది. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వానికీ, మావోయిస్టు పార్టీకీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత ఈ వ్యవహారంలో రాజీకి ఆస్కారం లేదనీ, ఉత్తరదక్షిణ ధ్రువాలను కలపాలనే ప్రయత్నం వ్యర్థమనే అభిప్రాయం ఏర్పడింది. మావోయిస్టు నాయకులకు ఆశ్రయం ఇచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. పోలీసులు వ్యూహం మార్చారు. మావోయిస్టుల ఆచూకీ తెలియగానే గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామీణులను హింసించే ప్రక్రియకు స్వస్తి చెప్పారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను పటిష్ఠం చేసుకొని మావోయిస్టుల గుట్టుమట్టులు తెలుసుకొని ‘ఎన్‌కౌంటర్‌’ చేయడం ద్వారా ఏరివేయడం ఆరంభించారు. ఆ దశ కూడా ముగిసింది. ఛత్తీస్‌గడ్‌లోనూ, మహారాష్ట్రలోనూ దాడులూ, ప్రతిదాడులూ సాగుతున్నాయి. చంపుడు పందెం సాగుతోంది. ఎవరి లెక్కలు వారు సరి చూసుకుంటున్నారు. సాధించే అవకాశం లేని లక్ష్యం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్న మావోయిస్టులను సమర్థించేవారు సమాజంలో కొందరు ఉంటారు. దానిని రాజకీయార్థిక సమస్యగా గుర్తించి పరిష్కరిస్తే సంతోషించేవారే ఎక్కువ మంది. మావోయిస్టులతో వ్యవహరించే విషయంలో రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులనూ, 1993 మానవ హక్కుల చట్టాన్నీ ఉల్లంఘించరాదనే నియమాన్ని ప్రభుత్వాలు తు.చ. తప్పకుండా పాటించాలనే హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు. హక్కుల నాయకులలో సైతం వ్యత్యాసం ఉంటుంది. ఎటువంటి హింసనైనా  నిర్ద్వంద్వంగా ఖండించేవారు ఒక బాపతు. రాజ్యం బలమైనదీ, రాజ్యాంగానికి కట్టుబడి నడవవలసిందీ కనుక రాజ్యహింసకు ప్రతిగానే మావోయిస్టుల హింస ఉంటుందని భావించేవారూ ఉన్నారూ. వారు వ్యక్తిగతంగా హింసావాదులు కారు. మావోయిస్టుల హింసను సైతం ఖండిస్తారు. ప్రముఖ హక్కుల నాయకుడు కె బాలగోపాల్‌ నక్సలైట్ల హింసావాదాన్ని కూడా గట్టిగా వ్యతిరేకించారు. హక్కుల నేతల పట్ల యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో హక్కుల కార్యకర్తలపైన ఒత్తిడి పెరిగింది. మావోయిజాన్ని రూపుమాపడం బదులు మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ దేశీయాంగ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ ప్రకటిస్తున్నారు.
 
అండాసెల్‌లో సాయిబాబా
ఈ ధోరణికి నిదర్శనమే పన్సారే, కల్బుర్గీ, దభోల్కర్, గౌరీ లంకేశ్‌ వంటి హక్కుల నాయకుల అమానుష హత్యలు. ఢిల్లీ విశ్వవిద్యాయం మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాకూ, మరి కొందరికీ యావజ్జీవ శిక్ష విధించి నాగపూర్‌ సెంట్రల్‌ జైలులోని అండాసెల్‌లో నిర్బంధించారు. తొంభై శాతం శారీక నిస్సత్తువ కలిగి, వీల్‌చైర్‌కే పరిమితమైన వ్యక్తిని ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కుట్ర చేసినవాడిగా పరిగణించి కనీస సౌకర్యాలు లేని సెల్‌లో నిర్బంధించి నరకం చూపిస్తున్నారు. మహారాష్ట్ర హైకోర్టు బెయిల్‌ దరఖాస్తును తిరస్కరించినప్పుడు సాయిబాబా తరఫున సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సుప్రీంకోర్టు 2016 మార్చిలో మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్‌ జనరల్‌కు తలంటింది. ‘నిందితుల పట్ల మీరు చాలా అన్యాయంగా వ్యవహరించారు,’ అంటూ జస్టిస్‌  జేఎస్‌ ఖేహార్, జస్టిస్‌ నాగప్పన్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది. తర్వాత మరో కేసు బనాయించి జైలులో పెట్టారు. సాయిబాబా ఆరోగ్యం క్షిణించిందనీ, వైద్యం అందకపోతే ప్రాణాలు దక్కవనీ భార్య వసంత చేసిన విజ్ఞప్తులు పాలకుల చెవికి ఎక్కలేదు. ఆయనను తక్షణం విడుదల చేసి, వైద్య సదుపాయం సమకూర్చాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి ప్రవీణులు మోదీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రచురించే ‘డీయూ బీట్‌’ పత్రికలో ‘కలిసే నేరస్థులుగా ఉందాం సార్‌’ (డియర్‌ ప్రొఫెసర్, లెట్స్‌ బి క్రిమినల్స్‌ టుగెదర్‌) అనే శీర్షికతో సంపాదకీయం రాశారు. ప్రముఖ కవి, విరసం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు (వీవీ) ఇంటిలో, ఆయన బంధువుల ఇళ్ళలో పోదాలు జరిపి, ఆయనను అరెస్టు చేసి పుణె జైలుకు తరలించిన సంగతి విదితమే. భీమా కోరేగాం హింసకు కారకులని చెబుతూ  ఒక కేసు పెట్టారు. తర్వాత మోదీ హత్యకు కుట్ర చేశారని మరో కేసు పెట్టారు. ఈ కుట్రలో ఎం–4 రైఫల్‌  కొనుగోలు చేయడానికి అవసరమైన ఎనిమిది కోట్ల రూపాయలు  సమకూర్చే బాధ్యత వీవీ స్వీకరించారని ఆరోపణ. ఆయనకు బెయిల్‌ ఇప్పించాలనే ప్రయత్నం ఫలించడం లేదు.  79 సంవత్సరాల వీవీ అనారోగ్యం కారణంగాæ జైలులో ఉండలేకపోతున్నారనీ, ఆరోపణలు నిరాధారమైనవనీ చెబుతూ వీవీ శ్రీమతి హేమలత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌కి బహి రంగ లేఖ రాశారు. కడచిన 45 సంవత్సరాలలో వీవీపైన 25 కేసులు బనాయించారనీ, వాటిలో 13 కేసులలో సుదీర్ఘమైన విచారణ తర్వాత వీవీని నిర్దోషిగా కోర్టులు ప్రకటించాయనీ, తక్కిన 12 కేసులనూ సాక్ష్యాధారాలు బొత్తిగా లేనికారణంగా ప్రభుత్వాలు ఉపసంహరించుకున్నాయనీ హేమలత వివరించారు. జస్టిస్‌ గొగోయ్‌ నుంచి స్పందన లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కు కూడా బహిరంగ లేఖ రాశారు. 1968 నుంచి యాభై సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ వాదనను వీవీ బలపరిచారని గుర్తు చేశారు. 2005 సెప్టెంబర్‌లో చంచల్‌గూడా జైలులో ఉన్న వీవీని చూసేందుకు  కేంద్ర మంత్రిగా ఉండిన కేసీఆర్‌ నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలను లెక్క చేయకుండా వెళ్ళిన సంగతి జ్ఞాపకం చేశారు. ఫలితం లేదు. ఈ హక్కుల నేతల గురించి ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు ప్రస్తావించలేదు. సమాజం స్పందించడం లేదు. 

ఎవరి గొడవ వారిది
‘మీరు చెప్పేదానిని నేను ఆమోదించను కానీ మీకు చెప్పడానికి ఉన్న హక్కును చనిపోయేవరకూ కాపాడతా (I disapprove of what you say, but I will defend to death your right to say it) అంటూ ఫ్రెంచ్‌ తత్వవేత్త వోల్తేర్‌ చెప్పిందే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణం. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్‌ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం యధేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా పోలీసు బలగాలనూ, నక్సలైట్ల వ్యతిరేక ప్రైవేటు సాయుధ బలాలనూ (సల్వాజుడుం) వినియోగించింది. మానవ హక్కులను హరించడాన్ని ప్రశ్నించిన చరిత్రకారుడు రామచంద్రగుహా, నందినీ సుందర్,  స్వామీ అగ్నివేష్, మాజీ ఉన్నతాధికారి ఇఏఎస్‌ శర్మలను మావోయిస్టు సానుభూతిపరులుగా అభివర్ణించడాన్ని సుప్రీంకోర్టు తప్పుపడుతూ 2011లో చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. జస్టిస్‌ బి సుదర్శనరెడ్డి, ఎస్‌ఎస్‌ నిజ్జర్‌తో కూడిన ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్‌ ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలిస్తూ నక్సలైట్‌ లేదా మావోయిస్టు ఉద్యమం మూలాలలోకి వెళ్ళింది. మానవ హక్కులకోసం ప్రశ్నించే ప్రతి వ్యక్తినీ అనుమానించి మావోయిస్టుల సానుభూతిపరులుగా ముద్రవేయడం, వారిపైన ఉక్కుపాదం మోపడం తప్ప మరో మార్గం లేదని ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తరఫున వాదించడం తమకు విస్మయం కలిగిస్తోందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ సమస్యకు మూలం, అందువల్లనే పరిష్కారం, వేరే చోట ఉన్నది (The root cause of the problem, and hence its solution, lies elsewhere)అని స్పష్టం చేశారు. మానవ హక్కుల గురించి మాట్లాడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా, దేశద్రోహంగా పరిగణిస్తున్న ఈ రోజులలో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? హేమలత లేఖకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వెంటనే స్పందించకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికల జాతర జరుగుతోంది. వివిధ పార్టీల నాయకులు లక్ష్మణరేఖ దాటి ఒకరిపైన ఒకరు యధాశక్తి బురద చల్లుకుంటున్నారు. ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చెప్పకపోయినా, చెప్పిన నిర్ణయం తమకు నచ్చకపోయినా సుప్రీంకోర్టు తలుపు తడుతున్నారు. దీనికి తోడు ప్రధాన న్యాయ మూర్తిపైనే లైంగికవేధింపుల ఆరోపణ (లేదా కుట్ర)పైన విచారణ. సర్వోన్నత న్యాయస్థానంలో ఊపిరి పీల్చుకునేందుకు కూడా తీరిక లేదు. ఎన్నికల సంఘం నియంత్రణ, సుప్రీంకోర్టు అభిశంసనలను ఖాతరు చేయకుండా ప్రచారాంకంలో అమీతుమీ తేల్చుకునే అంతిమ ఘట్టంలో ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, మరో వైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మోహరించి వాగ్బాణాలు సంధిస్తూ, పరస్పరం గాయపరుచుకుంటూ, రక్తం కళ్ళజూస్తూ పోరాటాన్ని రక్తికట్టిస్తు న్నారు. పాకిస్తాన్‌పైన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ మేము చేశామంటే మేము చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ రంధిలో మానవ హక్కులను ఎవరు పట్టించుకుంటారు? సాయిబాబానూ, వరవరరావునీ విడుదల చేయాలన్న లేదా కనీసం బెయిలు ఇప్పించాలన్న  న్యాయమైన విన్నపాలను ఎవరు వినిపించుకుంటారు?   


కె. రామచంద్రమూర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement