విజయ సంకల్పం స్థూప శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఓ వైపు 16వ నంబర్ జాతీయ రహదారి.. మరోవైపు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా నిలిచిన విజయ సంకల్ప స్థూపం. జన జాతర.. గాల్లోకి ఎగసిన బెలూన్లు.. బాణసంచా పేలుళ్లు.. జై జగన్.. జై జై జగన్.. కాబోయే సీఎం అంటూ మిన్నంటిన నినాదాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రజల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య విజయ సంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు. 2017, నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. వేలాది మందితో పాదయాత్రగా వచ్చిన జగన్ స్థూపం ప్రాంగణంలోకి వెళ్లి ఆసాంతం పరిశీలించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడున్న పార్టీ సీనియర్ నేతలు, ఇతర ప్రముఖులను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు విజయ సంకల్ప స్థూపం నమూనాను అందజేశారు. మూడు అంతస్తులతో నిర్మించిన ఈ స్థూపం చరిత్రాత్మకమైనదిగా నిలిచిపోతుందని పార్టీ నేతలు వివరించారు.
జనం గుండె చప్పుళ్లకు ప్రతీక..
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఆత్మ విశ్వాసానికి, విజయ సంకల్పానికి సూచికగా 91 అడుగుల ఎత్తులో ఈ స్థూపాన్ని నిర్మించారు. లక్షలాది ప్రజల గుండె చప్పుళ్లకు ఇది చిహ్నంలా నిలిచింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు తమ పాదయాత్రల ముగింపు సందర్భంగా స్థూపాలు నిర్మితమైన ఏకైక ప్రాంతంగా ఇచ్ఛాపురం నిలిచింది. వైఎస్సార్, ఆయన కుమార్తె షర్మిల పాదయాత్ర ముగింపులకు కూడా ఇచ్ఛాపురమే వేదికైంది. ఈ సందర్భంగా స్థూపాలు నిర్మించారు.
జాతరను తలపించిన స్థూప ప్రాంగణం
ఈ స్థూపం ప్రాంతమంతా జన జాతరను తలపించింది. అక్కడికి చేరుకున్న జనమంతా ఆ స్థూపాన్ని ఆసక్తిగా తిలకించారు. ఫొటోలు దిగారు. జగన్ వచ్చి ఆవిష్కరించేంత వరకు అదరూ స్థూపం గురించే చర్చించుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించాక వేలాది మంది జనం మధ్య వైఎస్ జగన్ బహుదా నది మీదుగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఇచ్ఛాపురం పట్టణంలోకి ప్రవేశించారు.
కృష్ణా జిల్లా ప్రజలు నాతో ఓ మాటన్నారు. మా అల్లుడుగారు (చంద్రబాబు) ఇక్కడికి ఇల్లరికం వచ్చారన్నా. ఎన్టీఆర్ ఇల్లునే కాదు.. పార్టీనే కాదు.. చివరకు రాష్ట్రాన్నే దోచుకుతిన్నారని చెబుతున్నారు. ఇలాంటి మోసాలు చేసే, అబద్ధాలు చెప్పే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే.. తానేమీ చెయ్యకపోయినా అన్నీ చేసినట్టు బుకాయిస్తాడు. అన్నీ ఇచ్చానని, ప్రజలు కేరింతలు కొడుతున్నారని ఎల్లో మీడియాలో రాయిస్తాడు.
– ఉయ్యూరు సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
చంద్రబాబు మాత్రం ఆయన, ఆయన బినామీలతో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి, రైతుల్ని మోసగిస్తూ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ రహస్యాలు కాపాడతానని, అవినీతికి తావు లేకుండా చేస్తాం అని ప్రమాణం చేసిన ఈ పెద్దమనిషి.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన బినామీలకు చెప్పి దగ్గరుండి ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసినందుకు, రైతుల్ని మోసం చేసినందుకు బొక్కలో వేయాల్సిన పని లేదా?
– విజయవాడ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ప్రతి సభలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రసంగం ఉత్తేజభరితంగా సాగింది. మాటలు తూటాల్లా పేలాయి. వాటిలో మచ్చుకు కొన్ని...
‘జన్మభూమి కమిటీలుండవు, ఎవరికీ ఒక్క రూపాయి లంచమిచ్చే పరిస్థితి ఉండదు. అప్పులను చూసి ఎవరూ భయపడొద్దు. ఎన్నికల నాటికి మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో.. ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల చేతికే అందేలా చేస్తానని హామీ ఇస్తున్నా.’
‘చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మళ్లీ ఇపుడు నాలుగేళ్లుగా ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. దీంతో మద్య నిషేధం గోవిందా.. అందాక ఉన్న 2 రూపాయలకు కిలో బియ్యం సబ్సిడీ గోవిందా.. అందాక ధైర్యంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా గోవిందా.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గోవిందా.. వ్యవసాయం గోవిందా.. వర్షాలు గోవిందా.. ఇళ్ల నిర్మాణం గోవిందా.. పెన్షన్లన్నీ గోవిందా.. అన్నీ గోవిందానే..’
రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలతో రేషన్ షాపుల స్థానంలో బడా మాల్స్ పెట్టిస్తారట. వీటిల్లో ప్రజలకు సరుకులు 20 శాతం తక్కువ ధరకు లభిస్తాయని చెబుతున్నారు. ఇంతకు ముందు రేషన్ షాపుల్లో 20 శాతం కాదయ్యా.. 60 శాతం తక్కువ ధరకు దొరికేవయ్యా.. చంద్రబాబు గారూ..
– ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
చంద్రబాబూ.. నేను సూటిగా అడుగుతున్నా.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చింది నువ్వు కాదా? నీ బావమరిది బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తున్నాడు. ఆ షూటింగ్ సెట్స్‌లో వెంకయ్యనాయుడు కన్పించడం లేదా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు అడ్డగోలుగా నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన నువ్వు.. బీజేపీతో కక్కుర్తి పడ్డావు కాబట్టే ఇవాల్టి వరకూ అరెస్టు కాకుండా తిరగగలుగుతున్నావనేది నిజం కాదా?
రాష్ట్రంలో చంద్రబాబు, ఈయన కొడుకు చెయ్యని అవినీతి లేదు. ఇసుక నుంచి మొదలు పెడితే మట్టిదాకా.. బొగ్గు, కరెంట్ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ అసైన్డ్ భూములు.. చివరకు గుడి భూములు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి వాస్తవం కాదా? ఈ నాలుగేళ్ల కాలంలో అక్షరాల నాలుగు లక్షల కోట్ల రూపాయలు సంపాదించావ్. అయినా నీ మీద సీబీఐ విచారణ జరగకుండా కాలం వెళ్లబుచ్చుతున్నావంటే నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే కదా చంద్రబాబూ?
సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టులో మీకు నచ్చిన కాంట్రాక్టర్లను బినామీలుగా తీసుకొచ్చి, నామినేషన్ పద్ధతిలో మీ ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచి అక్షరాల రూ.1,853 కోట్లు లూటీ చేశారని కాగ్ నివేదిక చెప్పినా, నీ మీద సీబీఐ విచారణ జరగడం లేదంటే.. నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నట్లే కదా చంద్రబాబూ?
నువ్వీమధ్య నీతి ఆయోగ్ సమావేశం జరిగినప్పుడు ఢిల్లీకెళ్లావు. అక్కడ మోదీ కన్పిస్తే నువ్వు చేసిందేంటి? ఆయనకు వంగి వంగి నమస్కారం పెట్టడం నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మా మిత్రుడని నిండు లోక్‌సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనడం నిజం కాదా?
– విజయనగరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
2014 ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు వేసినట్లే అని చంద్రబాబు అన్నాడు. బీజేపీతో జత కట్టాడు. ఇప్పుడు జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటాడు. కాంగ్రెస్‌తో జత కడతాడు. ఆయనకు మంచిదన్నది ఈనాడుకు మంచిదవుతుంది.. అదే రాస్తుంది. టీవీలలో చూపిస్తారు. ఈయన తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటుంది.
– సబ్బవరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
చెరువులను బాగు పరచాలంటే మూడడుగులు తవ్వితే ఫర్వాలేదు.. సిల్ట్ తీస్తున్నారులే అనుకోవచ్చు. కానీ పూడిక తీత అని నామకరణం చేసి, దానికి నీరు–చెట్టు అని పేరుపెట్టి ఏకంగా 50 అడుగుల వరకూ తవ్వేస్తే నీళ్లందక రైతులు అగచాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రే దగ్గరుండి ఇలా దోచుకోవడం సబబేనా?
– గన్నవరం సభలో వైఎస్ జగన్
ఇక్కడి ఇసుక విశాఖ వెళ్తోందని, లారీ రూ.30 వేలకు అమ్మకుంటున్నారని ప్రజలు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నాడు. మీకు ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? ఎవరికిస్తున్నారో తెలుసా? చంద్రబాబు బినామీలకు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు. అవి చినబాబు దగ్గరకు పోతున్నాయి. అక్కడి నుంచి పెదబాబు దగ్గరకెళ్తున్నాయి. వ్యవస్థ ఇంతగా దిగజారింది.
ఇవాళ ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. జేఎన్‌టీయూ లెక్చరర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది. ఏఎన్‌ఎమ్‌లు, సెకెండ్ ఏఎన్‌ఎమ్‌లు, విద్యుత్ రంగంలోని కార్మికులు, మోడల్స్ స్కూళ్ల సిబ్బంది, ఆదర్శ రైతులు, గోపాలమిత్రలు, ఆయుష్ ఉద్యోగులు, వీఏవోలు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, అంగన్‌వాడీలు.. ఇలా అందరిలోనూ అభద్రత నెలకొంది. ఆసుపత్రులసర్వీసులనూ ప్రైవేటుపరం చేస్తున్నారు.
ప్రత్యేక హోదా ఉంటేనే అంతో ఇంతో ఉద్యోగాలొస్తాయి. దాన్ని చంద్రబాబు దగ్గరుండి నీరుగార్చాడు. వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లెక్క తెల్చారు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా? డీఎస్సీ పరీక్షలు పెట్టడు. కానీ ఆ డీఎస్సీ పరీక్షల కోసం పిల్లలు ప్రిపేర్ కావడానికి టెట్–1, టెట్–2, టెట్–3 అంటాడు.
ఈ పెద్దమనిషి వ్యవసాయం దండగన్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలారేసుకోవాలన్నాడు. ప్రాజెక్టులు కడితే ఖర్చు తప్ప రాబడి ఉండదన్నదీ ఈయనే. సబ్సిడీలు పులిమీద సవారీలాంటివని ఆయన అనడమే కాకుండా..ఏకంగా తన పుస్తకంలో రాసుకున్నాడు.రైతుకు సంబంధించిన అవార్డు ఇలాంటి వ్యక్తికివ్వడం ఆ అవార్డును అవహేళన చేసినట్టు కాదా?
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో వచ్చేదేంటో తెలుసా? కరవు. అందుకే ఆయనకు ఉత్తమ కరవు రత్నఅనే అవార్డు ఇవ్వొచ్చు. కరవొచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలి. కానీ ఈయన మాత్రం ఆదుకోకుండా వెనకడుగు వేస్తాడు. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు. అందుకే ఈయనకు కలియుగ కుంభకర్ణ అనే అవార్డుకచ్చితంగా ఇవ్వొచ్చు. ఆయన సీఎం అవుతూనే సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలను దగ్గరుండి మూసేయిస్తాడు. అందుకే ఉత్తమ సహకార రంగ ద్రోహి అనేఅవార్డు కూడా ఇవ్వొచ్చని సిఫార్సు చేస్తున్నా.
– గజపతినగరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment