thrikalam
-
సంక్షేమ రథ సారథి
స్వయం సహాయక బృందాల సభ్యులకు ఐదువేల రూపాయల ‘ఓవర్‌డ్రాఫ్ట్’ (తాత్కాలిక రుణం) సౌకర్యం కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ శుక్రవారంనాడు 2019–20 బడ్జెట్ ప్రసంగంలో ఒకటికి రెండు సార్లు ఉద్ఘాటించినప్పుడు వింతగా వినిపించింది. తెలుగింటి కోడలు దేశ బడ్జెట్‌ను సమర్పించి కేంద్ర ఆర్థిక శాఖను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటలలోకి ఎక్కడం సంతోషం కలిగించింది. కానీ ఈ మాత్రం సహాయానికే కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చాటుకుంటే కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికీ మేలు చేయడానికి ప్రయత్నించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగా చెప్పుకొని ఉండాల్సింది? తండ్రి బాటలో నడుస్తూ ఆశా వర్కర్ల వేతనాలను మూడు వేల నుంచి పది వేలకు పెంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ఘనంగా చెప్పుకోవాలి? ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులైన ప్రజలు చెప్పుకోవాలి కానీ ముఖ్యమంత్రులూ, మంత్రులూ, అధికారులూ చెప్పుకోకూడదు. ఇప్పటికీ వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారంటే సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ ప్రధాన కారణం. కులం, ప్రాంతం, పార్టీ ప్రమేయం లేకుండా సర్వజనులకూ సంక్షేమం అనే సూత్రాన్ని అమలు చేసి సిసలైన ప్రజా నాయకుడిగా నిలిచిన వైఎస్ 70వ జయంతి రేపు. సంక్షేమ సారథిగా వైఎస్ పెట్టిన ఒరవడినే ప్రధానులైనా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా అనుసరిస్తు న్నారు. 1983లో ఎన్టీ రామారావు ప్రారంభించిన సంక్షేమ పథకాలను 2004లో పునరుద్ధరించి మరింత వేగంగా, సర్వజన సమ్మతంగా అమలు చేయడమే కాకుండా అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన జనహృదయాధినేత వైఎస్. పథకాలు కొన్నిటినే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సంక్షేమం అభివృద్ధికి సోపానం బడ్జెట్లో సింహభాగం ఉచితాల(ఫ్రీబీస్)కే పోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉండవనీ, సంక్షేమ వ్యయానికి సరిహద్దులు ఉండాలనీ వాదించే ఆర్థిక వేత్తలు చాలామంది ఉన్నారు. సంక్షేమమే అభివృద్ధికి దారితీస్తుందని అర్థం చేసుకోవాలంటే మనసుండాలి. మానవత్వం ఉండాలి. 1991లో నాటి ప్రధాని పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సమయంలో ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ (మానవీయ కోణంతో సంస్కరణలు) అంటూ నొక్కి చెప్పే వారు. 1996లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, పి.వి. పదవీ విరమణ తర్వాత ఆయన తరచు హైదరాబాద్ సందర్శించేవారు. నాబోటివాళ్ళు కలుసుకున్నప్పుడు ‘వేర్ ఈజ్ హ్యూమన్ ఫేస్?’ (మానవీయకోణం ఎక్కడుంది?)అంటూ నిర్వేదంగా పెదవి విరిచేవారు. మానవత్వం లేని భౌతిక సంపద వ్యర్థం. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత సంపన్నులు మరింత సంపన్నులైనారు. సంపద సృష్టిస్తే దాని ఫలితాలు క్రమంగా కిందికి దిగి అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందనే (ట్రిక్లింగ్ ఎఫెక్ట్) సిద్ధాంతం పనిచేస్తున్నట్టు కనిపించలేదు. కొంతమంది ముఖ్య మంత్రులు ఆర్థిక సంస్కరణలనూ, మార్కెట్ ఎకానమీనీ అపార్థం చేసుకొని క్రోనీ కేపిటలిస్టులకు అక్రమ ప్రయోజనాలు కలిగించే ఉద్దేశంతో విద్య, ఆరోగ్య రంగాలనుంచి ప్రభుత్వాలను తప్పించారు. మార్కెట్ ఎకానమీ పుట్టిన పాశ్చాత్య దేశాలలో సైతం విద్య, ఆరోగ్య రంగాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా నిష్క్ర మించలేదు. బ్రిటన్ ప్రధాని సంతానం లేదా అమెరికా అధ్యక్షుడి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకే వెడతారు. ప్రభుత్వ పాఠశాలలూ, కళాశాలలనూ పట్టిం చుకోకపోవడం, ఏదో ఒక సాకు (రేషనలైజేషన్) చూపించి ప్రభుత్వ పాఠశాల లను మూసివేయడం వల్ల పేద వర్గాలు కూడా పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకే పంపక తప్పని పరిస్థితి. ఆరోగ్యరంగం డిటో. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు లేకపోవడం, మందులు దొరకపోవడం, సేవలు క్షీణించడంతో ప్రైవేటు ఆస్పత్రులకు గిరాకీ పెరిగింది. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో వైద్యం అంది స్తామనీ, కార్పొరేట్ కళాశాల స్థాయిలో విద్యను అందిస్తామనీ నాయకులు చెప్పుకునే దుస్థితికి చేరుకున్నాం. గురుకుల పాఠశాలలు కొంత ఊరట కలిగి స్తున్నప్పటికీ పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోవడానికి విద్య, ఆరోగ్యం కోసం చేసే శక్తికి మించిన ఖర్చులే ప్రధాన కారణం. దీన్ని గ్రహించి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్. ఫీజ్ రీయంబర్స్మెంట్ ఫలితంగా వేలమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఈ సంక్షేమ చర్య యువతీయువకులకు ఉన్నత విద్యను ప్రసాదించి ఉద్యోగాలకు అర్హులను చేసింది. ఇందులో సంక్షేమం ఉన్నది. అభివృద్ధీ ఉన్నది. ఈ పథకాన్ని విస్తరించి జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత శాతం పెరుగుతుంది. వైఎస్ అస్తమించి పదేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచి వెలగడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ ముఠా రాజకీయాలలో వైఎస్ ఆత్మరక్షణ చేసుకుంటూ అంచెలంచెలుగా పైకి వచ్చిన తీరూ, ప్రజలతో మమే కమై వారి సేవ చేసి తరించాలన్న ఆకాంక్ష ఆయనను విలక్షణమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి. కార్యాలయంలో కంప్యూటర్ ముందు కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం కంటే పల్లెలకు వెళ్ళి రైతులతో మాట్లాడటానికి ఇష్టపడే వారు ఆయన. టైమ్స్ కవర్పేజీపైన తన ఫొటో ఉండాలనే తాపత్రయం లేదు. పేదవారి కళ్ళల్లో సంతోషం చూడాలని తప్పించేవారు. తన కంటే ముందు పదమూడు మంది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేసినా రైతులలో, ఉద్యోగులలో, మేధావులలో, ఇతర వర్గాలలో వైఎస్ పట్ల ఉన్నంత ప్రేమాభిమానాలు ఇతరులకు లేవంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక మినహా యింపు ఎన్‌టి రామారావు. వైఎస్ చేపట్టినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్టిఆర్ అమలు చేయలేదు. ఎన్టిఆర్ 1994లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంతకాలు చేసి అమలు చేసిన సంక్షేమ కార్య క్రమాలనూ, అంతకు ముందు ఎన్టీఆర్ అమలు చేసిన కార్యక్రమాలనూ చంద్ర బాబు ముఖ్యమంత్రిగా వచ్చాక రద్దు చేశారు. 2004లో వైఎస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే వ్యవసాయ రంగానికి రోజూ తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకూ, రూ. 1,250 కోట్ల మేరకు పేరుకున్న విద్యుచ్ఛక్తి చార్జీల బకాయిలు మాఫ్ చేసేందుకూ సంబంధించిన ఫైళ్ళపైన సంతకాలు చేశారు. పేదల సమ స్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించాలనే తపన వైఎస్‌కు రాజకీయాలలో ప్రవేశించినప్పటి నుంచీ ఉండేది. పాదయాత్రలో ఎదురైన అనుభవాలూ, ప్రజల సమస్యలను ఆలకించిన తర్వాత మనసులో కదలాడిన భావాలూ సంక్షేమ కార్య క్రమాలకు రూపునిచ్చి ప్రాణంపోశాయి. పాదయాత్రల కుటుంబం మండుటెండలో ఏప్రిల్ మాసంలో (9 జూన్ 2003) రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి వైఎస్ ప్రారంభించిన పాదయాత్ర 67 రోజులు సాగింది. 1,475 కిలో మీటర్లు నడిచి ఇచ్ఛాపురం చేరుకొని అక్కడ ప్రజాప్రస్థాన జ్ఞాపిక స్థూపాన్ని నెల కొల్పడానికి ముందే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల రూప కల్పన జరిగి ఉంటుంది. నాయకుల దగ్గరికి ప్రజలు వస్తారు. తమ కష్టాలు చెప్పు కుంటారు. మనసున్న నాయకులు స్పందించి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అది ఉత్తమం. నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడం అత్యుత్తమం. పరిష్కారాలు అక్కడే సాక్షాత్కరిస్తాయి. అమలు చేయడమే తరువాయి. వైఎస్ బాటలోనే ఆయన తనయ షర్మిల పాద యాత్ర చేశారు. అనంతరం జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇంత దూరం పాదయాత్ర చేయడం ప్రపంచంలో మరెక్కడా లేదు. వైఎస్ మొదటి పాదయాత్ర చేవెళ్ళ–ఇచ్ఛాపురం కాదు. దీని కంటే 17 సంవత్సరాల ముందే పోతిరెడ్డిపాడు పాదయాత్రకు వైఎస్ నాయ కత్వం వహించారు. 1986 జనవరి ఒకటో తేదీన లేపాక్షి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆరు పట్టణాలూ, 60 గ్రామాల మీదుగా ఇరవై రోజుల పాటు 500 కిలోమీటర్లు సాగి పోతిరెడ్డిపాడు చేరుకున్నది. మూడేళ్ళకు ఒకసారి కరువు కరాళనృత్యం చేసి ప్రజల బతుకుల్లో బడబాగ్ని నింపుతుంటే ఏదో ఒకటి చేయా లనే దీక్షతో వైఎస్, ఇతర మిత్రులు కలసి జరిపిన జనయాత్ర అది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి కృష్ణా జలాలను రాయలసీమకు ఉదా రంగా సరఫరా చేయాలన్నది వారి డిమాండ్. రెండు దశాబ్దాల తర్వాత ముఖ్య మంత్రి హోదాలో వైఎస్ ఆ పని చేశారు. ఆ పాదయాత్రలో ఎదురైన అను భవాలూ, 2003 నాటి ప్రజాప్రస్థానం తాలూకు అనుభవాలూ కలబోసి జల యజ్ఞం ఆవిష్కృతమైంది. లక్షా ఎనభై వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజె క్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని కల కన్నారు. 86 ప్రాజెక్టు ప్రారంభించారు. ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయినాయి. 21 ప్రాజెక్టులు పాక్షికంగా అమలు జరిగాయి. అమెరికాలోని కొలరాడో లిఫ్ట్ ఇరి గేషన్ ప్రాజెక్టు మాదిరే ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలను 600 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాలని సంకల్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని రూపం మారి కాళేశ్వరం బృహత్తర ప్రాజెక్టు అవతరించింది. 2000లో టీడీపీ ప్రభుత్వం విద్యుచ్ఛక్తి రంగంలో అమలు చేయడానికి ప్రయత్నించిన సంస్కరణలను ప్రతిఘటించడంలో వైఎస్ ముందున్నారు. పాత ఎంఎల్ఏ క్వార్టర్స్‌లో ఆమరణదీక్ష చేపట్టిన అఖిలపక్ష ఎంఎల్ఏలకు నాయ కత్వం వహించారు. ఆ సంవత్సరం ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో పోలీసులు జరి పిన కాల్పులలో ఇద్దరు మరణించారు. 14 రోజుల ఆమరణదీక్ష విరమించారు. ఆ ఉద్యమమే వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే నిర్ణయానికి స్ఫూర్తి. ఓటమి ఎరుగని విజేత ముప్పయ్ నాలుగేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నేత వైఎస్. ఆయన రాజకీయ జీవితం ఆది నుంచీ ఏటికి ఎదురీదడమే. పట్టువిడవని దృఢదీక్షతో అవరోధాలను అధిగమిస్తూ విజయలక్ష్యం వైపు సాగింది. ఇచ్చిన మాటకు కట్టు బడే తత్వం ఆద్యంతం ఆయనను రాజీలేకుండా నడిపించి ఎనలేని విశ్వస నీయతను సంపాదించిపెట్టింది. కడప జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్య క్షుడిగా వ్యవహరించిన వైఎస్ 1978 నాటికి చీలిపోయిన కాంగ్రెస్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని రెడ్డి కాంగ్రెస్ నాయకులు అడిగితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ కంటే ఇందిరా కాంగ్రెస్ లేదా జనతా పార్టీకి విజయావకాశాలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలిసినా రెడ్డి కాంగ్రెస్ ఆవు–దూడ గుర్తుతోనే పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2009 ఎన్నికల వరకూ తిరుగులేదు.1996లో జరిగిన ఎన్నికలలో పులివెందులలో వైఎస్‌ను ఓడించేందుకు చంద్ర బాబు విశ్వప్రయత్నం చేశారు. కుటంబసభ్యులనూ, మద్దతుదారులనూ గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రచారం చేయనివ్వలేదు. తక్కువ మెజారిటీతో (5,445 ఓట్లు) వైఎస్ గెలుపొందారు. అంత తక్కువ మెజారిటీ తర్వాత ఎన్నడూ రాలేదు. తనకు పరిచయం ఉన్న సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో మరణిం చారు. ఇందిరాగాంధీకి వైఎస్ దగ్గరౌతున్న సమయంలో ఆమెను 1984లో సిక్కు అంగరక్షకులు హత్య చేశారు. రాజీవ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజు లలోనే కే.ఇ. కృష్ణమూర్తిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించమని వైఎస్ సలహా చెబితే వైఎస్‌నే ఆ పదవిలో రాజీవ్ నియమించారు. అప్పటికి వైఎస్ వయస్సు 34 ఏళ్ళు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అనంతరం 1985లో జరిగిన ఎన్నికలలో ఎన్టిఆర్ ప్రభంజనాన్ని తట్టుకోవడం కాంగ్రెస్‌కు సాధ్యం కాలేదు. 1999లో వైఎస్ సారథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగింది. కార్గిల్ యుద్ధంలో విజయం వాజపేయి ప్రాబల్యాన్ని విశేషంగా పెంచింది. అది టీడీపీకి ఉపకరించింది. పాదయాత్ర అనంతరం 2004 ఎన్ని కలలో టీడీపీపైన కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. వైఎస్ సంక్షేమ రాజ్యం స్థాపించారు. 2009 ఎన్నికలలో విజయం సాధించారు. అదే సంవత్సరం సెప్టెం బర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అప్పటి నుంచీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని నివసిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి రూపంలో సంక్షేమ రథాన్ని రెట్టింపు వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. ధన్యజీవి. కె. రామచంద్రమూర్తి -
ఘనవిజయాలు, గుణపాఠాలు
త్రికాలమ్ సుమారు దశాబ్దకాలం దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడూ ఎరగని వేధింపులూ, వ్యక్తిత్వహననం, ఆర్థిక విధ్వంసం, భౌతిక దాడులూ ఎదుర్కొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సకల ప్రతికూల పరిస్థితులనూ అధిగమించి ఎన్నికలలో అఖండ విజయం సాధించి అధి కార పగ్గాలు చేపట్టబోతున్నారు. మొత్తం 175 స్థానాలు కలిగిన అసెం బ్లీలో 151 స్థానాలు గెలుచుకోవడం, మొత్తం 25 లోక్‌సభ స్థానాలలో 22 కైవసం చేసుకోవడం, 50 శాతానికిపైగా ఓట్లు సంపాదించడం మునుపెన్నడూ ఎరగని అసాధారణ పరిణామం. 1971లో ఇందిరా గాంధీ కానీ, 1983, 1994లో ఎన్‌టి రామారావు కానీ, 1984లో రాజీవ్ గాంధీ కానీ ఇంతటి ఘనవిజయం సాధించలేదు. అధికారం నిలబెట్టు కునేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబునాయుడు చేయని ప్రయత్నం లేదు. వేయని ఎత్తుగడ లేదు. పన్నని పన్నాగం లేదు. నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు ప్రజలనూ, వారి యోగక్షేమాలనూ పట్టించుకోకుండా ఎన్నికల ముందు పసుపూ– కుంకుమా అంటూ ప్రజాధనాన్ని మహిళలకు చెల్లించడం ద్వారా ఓట్లు దండుకోవచ్చునన్న తంత్రం ఫలించలేదు. పోలింగ్‌కు వారం రోజుల ముందుగా మహిళలకూ, రైతులకూ నగదు చేతిలో పడే విధంగా ప్రణాళిక రచించినా ఫలితం లేకపోయింది. తాను ఒక్క పిలుపు ఇస్తే మహిళలందరూ కదిలి పోలింగ్ కేంద్రా లకు వెళ్ళి తెల్లవారుజాముదాకా క్యూలలో నిలబడి తన పార్టీకి ఓటు వేశారంటూ ఢిల్లీలో, అమరావతిలో చంద్రబాబు పదేపదే చెప్పిన విషయం కేవలం భ్రమాజ నిత, స్వానురాగపూరిత కాల్పనిక కథనమేనని ఓట్ల లెక్కింపులో తేటతెల్లమై పోయింది. ప్రజాసామ్య వ్యవస్థకు ప్రజలే రక్షకులనే మాట అక్షర సత్యమని నిరూపించిన అరుదైన సందర్భం ఇది. అందరికీ గుణపాఠాలు ఎన్నికలలో విజేతలకూ, పరాజితులకూ గుణపాఠాలు ఉంటాయి. పరాజ యాన్ని అర్థం చేసుకోవడం ఎంత అవసరమో విజయంపై అవగాహనా అంతే ప్రధానం. ఓటమి కారణాలను విశ్లేషించుకొని, తప్పులు దిద్దుకొని, ముందడుగు వేసేవారికి రాజకీయాలలో మనుగడ ఉంటుంది. విజయాలకు తోడ్పడిన కార ణాలు గ్రహించి, ప్రత్యర్థుల పరాజయానికి దారి తీసిన అంశాలనూ అధ్యయనం చేసి అవగాహన చేసుకున్న నాయకులకు వచ్చే అయిదేళ్ళలో మందుపాతరల పైన కాలు పెట్టకుండా సురక్షితంగా, లాఘవంగా ఎట్లా నడవాలో బోధపడు తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్సీపీ ఘనవిజయం సాధిస్తుందని చెప్పడానికి సర్వేలు అక్కర లేదు. ఎగ్జిట్‌పోల్స్ అంతకన్నా అవసరం లేదు. పద్నాలుగు మాసాలు 3,648 కిలోమీటర్ల పొడవునా సాగిన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రసంగించిన లెక్కకు మించిన సభలకు హాజరైన లక్షలాది జనం ఆత్మ ఘోష ఆలకించినవారికీ, వారి మొహాలలో కనిపించిన ఆవేదననూ, ఉద్వేగాన్నీ, ఆశనూ, ఉత్సాహాన్నీ గమనించినవారికీ ఎన్నికల ఫలితాలు ఊహించుకోవడం కష్టం కానేకాదు. ఆంధ్రప్రదేశ్‌లో 33 లోక్‌సభ సభ్యులను గెలిపించి ఢిల్లీకి పంపించి యూపీఏ–2కి వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్ కుటుంబాన్ని అవమా నించాలని స్వార్థరాజకీయుల చాడీలు విని నిర్ణయించుకున్న సోనియాగాం«ధీకీ, రాహుల్‌గాంధీకీ నిష్కృతి ఉండదని 2014, 2019 ఎన్నికలు నిరూపించాయి. వారు తమ తప్పు తెలుసుకున్న దాఖలా లేదు. వారితో కలసి కుట్ర చేసినవారికీ, దానిని అమలు చేసినవారికీ ప్రజలు తగిన పాఠం చెప్పారు. జాతీయ స్థాయిలో వెలువడిన ఎన్నికల ఫలితాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫలి తాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికీ, జనసామాన్య మనోగతానికీ నిదర్శనమై నిలి చాయి. 2014లో ఐదు లక్షల ఓట్ల వ్యత్యాసంతో విజయం సాధించి, అధికార పగ్గాలు చేతపట్టిన చంద్రబాబు గెలుపును అపార్థం చేసుకున్నారు. సమాజంలోని సకల వర్గాలకు లెక్క లేనన్ని వాగ్దానాలు చేసిన ఎన్నికల ప్రణాళికను పక్కన పెట్టారు. తన సొంత అజెండాను భుజానికి ఎత్తుకున్నారు. కొత్త రాజధాని అమరావతిని అక్రమ వ్యాపారానికి అందివచ్చిన అవకాశంగా పరిగణించారు. సింగపూర్ అన్నారు. అస్థానా అన్నారు. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన అయిదు నగరాలలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు. ఈ మాటలు చెబుతూనే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా అస్మదీయుల చేత రాజధాని ప్రాంతంలో వందల ఎకరాల భూములు కొనిపించారు. డిజైన్ల పేరుమీద వందల కోట్ల రూపాయలు వెచ్చించారు. పదవీకాలం ముగిసే నాటికి అమరావతిలో శాశ్వత ప్రాతిపదికపైన ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తాత్కాలిక సచివాలయ, శాసన సభ భవనాలకు భూమి ఉచితంగా ఇచ్చి చదరపుటడుగుకు రూ. 11 వేలు కాంట్రాక్టర్లకు చెల్లించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతను కేంద్రం నుంచి అడిగి తీసుకొని మరీ తలకెత్తుకున్నారు. వ్యయం అంచనాను 16 వేల కోట్ల నుంచి 64 వేల కోట్లకు పెంచివేసి, కాంట్రాక్టర్లతో లాలూచీ పడి, అవినీతికి లాకులు ఎత్తేశారనే ఆరో పణలకు అవకాశం ఇచ్చారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సందర్శించినప్పుడు పోలవరం టీడీపీకి ఏటీఎంలాగా పని చేస్తోందంటూ చమత్కరించే వరకూ వ్యవహారం వెళ్ళింది. ఎర్త్ అండ్ రాక్ డామ్ నిర్మాణం ఆరంభం కాలేదు. కాఫర్ డ్యాం సైతం నత్తనడక నడుస్తోంది. ఈ మహా నిర్మాణం ప్రజలకు చూపించడంకోసం వందల కోట్ల ప్రజాధనం తగలేశారు. అనవసరమైన పట్టిసీమ వంటి ఎత్తిపోతల పథ కాల ఖర్చు అదనం. ఎత్తిపోతల పథకంతో గోదావరి, కృష్ణా నదులను అను సంధానం చేసినట్టూ, కృష్ణా డెల్టాకు గోదావరి నీరు పారించినట్టూ సంబరాలు చేసుకున్నారు. బెడిసికొట్టిన వ్యూహాలు ప్రతిపక్ష నాయకుడిని పరాభవించడం, లక్ష కోట్లు కాజేశారంటూ అదే పనిగా అసత్యారోపణలు చేయడం, అసెంబ్లీని అపహాస్యం చేయడం వంటి అకృ త్యాలతో ప్రతిపక్షం అసెంబ్లీకి రాకుండా ప్రజల మధ్యకు వెళ్ళాలని నిర్ణయిం చుకునే వరకూ వేధించారు. ఎన్నికల తంత్రం బెడిసికొట్టింది. మోదీతో, కేసీఆర్‌తో తాగాదా పెట్టుకోవడం, కేంద్రంలో ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు లక్నో, కోల్‌కతా, బెంగళూరు నగరాలకు పిలవని పేరంటం వెళ్ళి నానాయాతనా పడటం వికటించింది. నేలవిడిచి సాము చేయడాన్ని ప్రజలు మెచ్చలేదు. తమను వంచించడం, తక్కువగా అంచనా వేయడం, డబ్బుకు అమ్ముడుపోయేవాళ్ళుగా పరిగణించడం ప్రజలకు నచ్చలేదు. కడచిన పదేళ్ళుగా జగన్ ప్రజలలోనే, ప్రజలతోనే ఉన్నారు. ఓదార్పు యాత్ర, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు ఉద్యమంలో భాగంగా సభలూ, సమావేశాలూ, పాదయాత్ర, రెండు సార్వత్రిక ఎన్నికలలో విస్తృత ప్రచారంతో ప్రజల సమక్షంలోనే ఎక్కువ కాలం గడిచిపోయింది. పాదయాత్రలో దాదాపు కోటి మందిని కలుసుకొని వారి బాధలు విన్నారు. ఇచ్చిన మాట తప్పరనీ, నవ రత్నాలను నిజాయితీగా అమలు చేస్తారనే విశ్వాసంతో ప్రజలు ఓట్లు కుమ్మ రించారు. దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించిన రాజకీయ నాయకుడు జగన్ ఒక్కరే. తన పార్టీ గుర్తుపైన గెలిచిన 23 మంది ఎంఎల్‌ఏలనూ, ముగ్గురు ఎంపీలనూ చంద్రబాబు కొనుగోలు చేసినప్పటికీ తన పార్టీలో చేరదలచినవారి చేత ఉన్న పదవులకు రాజీనామా చేయించిన నైతికత జగన్‌ది. శనివారం లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏక గ్రీవంగా ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌లో గవర్నర్‌ని కలిసిన జగన్ రాజ్‌భవన్ నుంచి నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) నివాసం ప్రగతిభవన్‌కు వెళ్ళారు. జగన్‌ను కేసీఆర్ ఆలింగనం చేసుకొని కుటుంబ సమేతంగా స్వాగతం చెప్పారు. ఎన్నికల ముందు వాతావరణం, ఎన్నికల ప్రచారంలో ధోరణి తాజా పరిస్థితికి పూర్తి భిన్నం. మోదీనీ, కేసీఆర్నీ నిశితంగా విమర్శించడం,వారిని జగన్‌తో జతకట్టడం, ముగ్గురూ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కుట్రపన్నుతున్నా రంటూ అర్థంలేని ఆరోపణలతో ధ్వజమెత్తడం ద్వారా చంద్రబాబు విధ్వం సకరమైన పాత్ర పోషించారు. కేంద్రంతో తగవు పెట్టుకోవడం విజ్ఞత కాదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ చెబుతూ ఉండే వారు. తన బాధ్యత తమిళనాడు ప్రయోజనాలు సాధించడం మాత్రమే కానీ దేశాన్ని ఉద్ధరించడం కాదని అంటూ ఉండేవారు. ఇందుకు భిన్నంగా చంద్రబాబు నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న నాయకులలో ప్రథముడని పేరు తెచ్చుకునేందుకు అవసరానికి మించి గర్జించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ తెలుగువారి అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయడం కంటే కావలసింది ఏముంటుంది? అదే విధంగా ఈ రోజు జగన్ ఢిల్లీ వెళ్ళి మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా మోదీని కలుసుకోనున్నారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కేంద్ర సహాయం అత్యవసరం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నా కేంద్రంతో సయోధ్య అనివార్యం. ఇది నిర్మాణాత్మకమైన ధోరణి. విజయాన్ని సవ్యంగా అర్థం చేసుకొని, జనరంజకమైన, పరిశుభ్రమైన పరిపాలన అందిస్తే, సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా ప్రగతిరథాన్ని వేగంగా నడిపిస్తే జగన్ ఆపేక్షిస్తున్న విధంగానే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని ప్రజల ప్రశంసలు అందుకుంటారు. టీఆర్ఎస్ వెనకంజ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆశించినన్ని లోక్‌సభ స్థానాలు గెలుచు కోలేకపోయింది. మొత్తం 17 స్థానాలలో తొమ్మిదింటిని మాత్రమే టీఆర్ఎస్ గెలుచుకున్నది. నాలుగు బీజేపీకీ, మూడు కాంగ్రెస్‌కూ దక్కాయి. చేవెళ్ళలో కాంగ్రెస్ స్వల్ప వ్యత్యాసంతో ఓడిపోయింది. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ ఘనవిజయాన్ని కేసీఆర్ అర్థం చేసుకోవడంలో పొరబడి ఉంటారు. చంద్రబాబు పాదమహిమను పరిగణనలోకి తీసుకున్నట్టు లేరు. ఆయన ఖమ్మంలో, హైదరాబాద్‌లో అడుగుపెట్టకపోతే టీఆర్ఎస్కి అన్ని అసెంబ్లీ సీట్లు దక్కేవి కావు. కాంగ్రెస్ అంతగా దెబ్బతినేది కాదు. మాజీ మంత్రి హరీష్‌రావును పక్కన పెట్టారనే అభిప్రాయం కూడా కార్యకర్తలకు ఒకింత నిరుత్సాహం కలిగించి ఉండవచ్చు. ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్‌లు అనూహ్య విజయాలు సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలనాటి పరాజయ పరాభవం నుంచి కాంగ్రెస్, బీజేపీలు కొంతమేరకు కోలుకున్నాయి. అదీ ఒకందుకు మంచిదే అని చెప్పే వేలుగాడి కథ చిన్నతనంలో విన్నాం. కిషన్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో అంబర్‌పేటలో గెలిచి ఉంటే శాసనసభ్యుడిగానే ఉండేవారు. అప్పుడు ఓడి పోయారు కనుక ఇప్పుడు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు పోటీ చేసే అవకాశం వచ్చింది. మోదీ మంత్రిమండలిలో ఆయనకు స్థానం లభించినా ఆశ్చర్యం లేదు. రేవంత్‌రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి లోక్‌సభ ఎన్నికలలో గెలిచారు. కరీంనగర్ సంజయ్, ఖమ్మం నామా నాగేశ్వరరావూ, ఆది లాబాద్ సోయం బాబూరావు కూడా అదే బాపతు. రాజకీయ దురంధరుడైన కేసీఆర్‌కు పరిస్థితులను సమీక్షించుకొని సకాలంలో సరైన చర్యలు సత్వరంగా తీసుకునే వివేకం, సామర్థ్యం ఉన్నాయి. ప్రభంజనమంతా వింధ్యకు ఆవలే మోదీ–అమిత్‌షా యుద్ధకౌశలం తిరుగులేనిది. కులసమీకరణాలూ, మత రాజ కీయాలూ సమపాళ్ళలో మేళవించి ఎన్నికల విజయాలు సాధించడంలో వారు ఉద్దండులు. అయినప్పటికీ, వింధ్యకు ఆవలే అశ్వం ఆగిపోయింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు మోదీ సమ్మోహనాస్త్రాన్ని వమ్ము చేశాయి. ఉత్తరాదిలో విజయభేరి మరోసారి మోగించడానికి రెండు కారణాలు దోహదం చేశాయి. ఒకటి, మతం ప్రాతిపదికగా హిందువులను ఏకం చేసి తమ పక్షాన నిలుపుకోవడంలో బీజేపీ సఫలమైంది. మోదీని మహానాయకుడిగా అభివర్ణిస్తూ ఆయనకు దేశంలో ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం ప్రోదిచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తరహాలో భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నికలు జరిగాయి. వ్యవసాయ సంక్షోభాన్నీ, నిరుద్యోగాన్నీ ఇతివృత్తాలుగా వినియోగించుకొని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ ఉద్యమం నిర్మించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ప్రతిపక్షాలన్నీ ఏదో ఒక నాయకుడు లేదా నాయకురాలిని ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొని ఉంటే, ప్రతిపక్ష కూటమి తరఫున ఒక నియోజకవర్గంలో ఒకేఒక అభ్యర్థి నిలబడి ఉంటే ఫలితాలు ఎట్లా ఉండేవో తెలియదు. ఇప్పుడు ఏమని అనుకున్నా ఏమి లాభం? మరో ఐదేళ్ళు మోదీ పాలన సాగుతుంది. మతసామరస్యానికీ, దేశ సమగ్రతకు విఘాతం కలగ కుండా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే విధంగా ఎన్డీఏ పరిపాలన కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిద్దాం. కె. రామచంద్రమూర్తి -
నియమావళికి నైతికతే ప్రాణం
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 11న మొదటి ఘట్టంలోనే మొత్తం 25 లోక్‌సభ స్థానాలకూ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఓట్ల లెక్కింపు మే 23న జరుగుతుంది. అంటే పోలింగ్‌కూ, ఫలితాలు వెల్లడి కావడానికి మధ్య 42 రోజుల సుదీర్ఘ సమయం ఉంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లోనే ముగిశాయి. ప్రవర్తన నియమావళిని వర్తింపజేయడంలో తెలంగాణకూ, ఆంధ్రప్రదేశ్‌కూ వేర్వేరు ప్రమాణాలు ఉంటాయా? ప్రధాని నరేంద్రమోదీకీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కీ వర్తించని ఆంక్షలు తనకు మాత్రమే ఎందుకు వర్తింపజేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు గగ్గోలు పెట్టడం సమంజసమేనా? భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఉండాలనీ, అది నేరుగా రాష్ట్రపతికి జవాబుదారీగా ఉండాలనీ, ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఉద్వాసన చెప్పాలంటే పార్లమెంటు అభి శంసన తీర్మానం ఆమోదిస్తేనే కానీ సాధ్యం కాదని రాజ్యాంగాన్ని రూపొం దించిన రాజ్యాంగ పరిషత్తు నిర్ణయించింది. అత్యంత శక్తిమంతమైన ప్రజా స్వామ్య దేశం అమెరికాలో ఎన్నికల సంఘం లేదు. ప్రభుత్వమే ఎన్నికలు నిర్వహిస్తుంది. మన దేశంలో మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల సంఘం 1990ల వరకూ ఏకసభ్య సంఘంగా ఉండేది. 1980ల నాటికి అక్రమార్కులూ, గూండాలూ, నేరగాళ్ళూ ఎన్నికల వ్యవస్థను శాసించే దుస్థితి దాపురించింది. ఆ దశలో తిరునెల్లాయ్ నారాయణ అయ్యర్ శేషన్ (టీ.ఎన్. శేషన్) పదవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)గా నియమితులైనారు. శేషన్‌కు ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. మొదటి నుంచి నిజాయితీపరుడైన, సమర్థుడైన ఐఏఎస్ అధికారిగా పేరుంది. కాకపోతే కొంచెం తిక్క. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో శేషన్ రక్షణశాఖ కార్య దర్శిగా పని చేశారు. రక్షణ మంత్రి వీ. పీ. సింగ్ ప్రభుత్వం నుంచి వైదొలిగి బోఫోర్స్ కుంభకోణంపై ఉద్యమం చేసినప్పుడు రాజీవ్‌గాంధీని శేషన్ గట్టిగా బలపరిచారు. ఇందుకు మెచ్చి రాజీవ్‌గాంధీ 1989లో శేషన్‌కు కేబినెట్ సెక్ర టరీగా పదవోన్నతి ప్రసాదించారు. బోఫోర్స్ కారణంగానే 1989 ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఎన్.టి. రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ వీ.పీ. సింగ్‌ను ప్రధానిగా ఎన్నుకున్నది. సింగ్ అధికారంలోకి వచ్చిన వెంటనే శేషన్‌ను కేబినెట్ సెక్రటరీ పదవి నుంచి తొలగించి ప్రణాళికాసంఘం సభ్యుడుగా నియమించి కక్ష తీర్చుకున్నారు. మండల్, కమండల్ వీ.పీ. సింగ్ ప్రభుత్వానికి బీజేపీ బయటనుంచి మద్దతు ఇచ్చింది. వెనుకబడిన వర్గాల హృదయాలు గెలుచుకునేందుకు మండల్ కమిషన్ నివేదిక దుమ్ము దులిపి దానిని అమలు చేయడానికి సింగ్ పూనుకున్నారు. మండల్‌కి పోటీగా బీజేపీ కమండల్ ఉద్యమానికి తెర లేపింది. అయోధ్యలో బాబరీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మించాలంటూ బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేశారు. రథాన్ని బిహార్‌లో లాలూప్రసాద్ ప్రభుత్వం అడ్డుకున్నది. అడ్వాణీని అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా వీ.పీ. సింగ్ సర్కార్‌కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ ప్రధానిగా గద్దెనెక్కారు. శేషన్‌ను 1990 డిసెంబర్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియ మించారు. అప్పటి వరకూ తన అధికారాలు ఏమిటో తెలుసుకోకుండా బిక్కు బిక్కుమంటూ వ్యవహరించిన ఎన్నికల సంఘం అనూహ్యమైన రీతిలో జవస త్వాలు సంతరించుకున్నది. రౌతు కొద్దీ గుర్రం అన్నట్టు అప్పటి వరకూ పరమ సాత్వికంగా ఉండిన సంఘం అకస్మాత్తుగా సింహంలాగా గర్జించడం ఆరం భించింది. 1991లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీ.వీ. నరసింహా రావుకూ. శేషన్‌కూ కొంతకాలం సఖ్యత ఉండేది. శేషన్‌ని అభిశంసించాలని వామపక్షాలు చేసిన ప్రయత్నాలను పీ.వీ. వమ్ము చేశారు. కానీ ఏకు మేకైన చందాన శేషన్ పీ.వీ.కి కొరకరాని కొయ్యగా తయారైనారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణపైన కేంద్ర మంత్రిమండలి నుంచి సంక్షేమ మంత్రి సీతారాం కేసరి, ఆహారమంత్రి కల్పనాథ్ రాయ్ రాజీనామా చేయాలని 1994లో శేషన్ పట్టుపట్టారు. మధ్యప్రదేశ్‌లో పోటీ చేస్తున్న కుమా రుడి తరఫున ప్రచారం చేస్తున్నారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గుల్షన్ అహ్మద్పైన శేషన్ అభియోగం మోపారు. గవర్నర్ రాజీనామా చేయవలసి వచ్చింది. పంజాబ్‌లో పోలింగ్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పోలింగ్‌ను రద్దు చేశారు. ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు ఏకపక్షంగా తీసు కోవడం ద్వారా శేషన్ నాయకులకు సింహస్వప్నమైనారు. ఈ దశలో పీ.వీ. చాణక్యం చేశారు. ఎన్నికల సంఘంలో ఒకరికి బదులు ముగ్గురు ఉండాలని నిర్ణయించి, శేషన్‌కు తోడు మరి ఇద్దరు కమిషనర్లను నియమించారు. శేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇద్దరు కమిషనర్ల నియామకాన్ని ధ్రువీ కరిం చడమే కాకుండా ముగ్గురికీ సమానహోదా ఉంటుందనీ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సమవుజ్జీలలో ప్రథముడనీ, మెజారిటీ ఆధారంగా అన్ని నిర్ణయాలూ తీసుకో వాలనీ 1995లో సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటికే శేషన్ పదవీ కాలం ముగింపునకు వస్తోంది. 1996లో ఆయనకు ప్రతిష్ఠాత్మకమైన మెగ్సేసే అవార్డు లభించింది. 1997లో రాష్ట్రపతి పదవికి ఆర్కె నారాయణ్‌తో పోటీ పడి ఓడిపోయారు. కేరళలోని పాలక్కాడ్‌లో సొంత ఇల్లు ఉన్నప్పటికీ శేషన్, భార్య జయలక్ష్మి చైన్నైలోని అల్వార్‌పేటలో స్థిరపడినారు. జయలక్ష్మి 2018 మార్చి 31న మృతి చెందారు. వారికి సంతానం లేదు. అనారోగ్యంతో ఒంటరిగా శేషన్ శేషజీవితం గడుపుతున్నారు. శేషన్ ఆధిపత్యం సాగిన రోజుల్లో రాజకీయ నాయకులు ఇద్దరికే– దేవుడికీ, శేషన్‌కే– భయపడేవారని రాజకీయ పండితులు వ్యాఖ్యానించేవారు. ‘ది గ్రేట్ మార్చ్ ఆఫ్ డెమాక్రసీ’గ్రంథ రచయిత క్రిస్టొఫీ జాఫర్లాట్ ఇలా రాశారు: ‘అధినేత బలవంతుడా, బలహీనుడా అనే అంశం ఆధారంగా ఒకే సంస్థ భిన్నమైన వైఖరులు అవలంబిస్తుంది.’ శేషన్ సీఈసీగా పని చేసిన రోజుల్లో దేశంలో అనైక్యత ఉండేది. మత ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలలో అరాచకం రాజ్యం చేస్తూ ఉండేది. ‘ఆయారాం, గయారాం’ రాజకీయం అడ్డగోలుగా నడిచింది. ఓట్లను కొనుగోలు చేయడం, ఓటర్లకు మద్యం సరఫరా చేయడం, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రాకుండా దౌర్జన్యంగా అడ్డుకోవడం యధేచ్ఛగా జరిగేవి. అన్ని పార్టీలలో గూండాలు ముందుపీటీలోకి రావడంతో ఎన్నికల ప్రక్రియ, ప్రజా స్వామ్య వ్యవస్థ అపహాస్యానికి గురైనాయి. ఆ దశలో శేషన్ అడుగుపెట్టారు. ఆరేళ్ళ పదవీ కాలంలో దేశ ప్రజలలో ఎన్నికల సంఘం పట్ల విశ్వాసం పెంచారు. నాయకులలో ఆ సంస్థ పట్ల గౌరవాన్నీ, భయాన్నీ నెలకొల్పారు. ఎన్నికల సంఘం సాహసోపేతంగా వ్యవహరించలేని సందర్భాలలో దేశ ప్రజలకు శేషన్ జ్ఞాపకం వస్తారు. చండశాసనుడు ఈ రోజున శేషన్ వంటి చండశాసనుడి చేతిలో ఎన్నికల కమిషన్ సారథ్యం ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. శేషన్‌ను స్ఫూర్తిగా తీసుకొని కమిషన్ మరింత నిర్ణయాత్మకంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు ఉద్బోధించిన తర్వాత ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా లక్ష్మణ రేఖ దాటిన ఆరుగురు ప్రముఖులపైన శిక్షాత్మక చర్యలు తీసుకున్నారు. ప్రధాని జీవితకథ ఆధారంగా తీసిన సినిమా విడుదలను అడ్డుకున్నారు. మరి కొన్ని సందర్భాలలో కఠిన చర్యలు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. శేషన్ స్ఫూర్తి సజీవంగా ఉంటే, మోదీని మరోసారి ప్రధాని చేయాలంటూ వ్యాఖ్యానించిన రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ రాజీనామా చేసేవరకూ ఎన్నికల కమిషన్ విశ్రమించేది కాదు. నిరుపేదలకు కనీస ఆదాయం వచ్చే విధంగా ‘న్యాయ్’ పథకాన్ని అమలు చేస్తామంటూ కాంగ్రెస్ చేసిన వాగ్దానం అమలు సాధ్యం కాదంటూ తేల్చిచెప్పిన ‘నీతి ఆయోగ్’ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాజీవ్‌కుమార్‌కు ఉద్వాసన అనివార్యమై ఉండేది. అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నిర్ణయాన్ని మహారాష్ట్రలోని వార్ధా బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ విమర్శిస్తూ ‘హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్న అమేథీలో ఓడిపోతాననే భయంలో వయనాడ్ వెడుతున్నారు’అంటూ వ్యాఖ్యానించినందుకు నోటీసులు అందు కునేవారు. శాస్త్రజ్ఞులు ఉపగ్రహాన్ని ఛేదించే రాకెట్ ‘మిషన్ శక్తి’ని విజయ వంతంగా ప్రయోగించిన సందర్భంగా టీవీలో దేశవాసులను ఉద్దేశించి ప్రసం గించినందుకు మోదీని తప్పుపట్టేవారు. ‘మోదీజీ సేన’ అంటూ పరవశించి మాట్లాడినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేత గుంజీలు తీయించేవారు. రఫేల్ పత్రాలపైన సుప్రీంకోర్టు వ్యాఖ్యాలను వక్రీకరించినం దుకు రాహుల్‌గాంధీని బోను ఎక్కించేవారు. సుప్రీంకోర్టు సూచించినట్టు సునీల్ అరోరా శేషన్‌ను అనుసరించి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘంపైన ఒంటికాలిపైన లేచేవారు కాదు. పోలింగ్ ఆరంభమైన రెండు గంటలకే మూడింట ఒక వంతు ఈవీఎం మెషీన్లు పని చేయడం లేదంటూ, రీపోలింగ్ జరిపించాలంటూ యాగీ చేయడానికి సాహసించేవారు కాదు. ఈవీఎంలను రష్యా ఏజెంట్లు హ్యాక్ చేస్తున్నారంటూ నిరాధారమైన ఆరోపణ చేసేవారు కాదు. ప్రవర్తన నియమావళి కమిషన్ జారీ చేసే ప్రవర్తన నియమావళిని రాజీలేకుండా అమలు చేసింది శేషన్ హయాంలోనే. అభ్యర్థులూ, పార్టీలూ ఎన్నికల సమయంలో ఏ విధంగా వ్యవ హరించాలో నిర్దేశించడంతో పాటు, అధికార పార్టీ ఎటువంటి నిగ్రహం పాటించాలో కూడా నియమావళి ఏడవ భాగంలో వివరంగా ఉన్నది. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకత్వం నుంచి అధికార యంత్రానికి పరిపాలనా బాధ్యతల బదలాయింపు జరగాలన్నది ఉద్దేశం. ఎన్నికల సమయంలో అభ్య ర్థులందరికీ, అన్ని పార్టీలకీ సమానావకాశాలు (లెవల్ ప్లేయింగ్ఫీల్డ్) విధిగా ఉండాలన్న సూత్రాన్ని పాటించేందుకు వీలుగా అధికార పార్టీకి ఎటువంటి ఆధిక్యం లేకుండా చూసేందుకే ఈ ఏర్పాటు. ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. నైతికా ధికారమే ఎన్నికల కమిషన్‌ను నడిపిస్తుంది. ప్రవర్తన నియమావళి మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో అమలులోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ, మే 27 దాకా ఈ నియమావళి అమలులో ఉంటుంది. ఎన్నికల కమిషన్‌ను ఖాతరు చేయకుండా, దాని అధికారాలను గౌరవించకుండా వ్యవహ రించడం వల్ల చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేయాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ధిక్కరిం చవలసిందిగా నాటి ప్రధాన కార్యదర్శి (సీఎస్) పునేఠాపైన ఒత్తిడి తెచ్చి, వెంకటేశ్వరరావు బదిలీని రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వు (జీవో) జారీ చేయిం చింది ముఖ్యమంత్రే. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయించి పునేఠా పదవిని ప్రమాదంలో పడవేసిందీ ఆయనే. ఎన్నికల సంఘం ఎంత మెతకగా ఉన్నప్పటికీ ఇటువంటి ధిక్కారాన్ని సహించ లేకపోయింది. అందుకనే పునేఠాను బదిలీ చేసి ఆయన స్థానంలో అత్యంత అనుభజ్ఞుడైన అధికారి ఎల్.వి. సుబ్రహ్మణ్యంను నియమించింది. ఆయనను ముఖ్యమంత్రి అందరు అధికారుల వలె గౌరవించి ఉంటే సమస్య ఉండేది కాదు. ఆయన సహనిందితుడనీ, కోవర్టు అనీ నోరు పారేసుకోవడం ద్వారా మొత్తం కేంద్ర సర్వీసులకు చెందిన అధికారుల ఆగ్రహాన్ని కొనితెచ్చుకున్నారు. క్షణికా వేశంలో చంద్రబాబు తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారు. ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి ఎన్ని పేజీల లేఖ రాసినా ఏమి ప్రయోజనం? తనకు సమీక్షించే అవకాశం ఉండి ఉంటే పిడుగులు పడి ఏడుగురు మరణించేవారు కారని ఆ లేఖలో రాయడం ఏ మనస్తత్వానికి అద్దం పడుతుంది? శాశ్వత కార్యనిర్వాహకవర్గం (పర్మెనెంట్ ఎగ్జిక్యుటీవ్) అన్ని వ్యవ హారాలూ చూసుకుంటుంది. ‘ఫణి’ ముమ్మరమై తుపాను సంభవించి అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో సమీక్షించవచ్చు. సలహా ఇవ్వవచ్చు. అప్పుడైనా ప్రధాన కార్యదర్శితో, ఇతర అధికారులతో మర్యాదగా మాట్లాడే పరిస్థితి ఉండాలి. కె. రామచంద్రమూర్తి -
జన మనోరథయాత్ర
త్రికాలమ్ ఒకానొక చారిత్రక ఘట్టం ఈ నెల తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017 నవంబర్ 6న ఆరంభించిన ‘ప్రజాసంకల్పయాత్ర’ ఇచ్ఛాపురంలో పెద్ద బహిరంగసభతో ముగియనున్నది. కన్యాకుమారి నుంచి కశ్మీరం వరకూ జరిగిన ఆదిశంకరుడి పాదయాత్ర వివరాలు మనకు అందుబాటులో లేవు. పాదయాత్రను ఒక సాధనంగా వినియోగించి విజయాలు సాధించిన తొలి ప్రజానాయకుడు మహాత్మాగాంధీ. దక్షిణాఫ్రికాలో బొగ్గుగని కార్మికులను సమీకరించి పోరుబాటలో నడిపించడానికి గాంధీజీ చేసిన ప్రయోగం భారత స్వాతంత్య్ర సమరంలో ఒక విధానంగా స్థిరపడింది. 1930లో ఆయన ఆధ్వర్యంలో సాగిన దండి సత్యాగ్రహం దేశప్రజల్లో ఐకమత్యానికీ, స్వాతంత్య్ర పోరాటం తీవ్రతరం కావడానికీ దోహదం చేసింది. అదే మంత్రాన్ని వినోబా భావే 1950 దశకంలో భూదానోద్యమం ప్రచారానికి జయప్రదంగా ఉపయోగించారు. జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకూ జరిపిన పాదయాత్ర నడివయస్సులో ఉన్నవారికి గుర్తు ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో హరిత విప్లవ సారథి సుందర్‌లాల్ బహుగుణ ప్రజలలో అవగాహన పెంపొందించే కార్యక్రమానికి పాదయాత్రను వినియోగించుకున్నారు. ఏక్తాపరిషత్, స్వరాజ్ అభియాన్ వంటి సంస్థలు హక్కుల సాధనకోసం ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని రావడానికి పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. చంద్రశేఖర్ భారత్‌యాత్ర రాజకీయ లక్ష్యంతో, ఎన్నికలకు ముందు ప్రజలను ప్రభావితం చేయడానికి ఉద్దేశించిన పాదయాత్ర చేసిన తొలి నాయకుడు జనతాపార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్. జయప్రకాశ్‌నారాయణ్ ఆశీస్సులతో ఆవిర్భవించిన జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసి, 1980 ఎన్నికలలో పరాజయం చెందిన తర్వాత కొన్ని మాసాలకే విచ్ఛిన్నమైపోయింది. అటల్‌బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అడ్వాణీలు భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. చరణ్‌సింగ్, దేవీలాల్, లాలూ ప్రసాద్‌యాదవ్, ములాయంసింగ్‌యాదవ్, దేవెగౌడ వంటి నాయకులు వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నారు. చంద్రశేఖర్ ఒంటరి. ఆ నేపథ్యంలో ప్రత్యా మ్నాయ రాజకీయాలకు అంకురార్పణ చేయాలన్న సంకల్పంతో ఆయన ‘భారత్ యాత్ర’ను ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి 4,260 కిలోమీటర్లు ఆరు మాసాలలో (జనవరి6–జూన్ 25, 1983) నడిచి రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి శ్రద్ధాంజలి ఘటించడంతో యాత్ర ముగిసింది. కానీ చంద్రశేఖర్‌కు రాజకీయ ప్రయో జనం ఏదీ ఆ సందర్భంలో కలగలేదు. 1967 నుంచి ఎంపీగా ఉండిన చంద్ర శేఖర్ భారత్‌యాత్ర అనంతరం 1984లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ హత్య కారణంగా వీచిన సానుభూతి పవనాల ఫలితంగా ఓటమి చవిచూశారు. అనంతరం 1990 నవంబర్‌లో ప్రధాని పదవి చేపట్టి 1991 జూన్ వరకూ కొనసాగారు కానీ దానికీ, పాదయాత్రకూ సంబంధం లేదు. ప్రధాని పదవిలో రాణించడానికి అవసరమైన వ్యవధి కూడా లభించలేదు. పాదయాత్రలో తెలుసుకున్న సమస్యలకు పరిష్కారాలు ఆలోచించడానికి కానీ అమలు చేయడానికి కానీ అవకాశం లేకపోయింది. 1990లో బీజేపీ నాయకుడు అడ్వాణీ చేసిన 36 రోజుల రథయాత్ర దేశాన్ని కుదిపివేసింది. ఇది రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించే ప్రయత్నం. హిందువులను మతప్రాతిపదికపైన, బాబరీమసీదును తొలగించి రామాలయ నిర్మాణం జరిపించాలనే నినాదంపైన సంఘటితం చేసే ఉద్దేశంతో సాగిన యాత్ర. మహాభారత యుద్ధంలో అర్జునుడు ఉపయోగించిన రథాన్ని పోలిన వాహనంలో చేసిన యాత్రను బిహార్ ముఖ్యమంత్రి లాలూ అడ్డుకున్నారు. అడ్వాణీని అరెస్టు చేయించారు. అయినా ఆ యాత్ర బీజేపీకి లబ్ధి చేకూర్చింది. 1984లో రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే గెలుచుకున్న బీజేపీ 1998 నాటికి అధికారంలోకి వచ్చింది. రాజీవ్ హత్య జరిగి ఉండకపోతే 1991 ఎన్నికలలో బీజేపీ ఎక్కువ స్థానాలు సాధించి ఉండేది. హత్య కారణంగా ఎన్నికల రెండో ఘట్టంలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు కలిగిన పార్టీగా అవతరించింది. 1996 ఎన్నికల అనంతరం 13 రోజుల స్వల్పకాలం వాజపేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ అల్పాయుష్షు ప్రభు త్వాలకు దేవెగౌడ, గుజ్రాల్ సారథ్యం వహించారు. 1998 ఎన్నికలలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించి వాజపేయి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తంమీద రథయాత్ర ఫలితంగా బీజేపీ బలం పుంజుకొని అధికారంలోకి వచ్చిందని భావించవచ్చు. పూర్తిగా రాజకీయ, సామాజిక అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ, ప్రజలను కలుసుకొని వారి కంట నీరు తుడిచే ఉద్దేశంతో సాగిన పాదయాత్ర వైఎస్ రాజ శేఖరరెడ్డి 2003లో చేసిన ‘ప్రజాప్రస్థానం.’ రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి ఆరంభించి ఇచ్ఛాపురం వరకూ 64 రోజులపాటు 1,470 కిలోమీటర్లు సాగిన యాత్రలో అన్ని వర్గాల, కులాల, మతాల ప్రజలనూ కలుసుకొని వారి వెతలు వినే అవకాశం నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్కి దక్కింది. పేదప్రజలూ, నిరుద్యోగులూ, మైనారిటీలూ, దళితులూ, ఆదివాసులూ చెప్పిన అనేక సమస్యలను అవగాహన చేసుకొని వాటికి పరిష్కారాలు ఆలోచించి నిర్దిష్టమైన రూపం ఇచ్చే సావకాశం ఆయనకు లభించింది. 2004 ఎన్నికలలో విజయం సాధించాక ఆయన ప్రభుత్వం ఏర్పడి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. జలయజ్ఞం వంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. విద్య, ఆరోగ్య రంగాలలో వినూత్నమైన పథకాలు తెచ్చింది. పార్టీలకూ, ప్రాంతాలకూ అతీతంగా ప్రజలందరికీ పథకాల ఫలాలు అందే విధంగా అమలు చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. ఆ పథకాల ఫలితంగానే 2009లో మహాకూటమిని ఒంటరిగా ఎదుర్కొని వైఎస్ఆర్ నాయకత్వంలోని కాంగ్రెస్ విజయం సాధించింది. 2009 సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. వైఎస్ఆర్ స్థానంలో రోశయ్య, ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పని చేశారు. 2012 అక్టోబర్ 2న టీడీపీ అధినేత చంద్రబాబు హిందూపురం నుంచి విశాఖపట్టణం వరకూ పాదయాత్ర ప్రారంభించారు. 208 రోజులపాటు సుమారు 2,800 కిలోమీటర్లు నడిచి 2013 ఏప్రిల్ 27న యాత్ర ముగించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. సార్వత్రిక ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. టీడీపీ గెలిచింది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకులు జరిపిన పాదయాత్రలు ఫలించాయి. చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత పక్షం రోజులకు, 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ కుమార్తె షర్మిల ఇడు పులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర మొదలు పెట్టారు. 2013 జులై 29 వరకూ 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల దూరం నడిచి కొత్త రికార్డు నెలకొల్పారు. జగన్ జైలులో ఉన్న కారణంగా ఆయన చెల్లెలు అన్నకు సంఘీభావ సూచనగా ‘మరోప్రజాప్రస్థానం’ పేరుతో ఈ పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్సీపీ విజయావకాశాలు పెంపొందించడమే తప్ప తనకు వ్యక్తిగతంగా రాజకీయ ప్రయోజనం ఆశించలేదు కనుక షర్మిల పాదయాత్రకు నిర్దిష్టమైన ఫలితం అంటూ ఉండదు. ఈ పాదయాత్ర ప్రత్యేకతలు ఏమిటి? బుధవారం ముగియనున్న జగన్ పాదయాత్ర ఇంతకు మునుపు జరిగిన పాద యాత్రల కంటే పలు విధాల భిన్నమైనది. తెలుగునాట ఇంతకు పూర్వం పాద యాత్రలో నెలకొల్పిన రికార్డులన్నంటినీ ఇది అధిగమించింది. ఆయన ఇంత వరకూ 338 రోజులపాటు 3,600 కిలోమీటర్ల పైచిలుకు నడిచారు. కాలమూ, దూరంలోనే కాదు ప్రత్యేకత. వైఎస్ పాదయాత్ర చేసిన రోజులలో రాష్ట్రంలో కరువు తాండవించింది. వ్యవసాయదారుల సమస్యలను అధికంగా ప్రస్తావించే వారు. రైతుల రుణమాఫీ, ఉచిత కరెంటు ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఆ యాత్ర ఫలితమే. చంద్రబాబు చేసిన ‘వస్తున్నా మీ కోసం’ యాత్రలో రైతుల సమస్యలనూ, ఇతర వర్గాల సమస్యలనూ ప్రస్తావించారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే రైతులనూ, పేదలనూ విస్మరించి సింగపూర్ స్వప్నంలో మునిగారు. ఇప్పటికీ తేలలేదు. ఏడు మాసాల పాదయాత్రలో ఆలకించిన విన్నపాల ఆధారంగా ప్రజల ఎజెండా రూపొందించుకొని అమలు పరచవలసిన ముఖ్యమంత్రి సొంత ఎజెండాను తలకెత్తుకున్నారు. బహుశా ప్రజల ఆశలనూ, ఆకాంక్షలనూ చంద్రబాబు పట్టించుకోని ఫలితంగానే జగన్ పాదయాత్రకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఇదివరకు జరగనట్టు ఈ పాదయాత్రలో భాగంగా ప్రతి రెండు రోజులకూ ఒక బహిరంగసభ జరుగుతోంది. ఇదివరకు ఎరగనట్టు ప్రతి సభకూ ప్రజలు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. ఒక పాద యాత్రకు ఇంతమంది ప్రజలు హాజరుకావడం చరిత్ర. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రాష్ట్రం పొడవునా పాదయాత్ర చేయడం ప్రపంచ రికార్డు. బహిరంగ సభలతో పాటు వివిధ కులాలవారూ, వృత్తులవారూ ఆత్మీయసభ లలో జగన్‌ను కలుసుకొని తమ కష్టాలూ, సమస్యలూ చెప్పుకుంటున్నారు. ప్రతి పక్ష నాయకుడు అందరు చెప్పినవీ శ్రద్ధగా ఆలకించి పరిష్కారం సూచిస్తున్నారు. అందరి ఆశీస్సులతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని అనుకుంటున్నారో చెబుతున్నారు. ఇసుకవేస్తే రాలని జనం ఎందుకు వస్తున్నారు? టీడీపీ ఎన్నికల వాగ్దానాలు సక్రమంగా అమలు జరగడం లేదని ప్రజలు ఆవే శంగా, ఆవేదనతో చెబుతున్న మాటలు స్పష్టం చేస్తున్నాయి. అవే అంశాలు జగన్ ఉపన్యాసాలలో విమర్శనాస్త్రాలుగా వెలువడుతున్నాయి. విమర్శ సూటిగానే, ఘాటుగానే ఉంటున్నది. ప్రత్యర్థిని చులకన చేసి మాట్లాడటం లేదు. ‘ఈ పెద్దమనిషి, చంద్రబాబునాయుడుగారు...’ అంటూనే వాక్యం ప్రారంభం అవు తున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలనూ, ప్రభుత్వ వైఫల్యాలనూ పేర్కొంటూనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఏమి చేయాలని అను కుంటున్నదో కూడా స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం, వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారికే చెల్లించడం, వృద్ధాప్య పింఛన్నూ, వికలాంగులకు ఇచ్చే పింఛన్నూ వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు పెంచడం, పిల్లలను చదివించే తల్లులకు ప్రోత్సాహకాలు అందించే అమ్మఒడి పథకం, పేదలందరికీ ఇళ్ళు, ఆరోగ్యశ్రీకి పూర్వవైభవం, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం, దశలవా రీగా మద్యనిషేధం అంటూ నవరత్నాల పేరుమీద తొమ్మిది పథకాలను ప్రధాన ఎజెండాగా ప్రకటించారు. ప్రతిపథకం గురించి వివరంగా చెబుతున్నారు. ఇలా ప్రజల మధ్య నిత్యం ఉండటం,వారి మాటలు వినడం, మాట్లాడటం కంటే ముఖ్యమైన కార్యక్రమం రాజకీయ నాయకులకు ఉండదు. ప్రజల సంక్షేమమే పరమావధి అని భావించే నాయకులకు ఇది మహోపకారం చేస్తుంది. 2009లో తండ్రి ఆకస్మిక మరణం నుంచి నేటి వరకూ ఆయన పట్టుమని వారం రోజులు ఇంటి దగ్గర భార్యాపిల్లలతో కలసి ఉండలేదు. మొదట్లో ఓదార్పు యాత్ర, అనంతరం జైలు జీవితం, ఆ తర్వాత ప్రత్యేకహోదా సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా సభలు, అటుపిమ్మట పాదయాత్ర. 2018 పూర్తిగా పాదయాత్రలోనే గడిచిపోయింది. వాస్తవానికి ఇది 2017లో ఆరంభమై 2019లో పూర్తవుతున్న చరిత్రాత్మకమైన పాదయాత్ర. ‘ప్రజల సంక్షేమం కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే మీ జగన్ రెండడుగులు ముందుకేస్తాడు’ అంటూ అడుగడుగునా చెబుతున్న జగన్ 2019లో అద్భుతమైన విజయం సాధిస్తారనడంలో సందేహం ఏ మాత్రం లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ప్రజలు ఒకసారి సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రత్యర్థుల ఎత్తుగడలూ, కూడికలూ, తీసివేతలూ, వ్యూహాలూ, ప్రలోభాలూ, కుట్రలూ, ధనప్రవాహాలూ, విషప్రచారాలూ పని చేయవు. 2004లో, 2009లో పని చేయలేదు. ఈసారీ పని చేయవు. గెలిచిన తర్వాత జగన్ ఎట్లా వ్యవహరిస్తారో ప్రజలు పరిశీలిస్తారు. శాసనసభ్యుల చేత రాజీనామా చేయించిన తర్వాతనే పార్టీలో చేర్చుకున్నట్టు, ఆచరణసాధ్యమైన వాగ్దానాలనే ప్రజలకు చేసినట్టు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నట్టు... ఇదే రక మైన విలువలను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తే, పాద యాత్రలో చేసిన బాసలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం నిజాయితీగా చేయగలిగితే ‘ప్రజాసంకల్పయాత్ర’ పూర్తిగా సార్థకం అవుతుంది. జగన్మోహన్రెడ్డి జన్మ ధన్యమౌతుంది. కె. రామచంద్రమూర్తి -
ఏ ‘దేశం’ కోసం ఈ వేషం?
‘వాట్ ఈజ్ హేపనింగ్?’ (ఏమి జరుగుతోంది?). ‘వేర్ వియ్ ఆర్ (‘ఆర్ వియ్’ కాదు) గోయింగ్? (ఎక్కడికి పోతున్నాం?). ఈ రెండు ఇంగ్లీషు వాక్యాలు ఇటీవల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబునాయుడి నోట తరచుగా వెలువడుతున్నాయి? ఈ మాటలనే ఒకప్పుడు చిరునవ్వుతో, మరొ కప్పుడు ఆగ్రహంతో అంటూ విలేఖరులతో చంద్రబాబు ఆడుకోవడం గమనించినవారికి ఆయన ఆవేదన ఎందుకో ఒక పట్టాన అర్థం కాదు. ‘దేశాన్ని రక్షిం చుకోవాలి’, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’ అనే రెండు నినాదాలతో దేశ వ్యాపితంగా ఉద్యమం నిర్మించాలని ఆయన కంకణబద్ధుడై ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిష్వంగంలో నిలిచారు. కాంగ్రెస్‌తో కలసి పోరా డటం చారిత్రక అవసరమనీ, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం అనివార్యమైన విధానమనీ ఉద్బోధించారు. రాహుల్ ఏకీభవించారు. ‘మాకిద్దరికీ గతం ఉన్నది. గతం గతః. వర్తమానంకోసం, భవిష్యత్తుకోసం భుజం కలిపి పని చేయాలని నిర్ణయించుకున్నాం’ అంటూ రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ఎత్తుగడగా కాంగ్రెస్‌ను తల్లిపార్టీ, వైఎస్ఆర్సీపీని పిల్లపార్టీ అంటూ అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు ఇంత పని చేస్తారని ఆయన పార్టీలోని సీనియర్ నాయకులు సైతం ఊహించలేదు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానంటూ ప్రతిజ్ఞ చేసిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, అంతకంటే పెద్ద నేరం మరొకటి ఉండదంటూ వ్యాఖ్యానించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు మౌనాన్ని ఆశ్రయించారు. మాటకోసం, సిద్ధాంతంకోసం పదవిని త్యజించేంత గొప్ప నాయకుల తరం ఇప్పుడు లేదు. పరస్పరం మూడున్నర దశాబ్దాలపాటు క్షేత్రంలో, న్యాయస్థానాలలో, చట్ట సభలలో వ్యతిరేకించుకుంటూ, కలహించుకుంటూ, ఘర్షణపడుతూ వచ్చిన వివిధ స్థాయిలలోని ఉభయ పార్టీల నాయకులు అధినేతలు అవకాశవాద రాజ కీయాల కోసం నిర్ణయించారు కనుక పాత కక్షలూకార్పణ్యాలూ విస్మరించి కలసిమెలసి జీవించడం అసాధ్యం. ఆర్ఎస్ఎస్తో కలసి పని చేయాలని మావో యిస్టులు ప్రయత్నించడం, కాంగ్రెస్, బీజేపీలు కలసి ఒక కూటమి నిర్మించడం, బజరంగ్దళ్, ముస్లింబ్రదర్హుడ్ కలసి ఒకే వేదికపైన సంయుక్త కార్యాచరణ ప్రకటించడం ఎంత కృతకంగా ఉంటుందో కాంగ్రెస్, టీడీపీల పొత్తు సైతం అంతే అసహజంగా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ నుంచి రాజీనామా ప్రకటిం చారు. ఆ పార్టీలోని చాలామంది నాయకులు రాహుల్ నిర్ణయాన్ని మింగలేకా, కక్కలేక సతమతం అవుతున్నారు. తెలంగాణలో లేనిపోని ప్రయోజనం ఆశించి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా అయిదో స్థానంలోకి శాశ్వతంగా దిగజారడం ఎందుకో ఆలోచించాలి. నైతికతకు పాతరేనా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు చక్రం తిప్పుతానంటే కామోసు అనుకుంటున్నారు రాహుల్. తనను ‘పప్పు’గా, ప్రధాని పదవికి తగని అర్భకుడిగా, తన తల్లి సోనియా గాంధీని దేశానికి పట్టిన శనిగా, దేశాన్ని నాశనం చేస్తున్న గాడ్సేగా, ఇటాలియన్ మాఫియాగా వందలసార్లు అభివర్ణించిన వ్యక్తితో కరచాలనం చేయడం కపట రాజకీయానికి పరాకాష్ట. అవకాశవాద రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు వంటి నేతలకు అధికార రాజకీయం (పవర్ పొలిటిక్స్) మినహా తక్కిన మర్యా దలు ఏమీ పట్టవు. సోనియాను నాలుగేళ్ళపాటు అనునిత్యం దూషించిన చంద్ర బాబుతో రాహుల్ స్నేహం చేయడం నిస్సందేహంగా అనైతికం. ఏ పార్టీని భూస్థాపితం చేయడానికి టీడీపీని ఎన్‌టి రామారావు (ఎన్టీఆర్) స్థాపించారో ఆ పార్టీతో చేతులు కలపడం చంద్రబాబు చేసిన ద్రోహమంటూ ఎన్టీఆర్ సతి లక్ష్మీ పార్వతి ఒక లేఖ రాసి భర్త సమాధిపైన ఉంచారు. కాంగ్రెస్‌తో మైత్రిని చంద్రబాబు పొడిచిన రెండో వెన్నుపోటుగా ఎన్టీఆర్ అభిమానులు అభివర్ణిస్తే ఎట్లా అభ్యంతరం చెప్పగలం? ఏ ‘దేశం’ రక్షణకోసం చంద్రబాబు ఈ విన్యా సాలు చేస్తున్నారు? భారతదేశమా? తెలుగుదేశమా? ఈ అసాధారణ కలయికను నైతికంగా సమర్థించుకోవడం అటు రాహుల్‌కి కానీ ఇటు చంద్రబాబుకి కానీ సాధ్యం కాదు. ఎవరికి ప్రయోజనం? రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించినప్పటికీ ఈ కాంగ్రెస్–టీడీపీ బంధం భాగస్వాములకు ఎట్లా లాభిస్తుంది? తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)నాయకత్వంలోని టీఆర్ఎస్ను గద్దె దింపడం, బీజేపీ నేత నరేంద్ర మోదీని ప్రధాని పదవి నుంచి తొలగించడం చారిత్రక అవసరమని చెబుతూ ఈ పని చేయడానికి తాను సమర్థుడని భావించి తనను తాను సమన్వయకర్తగా (ఫెసిలిటేటర్) నియమించుకున్న తెంపరితనం చంద్రబాబుది. వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ప్రతిపక్ష నాయ కుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్లా, ఆయన నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పట్లా జనాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2014లో టీడీపీ విజయానికి దోహదం చేసిన నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌లు మాజీ మిత్రులుగా మారి పోయారు. చంద్రబాబు ఒంటరిగా ఎన్నడూ ఎన్నికలలో గెలిచింది లేదు. తోడు అత్యవసరం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వినా మరో పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేదు. తెలంగాణలో జవసత్వాలు కోల్పోయిన టీడీపీకి జీవం పోయాలన్న ఆలోచన టీఆర్ఎస్కు లేదు. టీఆర్ఎస్ని కూల్చడానికి తన శక్తి చాలదనీ, ఎవరు ముందుకు వస్తే వారి సహకారం స్వీకరించాలని కాంగ్రెస్ అర్రులు చాస్తోంది. ఆ పార్టీ అధినేతకు టీడీపీతో స్నేహం చేయడానికి నైతిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. టీడీపీకి సిద్ధాంతపరమైన అభ్యంతరాలు ఎప్పుడూ లేవు. టీడీపీ అధినేతకు తెలిసిన సిద్ధాంతం ఒక్కటే–అధికారం హస్త గతం చేసుకోవడం, నిలబెట్టుకోవడం, అన్ని విధాలా దానిని వినియోగిం చుకోవడం, అందుకోసం ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు అది చేయడం. టీడీపీతో అవగాహన కారణంగా కాంగ్రెస్‌కూడా నష్టబోతుంది. టీడీపీ పొడ గిట్టని కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పని చేయవు. కాంగ్రెస్‌కు ప్రతి ఎన్ని కలోనూ ఓటు చేసేవారు సైతం టీడీపీ పొత్తు కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ సారి ఓటు చేయకపోవచ్చు. టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్ అభిమానుల ఓటు చేయడం, కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ మద్దతుదారులు ఓటు వేయడం దాదాపు అసాధ్యం. చంద్రబాబుకి జాతీయ స్థాయిలో నిర్వాహకుడి పాత్ర పోషించాలన్న ఉబలాటం ఉన్నది కాబట్టి ఆర్థికంగా కాంగ్రెస్‌కు సహాయం చేయవచ్చు. కానీ ఓట్లు బదిలీ కావు. తెలంగాణలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలలో అత్యధికం టీఆర్ఎస్కి అప్పనంగా అప్పగించినట్టే అవుతుంది. నవంబర్ 9న అభ్యర్థుల జాబితాను ప్రకటించాక కాంగ్రెస్‌లో పెనుతుఫాను సంభవిస్తుంది. అసమ్మతివాదులను ఓదార్చడం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ వల్ల కాదు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటా నన్నప్పుడే ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) కూటమికి దూరంగా ఉండవలసింది. రాజకీయాలలో అధికార పార్టీని ఓడించడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. అమరుల ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పం కాంగ్రెస్, టీడీపీల ఆధ్వర్యంలో ఎట్లా నెరవేరుతుందో ఆలోచించాలి. అవసరమైతే ఈ ఎన్నికలకు దూరంగా ఉండవచ్చు లేదా ఒంటరిగా సాధ్య మైనన్ని స్థానాలకు పోటీ చేయవచ్చు. టీడీపీతో కలసి పని చేయడాన్ని కోదండరామ్‌ను అభిమానించే తెలంగాణవాదులు జీర్ణించుకోలేరు. ఇందుకు ప్రధాన కారణం ఏమంటే టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ. అక్కడి ప్రయో జనాలను పరిరక్షించే క్రమంలో ఇక్కడి ప్రయోజనాలకు విఘాతం కలిగించడం తప్పని సరి. కాశేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ కేంద్రానికి లేఖలు రాసిన టీడీపీకి తెలంగాణ సంక్షేమం కోరేవారు ఎట్లా ఓటు వేస్తారు? పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు కలిగిన రెండు ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ఒక ప్రాంతీ యపార్టీ ప్రాసంగికత కలిగి ఉండటం కుదరని పని. టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే ఎట్లా ఉంటుందో టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే అట్లాగే ఉంటుంది. జాతీయ స్థాయిలో కలసి పని చేయాలని రాహుల్‌గాంధీ, చంద్రబాబు నిర్ణయించుకున్నారు కనుక ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికల పొత్తు పెట్టుకొని తీరాలి. తెలంగాణలో టీడీపీకి ఎన్ని స్థానాలు కాంగ్రెస్ కేటా యించిందో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి టీడీపీ అన్ని స్థానాలు ప్రత్యేకించినా ఉదారంగా వ్యవహరించినట్టు భావించాలి. అంటే కాంగ్రెస్ అస్తిత్వం పదిహేను అసెంబ్లీ నియోజవర్గాలకు తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ– కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం లవలేశమైనా కనిపించడం లేదని వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వేళ కూటమి గెలిచినా కాంగ్రెస్ స్థాయి అయిదో స్థానానికి పడిపోవడం తథ్యం. ఇప్పుడున్న ధోరణి బట్టి వైఎస్ ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలు (బీజేపీ, జనసేనలలో ఏది మూడో స్థానంలో నిలుస్తుందో మరి!) మొదటి నాలుగు స్థానాలలో నిలిస్తే కాంగ్రెస్ అయిదో స్థానానికి పరిమితం అవుతుంది. 160 స్థానాలలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అంటే, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్లో కంటే హీనంగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో కుదించుకొని పోతుంది. అది అన్ని అసెంబ్లీ చోట్లా పోటీ చేస్తే ఉనికి సజీవంగా మిగిలి కనీసం భవిష్యత్తులో పుంజుకునే అవ కాశమైనా ఉంటుంది. యునైటెడ్‌ఫ్రంట్ ప్రభుత్వాల వైఫల్యం ఇక ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పడం సంగతి. ఎన్టీఆర్ 1983లో అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోపే విజయవాడలో ప్రతిపక్ష మహాసదస్సు (అపోజిషన్ కాంక్లేవ్) నిర్వహించారు. అది నేషనల్ఫ్రంట్కు దారి తీసింది. 1995లో చంద్ర బాబు ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా పని చేశారు. అప్పుడు యువ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుల మధ్య సమన్వయం సాధించే కృషి చేశారు. కానీ కీలక వ్యూహరచన, కార్యాచరణ అన్నీ సీపీఎం నాయకుడు హర్కిషన్సింగ్సూర్జిత్, డిఎంకే నాయకుడు కరు ణానిధి దర్శకత్వంలో జరిగేవి. సంకీర్ణ ప్రభుత్వాల కాలంలోనే దేశ ప్రగతి రేటు పెరిగిందంటూ చంద్రబాబు వాదిస్తున్నారు. యునైటెడ్‌ఫ్రంట్ ప్రభుత్వాల వల్ల దేశానికి మేలు జరగలేదు. పీవీ నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ నాయ కత్వంలోని మైనారిటీ ప్రభుత్వ కాలంలోనూ, ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాల హయాంలోనూ, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, రెండో తరం ఆర్థిక సంస్క రణలు సైతం అమలు చేసిన మాట నిజమే. కానీ ఎన్డీఏను కాంగ్రెస్ నాయ కత్వంలోని కూటమి ఓడిస్తే ప్రధాని ఎవరు? శరద్‌పవార్, మాయావతి సిద్ధంగా ఉన్నారు. మమతాబెనర్జీకీ అభ్యంతరం లేదు. కూటమిలోని పక్షాలన్నీ అంగీకరిస్తే తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్‌గాంధీ చెప్పారు. ఆయన కాకుండా ఎవరు ప్రధాని అయినా కాంగ్రెస్ మద్దతుపైన ఆధారపడవలసిందే. సీతారామ్‌కేసరి లాగా రాహుల్ సంవత్సరం తిరగకుండానే మద్దతు ఉపసంహరిస్తే కాబోయే ప్రధాని కూడా నాడు దేవెగౌడ, ఐకె గుజ్రాల్ వలె మట్టికరవవలసిందే. ముందు పవార్‌కి అవకాశం ఇవ్వాలో లేక మాయావతికి ఇవ్వాలో తేల్చడానికి సూర్జిత్, కరుణానిధి వంటి తలలు పండిన నాయకులు ఇప్పుడు లేరు. అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి గెలుపొందితే లోగడ 1978, 1989లో జరిగినట్టు నలుగురు ముఖ్యమంత్రులు సీల్డ్కవర్లోంచి ఊడిపడరని భరోసా లేదు. అంతమాత్రాన ఢిల్లీలో మోదీ పాలన, హైదరాబాద్‌లో కేసీఆర్ పాలన దివ్యంగా ఉన్నాయని కానీ వారి ప్రభుత్వాలను వ్యతిరేకించనక్కరలేదని కానీ అర్థం కాదు. ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు పెడుతున్నామో గమనించాలి. దేశం లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కా రానికి ఎటువంటి ప్రత్యామ్నాయ విధానాలనూ, కార్యక్రమాలనూ ప్రతిపాది స్తున్నామో పరిశీలించాలి. సుస్థిరతకు ముప్పు రాకుండా ఎవరో ఒక నాయకుడి లేదా నాయకురాలి ఆధ్వర్యంలో పటిష్టమైన కూటమి ఏర్పడి మేలైన పరిపాలన అందిస్తామని ముందుకు వస్తే ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. నకారాత్మక రాజకీయాలను ఆమోదించరు. కె. రామచంద్రమూర్తి -
పవర్ (లేని) స్టార్!
త్రికాలమ్ ‘మా సమస్య ఫలానా తేదీలోగా పరిష్కరించాలంటూ గడువు పెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారని ఆశించాం. హైకోర్టు కమిటీ వేయాలట, బీజేపీ నాయ కులకు విజ్ఞప్తి చేస్తారట. ప్రభుత్వానికి విన్నపం చేస్తారట. మేము న్యాయ స్థానా లలో పోరాడితే జనసేన న్యాయసహాయం చేస్తుందట. కలిసొచ్చే పార్టీలను కలుపుకొని శాంతియుతంగా పోరాటం చేస్తారట’ అంటూ నిష్ఠూరంగా, కించిత్ వ్యంగ్యంగా మాట్లాడారు పశ్చిమ గోదావరి నుంచి హైదరాబాద్ వచ్చి పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో తమ గోడు వెళ్ళబోసుకున్న ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ బాధి తులలో ఒకరు. పవన్ కల్యాణ్ నుంచి ఎంతో ఆశించి వచ్చినవారికి ఆయన స్పందన ఆశాభంగం కలిగించడంలో ఆశ్చర్యం లేదు. అమరావతి సమీపంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాల ప్రజల అనుభవం కూడా ఇదే. గర్జించవలసిన కథానాయకుడు మౌనంగా ఉండటం, మెత్తగా మాట్లాడటం, నీళ్ళు నమలడం ఎందుకో అభిమానులకు అర్థం కావడం లేదు. పవర్ స్టార్ రాజకీయం ఏమిటో రాజకీయ పరిశీలకులకు అంతుచిక్కడం లేదు. సినిమా వేరు, రాజకీయం వేరు సినిమాకూ, రాజకీయానికీ ఉన్న వ్యత్యాసం ఏమిటో ఈ పాటికి పవన్ కల్యాణ్‌కు తెలిసే ఉంటుంది. రెండు రంగాలలో శ్రమించినవారే రాణిస్తారు. సినిమా రంగంలో నటుడిగా నిలదొక్కుకొని హీరోగా వెలగాలంటే చాలా కష్టపడాలి. చిరంజీవి వంటి మెగాస్టార్ ఆశీస్సులు ఉన్నప్పటికీ పవన్‌కి స్వయంప్రకాశం లేకపోతే, కష్టపడి పనిచేసే మనస్తత్వం లేకపోతే ఈ స్థాయికి ఎదిగి ఇంత మంది అభిమానులను సంపాదించగలిగేవారు కాదు. సినిమా షూటింగ్లో షెడ్యూళ్ళు ఉంటాయి. ఒక షెడ్యూలుకూ, మరో షెడ్యూలుకూ మధ్య విరామం ఉంటుంది. ఎంత విరామం తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో నిర్ణయించడంలో హీరో ప్రమేయం ఉంటుంది. సినిమాలో వ్యవహారం అంతా డెరైక్టర్, హీరోల అదుపులో ఉంటుంది. రాజకీయాలు వేరు. ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నం అవుతుందో, ప్రత్యర్థులు ఎటువంటి ఎత్తులు వేస్తారో ముందుగా తెలియదు. ఎప్పటికప్పుడు పరిస్థితికి తగినట్టు స్పందించాలి. నిర్విరామంగా పనిచేయాలి. అటు సినిమాలోనూ, ఇటు రాజకీయాలలోనూ అంతిమంగా విజేతలను నిర్ణయించేది ప్రజలే. సినీ నటుడి కంటే రాజకీయ నాయకుడి నుంచి ప్రజలు ఎక్కువ ఆశిస్తారు. నటుడి నుంచి వినోదం కోరు కుంటే రాజకీయ నాయకుడు తమ సమస్యలన్నింటినీ పరిష్కరించాలంటారు. నిరంతరం తమ మధ్యనే ఉండాలని అభిలషిస్తారు. పిలవంగానే పలకాలనీ, రమ్మనగానే రావాలనీ, కష్టాలలో ఆదుకోవాలనీ అనుకుంటారు. జంటనగరా లకు చెందిన బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి దత్తాత్రేయకు సంబంధించి అందరూ చెప్పుకునే మాట ఏమిటంటే, ఎవరైనా ‘దత్తన్నా’ అని కేకవేస్తే ‘అత్తన్నా’ అంటూ వెంటనే బయలుదేరతారట. అందుకే ఆయనకు ప్రజల మనిషి అని పేరు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా కష్టం. ఇంతగా శ్రమించినా వారికి మప్పిదాల కంటే తప్పిదాలపైన విమర్శనాస్త్రాలే ఎక్కువ. పవన్‌కల్యాణ్ సందిగ్ధావస్థను అర్థం చేసుకోవాలంటే ఆయన సమస్యను సానుభూతితో పరిశీలించాలి. ఎన్.టి. రామారావు రాజకీయాలలో ప్రవేశించే ముందు సినిమాలన్నీ పూర్తి చేసుకొని పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయిం చుకున్నారు. పార్టీ నెలకొల్పిన తొమ్మిది మాసాలకే ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అధికారంలోకి అట్టహాసంగా వచ్చారు. ఆ తర్వాత ఇరవై ఆరు సంవత్సరాలకు మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేశారు. సినిమా లకు స్వస్తి చెప్పి, సొంతంగా ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి, రాష్ట్రం అంతటా ప్రచారం చేసి అదృష్టం పరిశీలించుకున్నారు. మెజారిటీ సాధించడానికి సరిపడి నంతగా ప్రజల మద్దతు కూడగట్టలేకపోయారు. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజ్యసభ సభ్యత్వాన్నీ, కేంద్ర సహాయమంత్రి పదవినీ పుచ్చుకున్నారు. తన శక్తిమీదా, పరిస్థితులమీదా ఎన్టీఆర్‌కీ, చిరంజీవికీ స్పష్టమైన అవగాహన ఉంది. రంగంలోకి దిగిన తర్వాత శక్తినంతా కూడగట్టుకొని పోరాటం చేశారు. రామారావుకు ఉన్నంత ప్రజాదరణ చిరంజీవికి లేదు. చిరంజీవికి ఉన్న జనా కర్షణ పవన్ కల్యాణ్‌కి లేదు. తెలుగు యువతలో పవన్ పట్ల విశేషమైన అభి మానం ఉన్న మాట నిజం. అతనితో పాటు ఇతర హీరోలకు కూడా అభి మానులు ఉన్నారు. రామారావు నటుడుగా రంగంలో ఉన్నంత వరకూ ఆయనదే అగ్రస్థానం. సాటి హీరోలతో పోల్చితే చిరంజీవిదే పైచేయి. అంత స్పష్టమైన ఆధిక్యం సినిమాలలో పవన్ కల్యాణ్‌కి లేదు. రాజకీయాలలోనూ రాదు. నాటకీయంగా రంగప్రవేశం 2014 ఎన్నికలకు పూర్వం బీజేపీ నాయకుడు సోము వీర్రాజు వెంట గాంధీనగర్ వెళ్ళి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీని కలుసుకోవడం, హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఇంటికి రప్పించుకోవడం, ఎన్నికల ప్రచార సభలలో మోదీతో, నాయుడితో వేదిక పంచుకోవడం. మోదీ పవనాలూ, పవన్ ప్రభావం ఫలితంగా టీడీపీ ఒక్క శాతం ఆధిక్యంతో అధికారం హస్తగతం చేసుకోవడం చరిత్ర. ‘మీరు చెబితే టీడీపీకి ఓటు వేశాం. అందుకే మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం’ అంటూ శనివారం నాడు పవన్‌కల్యాణ్‌ని కలుసుకున్న బాధితులు సూటిగా చెప్పారు. టీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన తర్వాత 2015 మార్చి 5న పవన్‌కల్యాణ్ అమరావతి ప్రాంతంలో పరిస్థితులు అధ్యయనం చేసేందుకు పర్యటించారు. ఉండవల్లి, బేతపూడి, తుళ్ళూరు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. భూసేకరణ చట్టం తెచ్చి భూములను బలవంతంగా తీసుకుంటామంటూ కొందరు మంత్రులు ప్రకటనలు జారీ చేయడంతో ఆగస్టు 23న రెండోసారి రాజధాని ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా పెనుమాక సభలో మాట్లాడుతూ, బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్నాననీ, ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడితో మాట్లాడతాననీ, అవసరమైతే నిరాహారదీక్ష చేస్తాననీ ప్రక టించారు. కొద్ది రోజుల తర్వాత కామినేని శ్రీనివాస్‌తో ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళి ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. అప్పుడే స్వరం మారింది. భూసేకరణ అవసరమేననీ, ప్రజలను ఒప్పించి భూమి సేకరించాలని ముఖ్య మంత్రికి చెప్పాననీ మీడియా ప్రతినిధులతో అన్నారు. అప్పటి నుంచి ఇంత వరకూ అమరావతి భూముల ప్రస్తావన లేదు. బందరు రేవు కోసం లక్ష ఎక రాలు సేకరిస్తామంటూ ప్రభుత్వం ప్రకటించినా స్పందన లేదు. ప్రత్యేక హోదా రాదని తెలిసి ప్రజలు నిరసన ప్రకటించినప్పుడు తిరుపతిలో, కాకినాడలో సభలు నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా వాగ్బాణాలు వదిలి ముఖ్యమంత్రిని మాత్రం ఉపేక్షించారు. అన్ని జిల్లాలలో సమావేశాలు పెడతానని తిరుపతిలో చెప్పిన పవన్ కాకినాడతో ప్రత్యేక హోదా ఉద్యమానికి స్వస్తి చెప్పారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని కలుసుకొని మద్దతు ప్రకటించడం తన కనీస కర్తవ్యమని ఆయన భావించి ఉంటారు. తీరా కలిసిన తర్వాత గట్టి హామీలు ఇవ్వలేకపోయారు. ఆ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తున్నదో అర్థం కావడంలేదని అన్నారు. ఆ ప్రాంతంలోని పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ ఎందుకు పట్టించుకోవడంలేదో తెలి యదు అంటూ ఆవేదన వెలిబుచ్చారు. నాయకుల ప్రమేయం పెద్దగా లేకుండా ప్రజలే పోరాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం మహిళలే ఆందోళన కొనసాగిస్తున్నారు. 35 రోజులుగా గ్రామాలలో పురుషులు లేరు. వారు పోలీ సులకు భయపడి ఎక్కడో తలదాచుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉంది. పురుషులతో పాటు మహిళలపైన కూడా బైండింగ్వోవర్ కేసులూ, 307 కేసులూ పెడుతున్నారనీ, పోలీసు జులుం విపరీతంగా పెరిగిందనీ, బెయిలు రాకుండా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారనీ, ఉద్యమాన్ని ఉక్కుపాదం అణచాలని చూస్తున్నారనీ ఆందోళనకారులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని లోక్‌సభ, శాసనసభ నియోజక వర్గాల లోనూ తెలుగుదేశం-బీజేపీ కూటమి అభ్యర్థులే గెలిచారు. రైతుల రుణాలూ, డ్వాక్రా మహిళల రుణాలూ మాఫ్ చేస్తానంటూ చంద్రబాబునాయుడు చేసిన వాగ్దానాన్ని ప్రజలు విశ్వసించారు. ఈ కూటమికి ఓటు వేయాలనీ, ప్రజల కష్టనష్టాలను తాను కాచుకుంటాననీ పవన్ కల్యాణ్ చెప్పిన మాట నమ్మారు. అందరూ అధికార పార్టీ ప్రతినిధులే కనుక ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించ లేకపోతున్నారు. ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన చందుర్రు, కె. బేత పూడి, జొన్నలగరువు గ్రామాలలో రాజుకొని మొత్తం 30 గ్రామాలకు విస్తరిం చింది. ఇవన్నీ నరసాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనివి. నరసాపురం శాసనసభ్యుడు మాధవనాయుడూ, భీమవరం ఎంఎల్ఏ అంజి బాబూ ప్రభుత్వానికీ, ప్రజలకూ మధ్య నలిగిపోతూ కుమిలిపోతున్నారు. ముఖ్య మంత్రికి వాస్తవాలు చెప్పే ధైర్యం లేదు. ప్రజలకు నచ్చజెప్పే సామర్థ్యం లేదు. సీపీఎం నాయకుడు మధుని భీమవరంలో ఈడ్చుకుంటూ తీసుకొని వెళ్ళి పోలీసు స్టేషన్లో పెట్టినప్పుడు వేడి పెరిగింది. వైఎస్ఆర్సీపీ శాసనమండలి సభ్యుడు మేకా శేషుబాబు బృందాకరత్‌తో కలిసి భీమవరం వె ళ్ళి బహిరంగ సభలో పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ ఆ ప్రాంతంలో పర్యటించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి ఈ నెల 19వ తేదీన ఆందోళన జరుగుతున్న ప్రాంతాలను సందర్శి స్తారని ఆళ్ళ నానీ ప్రకటించారు. సిద్ధూ, పవన్‌లది ఒకే బాట టీడీపీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రేరేపించిన వ్యక్తిగా, ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పవన్‌కల్యాణ్ నిరుడు లాఠీచార్జి జరిగినప్పుడే అక్కడికి వెళ్ళవలసింది. ఇప్పుడు కూడా ఒక స్వచ్ఛంద సంస్థకు చెందిన సురేష్ అనే వ్యక్తి కొంత మంది బాధితులను హైదరాబాద్ తీసుకువచ్చి పవన్‌తో కలిపించారు. తాను స్వయంగా వెడితే ఆ ప్రాంతంలో ఆవేశాలు పెరిగి, కులాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉన్నదనీ, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనీ భావించి అక్కడికి వెళ్ళాలన్న సంకల్పం విరమించుకున్నాననీ సంజాయిషీ చెప్పారు. అమరావతి ప్రాంతంలో రెండుసార్లు చేసిన పర్యటనకు ఈ వాదన వర్తించదా? పంజాబ్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడూ, వ్యాఖ్యాత, పార్లమెంటు మాజీ సభ్యుడూ నవజ్యోత్ సిద్ధూకు ఉన్నట్టే పవన్ కల్యాణ్‌కు సైతం ప్రాప్తకాలజ్ఞత ఉన్నదేమో. వాస్తవిక దృష్టి ఉన్నవాడు కనుకనే బీజేపీ నుంచి వైదొలగి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో పొత్తు పొసగక కొత్త వేదిక ‘ఆవాజ్-ఇ-పంజాబ్’ను నెలకొల్పిన తర్వాత మరో అడుగు ముందుకు వేయ డానికి ధైర్యం చాలలేదు. కాంగ్రెస్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉన్నదని పరిశీలకులు అంటున్నారు. సిద్ధూ సహకారం లేకుండానే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా కొత్త శాసనసభలో అవతరించే అవకాశం ఉన్నట్టు ఇండియా టుడే - ఒపీనియన్ పోల్ సర్వే సూచించింది. సిద్ధూ భుజం కలిపితే మెజారిటీ సాధించవచ్చు. ఏదైనా ఒక పార్టీ తరఫున ప్రచారం చేసి దాని విజయానికి దోహదం చేయగలను కానీ సొంత పార్టీని విజయపథంలో నడిపించలేననే అవగాహన సిద్ధూకు ఉంది. అదేరకమైన జ్ఞానం పవన్‌కల్యాణ్‌కూ ఉన్నట్టు భావించాలి. కాంగ్రెస్‌కూ, సిద్ధూకూ మధ్య ఎటువంటి ఒప్పందం జరుగుతోందో ఇతరులకు తెలియనట్టే చంద్రబాబునాయుడికీ, పవన్ కల్యాణ్‌కీ మధ్య ఎటువంటి రహస్య అవగాహన ఉన్నదో, ముఖ్యమంత్రిపైన ఇసుమంత విమర్శ చేయడానికి కూడా పవర్ స్టార్ ఎందుకు సంకోచిస్తున్నారో మనకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు. రాజ కీయాలలో రాణించడానికి అవసరమైన తెగువ, శక్తి పవన్ కల్యాణ్‌కు లేవు. కె. రామచంద్రమూర్తి