ఆఖరిరోజూ అదే ఆప్యాయత | YS Jagan Says Thanks to the people about Prajasankalpayatra Success | Sakshi
Sakshi News home page

ఆఖరిరోజూ అదే ఆప్యాయత

Published Thu, Jan 10 2019 3:40 AM | Last Updated on Thu, Jan 10 2019 3:40 AM

YS Jagan Says Thanks to the people about Prajasankalpayatra Success - Sakshi

విజయ సంకల్పం స్థూపం వద్ద అశేష జనసందోహానికి అభివాదం చేస్తున్న ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌

(ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తూరుపు దిక్కున మబ్బులు ఎర్రబారుతున్నాయి.. అప్పుడప్పుడే మంచు తెరలు విచ్చుకుంటున్నాయి.. చలిపులి నెమ్మదిగా నిష్క్రమిస్తోంది.. సూర్య కిరణాలు ఎగబాకుతున్నాయి.. అప్పటికే దూర ప్రాంతాల నుంచి జనం రాక మొదలైంది.. చురుక్కుమంటున్న వేడిమితో పాటే జన సందోహం అంతకంతకూ పెరుగుతోంది.. పోలీసులు సమాయత్తమవుతున్నారు.. భద్రతా సిబ్బంది బారులు తీరుతున్నారు.. కాన్వాయి సిద్ధమవుతోంది.. జనం కేరింతలు కొడుతున్నారు.. ఎటుచూసినా కిక్కిరిసిన వాహనాలే.. యువతీ యువకుల కోలాహలం.. జై జగన్‌ జైజై జగన్‌ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శిబిరం వద్ద బుధవారం ఉ.8 గంటల ప్రాంతంలోని దృశ్యమిదీ. తెల్లవారుజాము నుంచే వచ్చీపోయే వాహనాలతో రద్దీగా ఏర్పడిన ఆ ప్రాంతం నుంచే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో చిట్టచివరిరోజు పాదయాత్రను ప్రారంభించనుండడమే ఆ ప్రాంతంలో ఇంత సందడికి ప్రధాన కారణం. ఆఖరి ఘట్టంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అసంఖ్యాకంగా తరలివచ్చిన అశేష జనసందోహం మధ్య ఉదయం సరిగ్గా 8.22 గంటల ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ తన శిబిరం నుంచి బయటకు వచ్చారు. 

అదే స్ఫూర్తి, అదే ఆహార్యం..
తెల్లచొక్కా, క్రీమ్‌ కలర్‌ పాంటుతో కాళ్లకు బూట్లు ధరించి ముకుళిత హస్తాలతో బయటకు వచ్చిన జగన్‌కు అప్పటికే గుమికూడిన నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలతో ఎదురేగి అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 2017 నవంబరు 6వ తేదీన వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ఏ స్ఫూర్తితోనైతే ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారో సరిగ్గా 341 రోజుల తర్వాత కూడా అదే స్ఫూర్తి, అదే పట్టుదల ఉట్టిపడింది. ప్రసన్న వదనం, చిరునవ్వు, తొణికిసలాడిన ఆత్మవిశ్వాసంతో అందరికీ అభివాదం చేస్తూ ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో తుది ఘట్టాన్ని ముగించారు. మొత్తం 13 జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్ప యాత్ర సాగింది. పట్టుదల,  విలువలు, విశ్వసనీయత, భరోసా వారసత్వంగా పుణికిపుచ్చుకున్న వైఎస్‌ జగన్‌ వజ్ర సంకల్పానికి ఇచ్ఛాపురం సాక్షిభూతంగా నిలిచింది.

విసుగూ, విరామం ఎరుగక..
విసుగూ, విరామం లేకుండా అందర్నీ అప్యాయతతో పలకరిస్తూ ఆయన తన యాత్రను కొనసాగించడం విశేషం. మధ్యమధ్యలో పార్టీ ప్రముఖులను, ప్రజా ప్రతినిధులను, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన బాధ్యులను, కార్యకర్తలను చిరునవ్వుతో ముచ్చటిస్తూనే తనను కలిసేందుకు వచ్చిన అక్కచెల్లెమ్మలను ఆప్యాయతతో పలకరిస్తూ ముందుకు సాగారు. నడిచింది తానే అయినా నడిపించింది మీరేనని ఆయన ప్రజలకు చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. జగన్‌ పలకరింపుతో పులకరించిన ప్రజలు తమ ఊళ్లకు ముందుగానే సంక్రాంతి వచ్చిందంటూ సంబరపడ్డారు.

భోజనాలు చేశారా?
మధ్యాహ్నం విశ్రాంతి శిబిరం వద్ద తనను కలిసేందుకు వచ్చిన జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ మీడియా ప్రతినిధులను ఆత్మీయతతో పేరుపేరునా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. భోజనాలు చేశారా? అని ఆరా తీశారు. ప్రజలు తన కోసం వేచి ఉన్నందున నడుస్తూ దారి మధ్యలోనే మాట్లాడుకుందామంటూ వారితో మాటామంతి కలిపారు. జనం తాకిడి ఎక్కువగా ఉన్నా తాను ఏమి చెప్పదలచుకున్నారో దాన్ని సూటిగా చెప్పారు. భవిష్యత్‌ కార్యాచరణ గురించి మీడియా పదేపదే అడిగినా జనమే నా ఊపిరి, ప్రజలే నా నమ్మకం, విశ్వాసం అని విస్పష్టంగా చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయబోనన్నారు. ప్రజల పదఘట్టనలతో ఓ పక్క దుమ్మూ, ధూళి ఎగిసిపడుతున్నా, మరోపక్క జనం తనను కలిసేందుకు బారులు తీరి ఉన్నా ఎవరినీ నిరాశపరచలేదు. జగన్‌ యుగపురుషుడని, తమ ఆత్మబంధువని కొందరు చేసిన ప్రశంసలకు సైతం ఆయన చిరునవ్వు, నమస్కారమే సమాధానమైంది. నిద్ర లేచింది మొదలు నడుం వాల్చే వరకు ప్రజలే శ్వాస, ధ్యాసగా ఆయన తన ప్రజాసంకల్ప యాత్రను ముగించారు.

చరిత్ర పునరావృతమైంది..
అంతకుముందు.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం పట్టణ సమీపంలోని బహుదా నది వంతెనను దాటినప్పుడు వచ్చిన ప్రజల్ని చూసి చాలామంది చరిత్ర పునరావృతమైందంటూ బెజవాడలో కనకదుర్గమ్మ వారథి ఊగిపోయిన తీరును గుర్తుచేసుకున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఇలా అక్కడకు ఏ డిపో నుంచి వచ్చే బస్సు అయినా కిటకిటలాడుతూ కనిపించింది. బస్సుల్లోని ప్రయాణీకులు చేతులు ఊపుతూ జగన్‌కు అభినందలు తెలిపితే దానికి ప్రతిగా జగన్‌ రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాల మీద వచ్చిన వాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. ఆఖరి ఘట్టం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో స్పష్టంగా కనిపించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె, జగన్‌ సోదరి షర్మిలమ్మ కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. 

అక్కున చేర్చుకున్న ఇచ్ఛాపురం..
పాదయాత్రతో పట్టణంలోకి అడుగిడిన జగన్‌ను ఇచ్ఛాపురం అక్కున చేర్చుకుంది. ఆయన్ను చూసేందుకు ఆబాలగోపాలం పెద్దఎత్తున ఉత్సుకత చూపారు. మేడలు, మిద్దెలు జనసంద్రంతో నిండిపోయాయి. అడుగో జగన్, అడుగడుగో జగన్‌ అంటూ కేరింతలు కొడుతూ జేజేలు పలికారు. అవ్వా తాతలైతే.. అమ్మ బిడ్డడు ఎట్టయిపోయిండో చూడు అంటూ దూరం నుంచే ఆశీర్వదించారు. చివరి రోజు యాత్ర అంతా ఆయన హావభావాలు, ఆహార్యం, నిరాడంబరత్వం గురించే చర్చ జరిగింది. ఇంత దూరం నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రజలు ముచ్చటించుకోవడం కనిపించింది.  

ఆరోగ్యం ఎలా ఉంది బాబూ..
ఉదయం ఇచ్ఛాఫురం నియోజకవర్గంలోని అగ్రహాం వద్ద పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం బహిరంగ సభ జరిగేంత వరకూ అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. కొజ్జిరియా గ్రామం చేరే సమయానికే వేలాది మంది ఆయనతో కలిసి అడుగులో అడుగేశారు. కొజ్జిరియా కూడలి ప్రజా సమూహంతో కిటకిటలాడింది. పాత కొజ్జిరియా, ఎ.బలరాంపురం, అయ్యవారిపేట మీదుగా లొద్దపుట్టి వద్ద మధ్యాహ్నం విశ్రాంతి సమయానికి ఆ ప్రాంతమంతా జనప్రభంజనమైంది. ఆయనతో కలిసి నడిచిన వారు కొందరైతే.. సెల్ఫీలు దిగిన వారు మరికొందరు. యాత్ర పొడవునా జగన్‌ను కలిసేందుకు పెద్దఎత్తున మహిళలు తరలిరావడం విశేషం. ఆయన్ను కలిసిన ప్రతి మహిళా జగన్‌ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. నువ్వు చల్లంగా ఉండాలయ్యా అంటూ ఆశీర్వదించారు. యాత్ర ముగింపు రోజు సైతం ఆయనకు వినతులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు సాగిన యాత్రలోలాగే తనకు అందిన ఫిర్యాదులను, వినతులను వినమ్రంగా స్వీకరించారు. అక్కడికక్కడ పరిష్కరించదగిన వాటిని అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని పరిశీలించి ఏమి చేయవచ్చో సూచించమని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement