టీడీపీ పెద్దల నల్లధనమే ‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్లు
అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడైతే పచ్చ దొంగల బండారం బట్టబయలే
అందుకే రామోజీ కుటుంబం ససేమిరా
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ బాగోతం అంతా మేడిపండు చందమేనన్నది స్పష్టమైంది. నిగనిగలాడే మేడిపండు పొట్ట విప్పి చూస్తే పురుగులే ఉంటాయి. నీతులు వల్లించే రామోజీ కుటుంబానికి చెందిన ‘మార్గదర్శి’ డిపాజిట్ల గుట్టు విప్పితే నల్లధనం బట్టబయలవుతుంది. అక్రమార్జనను మార్గదర్శిలో గుట్టు చప్పుడు కాకుండా దాచిన టీడీపీ పెద్దల బండారం గుట్టు వీడుతుంది. అందుకే తాము సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలను వెల్లడించేందుకు రామోజీ కుటుంబం మొండికేస్తోంది.
చంద్రబాబు ప్రభుత్వం అందుకు సహకరిస్తోంది.
భారీగా నల్లధనం దందా...
మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు భారీస్థాయిలో నల్లధనం దందా సాగించారు. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు సేకరించారని వెల్లడైంది. ఆ అక్రమ డిపాజిట్ల ముసుగులో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. అందులో సింహభాగం టీడీపీ పెద్దలవేనని స్పష్టమవుతోంది. జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలంటే నిధులు ఎలా వచ్చాయో వెల్లడించాల్సి ఉంటుంది. భూములు, ఇతర స్థిరాస్తుల్లో పెట్టుబడిగా పెట్టినా ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తే వారి అక్రమార్జన బట్టబయలవుతుంది.
అందుకే నల్లధనాన్ని రామోజీరావుకు చెందిన ‘మార్గదర్శి’లో డిపాజిట్లుగా పెట్టారు. కేంద్ర ఆదాయపన్ను చట్టం సెక్షన్ 269 ప్రకారం రూ.20 వేలకు మించిన లావాదేవీలను నగదు రూపంలో తీసుకోకూడదు. కానీ, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే సేకరించడం గమనార్హం. ఆ నిధులను తమ కుటుంబ వ్యాపార సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరణకు వాడుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడులుగా పెట్టారు.
తద్వారా తమ ఫిల్మ్ సిటీ భూముల విలువ, మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో తమ పెట్టుబడులు భారీగా పెరిగేలా చేసుకుని తమ అక్రమ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగేలా కథ నడిపించారు. అలా నిబంధనలకు విరుద్ధంగా సాగించిన ఈ దందాతో అటు టీడీపీ పెద్దలు, ఇటు రామోజీరావు కుటుంబం భారీగా అక్రమ ఆస్తులను వెనకేసుకున్నారు.
రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి?
రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం తాము సేకరించిన మొత్తం రూ.2,610.38 కోట్ల డిపాజిట్లలో రూ.1,864.10 కోట్లు తిరిగి చెల్లించేశామని చెప్పారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఎవరివి? ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా టీడీపీ పెద్దలదేనని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో పేర్ల జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సమ్మతించడం లేదు. ఆ వివరాలు వెల్లడిస్తే బడాబాబుల నల్లధనం బండారం బట్టబయలవుతుందని, బినామీల పేరిట తాము పెట్టిన డిపాజిట్ల దందా వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతోంది. చంద్రబాబు సర్కారు ఈ అక్రమాలకు కొమ్ముకాస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment