నియమావళికి నైతికతే ప్రాణం | Is It Correct Chandrababu Comments On Election Code | Sakshi
Sakshi News home page

నియమావళికి నైతికతే ప్రాణం

Published Sun, Apr 28 2019 12:22 AM | Last Updated on Sun, Apr 28 2019 12:22 AM

Is It Correct Chandrababu Comments On Election Code - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌ 11న మొదటి ఘట్టంలోనే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకూ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతుంది. అంటే పోలింగ్‌కూ, ఫలితాలు వెల్లడి కావడానికి మధ్య 42 రోజుల సుదీర్ఘ సమయం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లోనే ముగిశాయి. ప్రవర్తన నియమావళిని వర్తింపజేయడంలో తెలంగాణకూ, ఆంధ్రప్రదేశ్‌కూ వేర్వేరు ప్రమాణాలు ఉంటాయా? ప్రధాని నరేంద్రమోదీకీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కీ వర్తించని ఆంక్షలు తనకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు గగ్గోలు పెట్టడం సమంజసమేనా?

భారత్‌ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఉండాలనీ, అది నేరుగా రాష్ట్రపతికి జవాబుదారీగా ఉండాలనీ, ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఉద్వాసన చెప్పాలంటే పార్లమెంటు అభి శంసన తీర్మానం ఆమోదిస్తేనే కానీ సాధ్యం కాదని రాజ్యాంగాన్ని రూపొం దించిన రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. అత్యంత శక్తిమంతమైన ప్రజా స్వామ్య దేశం అమెరికాలో ఎన్నికల సంఘం లేదు. ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహిస్తుంది. మన దేశంలో మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని  ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల సంఘం 1990ల వరకూ ఏకసభ్య సంఘంగా ఉండేది. 1980ల నాటికి అక్రమార్కులూ, గూండాలూ, నేరగాళ్ళూ ఎన్నికల వ్యవస్థను శాసించే దుస్థితి దాపురించింది. ఆ దశలో తిరునెల్లాయ్‌ నారాయణ అయ్యర్‌ శేషన్‌ (టీ.ఎన్‌. శేషన్‌) పదవ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ)గా నియమితులైనారు. శేషన్‌కు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మొదటి నుంచి నిజాయితీపరుడైన, సమర్థుడైన ఐఏఎస్‌ అధికారిగా పేరుంది. కాకపోతే కొంచెం తిక్క. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో శేషన్‌ రక్షణశాఖ కార్య దర్శిగా పని చేశారు. రక్షణ మంత్రి వీ. పీ. సింగ్‌ ప్రభుత్వం నుంచి వైదొలిగి బోఫోర్స్‌ కుంభకోణంపై  ఉద్యమం చేసినప్పుడు రాజీవ్‌గాంధీని శేషన్‌ గట్టిగా బలపరిచారు. ఇందుకు మెచ్చి రాజీవ్‌గాంధీ 1989లో శేషన్‌కు కేబినెట్‌ సెక్ర టరీగా పదవోన్నతి ప్రసాదించారు. బోఫోర్స్‌ కారణంగానే 1989 ఎన్నికలో కాంగ్రెస్‌ ఓడిపోయింది. ఎన్‌.టి. రామారావు నాయకత్వంలోని  నేషనల్‌ ఫ్రంట్‌ వీ.పీ. సింగ్‌ను ప్రధానిగా ఎన్నుకున్నది. సింగ్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే శేషన్‌ను కేబినెట్‌ సెక్రటరీ పదవి నుంచి తొలగించి ప్రణాళికాసంఘం సభ్యుడుగా నియమించి కక్ష తీర్చుకున్నారు.

మండల్, కమండల్‌
వీ.పీ. సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతు ఇచ్చింది. వెనుకబడిన వర్గాల హృదయాలు గెలుచుకునేందుకు మండల్‌ కమిషన్‌ నివేదిక దుమ్ము దులిపి దానిని అమలు చేయడానికి సింగ్‌ పూనుకున్నారు. మండల్‌కి పోటీగా బీజేపీ కమండల్‌ ఉద్యమానికి తెర లేపింది. అయోధ్యలో బాబరీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మించాలంటూ బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేశారు. రథాన్ని బిహార్‌లో లాలూప్రసాద్‌ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్వాణీని అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా వీ.పీ. సింగ్‌ సర్కార్‌కు  బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధానిగా గద్దెనెక్కారు. శేషన్‌ను 1990 డిసెంబర్‌లో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా నియ మించారు. అప్పటి వరకూ తన అధికారాలు ఏమిటో తెలుసుకోకుండా బిక్కు బిక్కుమంటూ వ్యవహరించిన ఎన్నికల సంఘం అనూహ్యమైన రీతిలో జవస త్వాలు  సంతరించుకున్నది. రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు అప్పటి వరకూ పరమ సాత్వికంగా ఉండిన సంఘం అకస్మాత్తుగా సింహంలాగా గర్జించడం ఆరం భించింది. 1991లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీ.వీ. నరసింహా రావుకూ. శేషన్‌కూ కొంతకాలం సఖ్యత ఉండేది. శేషన్‌ని అభిశంసించాలని వామపక్షాలు చేసిన ప్రయత్నాలను పీ.వీ. వమ్ము చేశారు. కానీ ఏకు మేకైన చందాన శేషన్‌ పీ.వీ.కి కొరకరాని కొయ్యగా తయారైనారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణపైన కేంద్ర మంత్రిమండలి నుంచి సంక్షేమ మంత్రి సీతారాం కేసరి, ఆహారమంత్రి కల్పనాథ్‌ రాయ్‌ రాజీనామా చేయాలని 1994లో శేషన్‌ పట్టుపట్టారు.

మధ్యప్రదేశ్‌లో పోటీ చేస్తున్న కుమా రుడి తరఫున ప్రచారం చేస్తున్నారని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ గుల్షన్‌ అహ్మద్‌పైన శేషన్‌ అభియోగం మోపారు. గవర్నర్‌ రాజీనామా చేయవలసి వచ్చింది. పంజాబ్‌లో పోలింగ్‌  ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పోలింగ్‌ను రద్దు చేశారు. ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు ఏకపక్షంగా తీసు కోవడం ద్వారా శేషన్‌ నాయకులకు సింహస్వప్నమైనారు. ఈ దశలో పీ.వీ. చాణక్యం చేశారు. ఎన్నికల సంఘంలో ఒకరికి బదులు ముగ్గురు ఉండాలని నిర్ణయించి, శేషన్‌కు తోడు మరి ఇద్దరు కమిషనర్లను నియమించారు. శేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని ధ్రువీ కరిం చడమే కాకుండా ముగ్గురికీ సమానహోదా ఉంటుందనీ, చీఫ్‌ ఎలక్షన్‌  కమిషనర్‌ సమవుజ్జీలలో ప్రథముడనీ, మెజారిటీ ఆధారంగా అన్ని నిర్ణయాలూ తీసుకో వాలనీ 1995లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటికే శేషన్‌ పదవీ కాలం ముగింపునకు వస్తోంది. 1996లో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన మెగ్సేసే అవార్డు లభించింది. 1997లో రాష్ట్రపతి పదవికి ఆర్‌కె నారాయణ్‌తో పోటీ పడి ఓడిపోయారు.  కేరళలోని పాలక్కాడ్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ శేషన్, భార్య జయలక్ష్మి చైన్నైలోని అల్వార్‌పేటలో స్థిరపడినారు. జయలక్ష్మి 2018 మార్చి 31న మృతి చెందారు. వారికి సంతానం లేదు. అనారోగ్యంతో ఒంటరిగా శేషన్‌ శేషజీవితం గడుపుతున్నారు. శేషన్‌ ఆధిపత్యం సాగిన  రోజుల్లో రాజకీయ నాయకులు ఇద్దరికే– దేవుడికీ, శేషన్‌కే– భయపడేవారని రాజకీయ పండితులు వ్యాఖ్యానించేవారు.

‘ది గ్రేట్‌ మార్చ్‌ ఆఫ్‌ డెమాక్రసీ’గ్రంథ రచయిత క్రిస్టొఫీ జాఫర్లాట్‌ ఇలా రాశారు: ‘అధినేత బలవంతుడా, బలహీనుడా అనే అంశం ఆధారంగా ఒకే సంస్థ భిన్నమైన వైఖరులు అవలంబిస్తుంది.’ శేషన్‌ సీఈసీగా పని చేసిన రోజుల్లో దేశంలో అనైక్యత ఉండేది. మత ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఉత్తరప్రదేశ్, బిహార్‌ వంటి రాష్ట్రాలలో అరాచకం రాజ్యం చేస్తూ ఉండేది. ‘ఆయారాం, గయారాం’ రాజకీయం అడ్డగోలుగా నడిచింది. ఓట్లను కొనుగోలు చేయడం, ఓటర్లకు మద్యం సరఫరా చేయడం, ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రాకుండా దౌర్జన్యంగా అడ్డుకోవడం యధేచ్ఛగా జరిగేవి. అన్ని పార్టీలలో గూండాలు ముందుపీటీలోకి రావడంతో ఎన్నికల ప్రక్రియ, ప్రజా స్వామ్య వ్యవస్థ అపహాస్యానికి గురైనాయి. ఆ దశలో శేషన్‌ అడుగుపెట్టారు. ఆరేళ్ళ పదవీ కాలంలో దేశ ప్రజలలో ఎన్నికల సంఘం పట్ల విశ్వాసం పెంచారు. నాయకులలో ఆ  సంస్థ పట్ల గౌరవాన్నీ, భయాన్నీ నెలకొల్పారు.  ఎన్నికల సంఘం సాహసోపేతంగా వ్యవహరించలేని సందర్భాలలో దేశ ప్రజలకు శేషన్‌ జ్ఞాపకం వస్తారు.

చండశాసనుడు
ఈ రోజున శేషన్‌ వంటి చండశాసనుడి చేతిలో ఎన్నికల కమిషన్‌ సారథ్యం ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. శేషన్‌ను స్ఫూర్తిగా తీసుకొని కమిషన్‌ మరింత నిర్ణయాత్మకంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఉద్బోధించిన తర్వాత ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరా లక్ష్మణ రేఖ దాటిన ఆరుగురు ప్రముఖులపైన శిక్షాత్మక చర్యలు తీసుకున్నారు. ప్రధాని జీవితకథ ఆధారంగా తీసిన సినిమా విడుదలను అడ్డుకున్నారు. మరి కొన్ని సందర్భాలలో కఠిన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. శేషన్‌ స్ఫూర్తి సజీవంగా ఉంటే, మోదీని మరోసారి ప్రధాని చేయాలంటూ వ్యాఖ్యానించిన రాజస్థాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ రాజీనామా చేసేవరకూ ఎన్నికల కమిషన్‌ విశ్రమించేది కాదు. నిరుపేదలకు కనీస ఆదాయం వచ్చే విధంగా ‘న్యాయ్‌’ పథకాన్ని అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ చేసిన వాగ్దానం అమలు సాధ్యం కాదంటూ తేల్చిచెప్పిన ‘నీతి ఆయోగ్‌’  ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌కుమార్‌కు ఉద్వాసన అనివార్యమై ఉండేది. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్‌ నుంచి కూడా పోటీ చేయాలన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయాన్ని మహారాష్ట్రలోని వార్ధా బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ విమర్శిస్తూ ‘హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్న అమేథీలో ఓడిపోతాననే భయంలో వయనాడ్‌ వెడుతున్నారు’అంటూ వ్యాఖ్యానించినందుకు నోటీసులు అందు కునేవారు. శాస్త్రజ్ఞులు ఉపగ్రహాన్ని ఛేదించే రాకెట్‌ ‘మిషన్‌ శక్తి’ని విజయ వంతంగా ప్రయోగించిన సందర్భంగా టీవీలో దేశవాసులను ఉద్దేశించి ప్రసం గించినందుకు మోదీని తప్పుపట్టేవారు. ‘మోదీజీ సేన’ అంటూ పరవశించి మాట్లాడినందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేత  గుంజీలు తీయించేవారు. రఫేల్‌ పత్రాలపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యాలను వక్రీకరించినం దుకు రాహుల్‌గాంధీని బోను ఎక్కించేవారు. సుప్రీంకోర్టు సూచించినట్టు సునీల్‌ అరోరా శేషన్‌ను అనుసరించి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘంపైన ఒంటికాలిపైన లేచేవారు కాదు. పోలింగ్‌ ఆరంభమైన రెండు గంటలకే మూడింట ఒక వంతు ఈవీఎం మెషీన్లు పని చేయడం లేదంటూ,  రీపోలింగ్‌ జరిపించాలంటూ యాగీ చేయడానికి సాహసించేవారు కాదు. ఈవీఎంలను రష్యా ఏజెంట్లు హ్యాక్‌ చేస్తున్నారంటూ నిరాధారమైన ఆరోపణ చేసేవారు కాదు.

ప్రవర్తన నియమావళి
కమిషన్‌ జారీ చేసే ప్రవర్తన నియమావళిని రాజీలేకుండా అమలు చేసింది శేషన్‌ హయాంలోనే. అభ్యర్థులూ, పార్టీలూ ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవ హరించాలో నిర్దేశించడంతో పాటు, అధికార పార్టీ ఎటువంటి నిగ్రహం  పాటించాలో కూడా నియమావళి ఏడవ భాగంలో వివరంగా ఉన్నది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి అధికార యంత్రానికి పరిపాలనా బాధ్యతల బదలాయింపు జరగాలన్నది ఉద్దేశం. ఎన్నికల సమయంలో అభ్య ర్థులందరికీ, అన్ని పార్టీలకీ సమానావకాశాలు (లెవల్‌ ప్లేయింగ్‌ఫీల్డ్‌) విధిగా ఉండాలన్న సూత్రాన్ని పాటించేందుకు వీలుగా అధికార పార్టీకి ఎటువంటి ఆధిక్యం లేకుండా చూసేందుకే ఈ ఏర్పాటు. ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. నైతికా ధికారమే ఎన్నికల కమిషన్‌ను నడిపిస్తుంది. ప్రవర్తన నియమావళి మార్చి 10న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ, మే 27 దాకా ఈ నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ను ఖాతరు చేయకుండా, దాని అధికారాలను గౌరవించకుండా వ్యవహ రించడం వల్ల చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని  ధిక్కరిం చవలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పునేఠాపైన ఒత్తిడి తెచ్చి, వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) జారీ చేయిం చింది ముఖ్యమంత్రే.

ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయించి పునేఠా పదవిని ప్రమాదంలో పడవేసిందీ ఆయనే. ఎన్నికల సంఘం ఎంత మెతకగా ఉన్నప్పటికీ ఇటువంటి ధిక్కారాన్ని సహించ లేకపోయింది. అందుకనే పునేఠాను బదిలీ చేసి ఆయన స్థానంలో అత్యంత  అనుభజ్ఞుడైన అధికారి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యంను నియమించింది. ఆయనను ముఖ్యమంత్రి అందరు అధికారుల వలె గౌరవించి ఉంటే సమస్య ఉండేది కాదు. ఆయన సహనిందితుడనీ, కోవర్టు అనీ నోరు పారేసుకోవడం ద్వారా మొత్తం కేంద్ర సర్వీసులకు చెందిన అధికారుల ఆగ్రహాన్ని కొనితెచ్చుకున్నారు. క్షణికా వేశంలో చంద్రబాబు తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారు. ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ఎన్ని పేజీల లేఖ రాసినా ఏమి ప్రయోజనం? తనకు సమీక్షించే అవకాశం ఉండి ఉంటే పిడుగులు పడి ఏడుగురు మరణించేవారు కారని ఆ లేఖలో రాయడం ఏ మనస్తత్వానికి అద్దం పడుతుంది? శాశ్వత కార్యనిర్వాహకవర్గం (పర్మెనెంట్‌ ఎగ్జిక్యుటీవ్‌) అన్ని వ్యవ హారాలూ చూసుకుంటుంది. ‘ఫణి’ ముమ్మరమై తుపాను సంభవించి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్షించవచ్చు.  సలహా ఇవ్వవచ్చు. అప్పుడైనా ప్రధాన కార్యదర్శితో, ఇతర అధికారులతో  మర్యాదగా మాట్లాడే పరిస్థితి ఉండాలి.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement