సంక్షేమ రథ సారథి | Former CM YS Rajasekhara Implement Great Schemes For Peoples | Sakshi
Sakshi News home page

సంక్షేమ రథ సారథి

Published Sun, Jul 7 2019 4:42 AM | Last Updated on Sun, Jul 7 2019 4:44 AM

Former CM YS Rajasekhara Implement Great Schemes For Peoples - Sakshi

స్వయం సహాయక బృందాల సభ్యులకు ఐదువేల  రూపాయల ‘ఓవర్‌డ్రాఫ్ట్‌’ (తాత్కాలిక రుణం) సౌకర్యం కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్‌ శుక్రవారంనాడు  2019–20 బడ్జెట్‌ ప్రసంగంలో ఒకటికి రెండు సార్లు ఉద్ఘాటించినప్పుడు వింతగా వినిపించింది. తెలుగింటి కోడలు దేశ బడ్జెట్‌ను సమర్పించి  కేంద్ర ఆర్థిక శాఖను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటలలోకి ఎక్కడం సంతోషం కలిగించింది. కానీ ఈ మాత్రం సహాయానికే కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చాటుకుంటే కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికీ మేలు చేయడానికి ప్రయత్నించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంతగా చెప్పుకొని ఉండాల్సింది? తండ్రి బాటలో నడుస్తూ ఆశా వర్కర్ల వేతనాలను మూడు వేల నుంచి పది వేలకు పెంచిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత ఘనంగా చెప్పుకోవాలి? ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులైన ప్రజలు చెప్పుకోవాలి కానీ ముఖ్యమంత్రులూ, మంత్రులూ, అధికారులూ చెప్పుకోకూడదు. ఇప్పటికీ వైఎస్‌ఆర్‌ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారంటే సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ ప్రధాన కారణం. కులం, ప్రాంతం, పార్టీ ప్రమేయం లేకుండా సర్వజనులకూ సంక్షేమం అనే సూత్రాన్ని అమలు చేసి సిసలైన ప్రజా నాయకుడిగా నిలిచిన వైఎస్‌ 70వ జయంతి రేపు. సంక్షేమ సారథిగా వైఎస్‌ పెట్టిన ఒరవడినే ప్రధానులైనా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా అనుసరిస్తు న్నారు. 1983లో ఎన్టీ రామారావు ప్రారంభించిన సంక్షేమ పథకాలను 2004లో పునరుద్ధరించి మరింత వేగంగా, సర్వజన సమ్మతంగా అమలు చేయడమే కాకుండా అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన జనహృదయాధినేత వైఎస్‌. పథకాలు కొన్నిటినే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.

సంక్షేమం అభివృద్ధికి సోపానం
బడ్జెట్‌లో సింహభాగం ఉచితాల(ఫ్రీబీస్‌)కే పోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉండవనీ, సంక్షేమ వ్యయానికి సరిహద్దులు ఉండాలనీ వాదించే ఆర్థిక వేత్తలు చాలామంది ఉన్నారు. సంక్షేమమే అభివృద్ధికి దారితీస్తుందని అర్థం చేసుకోవాలంటే మనసుండాలి. మానవత్వం ఉండాలి. 1991లో నాటి ప్రధాని పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సమయంలో ‘రిఫార్మ్స్‌ విత్‌ హ్యూమన్‌ ఫేస్‌’ (మానవీయ కోణంతో సంస్కరణలు) అంటూ నొక్కి చెప్పే వారు. 1996లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి, పి.వి. పదవీ విరమణ తర్వాత ఆయన తరచు హైదరాబాద్‌ సందర్శించేవారు. నాబోటివాళ్ళు కలుసుకున్నప్పుడు ‘వేర్‌ ఈజ్‌ హ్యూమన్‌ ఫేస్‌?’ (మానవీయకోణం ఎక్కడుంది?)అంటూ నిర్వేదంగా పెదవి విరిచేవారు. మానవత్వం లేని భౌతిక సంపద వ్యర్థం. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత సంపన్నులు మరింత సంపన్నులైనారు. సంపద సృష్టిస్తే దాని ఫలితాలు క్రమంగా కిందికి దిగి అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందనే (ట్రిక్లింగ్‌ ఎఫెక్ట్‌) సిద్ధాంతం పనిచేస్తున్నట్టు కనిపించలేదు. కొంతమంది ముఖ్య మంత్రులు ఆర్థిక సంస్కరణలనూ, మార్కెట్‌ ఎకానమీనీ అపార్థం చేసుకొని క్రోనీ కేపిటలిస్టులకు అక్రమ ప్రయోజనాలు కలిగించే ఉద్దేశంతో విద్య, ఆరోగ్య రంగాలనుంచి ప్రభుత్వాలను తప్పించారు. మార్కెట్‌ ఎకానమీ పుట్టిన పాశ్చాత్య దేశాలలో సైతం విద్య, ఆరోగ్య రంగాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా నిష్క్ర మించలేదు. బ్రిటన్‌ ప్రధాని సంతానం లేదా అమెరికా అధ్యక్షుడి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకే వెడతారు.

ప్రభుత్వ పాఠశాలలూ, కళాశాలలనూ  పట్టిం చుకోకపోవడం, ఏదో ఒక సాకు (రేషనలైజేషన్‌) చూపించి ప్రభుత్వ పాఠశాల లను మూసివేయడం వల్ల పేద వర్గాలు కూడా పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకే పంపక తప్పని పరిస్థితి. ఆరోగ్యరంగం డిటో. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు లేకపోవడం, మందులు దొరకపోవడం, సేవలు క్షీణించడంతో ప్రైవేటు ఆస్పత్రులకు గిరాకీ పెరిగింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో వైద్యం అంది స్తామనీ, కార్పొరేట్‌ కళాశాల స్థాయిలో విద్యను అందిస్తామనీ నాయకులు చెప్పుకునే దుస్థితికి చేరుకున్నాం. గురుకుల పాఠశాలలు కొంత ఊరట కలిగి స్తున్నప్పటికీ పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోవడానికి విద్య, ఆరోగ్యం కోసం చేసే శక్తికి మించిన ఖర్చులే ప్రధాన కారణం. దీన్ని గ్రహించి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్‌. ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్‌ ఫలితంగా వేలమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్‌ వంటి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఈ సంక్షేమ చర్య యువతీయువకులకు ఉన్నత విద్యను ప్రసాదించి ఉద్యోగాలకు అర్హులను చేసింది. ఇందులో సంక్షేమం ఉన్నది. అభివృద్ధీ ఉన్నది. ఈ పథకాన్ని విస్తరించి జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మ ఒడి’ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత శాతం పెరుగుతుంది. 

వైఎస్‌ అస్తమించి పదేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచి వెలగడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్‌ ముఠా రాజకీయాలలో వైఎస్‌ ఆత్మరక్షణ చేసుకుంటూ అంచెలంచెలుగా పైకి వచ్చిన తీరూ, ప్రజలతో మమే కమై వారి సేవ చేసి తరించాలన్న ఆకాంక్ష ఆయనను  విలక్షణమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి. కార్యాలయంలో కంప్యూటర్‌ ముందు కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం కంటే పల్లెలకు వెళ్ళి రైతులతో మాట్లాడటానికి ఇష్టపడే వారు ఆయన. టైమ్స్‌ కవర్‌పేజీపైన తన ఫొటో ఉండాలనే తాపత్రయం లేదు. పేదవారి కళ్ళల్లో సంతోషం చూడాలని తప్పించేవారు. తన కంటే ముందు పదమూడు మంది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేసినా రైతులలో, ఉద్యోగులలో, మేధావులలో, ఇతర వర్గాలలో వైఎస్‌ పట్ల ఉన్నంత ప్రేమాభిమానాలు ఇతరులకు లేవంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక మినహా యింపు ఎన్‌టి రామారావు. వైఎస్‌ చేపట్టినన్ని సంక్షేమ  కార్యక్రమాలు ఎన్‌టిఆర్‌ అమలు చేయలేదు. ఎన్‌టిఆర్‌ 1994లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంతకాలు చేసి అమలు చేసిన సంక్షేమ కార్య క్రమాలనూ, అంతకు ముందు ఎన్టీఆర్‌ అమలు చేసిన కార్యక్రమాలనూ  చంద్ర బాబు ముఖ్యమంత్రిగా వచ్చాక రద్దు చేశారు. 2004లో వైఎస్‌ రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే వ్యవసాయ రంగానికి రోజూ తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు  ఇచ్చేందుకూ, రూ. 1,250 కోట్ల మేరకు పేరుకున్న విద్యుచ్ఛక్తి చార్జీల బకాయిలు మాఫ్‌ చేసేందుకూ సంబంధించిన ఫైళ్ళపైన సంతకాలు చేశారు. పేదల సమ స్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించాలనే తపన వైఎస్‌కు రాజకీయాలలో ప్రవేశించినప్పటి నుంచీ ఉండేది. పాదయాత్రలో ఎదురైన అనుభవాలూ, ప్రజల సమస్యలను ఆలకించిన తర్వాత మనసులో కదలాడిన భావాలూ సంక్షేమ కార్య క్రమాలకు రూపునిచ్చి ప్రాణంపోశాయి. 

పాదయాత్రల కుటుంబం
మండుటెండలో ఏప్రిల్‌ మాసంలో (9 జూన్‌ 2003) రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి వైఎస్‌ ప్రారంభించిన పాదయాత్ర 67 రోజులు  సాగింది. 1,475 కిలో మీటర్లు నడిచి ఇచ్ఛాపురం చేరుకొని అక్కడ ప్రజాప్రస్థాన జ్ఞాపిక స్థూపాన్ని నెల కొల్పడానికి ముందే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్‌ వంటి పథకాల రూప కల్పన జరిగి ఉంటుంది. నాయకుల దగ్గరికి ప్రజలు వస్తారు. తమ కష్టాలు చెప్పు కుంటారు. మనసున్న నాయకులు స్పందించి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అది ఉత్తమం. నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడం అత్యుత్తమం. పరిష్కారాలు అక్కడే సాక్షాత్కరిస్తాయి. అమలు చేయడమే తరువాయి. వైఎస్‌ బాటలోనే ఆయన తనయ షర్మిల పాద యాత్ర చేశారు. అనంతరం జగన్‌ సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇంత దూరం పాదయాత్ర చేయడం ప్రపంచంలో మరెక్కడా లేదు.  వైఎస్‌ మొదటి పాదయాత్ర చేవెళ్ళ–ఇచ్ఛాపురం కాదు. దీని కంటే 17 సంవత్సరాల ముందే పోతిరెడ్డిపాడు పాదయాత్రకు వైఎస్‌ నాయ కత్వం వహించారు. 1986 జనవరి ఒకటో తేదీన లేపాక్షి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆరు పట్టణాలూ, 60 గ్రామాల మీదుగా ఇరవై రోజుల పాటు 500 కిలోమీటర్లు సాగి పోతిరెడ్డిపాడు చేరుకున్నది. మూడేళ్ళకు ఒకసారి కరువు కరాళనృత్యం చేసి ప్రజల బతుకుల్లో బడబాగ్ని నింపుతుంటే ఏదో ఒకటి చేయా లనే దీక్షతో వైఎస్, ఇతర మిత్రులు కలసి జరిపిన జనయాత్ర అది. పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంచి కృష్ణా జలాలను రాయలసీమకు ఉదా రంగా సరఫరా చేయాలన్నది వారి డిమాండ్‌.

రెండు దశాబ్దాల తర్వాత ముఖ్య మంత్రి హోదాలో వైఎస్‌ ఆ పని చేశారు. ఆ పాదయాత్రలో ఎదురైన అను భవాలూ, 2003 నాటి ప్రజాప్రస్థానం తాలూకు అనుభవాలూ కలబోసి జల యజ్ఞం ఆవిష్కృతమైంది. లక్షా ఎనభై వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజె క్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని కల కన్నారు. 86 ప్రాజెక్టు ప్రారంభించారు. ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయినాయి. 21 ప్రాజెక్టులు పాక్షికంగా అమలు జరిగాయి. అమెరికాలోని కొలరాడో లిఫ్ట్‌ ఇరి గేషన్‌ ప్రాజెక్టు మాదిరే ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలను 600 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాలని సంకల్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని రూపం మారి కాళేశ్వరం బృహత్తర ప్రాజెక్టు అవతరించింది. 2000లో టీడీపీ ప్రభుత్వం విద్యుచ్ఛక్తి రంగంలో అమలు చేయడానికి ప్రయత్నించిన సంస్కరణలను ప్రతిఘటించడంలో వైఎస్‌ ముందున్నారు. పాత ఎంఎల్‌ఏ క్వార్టర్స్‌లో ఆమరణదీక్ష చేపట్టిన అఖిలపక్ష ఎంఎల్‌ఏలకు నాయ కత్వం వహించారు. ఆ సంవత్సరం ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో పోలీసులు జరి పిన కాల్పులలో ఇద్దరు మరణించారు. 14 రోజుల ఆమరణదీక్ష విరమించారు. ఆ ఉద్యమమే వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే నిర్ణయానికి స్ఫూర్తి.

ఓటమి ఎరుగని విజేత 
ముప్పయ్‌ నాలుగేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నేత వైఎస్‌. ఆయన రాజకీయ జీవితం ఆది నుంచీ ఏటికి ఎదురీదడమే. పట్టువిడవని దృఢదీక్షతో అవరోధాలను అధిగమిస్తూ విజయలక్ష్యం వైపు సాగింది. ఇచ్చిన మాటకు కట్టు బడే తత్వం ఆద్యంతం ఆయనను రాజీలేకుండా నడిపించి ఎనలేని విశ్వస నీయతను సంపాదించిపెట్టింది. కడప జిల్లా యువజన కాంగ్రెస్‌ కమిటీ అధ్య క్షుడిగా వ్యవహరించిన వైఎస్‌ 1978 నాటికి చీలిపోయిన కాంగ్రెస్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని రెడ్డి కాంగ్రెస్‌ నాయకులు అడిగితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్‌ కంటే ఇందిరా కాంగ్రెస్‌ లేదా జనతా పార్టీకి విజయావకాశాలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలిసినా రెడ్డి కాంగ్రెస్‌ ఆవు–దూడ గుర్తుతోనే పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.  అప్పటి నుంచి 2009 ఎన్నికల వరకూ తిరుగులేదు.1996లో జరిగిన ఎన్నికలలో పులివెందులలో వైఎస్‌ను ఓడించేందుకు చంద్ర బాబు విశ్వప్రయత్నం చేశారు. కుటంబసభ్యులనూ, మద్దతుదారులనూ గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రచారం చేయనివ్వలేదు. తక్కువ మెజారిటీతో (5,445 ఓట్లు) వైఎస్‌ గెలుపొందారు. అంత తక్కువ మెజారిటీ తర్వాత ఎన్నడూ రాలేదు. తనకు పరిచయం ఉన్న సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో మరణిం చారు. ఇందిరాగాంధీకి వైఎస్‌ దగ్గరౌతున్న సమయంలో ఆమెను 1984లో సిక్కు అంగరక్షకులు హత్య చేశారు. రాజీవ్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజు లలోనే కే.ఇ. కృష్ణమూర్తిని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా నియమించమని వైఎస్‌ సలహా చెబితే వైఎస్‌నే ఆ పదవిలో రాజీవ్‌ నియమించారు. అప్పటికి వైఎస్‌ వయస్సు 34 ఏళ్ళు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అనంతరం 1985లో జరిగిన ఎన్నికలలో ఎన్‌టిఆర్‌ ప్రభంజనాన్ని తట్టుకోవడం కాంగ్రెస్‌కు సాధ్యం కాలేదు. 1999లో వైఎస్‌ సారథ్యంలోనే కాంగ్రెస్‌ ఎన్నికల బరిలో దిగింది. కార్గిల్‌ యుద్ధంలో విజయం వాజపేయి ప్రాబల్యాన్ని విశేషంగా పెంచింది. అది టీడీపీకి ఉపకరించింది. పాదయాత్ర అనంతరం 2004 ఎన్ని కలలో టీడీపీపైన కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది.  వైఎస్‌ సంక్షేమ రాజ్యం స్థాపించారు. 2009 ఎన్నికలలో విజయం సాధించారు. అదే సంవత్సరం సెప్టెం బర్‌ 2న హెలికాప్టర్‌  ప్రమాదంలో దుర్మరణం చెందారు. అప్పటి నుంచీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని నివసిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో సంక్షేమ రథాన్ని రెట్టింపు వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. ధన్యజీవి.

కె. రామచంద్రమూర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement