బిహార్ దిశానిర్దేశం | Who will win the Bihar assembly election 2015? | Sakshi
Sakshi News home page

బిహార్ దిశానిర్దేశం

Published Sun, Nov 1 2015 12:07 AM | Last Updated on Thu, Jul 18 2019 2:17 PM

బిహార్ దిశానిర్దేశం - Sakshi

బిహార్ దిశానిర్దేశం

త్రికాలమ్

 
బిహార్ దేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి. ఆ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశం అవుతున్నాయి? పద్దెనిమిది మాసాల కిందట లోక్‌సభ ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి అట్టహాసంగా హస్తినలో అధికారదండం చేతబట్టిన నరేంద్రమోదీ ఎందుకు బిహార్ ఎన్నికలపైన శక్తియుక్తులన్నిటినీ కేంద్రీకరిస్తున్నారు?


ప్రధానిగా నరేంద్రమోదీ వ్యవహరణ తీరును ఈ ఎన్నికల ఫలితాలు నిర్దేశించబోతున్నాయి. రాజ్యసభలో ఎన్‌డీఏకి మెజారిటీ ఎప్పుడు లభించేదీ సూచించబోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడుగా నితీశ్‌కుమార్ భవిష్య త్తును తేల్చబోతున్నాయి. పాతికేళ్ల కిందటే 'సామాజిక న్యాయం' నినాదాన్ని ఎన్నికలలో ప్రయోగించి చరిత్ర సృష్టించిన లాలూప్రసాద్ యాదవ్ పదేళ్ల అరణ్యవాసం తర్వాత బిహార్ రాజకీయాలలో తిరిగి ఒక శక్తిగా కోలుకుంటారో లేదో కూడా ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్‌గాంధీ కానీ పెద్దగా చర్చలో లేనట్టే లెక్క. ఇది రెండు కూటముల మధ్య పోరాటం. ప్రధానంగా ఇద్దరు నాయకుల మధ్య బ్యాలట్ యుద్ధం. ఒక వైపు ప్రధాని నరేంద్రమోదీ, రెండో వైపు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.


బీజేపీ, దాని మిత్రపక్షాలు (నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్- ఎన్‌డీఏ) గెలిస్తే లోక్‌సభ నాటి హవా కొనసాగినట్టూ, మోదీ కత్తికి ఎదురు లేనట్టూ ప్రజలు అర్థం చేసుకుంటారు. లాలూతో స్నేహం వల్ల నితీశ్ దెబ్బతిన్నాడని తీర్మానిస్తారు. జనతాదళ్-యూ, రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌లతో కూడిన మహా ఘట్‌బంధన్ విజయం సాధిస్తే 2019 నాటి లోక్‌సభ ఎన్నికలలో ప్రధాని నరేంద్రమోదీకి నితీశ్‌కుమార్ ఒక లౌకిక ప్రత్యామ్నాయంగా ఎదుగుతారు. విభిన్న మైన అభివృద్ధి నమూనాకు ప్రతినిధిగా నిలబడతారు. ఇద్దరి అభి వృద్ధి నమూనాలలో వ్యత్యాసం ఏమిటో పరిశీలిద్దాం.
మహాకూటమికే మొగ్గు?
ఇప్పటికి మూడు ఘట్టాల పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు ఘట్టాలు మిగిలి ఉన్నాయి. నాలుగో విడత పోలింగ్ ఈ రోజు. చివరి ఘట్టం నవంబర్ 5న. నవంబర్ 8 న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి. మొదటి రెండు దశల పోలింగ్ మహాకూటమికి అనుకూలంగా సాగినట్టూ, మూడో దశలో చెరిసగం ఆధిక్యం ఉన్నట్టూ రాజకీయ పరిశీలకుల అంచనా. చివరి రెండు దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో ముస్లింల జనాభా గణనీయం. మొత్తంమీద మహాకూటమి (మహా ఘట్‌బంధన్)కి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు. అంతా యాదవుల ఓట్లు కూర్మీ అభ్యర్థులకూ, కూర్మీల ఓట్లు యాదవ అభ్యర్థులకూ పడతాయా లేదా అన్నదానిపైన ఆధారపడి ఉంటుంది.

లోక్‌సభ ఎన్ని కలలో మొత్తం 40 స్థానాలకు 32 స్థానాలు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రాబల్యం అంతలోనే క్షీణించిందా? లోక్‌సభ ఎన్నికలలో బిహార్ ప్రజలు యూపీఏను శిక్షించాలనే లక్ష్యంతో బీజేపీకీ, దాని మిత్రపక్షాలకు ఓట్లు వేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు పట్నాలో ఎవరికి పట్టం కట్టాలనే విషయం తేల్చడానికి. ముఖ్యమంత్రిగా 2005 నుంచి ఇప్పటి వరకూ (మధ్యలో మాంఝీ హయాంను మినహాయిస్తే) నితీశ్‌కుమార్ చేసిన మంచి పనులను ప్రజలు మరచిపోలేదు. ముఖ్యంగా మహిళా సాధికారికత విషయంలో బిహార్ ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ విజయాలు సాధించింది. 2010 నాటి ఎన్నికల నుంచి మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఓటు హక్కు వినియోగిం చుకోవడం ఇందుకు నిదర్శనం. ఉన్నత కులంగా చలామణి అవుతున్న భూమిహార్ ప్రజలలో సైతం మగవారు బీజేపీని సమర్థిస్తుంటే ఆడవారు జనతా దళ్-యూని బలపర్చుతున్నారు.

మహా ఘట్‌బంధన్ తరఫున నితీశ్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రచారం చేస్తు న్నారు. ఎన్‌డీఏ అభ్యర్థుల పక్షాన మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , ఎందరో కేంద్రమంతులు, మిత్రపక్షాల నాయకులైన మాంఝీ, రాంవిలాస్ పాశ్వాన్, తదితరులు ఓటర్లను ప్రభావితులను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రధాని ర్యాలీలకే జనసమీకరణ భారీగా జరుగుతోంది. ఆయన ప్రసం గాలనే జాతీయ టెలివిజన్ చానళ్లు సంపూర్ణంగా ప్రసారం చేస్తున్నాయి.
 మోదీ ప్రచారం ప్రభావవంతంగా ఉంది. ముప్పయ్ అయిదేళ్ల కాంగ్రెస్ పాలనలో, పాతికేళ్ల లాలూ, నితీశ్ ఏలుబడితో బిహార్‌కి ఒరిగింది శూన్య మంటూ ఢంకా బజాయించి చెబుతున్నారు. నితీశ్‌తో పాటు తొమ్మిదేళ్లకు పైగా బీజేపీ అధికారం పంచుకున్న వైనాన్ని విస్మరిస్తున్నారు. బిహార్‌కి మేలు జరగనే లేదంటూ నొక్కి చెబుతున్నారు. ఇక లాలూపైన జంగిల్‌రాజ్ అంటూ ధ్వజ మెత్తారు. లాలూతో పొత్తుపెట్టుకోవడం నితీశ్ అవకాశవాద రాజకీయానికి నిదర్శనమంటూ ఎండగట్టారు. ఎన్నికల ప్రచారంలో మోదీ శైలి తెలిసిందే.


మోదీ-నితీశ్ వైరం
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీని నియమించినప్పుడు ఆ నిర్ణయాన్ని నితీశ్‌కుమార్ స్వాగతించి ఉంటే ఇప్పుడు ఎన్నికల పోరులో ఆయన ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామిగా, ఎన్‌డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. లాలూ, సోనియాల కూటమి పేలవంగా తేలిపోయేది. ఎన్నికల రంగం ఇంతటి రసవత్తరంగా ఉండేది కాదు. నరేంద్రమోదీ పట్ల వ్యక్తిగత, విధానపరమైన వ్యతిరేకత ఉన్న కారణంగానే ఎన్‌డీఏ నుంచి నితీశ్ వైదొలిగారు. లోక్‌సభ ఎన్నికలలో ఘోరపరాజయానికి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పు కొని తన స్థానంలో మాంఝీని కూర్చోబెట్టారు. ఏకులాగా వచ్చిన మాంఝీ మేకులాగా తయారై బీజేపీతో జతకట్టడంతో మాంఝీని తోసిరాజని ముఖ్య మంత్రిగా నితీశ్ తిరిగి బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది.


 మోదీ హయాంలో గుజరాత్ గణనీయంగా అభివృద్ధి చెందినట్టు చెప్పడం, దేశమంతా గుజరాత్ అభివృద్ధి నమూనాను అమలు చేయాలని ప్రచారం చేయడం రెండేళ్లుగా చూస్తున్నాం. నిజానికి మోదీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి పూర్వమే గుజరాత్ అభివృద్ధిపథంలో ఉన్నది. దాదాపు రెండు శతాబ్దాలుగా గుజరాతీయులలో వ్యాపారదక్షత పెరుగుతూ వచ్చింది. ధీరూ భాయ్ అంబానీ, గౌతమ్ అదానీ, కర్సన్‌భాయ్ పటేల్ వంటి దిగ్గజాలు మోదీ రావడానికి ముందే వ్యాపారరంగంలో తమ ముద్రను వేశారు. మాధవ్ సింగ్‌సోలంకీ ముఖ్యమంత్రిగా ఉండగా (1984) దేశంలో రూ.4,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించిన వంద జిల్లాల జాబితా తయారు చేస్తే అందులో పాతిక జిల్లాలు గుజరాత్ రాష్ట్రంలోనివే.

ఒక్క భారూచ్ జిల్లాలో పెట్టు బడులే జాబితాలోని తక్కిన అన్ని జిల్లాల పెట్టుబడులకంటే అధికం. అప్పుడు మోదీ ఎక్కడున్నారు? వాస్తవం ఏమిటంటే గుజరాత్‌లో చాలాకాలంగా సాగు తున్న అభివృద్ధి నమూనానే మోదీ కొనసాగించారు. బీజేపీ సర్కార్‌కు సుస్థిరత ప్రసాదించడం మూలంగా కొన్ని రంగాలలో అభివృద్ధి కొట్టవచ్చినట్టు కనిపిస్తు న్నది. మోదీ అభివృద్ధి నమూనా విపణి చోదకమైనది. కొన్ని రంగాలలో కొన్ని సంస్థలకే అభివృద్ధి ఫలాలు అందాయి. సామాజిక న్యాయం ఆశించినంత జరగ లేదు. దేశంలోని అతిసంపన్నవంతమైన రాష్ట్రాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ, అక్షరాస్యతలో, శిశుమరణాలలో, పేదరికంలో, ఇతర అభివృద్ధి సూచీలలో గుజరాత్ చాలా వెనుకబడి ఉన్నది.


 బిహార్ ఇందుకు భిన్నం. ‘బీమారూ’ రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ సరసన ఉండిన బిహార్ పదేళ్లలో గణనీయమైన అభి వృద్ధి సాధించింది. నితీశ్‌కుమార్ అనుసరించిన నమూనా ఫలితంగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను కొంతమేరకు పేదరికం నుంచి బయట పడవేయడం, తరతరాలుగా అణచివేతకు గురవుతూ వచ్చిన మహిళలకు అధికారం అప్పగించడం వంటి ప్రగతి సాధ్యమైంది. మానవ వికాసానికి అవసరమైన అభివృద్ధి అందుబాటులోకి వచ్చింది. 2001 నుంచి 2011 వరకూ అక్షరాస్యత 16.8 శాతం పెరిగింది. మహిళల అక్షరాస్యత 20 శాతం పెరిగింది. మూడు అంతస్తుల పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం స్థానాలు ప్రత్యేకించడమే కాకుండా 20 శాతం బడుగు కులాలవారికీ, పది శాతం దళితులకూ కేటాయించడం ద్వారా గ్రామీణ వ్యవస్థపైన శతాబ్దాలుగా కొన సాగిన భూస్వాముల ఆధిపత్యాన్ని అంతం చేయడం నితీశ్‌కుమార్ సాధించిన అద్భుతమైన సామాజిక విప్లవం. పంచాయతీరాజ్ వ్యవస్థలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మహిళా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం విశేషం. అతి బడుగు వర్గాలకు చేయూతనివ్వడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడంలో కూడా నితీశ్ కృతకృత్యుడైనారు.

సామాజిక న్యాయం, సామా జికార్థిక అభివృద్ధి, ప్రాథమిక వనరుల కల్పన అనే మూడు అంశాలకు ప్రాధాన్యమిస్తూ సాగిన నితీశ్ అభివృద్ధి నమూనా సమాజంలో అంతరాలు తగ్గించడానికీ, బడుగువర్గాల అభ్యున్నతికీ దోహదం చేసింది. భూసంస్కరణలు అమలు చేయగలిగి ఉండే సామాజిక న్యాయ సాధన ఇంకా వేగవంతమై ఉండేది. భూసంస్కరణలను సూచించడం కోసం బందోపాధ్యాయ కమిటీని నియమించినప్పటికీ కమిటీ సూచనలను అమలు చేయడంలో నితీశ్ కుమార్ విఫలమైనారు. ఈసారి ఎన్నికలలో గెలిస్తే నితీశ్, లాలూ ప్రసాద్ నిర్మాణాత్మ కంగా పనిచేసి భూసంస్కరణలు అమలు చేసి వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయగలిగితే బిహార్ సమాజంలో అంతరాలు మరింతగా తగ్గిపోతాయి. ఇంత కాలం దేశానికి ముడి ఖనిజం అందిస్తున్న బిహార్ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహిస్తే సంపద పెంచుకొని అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన చేరుతుంది. పశ్చిమ బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష సంఘటనకు ప్రజలు అధి కారం ఇచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను రూపొందించడంలో విఫలమైనారు.

బిహార్‌లో నితీశ్‌కుమార్ కొంత వరకైనా సాధించి చూపించారు. అందుకే, మూడో టరమ్ ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం బిహార్ ప్రజలు నితీశ్‌కుమార్‌కి ఇచ్చినట్లయితే, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రశాం తంగా పని చేసుకునే వీలు లాలూప్రసాద్ కల్పించినట్లయితే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా ఫలితాలు సాధించేందుకు ఇంకొంత సమయం లభిస్తుంది. ఎన్‌డీఏ విజయం సాధిస్తే ఢిల్లీలో, గాంధీనగర్‌లో అమలు జరుగుతున్న మార్కెట్ నమూనానే బిహార్‌లోనూ అమలు చేసే ప్రయత్నం జరుగుతుంది. నితీశ్ ప్రయోగం ఆగిపోతుంది. అందుకు బిహార్ ఎన్నికలంటే కేవలం కులాల పోరాటం లేదా రాజకీయ నాయకుల ఆరాటం మాత్రమే కాదు. బిహారీ లేదా బాహరీ కాదు. రెండు అభివృద్ధి నమూనాల మధ్య పోటీ.

http://img.sakshi.net/images/cms/2015-03/41427572503_160x120.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement