సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆనవాయితీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన నాయకులు అధికారం చేపట్టడం అనే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. తన తండ్రి బాటలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాజాగా అధికారం చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. కాలినడన అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. టీడీపీ సర్కారు మోసాలను, వైఫల్యాలను సాధికారికంగా ప్రజలకు వివరించి చెప్పారు. ఎల్లో మీడియా, పచ్చ నాయకుల కుట్రలను దీటుగా ఎదుర్కొని తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్ విజేతగా నిలిచారు. తండ్రి తగ్గ వారసుడు అనిపించుకున్నారు.
2003లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2012, అక్టోబర్ 2న ‘వస్తున్నా ... మీ కోసం’ అంటూ పాదయాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో వైఎస్ జగన్ సీఎం కాబోతున్నారు. దీంతో పాదయాత్ర చేసిన ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినట్టైంది.
Comments
Please login to add a commentAdd a comment