
సాక్షి, అమరావతి: చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, ది ప్రింట్ ఎడిటర్ చీఫ్ పద్మభూషణ్ శేఖర్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కారం చేశారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, శేఖర్‌గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్‌సీపీ నేతలు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: సీఎం వైఎస్ జగన్
ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 3648 కి,మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్‌సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు..
పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను, వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్‌తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తన నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవంలో పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందిచడం గొప్ప విషయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment