‘వాట్ ఈజ్ హేపనింగ్?’ (ఏమి జరుగుతోంది?). ‘వేర్ వియ్ ఆర్ (‘ఆర్ వియ్’ కాదు) గోయింగ్? (ఎక్కడికి పోతున్నాం?). ఈ రెండు ఇంగ్లీషు వాక్యాలు ఇటీవల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబునాయుడి నోట తరచుగా వెలువడుతున్నాయి? ఈ మాటలనే ఒకప్పుడు చిరునవ్వుతో, మరొ కప్పుడు ఆగ్రహంతో అంటూ విలేఖరులతో చంద్రబాబు ఆడుకోవడం గమనించినవారికి ఆయన ఆవేదన ఎందుకో ఒక పట్టాన అర్థం కాదు. ‘దేశాన్ని రక్షిం చుకోవాలి’, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’ అనే రెండు నినాదాలతో దేశ వ్యాపితంగా ఉద్యమం నిర్మించాలని ఆయన కంకణబద్ధుడై ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిష్వంగంలో నిలిచారు. కాంగ్రెస్‌తో కలసి పోరా డటం చారిత్రక అవసరమనీ, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం అనివార్యమైన విధానమనీ ఉద్బోధించారు. రాహుల్ ఏకీభవించారు. ‘మాకిద్దరికీ గతం ఉన్నది. గతం గతః. వర్తమానంకోసం, భవిష్యత్తుకోసం భుజం కలిపి పని చేయాలని నిర్ణయించుకున్నాం’ అంటూ రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ఎత్తుగడగా కాంగ్రెస్‌ను తల్లిపార్టీ, వైఎస్‌ఆర్‌సీపీని పిల్లపార్టీ అంటూ అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు ఇంత పని చేస్తారని ఆయన పార్టీలోని సీనియర్ నాయకులు సైతం ఊహించలేదు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానంటూ ప్రతిజ్ఞ చేసిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, అంతకంటే పెద్ద నేరం మరొకటి ఉండదంటూ వ్యాఖ్యానించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు మౌనాన్ని ఆశ్రయించారు. మాటకోసం, సిద్ధాంతంకోసం పదవిని త్యజించేంత గొప్ప నాయకుల తరం ఇప్పుడు లేదు.
పరస్పరం మూడున్నర దశాబ్దాలపాటు క్షేత్రంలో, న్యాయస్థానాలలో, చట్ట సభలలో వ్యతిరేకించుకుంటూ, కలహించుకుంటూ, ఘర్షణపడుతూ వచ్చిన వివిధ స్థాయిలలోని ఉభయ పార్టీల నాయకులు అధినేతలు అవకాశవాద రాజ కీయాల కోసం నిర్ణయించారు కనుక పాత కక్షలూకార్పణ్యాలూ విస్మరించి కలసిమెలసి జీవించడం అసాధ్యం. ఆర్‌ఎస్‌ఎస్‌తో కలసి పని చేయాలని మావో యిస్టులు ప్రయత్నించడం, కాంగ్రెస్, బీజేపీలు కలసి ఒక కూటమి నిర్మించడం, బజరంగ్‌దళ్, ముస్లింబ్రదర్‌హుడ్ కలసి ఒకే వేదికపైన సంయుక్త కార్యాచరణ ప్రకటించడం ఎంత కృతకంగా ఉంటుందో కాంగ్రెస్, టీడీపీల పొత్తు సైతం అంతే అసహజంగా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ నుంచి రాజీనామా ప్రకటిం చారు. ఆ పార్టీలోని చాలామంది నాయకులు రాహుల్ నిర్ణయాన్ని మింగలేకా, కక్కలేక సతమతం అవుతున్నారు. తెలంగాణలో లేనిపోని ప్రయోజనం ఆశించి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా అయిదో స్థానంలోకి శాశ్వతంగా దిగజారడం ఎందుకో ఆలోచించాలి.
నైతికతకు పాతరేనా?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు చక్రం తిప్పుతానంటే కామోసు అనుకుంటున్నారు రాహుల్. తనను ‘పప్పు’గా, ప్రధాని పదవికి తగని అర్భకుడిగా, తన తల్లి సోనియా గాంధీని దేశానికి పట్టిన శనిగా, దేశాన్ని నాశనం చేస్తున్న గాడ్సేగా, ఇటాలియన్ మాఫియాగా వందలసార్లు అభివర్ణించిన వ్యక్తితో కరచాలనం చేయడం కపట రాజకీయానికి పరాకాష్ట. అవకాశవాద రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు వంటి నేతలకు అధికార రాజకీయం (పవర్ పొలిటిక్స్) మినహా తక్కిన మర్యా దలు ఏమీ పట్టవు. సోనియాను నాలుగేళ్ళపాటు అనునిత్యం దూషించిన చంద్ర బాబుతో రాహుల్ స్నేహం చేయడం నిస్సందేహంగా అనైతికం. ఏ పార్టీని భూస్థాపితం చేయడానికి టీడీపీని ఎన్‌టి రామారావు (ఎన్టీఆర్) స్థాపించారో ఆ పార్టీతో చేతులు కలపడం చంద్రబాబు చేసిన ద్రోహమంటూ ఎన్టీఆర్ సతి లక్ష్మీ పార్వతి ఒక లేఖ రాసి భర్త సమాధిపైన ఉంచారు. కాంగ్రెస్‌తో మైత్రిని చంద్రబాబు పొడిచిన రెండో వెన్నుపోటుగా ఎన్టీఆర్ అభిమానులు అభివర్ణిస్తే ఎట్లా అభ్యంతరం చెప్పగలం? ఏ ‘దేశం’ రక్షణకోసం చంద్రబాబు ఈ విన్యా సాలు చేస్తున్నారు? భారతదేశమా? తెలుగుదేశమా? ఈ అసాధారణ కలయికను నైతికంగా సమర్థించుకోవడం అటు రాహుల్‌కి కానీ ఇటు చంద్రబాబుకి కానీ సాధ్యం కాదు.
ఎవరికి ప్రయోజనం?
రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించినప్పటికీ ఈ కాంగ్రెస్–టీడీపీ బంధం భాగస్వాములకు ఎట్లా లాభిస్తుంది? తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ను గద్దె దింపడం, బీజేపీ నేత నరేంద్ర మోదీని ప్రధాని పదవి నుంచి తొలగించడం చారిత్రక అవసరమని చెబుతూ ఈ పని చేయడానికి తాను సమర్థుడని భావించి తనను తాను సమన్వయకర్తగా (ఫెసిలిటేటర్) నియమించుకున్న తెంపరితనం చంద్రబాబుది. వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ప్రతిపక్ష నాయ కుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్లా, ఆయన నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ పట్లా జనాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2014లో టీడీపీ విజయానికి దోహదం చేసిన నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌లు మాజీ మిత్రులుగా మారి పోయారు. చంద్రబాబు ఒంటరిగా ఎన్నడూ ఎన్నికలలో గెలిచింది లేదు. తోడు అత్యవసరం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వినా మరో పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేదు. తెలంగాణలో జవసత్వాలు కోల్పోయిన టీడీపీకి జీవం పోయాలన్న ఆలోచన టీఆర్‌ఎస్‌కు లేదు. టీఆర్‌ఎస్‌ని కూల్చడానికి తన శక్తి చాలదనీ, ఎవరు ముందుకు వస్తే వారి సహకారం స్వీకరించాలని కాంగ్రెస్ అర్రులు చాస్తోంది. ఆ పార్టీ అధినేతకు టీడీపీతో స్నేహం చేయడానికి నైతిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. టీడీపీకి సిద్ధాంతపరమైన అభ్యంతరాలు ఎప్పుడూ లేవు. టీడీపీ అధినేతకు తెలిసిన సిద్ధాంతం ఒక్కటే–అధికారం హస్త గతం చేసుకోవడం, నిలబెట్టుకోవడం, అన్ని విధాలా దానిని వినియోగిం చుకోవడం, అందుకోసం ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు అది చేయడం.
టీడీపీతో అవగాహన కారణంగా కాంగ్రెస్‌కూడా నష్టబోతుంది. టీడీపీ పొడ గిట్టని కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పని చేయవు. కాంగ్రెస్‌కు ప్రతి ఎన్ని కలోనూ ఓటు చేసేవారు సైతం టీడీపీ పొత్తు కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ సారి ఓటు చేయకపోవచ్చు. టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్ అభిమానుల ఓటు చేయడం, కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ మద్దతుదారులు ఓటు వేయడం దాదాపు అసాధ్యం. చంద్రబాబుకి జాతీయ స్థాయిలో నిర్వాహకుడి పాత్ర పోషించాలన్న ఉబలాటం ఉన్నది కాబట్టి ఆర్థికంగా కాంగ్రెస్‌కు సహాయం చేయవచ్చు. కానీ ఓట్లు బదిలీ కావు. తెలంగాణలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలలో అత్యధికం టీఆర్‌ఎస్‌కి అప్పనంగా అప్పగించినట్టే అవుతుంది. నవంబర్ 9న అభ్యర్థుల జాబితాను ప్రకటించాక కాంగ్రెస్‌లో పెనుతుఫాను సంభవిస్తుంది. అసమ్మతివాదులను ఓదార్చడం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ వల్ల కాదు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటా నన్నప్పుడే ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) కూటమికి దూరంగా ఉండవలసింది. రాజకీయాలలో అధికార పార్టీని ఓడించడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. అమరుల ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పం కాంగ్రెస్, టీడీపీల ఆధ్వర్యంలో ఎట్లా నెరవేరుతుందో ఆలోచించాలి. అవసరమైతే ఈ ఎన్నికలకు దూరంగా ఉండవచ్చు లేదా ఒంటరిగా సాధ్య మైనన్ని స్థానాలకు పోటీ చేయవచ్చు. టీడీపీతో కలసి పని చేయడాన్ని కోదండరామ్‌ను అభిమానించే తెలంగాణవాదులు జీర్ణించుకోలేరు. ఇందుకు ప్రధాన కారణం ఏమంటే టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ. అక్కడి ప్రయో జనాలను పరిరక్షించే క్రమంలో ఇక్కడి ప్రయోజనాలకు విఘాతం కలిగించడం తప్పని సరి. కాశేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ కేంద్రానికి లేఖలు రాసిన టీడీపీకి తెలంగాణ సంక్షేమం కోరేవారు ఎట్లా ఓటు వేస్తారు? పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు కలిగిన రెండు ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ఒక ప్రాంతీ యపార్టీ ప్రాసంగికత కలిగి ఉండటం కుదరని పని. టీఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే ఎట్లా ఉంటుందో టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే అట్లాగే ఉంటుంది.
జాతీయ స్థాయిలో కలసి పని చేయాలని రాహుల్‌గాంధీ, చంద్రబాబు నిర్ణయించుకున్నారు కనుక ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికల పొత్తు పెట్టుకొని తీరాలి. తెలంగాణలో టీడీపీకి ఎన్ని స్థానాలు కాంగ్రెస్ కేటా యించిందో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి టీడీపీ అన్ని స్థానాలు ప్రత్యేకించినా ఉదారంగా వ్యవహరించినట్టు భావించాలి. అంటే కాంగ్రెస్ అస్తిత్వం పదిహేను అసెంబ్లీ నియోజవర్గాలకు తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ– కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం లవలేశమైనా కనిపించడం లేదని వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వేళ కూటమి గెలిచినా కాంగ్రెస్ స్థాయి అయిదో స్థానానికి పడిపోవడం తథ్యం. ఇప్పుడున్న ధోరణి బట్టి వైఎస్ ఆర్‌సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలు (బీజేపీ, జనసేనలలో ఏది మూడో స్థానంలో నిలుస్తుందో మరి!) మొదటి నాలుగు స్థానాలలో నిలిస్తే కాంగ్రెస్ అయిదో స్థానానికి పరిమితం అవుతుంది. 160 స్థానాలలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అంటే, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్‌లో కంటే హీనంగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో కుదించుకొని పోతుంది. అది అన్ని అసెంబ్లీ చోట్లా పోటీ చేస్తే ఉనికి సజీవంగా మిగిలి కనీసం భవిష్యత్తులో పుంజుకునే అవ కాశమైనా ఉంటుంది.
యునైటెడ్‌ఫ్రంట్ ప్రభుత్వాల వైఫల్యం
ఇక ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పడం సంగతి. ఎన్టీఆర్ 1983లో అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోపే విజయవాడలో ప్రతిపక్ష మహాసదస్సు (అపోజిషన్ కాంక్లేవ్) నిర్వహించారు. అది నేషనల్‌ఫ్రంట్‌కు దారి తీసింది. 1995లో చంద్ర బాబు ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా పని చేశారు. అప్పుడు యువ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుల మధ్య సమన్వయం సాధించే కృషి చేశారు. కానీ కీలక వ్యూహరచన, కార్యాచరణ అన్నీ సీపీఎం నాయకుడు హర్‌కిషన్‌సింగ్‌సూర్జిత్, డిఎంకే నాయకుడు కరు ణానిధి దర్శకత్వంలో జరిగేవి. సంకీర్ణ ప్రభుత్వాల కాలంలోనే దేశ ప్రగతి రేటు పెరిగిందంటూ చంద్రబాబు వాదిస్తున్నారు. యునైటెడ్‌ఫ్రంట్ ప్రభుత్వాల వల్ల దేశానికి మేలు జరగలేదు. పీవీ నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ నాయ కత్వంలోని మైనారిటీ ప్రభుత్వ కాలంలోనూ, ఎన్‌డీఏ, యూపీఏ ప్రభుత్వాల హయాంలోనూ, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, రెండో తరం ఆర్థిక సంస్క రణలు సైతం అమలు చేసిన మాట నిజమే. కానీ ఎన్‌డీఏను కాంగ్రెస్ నాయ కత్వంలోని కూటమి ఓడిస్తే ప్రధాని ఎవరు? శరద్‌పవార్, మాయావతి సిద్ధంగా ఉన్నారు. మమతాబెనర్జీకీ అభ్యంతరం లేదు. కూటమిలోని పక్షాలన్నీ అంగీకరిస్తే తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్‌గాంధీ చెప్పారు. ఆయన కాకుండా ఎవరు ప్రధాని అయినా కాంగ్రెస్ మద్దతుపైన ఆధారపడవలసిందే. సీతారామ్‌కేసరి లాగా రాహుల్ సంవత్సరం తిరగకుండానే మద్దతు ఉపసంహరిస్తే కాబోయే ప్రధాని కూడా నాడు దేవెగౌడ, ఐకె గుజ్రాల్ వలె మట్టికరవవలసిందే. ముందు పవార్‌కి అవకాశం ఇవ్వాలో లేక మాయావతికి ఇవ్వాలో తేల్చడానికి సూర్జిత్, కరుణానిధి వంటి తలలు పండిన నాయకులు ఇప్పుడు లేరు. అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి గెలుపొందితే లోగడ 1978, 1989లో జరిగినట్టు నలుగురు ముఖ్యమంత్రులు సీల్డ్‌కవర్‌లోంచి ఊడిపడరని భరోసా లేదు.
అంతమాత్రాన ఢిల్లీలో మోదీ పాలన, హైదరాబాద్‌లో కేసీఆర్ పాలన దివ్యంగా ఉన్నాయని కానీ వారి ప్రభుత్వాలను వ్యతిరేకించనక్కరలేదని కానీ అర్థం కాదు. ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు పెడుతున్నామో గమనించాలి. దేశం లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కా రానికి ఎటువంటి ప్రత్యామ్నాయ విధానాలనూ, కార్యక్రమాలనూ ప్రతిపాది స్తున్నామో పరిశీలించాలి. సుస్థిరతకు ముప్పు రాకుండా ఎవరో ఒక నాయకుడి లేదా నాయకురాలి ఆధ్వర్యంలో పటిష్టమైన కూటమి ఏర్పడి మేలైన పరిపాలన అందిస్తామని ముందుకు వస్తే ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. నకారాత్మక రాజకీయాలను ఆమోదించరు.
కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment