ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మకమైన రీతిలో సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి చరిత్ర సష్టించిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇచ్ఛాపురం వేదికగా ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాన ఉవ్వెత్తున ఎగసి పడిన జనసంద్రం సాక్షిగా భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఊపును, ఉత్సాహాన్ని నింపింది. సుమారు రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగిన ఆయన ప్రసంగం బాగా ఆకట్టుకుంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో జిత్తుల మారి, మాయావి అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాతో జరిగేది ఇక యుద్ధమేనని ప్రకటించి దిశానిర్దేశనం చేశారు.
తన పాదయాత్ర ముగిసిందని, అయితే నారాసురుడితో ఇకపై అలుపెరుగని రీతిలో పోరాటం చేయబోతున్నామని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. జగన్ తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసం తొణికిస లాడింది. ప్రజలు తనకు తోడుగా నిలిస్తే ప్రభుత్వం మోసాలు, అన్యాయాలపై విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేసి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. జగన్ పాదయాత్ర ముగింపు ఓ మరపురాని ఘట్టం కనుక 13 జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు. స్తూపం వద్దకు చేరుకున్నపుడే కార్యకర్తల్లో విజయ సంకల్ప స్థూపం వద్ద ఉత్తేజభరిత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జగన్ చేసిన ప్రసంగం వారిలో ఇంకా పోరాట పటిమను రేకెత్తించింది.
జగన్ అనుకున్నది సాధిస్తాడు
పేద ప్రజల పట్ల జగన్‌కు ఆవేదన ఉందనే విషయం ఆది నుంచీ తెలిసిందేనని, అలుపెరుగకుండా సుమారు దశాబ్ద కాలంగా ఆయన చేసిన పోరాటం వృథాగా పోదని, అనుకున్నది సాధించేదాకా ఆయన నిద్రపోడని తాను విశ్వసిస్తున్నానని వైఎస్సార్ హయాం నుంచీ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న పార్టీ సీఈసీ సభ్యుడు అందారపు సూరిబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వి.గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమరం హోరా హోరీగా ఉండబోతోందని జగన్ తన ప్రసంగం ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారని, దానిని అందిపుచ్చుకుని వీరోచితంగా పోరాడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment