ramachadramurthy
-
వైఎస్ జగన్ పాదయాత్రపై పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, ది ప్రింట్ ఎడిటర్ చీఫ్ పద్మభూషణ్ శేఖర్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కారం చేశారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, శేఖర్‌గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్సీపీ నేతలు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: సీఎం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 3648 కి,మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను, వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్‌తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తన నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవంలో పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందిచడం గొప్ప విషయమన్నారు. -
సంక్షేమ రథ సారథి
స్వయం సహాయక బృందాల సభ్యులకు ఐదువేల రూపాయల ‘ఓవర్‌డ్రాఫ్ట్’ (తాత్కాలిక రుణం) సౌకర్యం కల్పిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ శుక్రవారంనాడు 2019–20 బడ్జెట్ ప్రసంగంలో ఒకటికి రెండు సార్లు ఉద్ఘాటించినప్పుడు వింతగా వినిపించింది. తెలుగింటి కోడలు దేశ బడ్జెట్‌ను సమర్పించి కేంద్ర ఆర్థిక శాఖను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్న తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటలలోకి ఎక్కడం సంతోషం కలిగించింది. కానీ ఈ మాత్రం సహాయానికే కేంద్ర ప్రభుత్వం ఇంత గొప్పగా చాటుకుంటే కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికీ మేలు చేయడానికి ప్రయత్నించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతగా చెప్పుకొని ఉండాల్సింది? తండ్రి బాటలో నడుస్తూ ఆశా వర్కర్ల వేతనాలను మూడు వేల నుంచి పది వేలకు పెంచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ఘనంగా చెప్పుకోవాలి? ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులైన ప్రజలు చెప్పుకోవాలి కానీ ముఖ్యమంత్రులూ, మంత్రులూ, అధికారులూ చెప్పుకోకూడదు. ఇప్పటికీ వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారంటే సంక్షేమ పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ ప్రధాన కారణం. కులం, ప్రాంతం, పార్టీ ప్రమేయం లేకుండా సర్వజనులకూ సంక్షేమం అనే సూత్రాన్ని అమలు చేసి సిసలైన ప్రజా నాయకుడిగా నిలిచిన వైఎస్ 70వ జయంతి రేపు. సంక్షేమ సారథిగా వైఎస్ పెట్టిన ఒరవడినే ప్రధానులైనా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా అనుసరిస్తు న్నారు. 1983లో ఎన్టీ రామారావు ప్రారంభించిన సంక్షేమ పథకాలను 2004లో పునరుద్ధరించి మరింత వేగంగా, సర్వజన సమ్మతంగా అమలు చేయడమే కాకుండా అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన జనహృదయాధినేత వైఎస్. పథకాలు కొన్నిటినే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సంక్షేమం అభివృద్ధికి సోపానం బడ్జెట్లో సింహభాగం ఉచితాల(ఫ్రీబీస్)కే పోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఉండవనీ, సంక్షేమ వ్యయానికి సరిహద్దులు ఉండాలనీ వాదించే ఆర్థిక వేత్తలు చాలామంది ఉన్నారు. సంక్షేమమే అభివృద్ధికి దారితీస్తుందని అర్థం చేసుకోవాలంటే మనసుండాలి. మానవత్వం ఉండాలి. 1991లో నాటి ప్రధాని పి.వి. నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సమయంలో ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ (మానవీయ కోణంతో సంస్కరణలు) అంటూ నొక్కి చెప్పే వారు. 1996లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, పి.వి. పదవీ విరమణ తర్వాత ఆయన తరచు హైదరాబాద్ సందర్శించేవారు. నాబోటివాళ్ళు కలుసుకున్నప్పుడు ‘వేర్ ఈజ్ హ్యూమన్ ఫేస్?’ (మానవీయకోణం ఎక్కడుంది?)అంటూ నిర్వేదంగా పెదవి విరిచేవారు. మానవత్వం లేని భౌతిక సంపద వ్యర్థం. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత సంపన్నులు మరింత సంపన్నులైనారు. సంపద సృష్టిస్తే దాని ఫలితాలు క్రమంగా కిందికి దిగి అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందనే (ట్రిక్లింగ్ ఎఫెక్ట్) సిద్ధాంతం పనిచేస్తున్నట్టు కనిపించలేదు. కొంతమంది ముఖ్య మంత్రులు ఆర్థిక సంస్కరణలనూ, మార్కెట్ ఎకానమీనీ అపార్థం చేసుకొని క్రోనీ కేపిటలిస్టులకు అక్రమ ప్రయోజనాలు కలిగించే ఉద్దేశంతో విద్య, ఆరోగ్య రంగాలనుంచి ప్రభుత్వాలను తప్పించారు. మార్కెట్ ఎకానమీ పుట్టిన పాశ్చాత్య దేశాలలో సైతం విద్య, ఆరోగ్య రంగాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా నిష్క్ర మించలేదు. బ్రిటన్ ప్రధాని సంతానం లేదా అమెరికా అధ్యక్షుడి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకే వెడతారు. ప్రభుత్వ పాఠశాలలూ, కళాశాలలనూ పట్టిం చుకోకపోవడం, ఏదో ఒక సాకు (రేషనలైజేషన్) చూపించి ప్రభుత్వ పాఠశాల లను మూసివేయడం వల్ల పేద వర్గాలు కూడా పిల్లలను ప్రైవేటు స్కూళ్ళకే పంపక తప్పని పరిస్థితి. ఆరోగ్యరంగం డిటో. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు లేకపోవడం, మందులు దొరకపోవడం, సేవలు క్షీణించడంతో ప్రైవేటు ఆస్పత్రులకు గిరాకీ పెరిగింది. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో వైద్యం అంది స్తామనీ, కార్పొరేట్ కళాశాల స్థాయిలో విద్యను అందిస్తామనీ నాయకులు చెప్పుకునే దుస్థితికి చేరుకున్నాం. గురుకుల పాఠశాలలు కొంత ఊరట కలిగి స్తున్నప్పటికీ పేద, మధ్య తరగతి కుటుంబాలు చితికిపోవడానికి విద్య, ఆరోగ్యం కోసం చేసే శక్తికి మించిన ఖర్చులే ప్రధాన కారణం. దీన్ని గ్రహించి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నించిన తొలి ముఖ్యమంత్రి వైఎస్. ఫీజ్ రీయంబర్స్మెంట్ ఫలితంగా వేలమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించు కున్నారు. ఈ సంక్షేమ చర్య యువతీయువకులకు ఉన్నత విద్యను ప్రసాదించి ఉద్యోగాలకు అర్హులను చేసింది. ఇందులో సంక్షేమం ఉన్నది. అభివృద్ధీ ఉన్నది. ఈ పథకాన్ని విస్తరించి జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత శాతం పెరుగుతుంది. వైఎస్ అస్తమించి పదేళ్ళు కావస్తున్నా ఇప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచి వెలగడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ ముఠా రాజకీయాలలో వైఎస్ ఆత్మరక్షణ చేసుకుంటూ అంచెలంచెలుగా పైకి వచ్చిన తీరూ, ప్రజలతో మమే కమై వారి సేవ చేసి తరించాలన్న ఆకాంక్ష ఆయనను విలక్షణమైన నాయకుడిగా తీర్చిదిద్దాయి. కార్యాలయంలో కంప్యూటర్ ముందు కూర్చొని వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం కంటే పల్లెలకు వెళ్ళి రైతులతో మాట్లాడటానికి ఇష్టపడే వారు ఆయన. టైమ్స్ కవర్పేజీపైన తన ఫొటో ఉండాలనే తాపత్రయం లేదు. పేదవారి కళ్ళల్లో సంతోషం చూడాలని తప్పించేవారు. తన కంటే ముందు పదమూడు మంది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పని చేసినా రైతులలో, ఉద్యోగులలో, మేధావులలో, ఇతర వర్గాలలో వైఎస్ పట్ల ఉన్నంత ప్రేమాభిమానాలు ఇతరులకు లేవంటే అతిశయోక్తి కాదు. ఒకే ఒక మినహా యింపు ఎన్‌టి రామారావు. వైఎస్ చేపట్టినన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎన్టిఆర్ అమలు చేయలేదు. ఎన్టిఆర్ 1994లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంతకాలు చేసి అమలు చేసిన సంక్షేమ కార్య క్రమాలనూ, అంతకు ముందు ఎన్టీఆర్ అమలు చేసిన కార్యక్రమాలనూ చంద్ర బాబు ముఖ్యమంత్రిగా వచ్చాక రద్దు చేశారు. 2004లో వైఎస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టగానే వ్యవసాయ రంగానికి రోజూ తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు ఇచ్చేందుకూ, రూ. 1,250 కోట్ల మేరకు పేరుకున్న విద్యుచ్ఛక్తి చార్జీల బకాయిలు మాఫ్ చేసేందుకూ సంబంధించిన ఫైళ్ళపైన సంతకాలు చేశారు. పేదల సమ స్యల పట్ల అవగాహన, వాటిని పరిష్కరించాలనే తపన వైఎస్‌కు రాజకీయాలలో ప్రవేశించినప్పటి నుంచీ ఉండేది. పాదయాత్రలో ఎదురైన అనుభవాలూ, ప్రజల సమస్యలను ఆలకించిన తర్వాత మనసులో కదలాడిన భావాలూ సంక్షేమ కార్య క్రమాలకు రూపునిచ్చి ప్రాణంపోశాయి. పాదయాత్రల కుటుంబం మండుటెండలో ఏప్రిల్ మాసంలో (9 జూన్ 2003) రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి వైఎస్ ప్రారంభించిన పాదయాత్ర 67 రోజులు సాగింది. 1,475 కిలో మీటర్లు నడిచి ఇచ్ఛాపురం చేరుకొని అక్కడ ప్రజాప్రస్థాన జ్ఞాపిక స్థూపాన్ని నెల కొల్పడానికి ముందే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాల రూప కల్పన జరిగి ఉంటుంది. నాయకుల దగ్గరికి ప్రజలు వస్తారు. తమ కష్టాలు చెప్పు కుంటారు. మనసున్న నాయకులు స్పందించి వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. అది ఉత్తమం. నాయకులే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడం అత్యుత్తమం. పరిష్కారాలు అక్కడే సాక్షాత్కరిస్తాయి. అమలు చేయడమే తరువాయి. వైఎస్ బాటలోనే ఆయన తనయ షర్మిల పాద యాత్ర చేశారు. అనంతరం జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఇంత దూరం పాదయాత్ర చేయడం ప్రపంచంలో మరెక్కడా లేదు. వైఎస్ మొదటి పాదయాత్ర చేవెళ్ళ–ఇచ్ఛాపురం కాదు. దీని కంటే 17 సంవత్సరాల ముందే పోతిరెడ్డిపాడు పాదయాత్రకు వైఎస్ నాయ కత్వం వహించారు. 1986 జనవరి ఒకటో తేదీన లేపాక్షి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆరు పట్టణాలూ, 60 గ్రామాల మీదుగా ఇరవై రోజుల పాటు 500 కిలోమీటర్లు సాగి పోతిరెడ్డిపాడు చేరుకున్నది. మూడేళ్ళకు ఒకసారి కరువు కరాళనృత్యం చేసి ప్రజల బతుకుల్లో బడబాగ్ని నింపుతుంటే ఏదో ఒకటి చేయా లనే దీక్షతో వైఎస్, ఇతర మిత్రులు కలసి జరిపిన జనయాత్ర అది. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి కృష్ణా జలాలను రాయలసీమకు ఉదా రంగా సరఫరా చేయాలన్నది వారి డిమాండ్. రెండు దశాబ్దాల తర్వాత ముఖ్య మంత్రి హోదాలో వైఎస్ ఆ పని చేశారు. ఆ పాదయాత్రలో ఎదురైన అను భవాలూ, 2003 నాటి ప్రజాప్రస్థానం తాలూకు అనుభవాలూ కలబోసి జల యజ్ఞం ఆవిష్కృతమైంది. లక్షా ఎనభై వేల కోట్ల రూపాయల ఖర్చుతో ప్రాజె క్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని కల కన్నారు. 86 ప్రాజెక్టు ప్రారంభించారు. ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయినాయి. 21 ప్రాజెక్టులు పాక్షికంగా అమలు జరిగాయి. అమెరికాలోని కొలరాడో లిఫ్ట్ ఇరి గేషన్ ప్రాజెక్టు మాదిరే ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలను 600 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయాలని సంకల్పించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాని రూపం మారి కాళేశ్వరం బృహత్తర ప్రాజెక్టు అవతరించింది. 2000లో టీడీపీ ప్రభుత్వం విద్యుచ్ఛక్తి రంగంలో అమలు చేయడానికి ప్రయత్నించిన సంస్కరణలను ప్రతిఘటించడంలో వైఎస్ ముందున్నారు. పాత ఎంఎల్ఏ క్వార్టర్స్‌లో ఆమరణదీక్ష చేపట్టిన అఖిలపక్ష ఎంఎల్ఏలకు నాయ కత్వం వహించారు. ఆ సంవత్సరం ఆగస్టు 28న బషీర్‌బాగ్‌లో పోలీసులు జరి పిన కాల్పులలో ఇద్దరు మరణించారు. 14 రోజుల ఆమరణదీక్ష విరమించారు. ఆ ఉద్యమమే వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే నిర్ణయానికి స్ఫూర్తి. ఓటమి ఎరుగని విజేత ముప్పయ్ నాలుగేళ్ళ రాజకీయ ప్రస్థానంలో ఓటమి ఎరుగని నేత వైఎస్. ఆయన రాజకీయ జీవితం ఆది నుంచీ ఏటికి ఎదురీదడమే. పట్టువిడవని దృఢదీక్షతో అవరోధాలను అధిగమిస్తూ విజయలక్ష్యం వైపు సాగింది. ఇచ్చిన మాటకు కట్టు బడే తత్వం ఆద్యంతం ఆయనను రాజీలేకుండా నడిపించి ఎనలేని విశ్వస నీయతను సంపాదించిపెట్టింది. కడప జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్య క్షుడిగా వ్యవహరించిన వైఎస్ 1978 నాటికి చీలిపోయిన కాంగ్రెస్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని రెడ్డి కాంగ్రెస్ నాయకులు అడిగితే ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని మాట ఇచ్చారు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్ కంటే ఇందిరా కాంగ్రెస్ లేదా జనతా పార్టీకి విజయావకాశాలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలిసినా రెడ్డి కాంగ్రెస్ ఆవు–దూడ గుర్తుతోనే పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి 2009 ఎన్నికల వరకూ తిరుగులేదు.1996లో జరిగిన ఎన్నికలలో పులివెందులలో వైఎస్‌ను ఓడించేందుకు చంద్ర బాబు విశ్వప్రయత్నం చేశారు. కుటంబసభ్యులనూ, మద్దతుదారులనూ గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రచారం చేయనివ్వలేదు. తక్కువ మెజారిటీతో (5,445 ఓట్లు) వైఎస్ గెలుపొందారు. అంత తక్కువ మెజారిటీ తర్వాత ఎన్నడూ రాలేదు. తనకు పరిచయం ఉన్న సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో మరణిం చారు. ఇందిరాగాంధీకి వైఎస్ దగ్గరౌతున్న సమయంలో ఆమెను 1984లో సిక్కు అంగరక్షకులు హత్య చేశారు. రాజీవ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజు లలోనే కే.ఇ. కృష్ణమూర్తిని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించమని వైఎస్ సలహా చెబితే వైఎస్‌నే ఆ పదవిలో రాజీవ్ నియమించారు. అప్పటికి వైఎస్ వయస్సు 34 ఏళ్ళు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం అనంతరం 1985లో జరిగిన ఎన్నికలలో ఎన్టిఆర్ ప్రభంజనాన్ని తట్టుకోవడం కాంగ్రెస్‌కు సాధ్యం కాలేదు. 1999లో వైఎస్ సారథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగింది. కార్గిల్ యుద్ధంలో విజయం వాజపేయి ప్రాబల్యాన్ని విశేషంగా పెంచింది. అది టీడీపీకి ఉపకరించింది. పాదయాత్ర అనంతరం 2004 ఎన్ని కలలో టీడీపీపైన కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. వైఎస్ సంక్షేమ రాజ్యం స్థాపించారు. 2009 ఎన్నికలలో విజయం సాధించారు. అదే సంవత్సరం సెప్టెం బర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అప్పటి నుంచీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని నివసిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి రూపంలో సంక్షేమ రథాన్ని రెట్టింపు వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. ధన్యజీవి. కె. రామచంద్రమూర్తి -
ఉభయతారకం, శుభదాయకం
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పక్కపక్కన కూర్చొని వివాదాలను సామరస్య ధోరణిలో, ఇచ్చిపుచ్చుకునే పద్ధతిలో పరిష్కరించుకుందామని సంకల్పం చెప్పుకోవడం చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభపరిణామం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అయిదేళ్ళు కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ రెండు రాష్ట్రాల పాలకుల మధ్య సుహృద్భావం కరువై సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. నదీజలాల వివాదాల సంగతి సరేసరి. 2014లో ఆంధ్రప్రదేశ్ పున ర్మిర్మాణ చట్టం అమలులోకి వచ్చి అదే సంవత్సరం జూన్ 2న రెండు రాష్ట్రాలూ ఏర్పడిన తర్వాత విభజన తాలూకు గాయాలు మానడానికి కొంత సమయం అవసరమనే సంగతి ఊహించిందే. కానీ రాజకీయ నాయకత్వాల మధ్య అవగాహన లేక, సంఘర్షణాత్మక వైఖరినే ప్రజలు మెచ్చుతారనే ఆలోచనతో కలహానికి కాలు దువ్వారే కానీ సఖ్యతకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఓటుకు కోట్ల కేసు వెలుగులోకి వచ్చిన వెంటనే నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ‘మీకు పోలీసు ఉంది, మాకూ పోలీసు ఉంది. మీకు ఏసీబీ ఉంది మాకూ ఏసీబీ ఉంది,’ అంటూ విజయవాడ వెళ్ళి కృష్ణానదీ గర్భంలో అక్రమ కట్టడంలో నివాసం కుదుర్చుకున్నప్పటి నుంచీ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పెరిగాయే కానీ తరగలేదు. విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండగా నదీజలాల వివాదాలలో పీటముళ్ళు పడి దాయాదుల పోరును తలపిం చడం విషాదం. విడిపోయి కలిసి ఉందామనే నినాదం అర్థరహితంగా మారిన పరిస్థితులు తెలుగువారికి బాధ కలిగించాయి. అవిభక్త రాష్ట్రానికి కృష్ణా జలాల కేటాయింపులో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ 2013 నవంబర్ 29న ఇచ్చిన అంతిమ తీర్పుపైన సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలూ అదే ట్రిబ్యూనల్ ఎదుట తమతమ వాటాల విషయంలో వాదులాడు కున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరు తరలిం చరాదనీ, చెన్నైకి తెలుగుగంగ ద్వారా పంపేందుకు 1,500 క్యూసెక్కులు మాత్రమే వినియోగించుకోవాలనీ తెలంగాణ వాదించింది. కానీ జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి మిగులు జలాలను వినియోగించే అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది. పోలవరం నిర్మాణానికి తెలంగాణ అభ్యంతరం చెబితే కాళేశ్వరంను ఆంధ్రప్రదేశ్ తప్పుపట్టింది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాబేసిన్‌లోకి ఎత్తిపోసే 45 టీఎంసీల గోదావరి నీటిలో తెలంగాణ వాటా ఇవ్వాలని కోరింది. అట్లా అడిగే పక్షంలో తెలంగాణలో వివిధ ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే 214 టీఎంసీల గోదావరి నీటిలో తమకూ వాటా ఉంటుందంటూ ఆంధ్రప్రదేశ్ ఎదురు వాదించింది. ఎంత నీరు కేటాయించినా వినియోగించుకునే వ్యవస్థ లేనప్పుడు కీచులాడుకొని ఏమి ఫలితం? ఖడ్గచాలనం కాదు, కరచాలనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మే 30న ప్రమాణం చేసిన సభలో అతిథిగా పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కీసీఆర్) రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా ‘ఖడ్గచాలనం కాదు, కరచాలనం’ జరగాలంటూ హితవాక్యం పకలడంతో వాతావరణం మారి పోయింది. కృష్ణా, గోదావరీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాలలోని వెనుకబడిన ప్రాంతాలకు తరలించేందుకు ఎటువంటి పథకాలు రచించాలో సమాలోచన చేయాలన్న సద్భావన ఫలితంగానే శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, మంత్రులూ, ఉన్నతాధికారులూ చర్చలు ప్రారంభించారు. ఘర్షణ వల్ల ప్రయోజనం లేదు. 1996లో కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టును అడ్డుకునేందును అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెళ్ళి హడావిడి చేయడం, ప్రాజెక్టు ఆపకపోతే ఢిల్లీలోదేవెగౌడ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తామంటూ బెదిరించడం వల్ల ఫలితం లేకపోయింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆయన మహారాష్ట్ర వెళ్ళి, ధర్నా చేసి, అరెస్టు తర్వాత ఔరంగాబాద్ జైలులో కొన్ని గంటలు గడిపినా ప్రయోజనం శూన్యం. ఇటువంటి చర్యలు రాజకీయ ప్రచారానికీ, ఏదో చేస్తున్నామని ప్రజలను నమ్మించేందుకూ ఉపయోగపడతాయి కానీ సమస్యను పరిష్కరించజాలవు. 1996 తర్వాత అధికారంలో 2004 వరకూ ఉన్నప్పటికీ ఆల్మట్టిని ఆపేందుకు చంద్రబాబు చేసిన గట్టిప్రయత్నం ఏమీలేదు. ఆ ఎనిమిదేళ్ళూ ఢిల్లీలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభు త్వాలు ఉన్నా, బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్ డీఏ) సర్కార్ ఉన్నా, చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారంటూ తెలుగువారు చంకలు గుద్దుకున్నా ఒరిగింది ఏమీ లేదు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సైతం ఆ ఒక్క నిరసన ప్రదర్శన తర్వాత కొనసాగింపు చర్యలు లేవు. ఎగువ రాష్ట్రాలలో జరిగే నిర్మాణాలను ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా అడ్డుకోవడం ముఖ్యమంత్రులకైనా, ప్రతిపక్ష నాయకులకైనా సాధ్యం కాదనే విషయం స్పష్టంగా తెలిసివచ్చింది. నదీజలాల వివాదాలపై న్యాయస్థానాలలో, ట్రిబ్యూనళ్ళలో మొత్తం 350 పిటిషన్లు ఈ రోజుకూ అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిలో కొన్ని మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. ట్రిబ్యూనళ్ళ చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ, కేంద్ర జలవనరుల మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పరిష్కారాలు ప్రసాదించమంటూ ప్రాధేయపడటం కంటే ఇరుగుపొరుగు ముఖ్యమంత్రులు స్నేహపూరిత వాతావరణంలో కలుసుకొని జనహితమే పరమావధిగా సమాలోచనల ద్వారా విభేదాలు పరిష్కరించుకోవడం శ్రేయ స్కరమని కేసీఆర్ చేసిన ప్రతిపాదనను బేషరతుగా ఆమోదించవలసిందే. జగన్ చేసిన పని అదే. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వారు పరిరక్షించుకుంటూనే ప్రజలకు మేలు జరిగే విధంగా నదీ జలాలను సద్వినియోగం చేసుకొని భూములను సస్యశ్యామలం చేయగలిగితే అంతకంటే కావలసినది ఏమున్నది? కృష్ణాకటాక్షం లేదు కృష్ణానదిపైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు బరాజులు నిర్మించిన కారణంగా దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాలకు వచ్చే నీటి పరిణామం క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ప్రతి సంవత్సరం గోదావరి (దక్షిణగంగ) నదికి వరదలు వచ్చి వెయ్యి నుంచి మూడువేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా పోతున్నది. కొన్నేళ్ళుగా కృష్ణానదికి వరద రానే లేదు. మిగులు నీరు లేదు. ప్రకాశం బరాజ్ నుంచి కిందికి వదలి సముద్రంలోకి పంపవలసిన 16 టీఎంసీల నీరు కూడా అందుబాటులో ఉండటం లేదు. కృష్ణాకటాక్షం లేకుండా పోతున్నది కనుకనే వృధాగా సముద్రంలోకి పోతున్న సుమారు 3,000 టీఎంసీల గోదావరి నీటినీ ఒడిసిపట్టుకొని పంటపొలాలకు మళ్ళించాలన్న మహాసంకల్పం ఉభయ తారకమైనది. అవశ్యం ఆచరణయోగ్యమైనది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం క్రమంలో కేసీఆర్ ముంబైకి వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో సంప్ర తింపులు జరిపి ఉభయులకూ సంతృప్తికరమైన పరిష్కారం కుదుర్చుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌తో పాటు ఫడ్నవీస్ కూడా హాజరు కావడం మూడు రాష్ట్రాల మధ్య బలపడుతున్న మైత్రికి నిదర్శనంగా చెప్పు కోవచ్చు. కాళేశ్వరం వల్ల మహారాష్ట్రకు కూడా ప్రయోజనమేనంటూ ఫడ్నవీస్ హర్షం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా కోరుకుంటున్న ప్రత్యేక హోదాకు తాను అభ్యంతరం చెప్పబోననీ, తమ ఎంపీలు ఆ డిమాండ్‌ను పార్ల మెంటులో బలపర్చుతారనీ కేసీఆర్ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును ప్రశ్నించబోమని స్పష్టం చేశారు. దీనికి అభ్యంతరం చెబుతూ తెలంగాణ ఇదివరకు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించు కుంటామనీ, అవసరమైతే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరిపి ఆయనను కూడా పోలవరం ప్రాజెక్టుకు ఒప్పిస్తాననీ కేసీఆర్ చెప్పడం విశేషం. ప్రాంతీయ సహకార స్ఫూర్తితో వాస్తవాల ప్రాతిపదికగా సమాలోచనలు జరిపినప్పుడు న్యాయమైన ప్రతిపాదనలను ఏ ముఖ్యమంత్రి అయినా అంగీ కరించే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్ర ప్రజలకు మేలు జరగరాదని ఏ ముఖ్య మంత్రికీ ఉండదు. అవగాహన లేక, సంయమనం లేక, నేర్పులేక ఘర్షణ వాతా వరణం కల్పించుకోవడం, కేసులు పెట్టుకోవడం ఉత్తమమైన రాజకీయం కాదని రాష్ట్రాధినేతలు గ్రహించడం మంచి పరిణామం. కాళేశ్వరం, పోలవరం భారీ ప్రాజెక్టులు. వేలకోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న ఈ రెండు ప్రాజెక్టులూ తెలంగాణ, ఆంధ్రప్రజలకు ప్రాణాధారాలు. రెండు ప్రాజెక్టులకూ కేంద్రం అవసరమైన అను మతులన్నిటినీ మంజూరు చేసింది. ట్రిబ్యూనళ్ళూ, న్యాయస్థానాల ప్రమేయం లేకుండా, కేంద్ర నాయకుల మధ్యవర్తిత్వం లేకుండా ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయగలిగితే ఇద్దరు ముఖ్యమంత్రులూ చరితార్థులు అవుతారు. సమావేశంలో ప్రతిపాదించినట్టు గోదావరినీటిని శ్రీశైలం జలాశయానికీ, నాగార్జునసాగర్ జలాÔ¶ యానికీ రోజుకు చెరి రెండు టీఎంసీల వంతున నీరు చేర్చగలిగితే కృష్ణానది కరుణించకపోయినా, గోదావరి జలాలతో తెలుగు ప్రజల హృదయాలు పులకిస్తాయి. నదీ జలాలను సాధ్యమైనంత తక్కువ వ్యయంతో గరిష్ఠంగా వినియోగించుకునే మార్గాలను అన్వేషించవలసిందిగా ఉభయ రాష్ట్రాల అధికారులను ముఖ్యమంత్రులు ఆదేశించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ శాఖలకు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు వెంకటేశ్వరరావు, మురళీధర్‌లు ఇతర అధికారులతో సమాలోచన జరిపి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించారు. 5 ప్రత్యామ్నాయాలు మొత్తం అయిదు ప్రత్యామ్నాయాలు పరిశీలనలో ఉన్నాయి. 1. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టుకు రీఇంజనీరింగ్ చేయడం. గోదావరి జలాలను టెయిల్‌పాండ్‌లోకి కాకుండా నేరుగా నాగార్జునసాగర్‌కు తరలించి, అందులో సగం ఉపకాలువ ద్వారా శ్రీశైలం జలాశయానికి తరలించడం. 2. అకినేపల్లి నుంచి శ్రీశైలంకూ, దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కూ శ్రీశైలానికీ గోదావరి నీరు మళ్ళించడం. 3. రాంపూర్ నుంచి గోదావరి జలాలను నేరుగా నాగార్జునసాగర్లోకీ, అక్కడి నుంచి ఉపకాలువ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకూ తరలించడం. 4. ఇంద్రావతి కలిసిన తర్వాత మేడిగడ్డకు దిగువన, తుపాకుల గూడెం ఎగువున ఉన్న ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించి సగం నీటిని సాగర్లోకీ, మిగిలిన సగం నీటిని ఉపకాలువ ద్వారా శ్రీశైలంలోకీ మరలించడం. 5. పోలవరం నుంచి మున్నేరు మీదుగా పులిచింతలకూ, నాగా ర్జునసాగర్కూ ఎత్తిపోయడం. అభయారణ్యాలను కాపాడుతూ, పర్యావరణాన్ని రక్షిస్తూ కాలువలు నిర్మించాలని కూడా ముఖ్యమంత్రులు సూచించారు. నీటి వినియోగం ఆధారంగా దామాషా పద్ధతిలో ఖర్చు భరించాలనే ప్రతిపాదన ఉంది. కృష్ణా–గోదావరి అనుసంధానం రెండేళ్ళలోగా పూర్తి కావాలని ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆకాంక్షించారు. కృష్ణా, గోదావరి జలాలలో నాలుగు వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేయాలన్న ఆకాంక్ష నెరవేరితే తెలుగు రాష్ట్రా లలో ప్రతి అంగుళంలోనూ కోనసీమ ప్రతిఫలిస్తుంది. జులై 15 కల్లా ప్రాథమిక నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రులు ఆదేశించారు. ఆ నివేదికను పరిశీలించి కార్యాచరణకు పూనుకునేందుకు ఆం్ర«దప్రదేశ్‌లో మరోసారి ఇద్దరు ముఖ్యమంత్రులూ సమావేశం కావాలని నిర్ణయించారు. విభజన తర్వాత తలెత్తిన విభజన అంశాలలో అత్యంత ముఖ్యమైనవి నదీజలాల వివాదాలు. ఆ తర్వాత విభజన చట్టంలోని తొమ్మిదో షెడ్యూల్ కింద 89 సంస్థలనూ, పదో షెడ్యూల్ కింద 107 సంస్థలనూ విభజించవలసి ఉంది. మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటు తెలంగాణ సర్కార్‌తోనూ, కేంద్రంతోనూ సత్సంబంధాలు లేవు కనుక ఈ కసరత్తు ప్రారంభం కాలేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన తర్వాత ఆయన కోరిన విధంగా ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు డిప్యుటేషన్పైకి పంపేందుకు కేసీఆర్ అంగీకరించారు. అదే విధంగా హైదరాబాద్ సచివాలయంలో నిరుపయోగంగా పడి ఉన్న గదులను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు జగన్ సమ్మతించారు. ఎవ్వరికీ నష్టం లేని విషయాలలో అనవరమైన పట్టింపులకు పోయి రాద్ధాంతం చేయకుండా చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం అభినందనీయమైనది. ఇలాగే సహకరించుకుంటూ ప్రగతిబాటలో కలసికట్టుగా సాగితే తెలుగువారి భవిష్యత్తు దేదీప్యమానంగా ఉంటుంది. ఇదే సుహృద్భావం అవిచ్ఛిన్నంగా కొనసాగేందుకు తెలుగువారు అందరూ శక్తివంచనలేకుండా పాటుపడాలి. కె. రామచంద్రమూర్తి -
బిహార్ దిశానిర్దేశం
త్రికాలమ్ బిహార్ దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? పద్దెనిమిది మాసాల కిందట లోక్‌సభ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అట్టహాసంగా హస్తినలో అధికారదండం చేతబట్టిన నరేంద్రమోదీ ఎందుకు బిహార్ ఎన్నికలపైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరిస్తున్నారు? ప్రధానిగా నరేంద్రమోదీ వ్యవహరణ తీరును ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశించబోతున్నాయి. రాజ్యసభలో ఎన్డీఏకి మెజారిటీ ఎప్పుడు లభించేదీ సూచించబోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడుగా నితీశ్‌కుమార్ భవిష్య త్తును తేల్చబోతున్నాయి. పాతికేళ్ల కిందటే 'సామాజిక న్యాయం' నినాదాన్ని ఎన్నికలలో ప్రయోగించి చరిత్ర సృష్టించిన లాలూప్రసాద్ యాదవ్ పదేళ్ల అరణ్యవాసం తర్వాత బిహార్ రాజకీయాలలో తిరిగి ఒక శక్తిగా కోలుకుంటారో లేదో కూడా ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్‌గాంధీ కానీ పెద్దగా చర్చలో లేనట్టే లెక్క. ఇది రెండు కూటముల మధ్య పోరాటం. ప్రధానంగా ఇద్దరు నాయకుల మధ్య బ్యాలట్ యుద్ధం. ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, రెండో వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. బీజేపీ, దాని మిత్రపక్షాలు (నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్- ఎన్డీఏ) గెలిస్తే లోక్‌సభ నాటి హవా కొనసాగినట్టూ, మోదీ కత్తికి ఎదురు లేనట్టూ ప్రజలు అర్థం చేసుకుంటారు. లాలూతో స్నేహం వల్ల నితీశ్ దెబ్బతిన్నాడని తీర్మానిస్తారు. జనతాదళ్-యూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌లతో కూడిన మహా ఘట్బంధన్ విజయం సాధిస్తే 2019 నాటి లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోదీకి నితీశ్‌కుమార్ ఒక లౌకిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు. విభిన్న మైన అభివృద్ధి నమూనాకు ప్రతినిధిగా నిలబడతారు. ఇద్దరి అభి వృద్ధి నమూనాలలో వ్యత్యాసం ఏమిటో పరిశీలిద్దాం. మహాకూటమికే మొగ్గు? ఇప్పటికి మూడు ఘట్టాల పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు ఘట్టాలు మిగిలి ఉన్నాయి. నాలుగో విడత పోలింగ్ ఈ రోజు. చివరి ఘట్టం నవంబర్ 5న. నవంబర్ 8 న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. మొదటి రెండు దశల పోలింగ్ మహాకూటమికి అనుకూలంగా సాగినట్టూ, మూడో దశలో చెరిసగం ఆధిక్యం ఉన్నట్టూ రాజకీయ పరిశీలకుల అంచనా. చివరి రెండు దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ముస్లింల జనాభా గణనీయం. మొత్తంమీద మహాకూటమి (మహా ఘట్బంధన్)కి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతా యాదవుల ఓట్లు కూర్మీ అభ్యర్థులకూ, కూర్మీల ఓట్లు యాదవ అభ్యర్థులకూ పడతాయా లేదా అన్నదానిపైన ఆధారపడి ఉంటుంది. లోక్‌సభ ఎన్ని కలలో మొత్తం 40 స్థానాలకు 32 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాబల్యం అంతలోనే క్షీణించిందా? లోక్‌సభ ఎన్నికలలో బిహార్ ప్రజలు యూపీఏను శిక్షించాలనే లక్ష్యంతో బీజేపీకీ, దాని మిత్రపక్షాలకు ఓట్లు వేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పట్నాలో ఎవరికి పట్టం కట్టాలనే విషయం తేల్చడానికి. ముఖ్యమంత్రిగా 2005 నుంచి ఇప్పటి వరకూ (మధ్యలో మాంఝీ హయాంను మినహాయిస్తే) నితీశ్‌కుమార్ చేసిన మంచి పనులను ప్రజలు మరచిపోలేదు. ముఖ్యంగా మహిళా సాధికారికత విషయంలో బిహార్ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ విజయాలు సాధించింది. 2010 నాటి ఎన్నికల నుంచి మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగిం చుకోవడం ఇందుకు నిదర్శనం. ఉన్నత కులంగా చలామణి అవుతున్న భూమిహార్ ప్రజలలో సైతం మగవారు బీజేపీని సమర్థిస్తుంటే ఆడవారు జనతా దళ్-యూని బలపర్చుతున్నారు. మహా ఘట్బంధన్ తరఫున నితీశ్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రచారం చేస్తు న్నారు. ఎన్డీఏ అభ్యర్థుల పక్షాన మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , ఎందరో కేంద్రమంతులు, మిత్రపక్షాల నాయకులైన మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్, తదితరులు ఓటర్లను ప్రభావితులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ర్యాలీలకే జనసమీకరణ భారీగా జరుగుతోంది. ఆయన ప్రసం గాలనే జాతీయ టెలివిజన్ చానళ్లు సంపూర్ణంగా ప్రసారం చేస్తున్నాయి. మోదీ ప్రచారం ప్రభావవంతంగా ఉంది. ముప్పయ్ అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో, పాతికేళ్ల లాలూ, నితీశ్ ఏలుబడితో బిహార్‌కి ఒరిగింది శూన్య మంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు. నితీశ్‌తో పాటు తొమ్మిదేళ్లకు పైగా బీజేపీ అధికారం పంచుకున్న వైనాన్ని విస్మరిస్తున్నారు. బిహార్‌కి మేలు జరగనే లేదంటూ నొక్కి చెబుతున్నారు. ఇక లాలూపైన జంగిల్‌రాజ్ అంటూ ధ్వజ మెత్తారు. లాలూతో పొత్తుపెట్టుకోవడం నితీశ్ అవకాశవాద రాజకీయానికి నిదర్శనమంటూ ఎండగట్టారు. ఎన్నికల ప్రచారంలో మోదీ శైలి తెలిసిందే. మోదీ-నితీశ్ వైరం బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని నియమించినప్పుడు ఆ నిర్ణయాన్ని నితీశ్‌కుమార్ స్వాగతించి ఉంటే ఇప్పుడు ఎన్నికల పోరులో ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా, ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. లాలూ, సోనియాల కూటమి పేలవంగా తేలిపోయేది. ఎన్నికల రంగం ఇంతటి రసవత్తరంగా ఉండేది కాదు. నరేంద్రమోదీ పట్ల వ్యక్తిగత, విధానపరమైన వ్యతిరేకత ఉన్న కారణంగానే ఎన్డీఏ నుంచి నితీశ్ వైదొలిగారు. లోక్‌సభ ఎన్నికలలో ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పు కొని తన స్థానంలో మాంఝీని కూర్చోబెట్టారు. ఏకులాగా వచ్చిన మాంఝీ మేకులాగా తయారై బీజేపీతో జతకట్టడంతో మాంఝీని తోసిరాజని ముఖ్య మంత్రిగా నితీశ్ తిరిగి బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. మోదీ హయాంలో గుజరాత్ గణనీయంగా అభివృద్ధి చెందినట్టు చెప్పడం, దేశమంతా గుజరాత్ అభివృద్ధి నమూనాను అమలు చేయాలని ప్రచారం చేయడం రెండేళ్లుగా చూస్తున్నాం. నిజానికి మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి పూర్వమే గుజరాత్ అభివృద్ధిపథంలో ఉన్నది. దాదాపు రెండు శతాబ్దాలుగా గుజరాతీయులలో వ్యాపారదక్షత పెరుగుతూ వచ్చింది. ధీరూ భాయ్ అంబానీ, గౌతమ్ అదానీ, కర్సన్భాయ్ పటేల్ వంటి దిగ్గజాలు మోదీ రావడానికి ముందే వ్యాపారరంగంలో తమ ముద్రను వేశారు. మాధవ్ సింగ్సోలంకీ ముఖ్యమంత్రిగా ఉండగా (1984) దేశంలో రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన వంద జిల్లాల జాబితా తయారు చేస్తే అందులో పాతిక జిల్లాలు గుజరాత్ రాష్ట్రంలోనివే. ఒక్క భారూచ్ జిల్లాలో పెట్టు బడులే జాబితాలోని తక్కిన అన్ని జిల్లాల పెట్టుబడులకంటే అధికం. అప్పుడు మోదీ ఎక్కడున్నారు? వాస్తవం ఏమిటంటే గుజరాత్లో చాలాకాలంగా సాగు తున్న అభివృద్ధి నమూనానే మోదీ కొనసాగించారు. బీజేపీ సర్కార్‌కు సుస్థిరత ప్రసాదించడం మూలంగా కొన్ని రంగాలలో అభివృద్ధి కొట్టవచ్చినట్టు కనిపిస్తు న్నది. మోదీ అభివృద్ధి నమూనా విపణి చోదకమైనది. కొన్ని రంగాలలో కొన్ని సంస్థలకే అభివృద్ధి ఫలాలు అందాయి. సామాజిక న్యాయం ఆశించినంత జరగ లేదు. దేశంలోని అతిసంపన్నవంతమైన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, అక్షరాస్యతలో, శిశుమరణాలలో, పేదరికంలో, ఇతర అభివృద్ధి సూచీలలో గుజరాత్ చాలా వెనుకబడి ఉన్నది. బిహార్ ఇందుకు భిన్నం. ‘బీమారూ’ రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరసన ఉండిన బిహార్ పదేళ్లలో గణనీయమైన అభి వృద్ధి సాధించింది. నితీశ్‌కుమార్ అనుసరించిన నమూనా ఫలితంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను కొంతమేరకు పేదరికం నుంచి బయట పడవేయడం, తరతరాలుగా అణచివేతకు గురవుతూ వచ్చిన మహిళలకు అధికారం అప్పగించడం వంటి ప్రగతి సాధ్యమైంది. మానవ వికాసానికి అవసరమైన అభివృద్ధి అందుబాటులోకి వచ్చింది. 2001 నుంచి 2011 వరకూ అక్షరాస్యత 16.8 శాతం పెరిగింది. మహిళల అక్షరాస్యత 20 శాతం పెరిగింది. మూడు అంతస్తుల పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం స్థానాలు ప్రత్యేకించడమే కాకుండా 20 శాతం బడుగు కులాలవారికీ, పది శాతం దళితులకూ కేటాయించడం ద్వారా గ్రామీణ వ్యవస్థపైన శతాబ్దాలుగా కొన సాగిన భూస్వాముల ఆధిపత్యాన్ని అంతం చేయడం నితీశ్‌కుమార్ సాధించిన అద్భుతమైన సామాజిక విప్లవం. పంచాయతీరాజ్ వ్యవస్థలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మహిళా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం విశేషం. అతి బడుగు వర్గాలకు చేయూతనివ్వడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంలో కూడా నితీశ్ కృతకృత్యుడైనారు. సామాజిక న్యాయం, సామా జికార్థిక అభివృద్ధి, ప్రాథమిక వనరుల కల్పన అనే మూడు అంశాలకు ప్రాధాన్యమిస్తూ సాగిన నితీశ్ అభివృద్ధి నమూనా సమాజంలో అంతరాలు తగ్గించడానికీ, బడుగువర్గాల అభ్యున్నతికీ దోహదం చేసింది. భూసంస్కరణలు అమలు చేయగలిగి ఉండే సామాజిక న్యాయ సాధన ఇంకా వేగవంతమై ఉండేది. భూసంస్కరణలను సూచించడం కోసం బందోపాధ్యాయ కమిటీని నియమించినప్పటికీ కమిటీ సూచనలను అమలు చేయడంలో నితీశ్ కుమార్ విఫలమైనారు. ఈసారి ఎన్నికలలో గెలిస్తే నితీశ్, లాలూ ప్రసాద్ నిర్మాణాత్మ కంగా పనిచేసి భూసంస్కరణలు అమలు చేసి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయగలిగితే బిహార్ సమాజంలో అంతరాలు మరింతగా తగ్గిపోతాయి. ఇంత కాలం దేశానికి ముడి ఖనిజం అందిస్తున్న బిహార్ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తే సంపద పెంచుకొని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన చేరుతుంది. పశ్చిమ బెంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష సంఘటనకు ప్రజలు అధి కారం ఇచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించడంలో విఫలమైనారు. బిహార్‌లో నితీశ్‌కుమార్ కొంత వరకైనా సాధించి చూపించారు. అందుకే, మూడో టరమ్ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం బిహార్ ప్రజలు నితీశ్‌కుమార్‌కి ఇచ్చినట్లయితే, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రశాం తంగా పని చేసుకునే వీలు లాలూప్రసాద్ కల్పించినట్లయితే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఫలితాలు సాధించేందుకు ఇంకొంత సమయం లభిస్తుంది. ఎన్డీఏ విజయం సాధిస్తే ఢిల్లీలో, గాంధీనగర్‌లో అమలు జరుగుతున్న మార్కెట్ నమూనానే బిహార్‌లోనూ అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. నితీశ్ ప్రయోగం ఆగిపోతుంది. అందుకు బిహార్ ఎన్నికలంటే కేవలం కులాల పోరాటం లేదా రాజకీయ నాయకుల ఆరాటం మాత్రమే కాదు. బిహారీ లేదా బాహరీ కాదు. రెండు అభివృద్ధి నమూనాల మధ్య పోటీ.