Ramachandramurthi
-
నియమావళికి నైతికతే ప్రాణం
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న మొదటి ఘట్టంలోనే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకూ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతుంది. అంటే పోలింగ్‌కూ, ఫలితాలు వెల్లడి కావడానికి మధ్య 42 రోజుల సుదీర్ఘ సమయం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లోనే ముగిశాయి. ప్రవర్తన నియమావళిని వర్తింపజేయడంలో తెలంగాణకూ, ఆంధ్రప్రదేశ్‌కూ వేర్వేరు ప్రమాణాలు ఉంటాయా? ప్రధాని నరేంద్రమోదీకీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కీ వర్తించని ఆంక్షలు తనకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు గగ్గోలు పెట్టడం సమంజసమేనా? భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఉండాలనీ, అది నేరుగా రాష్ట్రపతికి జవాబుదారీగా ఉండాలనీ, ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఉద్వాసన చెప్పాలంటే పార్లమెంటు అభి శంసన తీర్మానం ఆమోదిస్తేనే కానీ సాధ్యం కాదని రాజ్యాంగాన్ని రూపొం దించిన రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. అత్యంత శక్తిమంతమైన ప్రజా స్వామ్య దేశం అమెరికాలో ఎన్నికల సంఘం లేదు. ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహిస్తుంది. మన దేశంలో మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల సంఘం 1990ల వరకూ ఏకసభ్య సంఘంగా ఉండేది. 1980ల నాటికి అక్రమార్కులూ, గూండాలూ, నేరగాళ్ళూ ఎన్నికల వ్యవస్థను శాసించే దుస్థితి దాపురించింది. ఆ దశలో తిరునెల్లాయ్ నారాయణ అయ్యర్ శేషన్ (టీ.ఎన్. శేషన్) పదవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా నియమితులైనారు. శేషన్‌కు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మొదటి నుంచి నిజాయితీపరుడైన, సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా పేరుంది. కాకపోతే కొంచెం తిక్క. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో శేషన్ రక్షణశాఖ కార్య దర్శిగా పని చేశారు. రక్షణ మంత్రి వీ. పీ. సింగ్ ప్రభుత్వం నుంచి వైదొలిగి బోఫోర్స్ కుంభకోణంపై ఉద్యమం చేసినప్పుడు రాజీవ్‌గాంధీని శేషన్ గట్టిగా బలపరిచారు. ఇందుకు మెచ్చి రాజీవ్‌గాంధీ 1989లో శేషన్‌కు కేబినెట్ సెక్ర టరీగా పదవోన్నతి ప్రసాదించారు. బోఫోర్స్ కారణంగానే 1989 ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎన్.టి. రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ వీ.పీ. సింగ్‌ను ప్రధానిగా ఎన్నుకున్నది. సింగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే శేషన్‌ను కేబినెట్ సెక్రటరీ పదవి నుంచి తొలగించి ప్రణాళికాసంఘం సభ్యుడుగా నియమించి కక్ష తీర్చుకున్నారు. మండల్, కమండల్ వీ.పీ. సింగ్ ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతు ఇచ్చింది. వెనుకబడిన వర్గాల హృదయాలు గెలుచుకునేందుకు మండల్ కమిషన్ నివేదిక దుమ్ము దులిపి దానిని అమలు చేయడానికి సింగ్ పూనుకున్నారు. మండల్‌కి పోటీగా బీజేపీ కమండల్ ఉద్యమానికి తెర లేపింది. అయోధ్యలో బాబరీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మించాలంటూ బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేశారు. రథాన్ని బిహార్‌లో లాలూప్రసాద్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్వాణీని అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా వీ.పీ. సింగ్ సర్కార్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా గద్దెనెక్కారు. శేషన్‌ను 1990 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియ మించారు. అప్పటి వరకూ తన అధికారాలు ఏమిటో తెలుసుకోకుండా బిక్కు బిక్కుమంటూ వ్యవహరించిన ఎన్నికల సంఘం అనూహ్యమైన రీతిలో జవస త్వాలు సంతరించుకున్నది. రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు అప్పటి వరకూ పరమ సాత్వికంగా ఉండిన సంఘం అకస్మాత్తుగా సింహంలాగా గర్జించడం ఆరం భించింది. 1991లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీ.వీ. నరసింహా రావుకూ. శేషన్‌కూ కొంతకాలం సఖ్యత ఉండేది. శేషన్‌ని అభిశంసించాలని వామపక్షాలు చేసిన ప్రయత్నాలను పీ.వీ. వమ్ము చేశారు. కానీ ఏకు మేకైన చందాన శేషన్ పీ.వీ.కి కొరకరాని కొయ్యగా తయారైనారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణపైన కేంద్ర మంత్రిమండలి నుంచి సంక్షేమ మంత్రి సీతారాం కేసరి, ఆహారమంత్రి కల్పనాథ్ రాయ్ రాజీనామా చేయాలని 1994లో శేషన్ పట్టుపట్టారు. మధ్యప్రదేశ్‌లో పోటీ చేస్తున్న కుమా రుడి తరఫున ప్రచారం చేస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గుల్షన్ అహ్మద్పైన శేషన్ అభియోగం మోపారు. గవర్నర్ రాజీనామా చేయవలసి వచ్చింది. పంజాబ్‌లో పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పోలింగ్‌ను రద్దు చేశారు. ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు ఏకపక్షంగా తీసు కోవడం ద్వారా శేషన్ నాయకులకు సింహస్వప్నమైనారు. ఈ దశలో పీ.వీ. చాణక్యం చేశారు. ఎన్నికల సంఘంలో ఒకరికి బదులు ముగ్గురు ఉండాలని నిర్ణయించి, శేషన్‌కు తోడు మరి ఇద్దరు కమిషనర్లను నియమించారు. శేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని ధ్రువీ కరిం చడమే కాకుండా ముగ్గురికీ సమానహోదా ఉంటుందనీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమవుజ్జీలలో ప్రథముడనీ, మెజారిటీ ఆధారంగా అన్ని నిర్ణయాలూ తీసుకో వాలనీ 1995లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటికే శేషన్ పదవీ కాలం ముగింపునకు వస్తోంది. 1996లో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన మెగ్సేసే అవార్డు లభించింది. 1997లో రాష్ట్రపతి పదవికి ఆర్కె నారాయణ్‌తో పోటీ పడి ఓడిపోయారు. కేరళలోని పాలక్కాడ్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ శేషన్, భార్య జయలక్ష్మి చైన్నైలోని అల్వార్‌పేటలో స్థిరపడినారు. జయలక్ష్మి 2018 మార్చి 31న మృతి చెందారు. వారికి సంతానం లేదు. అనారోగ్యంతో ఒంటరిగా శేషన్ శేషజీవితం గడుపుతున్నారు. శేషన్ ఆధిపత్యం సాగిన రోజుల్లో రాజకీయ నాయకులు ఇద్దరికే– దేవుడికీ, శేషన్‌కే– భయపడేవారని రాజకీయ పండితులు వ్యాఖ్యానించేవారు. ‘ది గ్రేట్ మార్చ్ ఆఫ్ డెమాక్రసీ’గ్రంథ రచయిత క్రిస్టొఫీ జాఫర్లాట్ ఇలా రాశారు: ‘అధినేత బలవంతుడా, బలహీనుడా అనే అంశం ఆధారంగా ఒకే సంస్థ భిన్నమైన వైఖరులు అవలంబిస్తుంది.’ శేషన్ సీఈసీగా పని చేసిన రోజుల్లో దేశంలో అనైక్యత ఉండేది. మత ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలలో అరాచకం రాజ్యం చేస్తూ ఉండేది. ‘ఆయారాం, గయారాం’ రాజకీయం అడ్డగోలుగా నడిచింది. ఓట్లను కొనుగోలు చేయడం, ఓటర్లకు మద్యం సరఫరా చేయడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా దౌర్జన్యంగా అడ్డుకోవడం యధేచ్ఛగా జరిగేవి. అన్ని పార్టీలలో గూండాలు ముందుపీటీలోకి రావడంతో ఎన్నికల ప్రక్రియ, ప్రజా స్వామ్య వ్యవస్థ అపహాస్యానికి గురైనాయి. ఆ దశలో శేషన్ అడుగుపెట్టారు. ఆరేళ్ళ పదవీ కాలంలో దేశ ప్రజలలో ఎన్నికల సంఘం పట్ల విశ్వాసం పెంచారు. నాయకులలో ఆ సంస్థ పట్ల గౌరవాన్నీ, భయాన్నీ నెలకొల్పారు. ఎన్నికల సంఘం సాహసోపేతంగా వ్యవహరించలేని సందర్భాలలో దేశ ప్రజలకు శేషన్ జ్ఞాపకం వస్తారు. చండశాసనుడు ఈ రోజున శేషన్ వంటి చండశాసనుడి చేతిలో ఎన్నికల కమిషన్ సారథ్యం ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. శేషన్‌ను స్ఫూర్తిగా తీసుకొని కమిషన్ మరింత నిర్ణయాత్మకంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఉద్బోధించిన తర్వాత ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా లక్ష్మణ రేఖ దాటిన ఆరుగురు ప్రముఖులపైన శిక్షాత్మక చర్యలు తీసుకున్నారు. ప్రధాని జీవితకథ ఆధారంగా తీసిన సినిమా విడుదలను అడ్డుకున్నారు. మరి కొన్ని సందర్భాలలో కఠిన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. శేషన్ స్ఫూర్తి సజీవంగా ఉంటే, మోదీని మరోసారి ప్రధాని చేయాలంటూ వ్యాఖ్యానించిన రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ రాజీనామా చేసేవరకూ ఎన్నికల కమిషన్ విశ్రమించేది కాదు. నిరుపేదలకు కనీస ఆదాయం వచ్చే విధంగా ‘న్యాయ్’ పథకాన్ని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన వాగ్దానం అమలు సాధ్యం కాదంటూ తేల్చిచెప్పిన ‘నీతి ఆయోగ్’ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్‌కుమార్‌కు ఉద్వాసన అనివార్యమై ఉండేది. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయాన్ని మహారాష్ట్రలోని వార్ధా బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ విమర్శిస్తూ ‘హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్న అమేథీలో ఓడిపోతాననే భయంలో వయనాడ్ వెడుతున్నారు’అంటూ వ్యాఖ్యానించినందుకు నోటీసులు అందు కునేవారు. శాస్త్రజ్ఞులు ఉపగ్రహాన్ని ఛేదించే రాకెట్ ‘మిషన్ శక్తి’ని విజయ వంతంగా ప్రయోగించిన సందర్భంగా టీవీలో దేశవాసులను ఉద్దేశించి ప్రసం గించినందుకు మోదీని తప్పుపట్టేవారు. ‘మోదీజీ సేన’ అంటూ పరవశించి మాట్లాడినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేత గుంజీలు తీయించేవారు. రఫేల్ పత్రాలపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యాలను వక్రీకరించినం దుకు రాహుల్‌గాంధీని బోను ఎక్కించేవారు. సుప్రీంకోర్టు సూచించినట్టు సునీల్ అరోరా శేషన్‌ను అనుసరించి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘంపైన ఒంటికాలిపైన లేచేవారు కాదు. పోలింగ్ ఆరంభమైన రెండు గంటలకే మూడింట ఒక వంతు ఈవీఎం మెషీన్లు పని చేయడం లేదంటూ, రీపోలింగ్ జరిపించాలంటూ యాగీ చేయడానికి సాహసించేవారు కాదు. ఈవీఎంలను రష్యా ఏజెంట్లు హ్యాక్ చేస్తున్నారంటూ నిరాధారమైన ఆరోపణ చేసేవారు కాదు. ప్రవర్తన నియమావళి కమిషన్ జారీ చేసే ప్రవర్తన నియమావళిని రాజీలేకుండా అమలు చేసింది శేషన్ హయాంలోనే. అభ్యర్థులూ, పార్టీలూ ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవ హరించాలో నిర్దేశించడంతో పాటు, అధికార పార్టీ ఎటువంటి నిగ్రహం పాటించాలో కూడా నియమావళి ఏడవ భాగంలో వివరంగా ఉన్నది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి అధికార యంత్రానికి పరిపాలనా బాధ్యతల బదలాయింపు జరగాలన్నది ఉద్దేశం. ఎన్నికల సమయంలో అభ్య ర్థులందరికీ, అన్ని పార్టీలకీ సమానావకాశాలు (లెవల్ ప్లేయింగ్ఫీల్డ్) విధిగా ఉండాలన్న సూత్రాన్ని పాటించేందుకు వీలుగా అధికార పార్టీకి ఎటువంటి ఆధిక్యం లేకుండా చూసేందుకే ఈ ఏర్పాటు. ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. నైతికా ధికారమే ఎన్నికల కమిషన్‌ను నడిపిస్తుంది. ప్రవర్తన నియమావళి మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ, మే 27 దాకా ఈ నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ను ఖాతరు చేయకుండా, దాని అధికారాలను గౌరవించకుండా వ్యవహ రించడం వల్ల చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ధిక్కరిం చవలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి (సీఎస్) పునేఠాపైన ఒత్తిడి తెచ్చి, వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) జారీ చేయిం చింది ముఖ్యమంత్రే. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయించి పునేఠా పదవిని ప్రమాదంలో పడవేసిందీ ఆయనే. ఎన్నికల సంఘం ఎంత మెతకగా ఉన్నప్పటికీ ఇటువంటి ధిక్కారాన్ని సహించ లేకపోయింది. అందుకనే పునేఠాను బదిలీ చేసి ఆయన స్థానంలో అత్యంత అనుభజ్ఞుడైన అధికారి ఎల్.వి. సుబ్రహ్మణ్యంను నియమించింది. ఆయనను ముఖ్యమంత్రి అందరు అధికారుల వలె గౌరవించి ఉంటే సమస్య ఉండేది కాదు. ఆయన సహనిందితుడనీ, కోవర్టు అనీ నోరు పారేసుకోవడం ద్వారా మొత్తం కేంద్ర సర్వీసులకు చెందిన అధికారుల ఆగ్రహాన్ని కొనితెచ్చుకున్నారు. క్షణికా వేశంలో చంద్రబాబు తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారు. ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ఎన్ని పేజీల లేఖ రాసినా ఏమి ప్రయోజనం? తనకు సమీక్షించే అవకాశం ఉండి ఉంటే పిడుగులు పడి ఏడుగురు మరణించేవారు కారని ఆ లేఖలో రాయడం ఏ మనస్తత్వానికి అద్దం పడుతుంది? శాశ్వత కార్యనిర్వాహకవర్గం (పర్మెనెంట్ ఎగ్జిక్యుటీవ్) అన్ని వ్యవ హారాలూ చూసుకుంటుంది. ‘ఫణి’ ముమ్మరమై తుపాను సంభవించి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్షించవచ్చు. సలహా ఇవ్వవచ్చు. అప్పుడైనా ప్రధాన కార్యదర్శితో, ఇతర అధికారులతో మర్యాదగా మాట్లాడే పరిస్థితి ఉండాలి. కె. రామచంద్రమూర్తి -
లక్ష్యం నెరవేరేనా?
-
లక్ష్యం నెరవేరేనా?
త్రికాలమ్ పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెనుదుమారమే లేపింది. సాధారణ పౌరులు నాలుగు రోజులుగా నానాయాతనా పడుతున్నారు. ఈ కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో తెలియదు. తమ నేరం లేకుండానే జీవితాలలో ఇంతటి సంక్షోభం ఏర్పడటం వారికి దిగ్భ్రాంతి కలిగించింది. వివాహాది శుభకార్యాలు తలపెట్టినవారూ, ఇల్లు, పొలం అమ్మిన డబ్బును బ్యాంకులో జమకట్టకుండా బద్ధకించినవాళ్ళూ, అటు వంటి అలవాటు లేనివాళ్ళూ, క్యూలో గంటల తరబడి నిలబడలేనివాళ్ళూ, బ్యాంకు ఖాతాలు లేనివాళ్ళూ, డెబిట్ కార్డు తెలియనివాళ్ళూ, క్రెడిట్‌కార్డు చూడని వాళ్ళూ, వారాంతంలో కూలీలకు డబ్బు చెల్లించవలసిన ఛోటా కాంట్రాక్టర్లూ, చిన్న దుకాణాలు నడుపుకునే చిరువ్యాపారులూ పడుతున్న అవస్థలు వర్ణనా తీతం. ఇవన్నీ తాత్కాలికమైనవేననీ, నల్లధనాన్నీ, దొంగనోట్లనూ నిర్మూలించాలన్న మహత్తర లక్ష్యం నెరవేరాలంటే ప్రజలు ఈ మాత్రం త్యాగం చేయాలనీ పాలకులు అంటున్నారు. నల్లధనం, నకిలీ నోట్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు తీరని హాని కలగడమే కాకుండా హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదులకూ, సంఘవ్యతిరేక శక్తులకూ హవాలా డబ్బు అందుతున్నదనీ, సరిహద్దు దాటి నకిలీ నోట్లు దేశంలో ప్రవేశించి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయనీ ప్రజలకు తెలుసు. ఈ అరిష్టాలని అరికట్టాలంటే మెరుపుదాడి (బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాటలలో చెప్పాలంటే నల్లధనంపైన మెరుపుదాడి–సర్జికల్ స్ట్రయిక్) అవసరమే. ఇది చాలా కష్టభూయిష్టమైన వ్యవహారమని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్వయంగా చెబుతున్నారు. ఇంతటి క్లిష్టమైన నిర్ణయాన్ని ముందస్తు సన్నాహాలు లేకుండా అకస్మాత్తుగా ప్రకటించి, ‘తాంబూలాలు ఇచ్చేశాం, తన్నుకు చావండి’ అన్నట్టు వ్యవహరిస్తే ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి? గంటల తరబడి బ్యాంకుల ఎదుటా, ఏటీఎంల ఎదుటా నిలబడి క్యూలో తనవంతు రాక ముందే బ్యాంకు పనిగంటలు అయిపోతే, ఏటీఎంలు ఒట్టిపోతే నిరాశా నిస్పృహలతో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళినవారిని అభినందిస్తూ టీవీలో ప్రధాని నరేంద్రమోదీ చిద్విలాసంతో దర్శనమిస్తారు. గొప్ప సంస్క రణ విజయం సాధించేందుకు సహకరిస్తున్న ప్రజానీకానికి ధన్యవాదాలంటూ జపాన్‌లో భారత సంతతి ప్రజల సభలో కరతాళాల ధ్వనుల మధ్య మోదీ నాట కీయంగా చెప్పడం చూసిన నిస్సహాయులు ఏడవలేక నవ్వక తప్పని పరిస్థితి. ముందు జాగ్రత్త చర్యలేవీ? నరేంద్రమోదీ రాజకీయ కౌశలాన్ని తక్కువ అంచనా వేయలేం. మాటల మాంత్రి కుడు ఆయన. అరచేతిలో స్వర్గం చూపించగల ఘనుడు. ఇంతటి ప్రభావశీల మైన సంస్కరణను ప్రవేశపెట్టే ముందు పూర్వాపరాలు పరిశీలించి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని, సామాన్య ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడగలిగితే బాగుండేది. నరేంద్రమోదీ మెరుపుదాడిని ప్రతిపక్షాలు నిర్ద్వం ద్వంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ పశ్చి మబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ఉద్ఘోషించారు. రెండు మాసాలలో ఎన్నికలు జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో ప్రతిపక్షనేతలందరూ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. బీజేపీ నాయకులకూ, కేంద్ర మంత్రులకూ రెండున్నర సంవత్సరాలుగా అలవాటైన యుద్ధనీతి ఉంది. ప్రభుత్వ చర్యను వ్యతిరేకించినవారిని దేశద్రోహులుగా, నల్ల« దనంలో మునిగితేలుతున్నవారిగా, ఉగ్రవాదులతో షరీకైనవారుగా, పాకిస్తాన్ ఏజెంట్లుగా అభివర్ణించే అదరగండపు రాజకీయాలలో వారు ఆరితేరారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపైన మెరుపుదాడులు జరిగినట్టు దాఖలా చూపించమని అడిగినవారినీ, దాడులు జరిగాయో లేదో అంటూ సంశయం వెలి బుచ్చినవారినీ పచ్చి దేశద్రోహులంటూ ప్రధాని, దేశీయాంగమంత్రి, రక్షణ మంత్రి నిందించారు. మొన్ననే గుండెలో గునపం దిగిన చందంగా ముగిసిన అమెరికా ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్, డెమాక్రాటిక్ పార్టీల అభ్యర్థులు ఉపయోగించిన పదజాలం, లేవనెత్తిన వ్యక్తిగత వివాదాలూ చూసిన తర్వాత అమిత్ షా, కపిల్ శిబ్బల్ అమిత సౌమ్యులుగా, కడుంగడు సంస్కారవంతు లుగా కనిపిస్తారు. అమిత్ షా, అరుణ్‌జైట్లీలు మాట్లాడుతుంటే వారు పరమపవి త్రులుగా, అమలిన రాజకీయ ధురంధరులుగా ప్రకాశిస్తారు. ప్రతిపక్షాలలో ఉన్నవారు అంతులేని అవినీతిలో కూరుకుపోయి, సమాజానికి కీడు చేసే పాడు బుద్ధితో, దేశమంటే లవలేశమైనా ప్రేమలేని స్వార్థపరులుగా కనిపిస్తారు. పెద్దనోట్ల రద్దు అతి పెద్ద సామ్యవాద నిర్ణయమంటూ ‘బిజినెస్ స్టాండర్డ్’ సంపాదకీయం అభివర్ణించింది. ప్రజల దగ్గర, ముఖ్యంగా సంపన్నుల లోగి ళ్ళలో, మూలుగుతున్న అవినీతి సొమ్మును బ్యాంకులకు తరలించి ప్రజల సంక్షేమం కోసం వినియోగించడానికి మించిన సామ్యవాదం ఏముంటుందని ఆ పత్రిక ప్రశ్నించింది. లెనిన్ బతికుంటే ఈ నిర్ణయాన్ని మనస్పూర్తిగా హర్షించే వాడు. మన కమ్యూనిస్టులకు అభ్యంతరం ఎందుకో అర్థం కావడం లేదంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా సమర్థించేవారూ, అంతే గుడ్డిగా వ్యతిరేకించేవారూ సమాజంలో బలంగా ఉన్నారు. మధ్యేవాదులూ, హేతువాదులూ బలహీనపడుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం నిర్మూ లనం జరిగిపోతుందనీ, నకిలీనోట్లు అంతర్థానమైపోతాయనీ, ఆర్థిక వ్యవస్థ దేదీప్యమానంగా వెలిగిపోతుందనీ, ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం నరేంద్రమోదీ వంటి మహానాయకుడు మినహా మరెవ్వరూ తీసుకోలేరని వాదిం చేవారు ఒక వైపు (తొలి గుజరాతీ ప్రధాని మొరార్జీదేశాయ్ 1978లోనే ఇటు వంటి నిర్ణయం తీసుకొని అభాసుపాలైన సంగతి విస్మరిస్తారు). ఇది పాలకులకు అనుకూలురైన ఆశ్రిత వ్యాపారవేత్తల ప్రయోజనాలను ఉద్దేశించి తీసుకున్న నిర్ణయం తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదని అంతే బలంగా వాదించేవారు మరో వైపు. నల్లధనం కూడబెట్టడానికి దోహదం చేస్తున్నాయనే కారణంతో పెద్దనోట్లు రద్దు చేసిన సర్కార్ అంత కంటే పెద్దదైన రెండు వేల రూపాయల నోట్లు జారీ చేయడంలోని ఆంతర్యం ఏమిటంటూ కేజ్రీవాల్ అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అస్మదీయులకు ముందు గానే తెలుసంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టివేయడానికీ వీలులేదు. చంద్ర బాబు వంటివారికి ముందే ఉప్పు అందిందని నమ్ముతున్నవారూ ఉన్నారు. రాజకీయ ప్రయోజనమే ప్రధానమా? ఈ చర్య ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి బీజేపీ నాయకులు సిద్ధమైనారు కానీ పర్యవసానాలను ఎదుర్కోటానికి మాత్రం సిద్ధంగా లేరు. వారు ఆశించిన రాజకీయ ఫలం అందుతుందో లేదో అనుమానమే. పెద్దనోట్ల రద్దు వెనుక ఉన్న ఉత్కృష్టమైన లక్ష్యం సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు. వారం, పది రోజులు పడిన కష్టాలు మాత్రం గుర్తుంటాయి. ఇటువంటి నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన శక్తియుక్తులు బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రభుత్వ వ్యవస్థలో కానీ లేవు. ప్రధానమంత్రి సంకల్పం కూడా అంత బలంగా లేదు. ఉదాహరణకు, నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో ‘ప్రధానమంత్రి జనధన యోజన’ను ప్రకటించారు. ప్రతి కుటుంబం పేరు మీదా ఒక బ్యాంకు ఖాతా తెరవాలని బ్యాంకులను ఆదేశించారు. ఈ నెల రెండో తేదీ వరకూ దేశవ్యాప్తంగా 23.37 కోట్ల ఖాతాలు తెరిచారు. కొన్ని రాష్ట్రాలలో అయితే ప్రతి ఇంటికీ ఒక ఖాతా ఉంది. కానీ వీటిలో 23 శాతం ఖాతాలలో నయాపైసా లేదు–జీరో బ్యాలెన్స్. ఇటువంటి ఖాతాల సంఖ్యను తగ్గించాలంటూ కేంద్రం నుంచి బ్యాంకులపై ఒత్తిడి వచ్చింది. బ్యాంకుల బ్రాంచి మేనేజర్లు జనధన్ ఖాతాలో రూపాయి, రెండు రూపాయలు జమచేసి జీరో బ్యాలెన్స్ ఖాతాల సంఖ్యను తగ్గించారంటూ ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనం ప్రకటించింది. పనామా పత్రాలు విదేశీ బ్యాంకులలో అవినీతిపరులు పోగేసిన లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకు వచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమచేస్తానంటూ సార్వత్రిక ఎన్ని కల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ వాగ్దానం చేశారు. అధికారం లోకి వచ్చిన తర్వాత జస్టిస్ షా ఆధ్వర్యంలో నల్లధనంపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను నియమించారు. అది చేసింది తక్కువ. పనామా పేపర్ల ఉదం తంలో లీక్వీరుడు హెర్ ఫాల్సియానీతో జస్టిస్ షా సహకరించలేదనే ఆరోపణ ఉంది. ఇండియా రావడానికి తనకు రక్షణ కల్పించాలన్న ఫాల్సియానీ అభ్య ర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఏమైనా సమాచారం ఉంటే ప్రభుత్వా నికి ఇవ్వాలి కానీ షరతులు పెట్టకూడదని అరుణ్‌జైట్లీ వాదించారు. నల్లధనం ఎవరి పేరు మీద ఉన్నదో తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని ప్రభుత్వం చేయలేదు. చాలా దేశాలు ఫాల్సియానీ చెప్పిన పద్ధతిలో దర్యాప్తు చేసి కొన్ని లక్షల యూరోలు రాబట్టుకున్నాయి. ఖాతాదారుల వివరాలు తెలుసుకునే కిటుకు చెబుతాను ఎవరినైనా బార్సిలోనాకు పంపించమంటూ ఫాల్సియానీ చేసిన ప్రతిపాదనకు సైతం మోదీ సర్కార్ స్పందించలేదు. నల్లధనం వెలికి తీతలో ఇతర దేశాలలోని ప్రభుత్వాలకు ఉన్న పట్టుదల మనకు లేదన్నది అంత ర్జాతీయ ప్రవీణుల అభిప్రాయం. రెండున్నర సంవత్సరాలలో నల్లధనం రాబ ట్టడానికి ఏమీ చేయలేదనే చెడ్డపేరును మాపుకోవడానికి మోదీ ఈ మెరుపుదాడి చేసినట్టు కొందరి అభిప్రాయం. పెద్దనోట్ల రద్దు కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే శనివారం మధ్యాహ్నం వరకూ రూ. 47,868 కోట్లు జమ అయి నట్లు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ఇందులో అనుమానం ఉన్న ఖాతాలపైన ఆదా యపన్ను శాఖ దృష్టి సారిస్తుంది. దేశంలోని బ్యాంకులు ఇచ్చిన తిరిగి రాని రుణాల మొత్తం రూ.6,00,000 కోట్లు. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులు దయనీయ స్థితిలో ఉన్నాయి. బ్యాంకుల పరపతి స్థాయిని నిర్ణయించే సంస్థ ‘మూడీ’ లెక్కల ప్రకారం దేశంలోని బ్యాంకులలో రూ. 625 కోట్ల మేరకు కొత్త డిపాజిట్లు జమ అయితేనే మూలధనం స్థాయి పెరిగి అవి ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. ప్రభుత్వ రంగంలోని 13 బ్యాంకులలోనూ కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్ళలో రూ. 23,000 కోట్లు జమ చేసింది. 2019లోగా ఈ బ్యాంకులలో ప్రభుత్వం రూ. 70,000 కోట్ల మేరకు డిపాజిట్లు సమకూర్చుతుందని నిరుడు జైట్లీ అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం కారణంగా వందలాదికోట్ల రూపాయలు ప్రజల నుంచి బ్యాంకులకు వచ్చి పడుతున్నాయి. ఇటీవల ఆదాయం వెల్లడి పథకం (ఇన్‌కం డిస్క్లోజర్ స్కీం) కింద రూ. 65 వేలకోట్లు సమకూరాయి. ఇందులో నలభై శాతం, అంటే దాదాపు రూ. 30 వేల కోట్ల ప్రభుత్వం చేతుల్లోకి వెడతాయి. పెరిగిన పాజిట్లను బ్యాంకులు ఏ విధంగా వినియోగిస్తాయన్నది కీలకమైన అంశం. మమతా బెనర్జీ చేసిన ఆరోపణ నిజమైతే ఆశ్రిత వ్యాపారుల కోసం ఈ ద్రవ్యాన్ని వినియోగి స్తారు. దేశంలో బ్యాంకులకు బాకీ ఉన్న బడా పెట్టుబడిదారుల జాబితా పరి శీలిస్తే మొదటి స్థానంలో రిలయన్స్ బ్రదర్స్‌లో చిన్నవాడు అనీల్ అంబానీ ఉంటారు. వివిధ బ్యాంకులకు ఆయన చెల్లించవలసిన మొత్తం రూ. 1,25,000 కోట్లు. వేదాంత గ్రూపు అధినేత అనీల్ అగర్వాల్ (రూ. 1,03,000 కోట్లు), ఎస్సార్ గ్రూప్ అధిపతి శశి రుయా, రవి రుయాలు(రూ.1,01,000 కోట్లు) తర్వాత స్థానాలలో ఉన్నారు. అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ రూ. 96,031 కోట్లు, జేపీ గ్రూప్ అధినేత మనోజ్ గౌర్ రూ. 75,163కోట్లు, జేఎస్ డబ్ల్యూ అధిపతి సజ్జన్ జిందాల్ రూ. 58,171 కోట్లు బ్యాంకులకు చెల్లించవలసి ఉంది. గ్రంధి మల్లికార్జునరావు (జీఎంఆర్ గ్రూప్) రూ. 47,976 కోట్లు, లగడపాటి మధుసూదనరావు (ల్యాంకోగ్రూప్–లగడపాటి రాజగోపాల్ అన్న గారు) రూ. 47,102కోట్లు, వేణుగోపాల్ ధూత్ (విడియోకాన్) రూ. 45,405 కోట్లు, జీవీకే రెడ్డి (జీవీకే గ్రూప్) రూ. 33, 933 కోట్లు బ్యాంకులకు బకాయి ఉన్నారు. వీరంతా అప్పులపైన వడ్డీలు చెల్లిస్తున్నారు. ఎగవేతదారులుగా వీరిని పరిగణించడానికి వీలు లేదు. వీళ్ళందరికీ కానీ, వీరిలో కొందరికి కానీ, వీరిని పోలిన ఇతర వ్యాపారస్థులకు కానీ ఇప్పుడు వచ్చి చేరుతున్న డిపాజిట్లను కొత్త రుణాల రూపంలో ఇస్తారా? బ్యాంకులను వేధిస్తున్న మొండి బకాయిలను రైటాఫ్ (మాఫ్) చేయడానికి ఈ అదనపు నిధులను వినియోగిస్తారా? కేంద్ర ప్రభుత్వం బాండ్ల స్థాయి పెంచి బ్యాంకుల నుంచి నిధులు సేకరించి వచ్చే బడ్జెట్లో ‘జనధన్ యోజన’ కింద పేదవారి బ్యాంకు ఖాతాలలో నేరుగా డబ్బు జమచేసి ఎన్నికల వాగ్దానం ఎంతో కొంత నిలబెట్టుకుంటారా? ఒక్కొక్క ఖాతాలో రూ. 15 లక్షలు రాకపోయినా పదివేల రూపాయలు పడినా వాగ్దాన భంగం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారనే మంచి పేరు మోదీకి వస్తుంది. ఏమి చేస్తారో చూడాలి. -కె. రామచంద్రమూర్తి -
సాక్షి టీవీ పిటిషన్‌ను పరిష్కరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవా లు చేస్తూ సాక్షి టీవీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ టీవీ ప్రసారాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపేశారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సాక్షి టీవీ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్ ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. సాక్షి ప్రసారాల నిలుపుదలలో ప్రభుత్వానికి, పోలీసులకు సంబంధం లేదని వివరించారు.సాక్షి తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ ఏపీలో సాక్షి ప్రసారాలు పునరుద్ధరించారని తెలిపారు. దీంతో న్యాయమూర్తి పై ఉత్తర్వులు ఇచ్చారు.