లక్ష్యం నెరవేరేనా? | ban on high denominations leads side track | Sakshi
Sakshi News home page

లక్ష్యం నెరవేరేనా?

Published Sun, Nov 13 2016 12:11 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

లక్ష్యం నెరవేరేనా? - Sakshi

లక్ష్యం నెరవేరేనా?

త్రికాలమ్‌
పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెనుదుమారమే లేపింది. సాధారణ పౌరులు నాలుగు రోజులుగా నానాయాతనా పడుతున్నారు. ఈ కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో తెలియదు. తమ నేరం లేకుండానే జీవితాలలో ఇంతటి సంక్షోభం ఏర్పడటం వారికి దిగ్భ్రాంతి కలిగించింది. వివాహాది శుభకార్యాలు తలపెట్టినవారూ, ఇల్లు, పొలం అమ్మిన డబ్బును బ్యాంకులో జమకట్టకుండా బద్ధకించినవాళ్ళూ, అటు వంటి అలవాటు లేనివాళ్ళూ, క్యూలో గంటల తరబడి నిలబడలేనివాళ్ళూ, బ్యాంకు ఖాతాలు లేనివాళ్ళూ, డెబిట్‌ కార్డు తెలియనివాళ్ళూ, క్రెడిట్‌కార్డు చూడని వాళ్ళూ, వారాంతంలో కూలీలకు డబ్బు చెల్లించవలసిన ఛోటా కాంట్రాక్టర్లూ, చిన్న దుకాణాలు నడుపుకునే చిరువ్యాపారులూ పడుతున్న అవస్థలు వర్ణనా తీతం. ఇవన్నీ తాత్కాలికమైనవేననీ, నల్లధనాన్నీ, దొంగనోట్లనూ నిర్మూలించాలన్న మహత్తర లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు ఈ మాత్రం త్యాగం చేయాలనీ పాలకులు అంటున్నారు.

నల్లధనం, నకిలీ నోట్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు తీరని హాని కలగడమే కాకుండా హిజ్బుల్‌ ముజాహిదీన్‌ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులకూ, సంఘవ్యతిరేక శక్తులకూ హవాలా డబ్బు అందుతున్నదనీ, సరిహద్దు దాటి నకిలీ నోట్లు దేశంలో ప్రవేశించి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయనీ ప్రజలకు తెలుసు. ఈ అరిష్టాలని అరికట్టాలంటే మెరుపుదాడి (బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మాటలలో చెప్పాలంటే నల్లధనంపైన మెరుపుదాడి–సర్జికల్‌ స్ట్రయిక్‌) అవసరమే. ఇది చాలా కష్టభూయిష్టమైన వ్యవహారమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్వయంగా  చెబుతున్నారు. ఇంతటి క్లిష్టమైన నిర్ణయాన్ని ముందస్తు సన్నాహాలు లేకుండా అకస్మాత్తుగా ప్రకటించి, ‘తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి’ అన్నట్టు వ్యవహరిస్తే ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి? గంటల తరబడి బ్యాంకుల ఎదుటా, ఏటీఎంల ఎదుటా నిలబడి క్యూలో తనవంతు రాక ముందే బ్యాంకు పనిగంటలు అయిపోతే, ఏటీఎంలు ఒట్టిపోతే నిరాశా నిస్పృహలతో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళినవారిని అభినందిస్తూ టీవీలో ప్రధాని నరేంద్రమోదీ చిద్విలాసంతో దర్శనమిస్తారు. గొప్ప సంస్క రణ విజయం సాధించేందుకు సహకరిస్తున్న ప్రజానీకానికి ధన్యవాదాలంటూ జపాన్‌లో భారత సంతతి ప్రజల సభలో కరతాళాల ధ్వనుల మధ్య మోదీ నాట కీయంగా చెప్పడం చూసిన నిస్సహాయులు ఏడవలేక నవ్వక తప్పని పరిస్థితి.

ముందు జాగ్రత్త చర్యలేవీ?
నరేంద్రమోదీ రాజకీయ కౌశలాన్ని తక్కువ అంచనా వేయలేం. మాటల మాంత్రి కుడు ఆయన. అరచేతిలో స్వర్గం చూపించగల ఘనుడు. ఇంతటి ప్రభావశీల మైన సంస్కరణను ప్రవేశపెట్టే ముందు పూర్వాపరాలు పరిశీలించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని, సామాన్య ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడగలిగితే బాగుండేది. నరేంద్రమోదీ మెరుపుదాడిని ప్రతిపక్షాలు నిర్ద్వం ద్వంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ పశ్చి మబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీ వాల్‌ ఉద్ఘోషించారు. రెండు మాసాలలో ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్షనేతలందరూ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. బీజేపీ నాయకులకూ, కేంద్ర మంత్రులకూ రెండున్నర సంవత్సరాలుగా అలవాటైన యుద్ధనీతి ఉంది. ప్రభుత్వ చర్యను వ్యతిరేకించినవారిని దేశద్రోహులుగా, నల్ల« దనంలో మునిగితేలుతున్నవారిగా, ఉగ్రవాదులతో షరీకైనవారుగా, పాకిస్తాన్‌ ఏజెంట్లుగా అభివర్ణించే అదరగండపు రాజకీయాలలో వారు ఆరితేరారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపైన మెరుపుదాడులు జరిగినట్టు దాఖలా చూపించమని అడిగినవారినీ, దాడులు జరిగాయో లేదో అంటూ సంశయం వెలి బుచ్చినవారినీ పచ్చి దేశద్రోహులంటూ ప్రధాని, దేశీయాంగమంత్రి, రక్షణ మంత్రి నిందించారు. మొన్ననే గుండెలో గునపం దిగిన చందంగా ముగిసిన అమెరికా ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్, డెమాక్రాటిక్‌ పార్టీల అభ్యర్థులు ఉపయోగించిన పదజాలం, లేవనెత్తిన వ్యక్తిగత వివాదాలూ చూసిన తర్వాత అమిత్‌ షా, కపిల్‌ శిబ్బల్‌ అమిత సౌమ్యులుగా, కడుంగడు సంస్కారవంతు లుగా కనిపిస్తారు. అమిత్‌ షా, అరుణ్‌జైట్లీలు మాట్లాడుతుంటే వారు పరమపవి త్రులుగా, అమలిన రాజకీయ ధురంధరులుగా ప్రకాశిస్తారు. ప్రతిపక్షాలలో ఉన్నవారు అంతులేని అవినీతిలో కూరుకుపోయి, సమాజానికి కీడు చేసే పాడు బుద్ధితో, దేశమంటే లవలేశమైనా ప్రేమలేని స్వార్థపరులుగా కనిపిస్తారు.


పెద్దనోట్ల రద్దు అతి పెద్ద సామ్యవాద నిర్ణయమంటూ ‘బిజినెస్‌ స్టాండర్డ్‌’ సంపాదకీయం అభివర్ణించింది. ప్రజల దగ్గర, ముఖ్యంగా సంపన్నుల లోగి ళ్ళలో, మూలుగుతున్న అవినీతి సొమ్మును బ్యాంకులకు తరలించి ప్రజల సంక్షేమం కోసం వినియోగించడానికి మించిన సామ్యవాదం ఏముంటుందని  ఆ పత్రిక ప్రశ్నించింది. లెనిన్‌ బతికుంటే ఈ నిర్ణయాన్ని మనస్పూర్తిగా హర్షించే వాడు. మన కమ్యూనిస్టులకు అభ్యంతరం ఎందుకో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా సమర్థించేవారూ, అంతే గుడ్డిగా వ్యతిరేకించేవారూ సమాజంలో బలంగా ఉన్నారు. మధ్యేవాదులూ, హేతువాదులూ బలహీనపడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం నిర్మూ లనం జరిగిపోతుందనీ, నకిలీనోట్లు అంతర్థానమైపోతాయనీ, ఆర్థిక వ్యవస్థ దేదీప్యమానంగా వెలిగిపోతుందనీ, ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం నరేంద్రమోదీ వంటి మహానాయకుడు మినహా మరెవ్వరూ తీసుకోలేరని వాదిం చేవారు ఒక వైపు (తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీదేశాయ్‌ 1978లోనే ఇటు వంటి నిర్ణయం తీసుకొని అభాసుపాలైన సంగతి విస్మరిస్తారు).


ఇది పాలకులకు అనుకూలురైన ఆశ్రిత వ్యాపారవేత్తల ప్రయోజనాలను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని అంతే బలంగా వాదించేవారు మరో వైపు. నల్లధనం కూడబెట్టడానికి దోహదం చేస్తున్నాయనే కారణంతో పెద్దనోట్లు రద్దు చేసిన సర్కార్‌ అంత కంటే పెద్దదైన రెండు వేల రూపాయల నోట్లు జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటంటూ కేజ్రీవాల్‌ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అస్మదీయులకు ముందు గానే తెలుసంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టివేయడానికీ వీలులేదు. చంద్ర బాబు వంటివారికి ముందే ఉప్పు అందిందని నమ్ముతున్నవారూ ఉన్నారు.

రాజకీయ ప్రయోజనమే ప్రధానమా?
ఈ చర్య ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ నాయకులు సిద్ధమైనారు కానీ పర్యవసానాలను ఎదుర్కోటానికి మాత్రం సిద్ధంగా లేరు. వారు ఆశించిన రాజకీయ ఫలం అందుతుందో లేదో అనుమానమే. పెద్దనోట్ల రద్దు వెనుక ఉన్న ఉత్కృష్టమైన లక్ష్యం సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు. వారం, పది రోజులు పడిన కష్టాలు మాత్రం గుర్తుంటాయి. ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన శక్తియుక్తులు బ్యాంకింగ్‌ రంగంలో కానీ ప్రభుత్వ వ్యవస్థలో కానీ లేవు. ప్రధానమంత్రి సంకల్పం కూడా అంత బలంగా లేదు. ఉదాహరణకు, నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో ‘ప్రధానమంత్రి జనధన యోజన’ను ప్రకటించారు. ప్రతి కుటుంబం పేరు మీదా ఒక బ్యాంకు ఖాతా తెరవాలని బ్యాంకులను ఆదేశించారు. ఈ నెల రెండో తేదీ వరకూ దేశవ్యాప్తంగా 23.37 కోట్ల ఖాతాలు తెరిచారు. కొన్ని రాష్ట్రాలలో అయితే ప్రతి ఇంటికీ ఒక ఖాతా ఉంది. కానీ వీటిలో 23 శాతం ఖాతాలలో నయాపైసా లేదు–జీరో బ్యాలెన్స్‌. ఇటువంటి ఖాతాల సంఖ్యను తగ్గించాలంటూ కేంద్రం నుంచి బ్యాంకులపై ఒత్తిడి వచ్చింది. బ్యాంకుల బ్రాంచి మేనేజర్లు జనధన్‌ ఖాతాలో రూపాయి, రెండు రూపాయలు జమచేసి జీరో బ్యాలెన్స్‌ ఖాతాల సంఖ్యను తగ్గించారంటూ ఇటీవల ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒక కథనం ప్రకటించింది.

పనామా పత్రాలు
విదేశీ బ్యాంకులలో అవినీతిపరులు పోగేసిన లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకు వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేస్తానంటూ సార్వత్రిక ఎన్ని కల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ వాగ్దానం చేశారు. అధికారం లోకి వచ్చిన తర్వాత జస్టిస్‌ షా ఆధ్వర్యంలో నల్లధనంపైన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌)ను నియమించారు. అది చేసింది తక్కువ. పనామా పేపర్ల ఉదం తంలో లీక్‌వీరుడు హెర్‌ ఫాల్సియానీతో జస్టిస్‌ షా సహకరించలేదనే ఆరోపణ ఉంది. ఇండియా రావడానికి తనకు రక్షణ కల్పించాలన్న ఫాల్సియానీ అభ్య ర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వా నికి ఇవ్వాలి కానీ షరతులు పెట్టకూడదని అరుణ్‌జైట్లీ వాదించారు. నల్లధనం ఎవరి పేరు మీద ఉన్నదో తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని ప్రభుత్వం చేయలేదు. చాలా దేశాలు ఫాల్సియానీ చెప్పిన పద్ధతిలో దర్యాప్తు చేసి కొన్ని లక్షల యూరోలు రాబట్టుకున్నాయి.


ఖాతాదారుల వివరాలు తెలుసుకునే కిటుకు చెబుతాను ఎవరినైనా బార్సిలోనాకు పంపించమంటూ ఫాల్సియానీ చేసిన ప్రతిపాదనకు సైతం మోదీ సర్కార్‌ స్పందించలేదు. నల్లధనం వెలికి తీతలో ఇతర దేశాలలోని ప్రభుత్వాలకు ఉన్న పట్టుదల మనకు లేదన్నది అంత ర్జాతీయ ప్రవీణుల అభిప్రాయం. రెండున్నర సంవత్సరాలలో నల్లధనం రాబ ట్టడానికి ఏమీ చేయలేదనే చెడ్డపేరును మాపుకోవడానికి మోదీ ఈ మెరుపుదాడి చేసినట్టు కొందరి అభిప్రాయం. పెద్దనోట్ల రద్దు కారణంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలోనే శనివారం మధ్యాహ్నం వరకూ రూ. 47,868 కోట్లు జమ అయి నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఇందులో అనుమానం ఉన్న ఖాతాలపైన ఆదా యపన్ను శాఖ దృష్టి సారిస్తుంది.


దేశంలోని బ్యాంకులు ఇచ్చిన తిరిగి రాని రుణాల మొత్తం రూ.6,00,000 కోట్లు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు దయనీయ స్థితిలో ఉన్నాయి. బ్యాంకుల పరపతి స్థాయిని నిర్ణయించే సంస్థ ‘మూడీ’ లెక్కల ప్రకారం దేశంలోని బ్యాంకులలో రూ. 625 కోట్ల మేరకు కొత్త డిపాజిట్లు జమ అయితేనే మూలధనం స్థాయి పెరిగి అవి ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులలోనూ కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్ళలో రూ. 23,000 కోట్లు జమ చేసింది. 2019లోగా ఈ బ్యాంకులలో ప్రభుత్వం రూ. 70,000 కోట్ల మేరకు డిపాజిట్లు సమకూర్చుతుందని నిరుడు జైట్లీ అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా వందలాదికోట్ల రూపాయలు ప్రజల నుంచి బ్యాంకులకు వచ్చి పడుతున్నాయి. ఇటీవల ఆదాయం వెల్లడి పథకం (ఇన్‌కం డిస్‌క్లోజర్‌ స్కీం) కింద రూ. 65 వేలకోట్లు సమకూరాయి. ఇందులో నలభై శాతం, అంటే దాదాపు రూ. 30 వేల కోట్ల ప్రభుత్వం చేతుల్లోకి వెడతాయి. పెరిగిన పాజిట్లను బ్యాంకులు ఏ విధంగా వినియోగిస్తాయన్నది కీలకమైన అంశం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణ నిజమైతే ఆశ్రిత వ్యాపారుల కోసం ఈ ద్రవ్యాన్ని వినియోగి స్తారు. దేశంలో బ్యాంకులకు బాకీ ఉన్న బడా పెట్టుబడిదారుల జాబితా పరి శీలిస్తే మొదటి స్థానంలో రిలయన్స్‌ బ్రదర్స్‌లో చిన్నవాడు అనీల్‌ అంబానీ ఉంటారు. వివిధ బ్యాంకులకు ఆయన చెల్లించవలసిన మొత్తం రూ. 1,25,000 కోట్లు.

వేదాంత గ్రూపు అధినేత అనీల్‌ అగర్వాల్‌ (రూ. 1,03,000 కోట్లు), ఎస్సార్‌ గ్రూప్‌ అధిపతి శశి రుయా, రవి రుయాలు(రూ.1,01,000 కోట్లు) తర్వాత స్థానాలలో ఉన్నారు. అదానీ గ్రూప్‌ యజమాని గౌతమ్‌ అదానీ రూ. 96,031 కోట్లు, జేపీ గ్రూప్‌ అధినేత మనోజ్‌ గౌర్‌ రూ. 75,163కోట్లు, జేఎస్‌ డబ్ల్యూ అధిపతి సజ్జన్‌ జిందాల్‌ రూ. 58,171 కోట్లు బ్యాంకులకు చెల్లించవలసి ఉంది. గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్‌ గ్రూప్‌) రూ. 47,976 కోట్లు, లగడపాటి మధుసూదనరావు (ల్యాంకోగ్రూప్‌–లగడపాటి రాజగోపాల్‌ అన్న గారు) రూ. 47,102కోట్లు, వేణుగోపాల్‌ ధూత్‌ (విడియోకాన్‌) రూ. 45,405 కోట్లు, జీవీకే రెడ్డి (జీవీకే గ్రూప్‌) రూ. 33, 933 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. వీరంతా అప్పులపైన వడ్డీలు చెల్లిస్తున్నారు. ఎగవేతదారులుగా వీరిని పరిగణించడానికి వీలు లేదు. వీళ్ళందరికీ కానీ, వీరిలో కొందరికి కానీ, వీరిని పోలిన ఇతర వ్యాపారస్థులకు కానీ ఇప్పుడు వచ్చి చేరుతున్న డిపాజిట్లను కొత్త రుణాల రూపంలో ఇస్తారా? బ్యాంకులను వేధిస్తున్న మొండి బకాయిలను రైటాఫ్‌ (మాఫ్‌) చేయడానికి ఈ అదనపు నిధులను వినియోగిస్తారా?  కేంద్ర ప్రభుత్వం బాండ్‌ల స్థాయి పెంచి బ్యాంకుల నుంచి నిధులు సేకరించి వచ్చే బడ్జెట్‌లో ‘జనధన్‌ యోజన’ కింద పేదవారి బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బు  జమచేసి ఎన్నికల వాగ్దానం ఎంతో కొంత నిలబెట్టుకుంటారా? ఒక్కొక్క ఖాతాలో రూ. 15 లక్షలు రాకపోయినా పదివేల రూపాయలు పడినా వాగ్దాన భంగం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారనే మంచి పేరు మోదీకి వస్తుంది. ఏమి చేస్తారో చూడాలి.

-కె. రామచంద్రమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement