Ramchandra Murthy
-
ప్రభుత్వ సలహాదారుగా రామచంద్రమూర్తి
సాక్షి, అమ రావతి: ఏపీ ప్రభుత్వ సలహా దారు(పబ్లిక్ పాలసీ)గా డాక్టర్ రామచంద్రమూర్తి కొండు భట్లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
ఏ ‘దేశం’ కోసం ఈ వేషం?
‘వాట్ ఈజ్ హేపనింగ్?’ (ఏమి జరుగుతోంది?). ‘వేర్ వియ్ ఆర్ (‘ఆర్ వియ్’ కాదు) గోయింగ్? (ఎక్కడికి పోతున్నాం?). ఈ రెండు ఇంగ్లీషు వాక్యాలు ఇటీవల తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబునాయుడి నోట తరచుగా వెలువడుతున్నాయి? ఈ మాటలనే ఒకప్పుడు చిరునవ్వుతో, మరొ కప్పుడు ఆగ్రహంతో అంటూ విలేఖరులతో చంద్రబాబు ఆడుకోవడం గమనించినవారికి ఆయన ఆవేదన ఎందుకో ఒక పట్టాన అర్థం కాదు. ‘దేశాన్ని రక్షిం చుకోవాలి’, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’ అనే రెండు నినాదాలతో దేశ వ్యాపితంగా ఉద్యమం నిర్మించాలని ఆయన కంకణబద్ధుడై ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిష్వంగంలో నిలిచారు. కాంగ్రెస్‌తో కలసి పోరా డటం చారిత్రక అవసరమనీ, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం అనివార్యమైన విధానమనీ ఉద్బోధించారు. రాహుల్ ఏకీభవించారు. ‘మాకిద్దరికీ గతం ఉన్నది. గతం గతః. వర్తమానంకోసం, భవిష్యత్తుకోసం భుజం కలిపి పని చేయాలని నిర్ణయించుకున్నాం’ అంటూ రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ఎత్తుగడగా కాంగ్రెస్‌ను తల్లిపార్టీ, వైఎస్ఆర్సీపీని పిల్లపార్టీ అంటూ అసత్య ప్రచారం చేసిన చంద్రబాబు ఇంత పని చేస్తారని ఆయన పార్టీలోని సీనియర్ నాయకులు సైతం ఊహించలేదు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానంటూ ప్రతిజ్ఞ చేసిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, అంతకంటే పెద్ద నేరం మరొకటి ఉండదంటూ వ్యాఖ్యానించిన రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు మౌనాన్ని ఆశ్రయించారు. మాటకోసం, సిద్ధాంతంకోసం పదవిని త్యజించేంత గొప్ప నాయకుల తరం ఇప్పుడు లేదు. పరస్పరం మూడున్నర దశాబ్దాలపాటు క్షేత్రంలో, న్యాయస్థానాలలో, చట్ట సభలలో వ్యతిరేకించుకుంటూ, కలహించుకుంటూ, ఘర్షణపడుతూ వచ్చిన వివిధ స్థాయిలలోని ఉభయ పార్టీల నాయకులు అధినేతలు అవకాశవాద రాజ కీయాల కోసం నిర్ణయించారు కనుక పాత కక్షలూకార్పణ్యాలూ విస్మరించి కలసిమెలసి జీవించడం అసాధ్యం. ఆర్ఎస్ఎస్తో కలసి పని చేయాలని మావో యిస్టులు ప్రయత్నించడం, కాంగ్రెస్, బీజేపీలు కలసి ఒక కూటమి నిర్మించడం, బజరంగ్దళ్, ముస్లింబ్రదర్హుడ్ కలసి ఒకే వేదికపైన సంయుక్త కార్యాచరణ ప్రకటించడం ఎంత కృతకంగా ఉంటుందో కాంగ్రెస్, టీడీపీల పొత్తు సైతం అంతే అసహజంగా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ సీనియర్ నాయకులు సి రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ నుంచి రాజీనామా ప్రకటిం చారు. ఆ పార్టీలోని చాలామంది నాయకులు రాహుల్ నిర్ణయాన్ని మింగలేకా, కక్కలేక సతమతం అవుతున్నారు. తెలంగాణలో లేనిపోని ప్రయోజనం ఆశించి ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా అయిదో స్థానంలోకి శాశ్వతంగా దిగజారడం ఎందుకో ఆలోచించాలి. నైతికతకు పాతరేనా? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో మహాకూటమి ఏర్పాటు చేయడానికి చంద్రబాబు చక్రం తిప్పుతానంటే కామోసు అనుకుంటున్నారు రాహుల్. తనను ‘పప్పు’గా, ప్రధాని పదవికి తగని అర్భకుడిగా, తన తల్లి సోనియా గాంధీని దేశానికి పట్టిన శనిగా, దేశాన్ని నాశనం చేస్తున్న గాడ్సేగా, ఇటాలియన్ మాఫియాగా వందలసార్లు అభివర్ణించిన వ్యక్తితో కరచాలనం చేయడం కపట రాజకీయానికి పరాకాష్ట. అవకాశవాద రాజకీయాలలో ఆరితేరిన చంద్రబాబు వంటి నేతలకు అధికార రాజకీయం (పవర్ పొలిటిక్స్) మినహా తక్కిన మర్యా దలు ఏమీ పట్టవు. సోనియాను నాలుగేళ్ళపాటు అనునిత్యం దూషించిన చంద్ర బాబుతో రాహుల్ స్నేహం చేయడం నిస్సందేహంగా అనైతికం. ఏ పార్టీని భూస్థాపితం చేయడానికి టీడీపీని ఎన్‌టి రామారావు (ఎన్టీఆర్) స్థాపించారో ఆ పార్టీతో చేతులు కలపడం చంద్రబాబు చేసిన ద్రోహమంటూ ఎన్టీఆర్ సతి లక్ష్మీ పార్వతి ఒక లేఖ రాసి భర్త సమాధిపైన ఉంచారు. కాంగ్రెస్‌తో మైత్రిని చంద్రబాబు పొడిచిన రెండో వెన్నుపోటుగా ఎన్టీఆర్ అభిమానులు అభివర్ణిస్తే ఎట్లా అభ్యంతరం చెప్పగలం? ఏ ‘దేశం’ రక్షణకోసం చంద్రబాబు ఈ విన్యా సాలు చేస్తున్నారు? భారతదేశమా? తెలుగుదేశమా? ఈ అసాధారణ కలయికను నైతికంగా సమర్థించుకోవడం అటు రాహుల్‌కి కానీ ఇటు చంద్రబాబుకి కానీ సాధ్యం కాదు. ఎవరికి ప్రయోజనం? రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించినప్పటికీ ఈ కాంగ్రెస్–టీడీపీ బంధం భాగస్వాములకు ఎట్లా లాభిస్తుంది? తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)నాయకత్వంలోని టీఆర్ఎస్ను గద్దె దింపడం, బీజేపీ నేత నరేంద్ర మోదీని ప్రధాని పదవి నుంచి తొలగించడం చారిత్రక అవసరమని చెబుతూ ఈ పని చేయడానికి తాను సమర్థుడని భావించి తనను తాను సమన్వయకర్తగా (ఫెసిలిటేటర్) నియమించుకున్న తెంపరితనం చంద్రబాబుది. వాస్తవం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ప్రతిపక్ష నాయ కుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పట్లా, ఆయన నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ పట్లా జనాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 2014లో టీడీపీ విజయానికి దోహదం చేసిన నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌లు మాజీ మిత్రులుగా మారి పోయారు. చంద్రబాబు ఒంటరిగా ఎన్నడూ ఎన్నికలలో గెలిచింది లేదు. తోడు అత్యవసరం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ వినా మరో పార్టీ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా లేదు. తెలంగాణలో జవసత్వాలు కోల్పోయిన టీడీపీకి జీవం పోయాలన్న ఆలోచన టీఆర్ఎస్కు లేదు. టీఆర్ఎస్ని కూల్చడానికి తన శక్తి చాలదనీ, ఎవరు ముందుకు వస్తే వారి సహకారం స్వీకరించాలని కాంగ్రెస్ అర్రులు చాస్తోంది. ఆ పార్టీ అధినేతకు టీడీపీతో స్నేహం చేయడానికి నైతిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. టీడీపీకి సిద్ధాంతపరమైన అభ్యంతరాలు ఎప్పుడూ లేవు. టీడీపీ అధినేతకు తెలిసిన సిద్ధాంతం ఒక్కటే–అధికారం హస్త గతం చేసుకోవడం, నిలబెట్టుకోవడం, అన్ని విధాలా దానిని వినియోగిం చుకోవడం, అందుకోసం ఎప్పుడు ఏది అవసరమైతే అప్పుడు అది చేయడం. టీడీపీతో అవగాహన కారణంగా కాంగ్రెస్‌కూడా నష్టబోతుంది. టీడీపీ పొడ గిట్టని కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పని చేయవు. కాంగ్రెస్‌కు ప్రతి ఎన్ని కలోనూ ఓటు చేసేవారు సైతం టీడీపీ పొత్తు కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ సారి ఓటు చేయకపోవచ్చు. టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్ అభిమానుల ఓటు చేయడం, కాంగ్రెస్ అభ్యర్థులకు టీడీపీ మద్దతుదారులు ఓటు వేయడం దాదాపు అసాధ్యం. చంద్రబాబుకి జాతీయ స్థాయిలో నిర్వాహకుడి పాత్ర పోషించాలన్న ఉబలాటం ఉన్నది కాబట్టి ఆర్థికంగా కాంగ్రెస్‌కు సహాయం చేయవచ్చు. కానీ ఓట్లు బదిలీ కావు. తెలంగాణలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు కేటాయించే స్థానాలలో అత్యధికం టీఆర్ఎస్కి అప్పనంగా అప్పగించినట్టే అవుతుంది. నవంబర్ 9న అభ్యర్థుల జాబితాను ప్రకటించాక కాంగ్రెస్‌లో పెనుతుఫాను సంభవిస్తుంది. అసమ్మతివాదులను ఓదార్చడం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ వల్ల కాదు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటా నన్నప్పుడే ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజేఎస్) కూటమికి దూరంగా ఉండవలసింది. రాజకీయాలలో అధికార పార్టీని ఓడించడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. అమరుల ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పం కాంగ్రెస్, టీడీపీల ఆధ్వర్యంలో ఎట్లా నెరవేరుతుందో ఆలోచించాలి. అవసరమైతే ఈ ఎన్నికలకు దూరంగా ఉండవచ్చు లేదా ఒంటరిగా సాధ్య మైనన్ని స్థానాలకు పోటీ చేయవచ్చు. టీడీపీతో కలసి పని చేయడాన్ని కోదండరామ్‌ను అభిమానించే తెలంగాణవాదులు జీర్ణించుకోలేరు. ఇందుకు ప్రధాన కారణం ఏమంటే టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ. అక్కడి ప్రయో జనాలను పరిరక్షించే క్రమంలో ఇక్కడి ప్రయోజనాలకు విఘాతం కలిగించడం తప్పని సరి. కాశేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెబుతూ కేంద్రానికి లేఖలు రాసిన టీడీపీకి తెలంగాణ సంక్షేమం కోరేవారు ఎట్లా ఓటు వేస్తారు? పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు కలిగిన రెండు ఇరుగుపొరుగు రాష్ట్రాలలో ఒక ప్రాంతీ యపార్టీ ప్రాసంగికత కలిగి ఉండటం కుదరని పని. టీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తే ఎట్లా ఉంటుందో టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే అట్లాగే ఉంటుంది. జాతీయ స్థాయిలో కలసి పని చేయాలని రాహుల్‌గాంధీ, చంద్రబాబు నిర్ణయించుకున్నారు కనుక ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికల పొత్తు పెట్టుకొని తీరాలి. తెలంగాణలో టీడీపీకి ఎన్ని స్థానాలు కాంగ్రెస్ కేటా యించిందో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కి టీడీపీ అన్ని స్థానాలు ప్రత్యేకించినా ఉదారంగా వ్యవహరించినట్టు భావించాలి. అంటే కాంగ్రెస్ అస్తిత్వం పదిహేను అసెంబ్లీ నియోజవర్గాలకు తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ– కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం లవలేశమైనా కనిపించడం లేదని వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వేళ కూటమి గెలిచినా కాంగ్రెస్ స్థాయి అయిదో స్థానానికి పడిపోవడం తథ్యం. ఇప్పుడున్న ధోరణి బట్టి వైఎస్ ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనలు (బీజేపీ, జనసేనలలో ఏది మూడో స్థానంలో నిలుస్తుందో మరి!) మొదటి నాలుగు స్థానాలలో నిలిస్తే కాంగ్రెస్ అయిదో స్థానానికి పరిమితం అవుతుంది. 160 స్థానాలలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అంటే, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్లో కంటే హీనంగా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో కుదించుకొని పోతుంది. అది అన్ని అసెంబ్లీ చోట్లా పోటీ చేస్తే ఉనికి సజీవంగా మిగిలి కనీసం భవిష్యత్తులో పుంజుకునే అవ కాశమైనా ఉంటుంది. యునైటెడ్‌ఫ్రంట్ ప్రభుత్వాల వైఫల్యం ఇక ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పడం సంగతి. ఎన్టీఆర్ 1983లో అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోపే విజయవాడలో ప్రతిపక్ష మహాసదస్సు (అపోజిషన్ కాంక్లేవ్) నిర్వహించారు. అది నేషనల్ఫ్రంట్కు దారి తీసింది. 1995లో చంద్ర బాబు ముఖ్యమంత్రి పదవిని కైవసం చేసుకున్న తర్వాత యునైటెడ్ ఫ్రంట్‌కు కన్వీనర్‌గా పని చేశారు. అప్పుడు యువ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుల మధ్య సమన్వయం సాధించే కృషి చేశారు. కానీ కీలక వ్యూహరచన, కార్యాచరణ అన్నీ సీపీఎం నాయకుడు హర్కిషన్సింగ్సూర్జిత్, డిఎంకే నాయకుడు కరు ణానిధి దర్శకత్వంలో జరిగేవి. సంకీర్ణ ప్రభుత్వాల కాలంలోనే దేశ ప్రగతి రేటు పెరిగిందంటూ చంద్రబాబు వాదిస్తున్నారు. యునైటెడ్‌ఫ్రంట్ ప్రభుత్వాల వల్ల దేశానికి మేలు జరగలేదు. పీవీ నరసింహారావు ప్రధానిగా కాంగ్రెస్ నాయ కత్వంలోని మైనారిటీ ప్రభుత్వ కాలంలోనూ, ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాల హయాంలోనూ, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, రెండో తరం ఆర్థిక సంస్క రణలు సైతం అమలు చేసిన మాట నిజమే. కానీ ఎన్డీఏను కాంగ్రెస్ నాయ కత్వంలోని కూటమి ఓడిస్తే ప్రధాని ఎవరు? శరద్‌పవార్, మాయావతి సిద్ధంగా ఉన్నారు. మమతాబెనర్జీకీ అభ్యంతరం లేదు. కూటమిలోని పక్షాలన్నీ అంగీకరిస్తే తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్‌గాంధీ చెప్పారు. ఆయన కాకుండా ఎవరు ప్రధాని అయినా కాంగ్రెస్ మద్దతుపైన ఆధారపడవలసిందే. సీతారామ్‌కేసరి లాగా రాహుల్ సంవత్సరం తిరగకుండానే మద్దతు ఉపసంహరిస్తే కాబోయే ప్రధాని కూడా నాడు దేవెగౌడ, ఐకె గుజ్రాల్ వలె మట్టికరవవలసిందే. ముందు పవార్‌కి అవకాశం ఇవ్వాలో లేక మాయావతికి ఇవ్వాలో తేల్చడానికి సూర్జిత్, కరుణానిధి వంటి తలలు పండిన నాయకులు ఇప్పుడు లేరు. అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి గెలుపొందితే లోగడ 1978, 1989లో జరిగినట్టు నలుగురు ముఖ్యమంత్రులు సీల్డ్కవర్లోంచి ఊడిపడరని భరోసా లేదు. అంతమాత్రాన ఢిల్లీలో మోదీ పాలన, హైదరాబాద్‌లో కేసీఆర్ పాలన దివ్యంగా ఉన్నాయని కానీ వారి ప్రభుత్వాలను వ్యతిరేకించనక్కరలేదని కానీ అర్థం కాదు. ఎటువంటి ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందు పెడుతున్నామో గమనించాలి. దేశం లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కా రానికి ఎటువంటి ప్రత్యామ్నాయ విధానాలనూ, కార్యక్రమాలనూ ప్రతిపాది స్తున్నామో పరిశీలించాలి. సుస్థిరతకు ముప్పు రాకుండా ఎవరో ఒక నాయకుడి లేదా నాయకురాలి ఆధ్వర్యంలో పటిష్టమైన కూటమి ఏర్పడి మేలైన పరిపాలన అందిస్తామని ముందుకు వస్తే ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. నకారాత్మక రాజకీయాలను ఆమోదించరు. కె. రామచంద్రమూర్తి -
నా గీతం కన్నీటి జలపాతం
విశాఖపట్నం, అనకాపల్లి: ఉన్నత చదువులేవీ చదువుకోలేదు.. గంటల తరబడి సభల్లో ప్రసంగించడమూ రాదు.. సంపన్న కుటుంబంలో పుట్టలేదు.. కానీ సమాజంలో ఆదివాసీలు అనుభవిస్తున్న దుస్థితిని చూసి ఆవేదన చెంది.. వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న బలమైన కోరికతో పోరాడుతున్నానని కన్నీటి పర్యంతమయ్యారు తమ్మయ్య.. నిమ్న వర్గాల అభ్యున్నతికి పోరాడుతున్న వారికి సమాలోచన సంస్థ ఏటా అందిస్తున్న ‘బాషా స్మారక అవార్డు’కు విజయనగరం జిల్లా పాచిపెంటకు చెందిన పడాల తమ్మయ్య ఎంపికయ్యారు. ఏపీ బాలల హక్కుల కమిషన్ మెంబర్ వి.గాంధీబాబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి చేతుల మీదుగా ఈ అవార్డును ఆదివారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుం చి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వా డినని, పాటల రూపంలో ఆదివాసీలను చైతన్యపరుస్తున్నానని తెలిపారు. ఆదివాసీల హక్కుల కోసం గద్దర్, ఆర్.నారాయణమూర్తి తదితరులతో కలిసి చాలా పాటలు పాడానన్నారు. ఆదివాసీల జీవన విధానాలపైడాక్యుమెంటరీ గాంధీబాబు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల గురించి పోరాడుతున్న తమ్మయ్యలాంటి యువకుల గురించి మంచి కథనాలు రాయాలని కోరారు. సమాలోచన సంస్థ సభ్యులు బి.చక్రధర్ మాట్లాడుతూ బాషాస్మారక అవార్డు ఎంపికను తమ బృందం ఎటువంటి సిఫార్సులు లేకుండా చేస్తుందని తెలిపారు. సామాజిక కార్యకర్త పి.ఎస్. అజయ్‌కుమార్ పవర్‌పాయింట్ ప్రెజెం టేషన్ ద్వారా ఆదివాసీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వారు అనుభవిస్తున్న దుర్భర స్థితిని వివరించా రు. సామాజిక కార్యకర్త కాంతారావు, విద్యావేత్త పి.డి.కె.రావులు అవార్డు గ్రహీత తమ్మయ్య సేవలు, ఆశయాల గురించి వివరించారు. అనంతరం గూంజ్ సంస్థ సహకారంతో 710 కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. మరింతమంది ముందుకురావాలి సమాజంలో అణచివేతకు గురవుతున్న ఆదివాసీల జీవనవిధానాల్లో మార్పు తీసుకురావాలని పోరాడుతున్న పడాల తమ్మయ్యను సాక్షి ఈడీ కె.రామచంద్రమూర్తి అభినందించారు. పట్టణంలోని వివేకానంద చారిటబుల్ ట్రస్టు ఆవరణలో ఆదివారం నిర్వహించిన బాషా స్మారక అవార్డు ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆదివాసీల చట్టాలు, వారి హక్కులను గ్రామాల్లో విస్త్రతంగా ప్రచారం చేస్తూ తమ్మయ్య అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ స్ఫూర్తితో మరింత మంది ముందుకు వచ్చి అణగారిన వర్గాలో చైతన్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. -
ఇదేం ప్రజాస్వామ్యం!?
‘ఇక సహించజాలం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. దేవుళ్ళ దగ్గరికే వెడదాం’ ఈ మాటలు అన్నది తెలుగుదేశం వ్యవస్థాపకుడు, నేషనల్ ఫ్రంట్ అధినేత నందమూరి తారకరామారావు. బోఫోర్స్ కుంభకోణంపై కాగ్ నివేదిక రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టినప్పటికీ రాజీనామా చేయడానికి నిరాకరించారు. అందుకు నిరసనగా 12 పార్టీలకు చెందిన 106 మంది లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తారని ఎన్టీఆర్ 1989 జూన్ 24న ప్రకటించారు. ఈ రోజుల్లో కాగ్ ప్రభుత్వాలను ఉతికి ఆరేసినా ముఖ్యమంత్రులు చలించడం లేదు. పైగా ఇదివరకటి ప్రధానులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేశారా అని దబాయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అక్రమాలనూ, అవినీతినీ ఎండగడుతూ శనివారం కాగ్ వెల్లడించిన నివేదికపైన ఎన్టీఆర్ ఏ విధంగా స్పందించేవారో ఊహించుకోవాలంటే 29 సంవత్సరాలు వెనక్కిపోవాలి. బోఫోర్స్పైన కాగ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే రాజీవ్‌గాంధీ ప్రధాని పదవి నుంచి వైదొలగాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆయన నిరాకరించడంతో బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకూ 12 ప్రతిపక్షాల సభ్యులు రాజీనామా చేశారు. అప్పుడు నేషనల్ ఫ్రంట్‌లో బీజేపీ ఎంపీలు 88 మందీ, వామపక్ష సంఘటన ఎంపీలు 44 మందీ ఉండేవారు. ఫ్రంట్ బలం మొత్తం 148. వందమందికి పైగా ప్రతిపక్ష సభ్యులు మూకుమ్మడి రాజీ నామా చేస్తే దేశం నివ్వెర బోయింది. 73 మంది లోక్‌సభ సభ్యుల బృందం స్వయంగా స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖలు ఇచ్చింది. ‘మహాభారత సంగ్రా మం ఆరంభమైంది. ఇది మాకు దొరికిన చివరి అవకాశం. సద్వినియోగం చేసుకుంటున్నాం’ అంటూ కదనకుతూహలం ప్రదర్శించారు బీజేపీ నేత అటల్ బిహారీ వాజపేయి. ‘1984లో కాంగ్రెస్‌కు లభించిన జనామోదం బోఫోర్స్‌పై కాగ్ నివేదికతో అంతమైంది’ అంటూ వ్యాఖ్యానించారు విశ్వనాథ్‌ప్రతాప్‌సింగ్. చారిత్రక నిర్ణయాలు చరిత్రలో కొన్ని ఘట్టాలు ఎప్పటికీ గుర్తుంటాయి. 1966లో తాష్కెంట్లో లాల్‌బహదూర్ శాస్త్రి అస్తమించిన అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నాడార్ మొరార్జీ దేశాయ్‌ని కాదని ఇందిరాగాంధీని ప్రధాని పదవికి పోటీ పెట్టి గెలిపించిన ఘట్టం, మూడేళ్ళ తర్వాత అదే ఇందిరాగాంధీ ప్రధాని పదవిలో నిలదొక్కుకున్నాక తాను ఆటబొమ్మను (కట్పుత్లీ) కానని నిరూపించిన విధం ఎన్నటికీ మరపురాదు. కామరాజ్, నిజలింగప్ప, అతుల్యఘోష్, ఎస్కె పాటిల్, నీలం సంజీవరెడ్డి వంటి హేమాహేమీలను ఎదిరించి, 1969 రాష్ట్రపతి ఎన్నికలో అంతరాత్మ ప్రబోధం పిలుపుతో పార్టీని నిలువుగా చీల్చి, సీనియర్ నాయకుల సిండికేట్‌ను పూర్వపక్షం చేసిన తీరు భారత రాజకీయాలలో అపూర్వ ఘట్టం. 1977లో ఆత్యయిక పరిస్థితిని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించడం కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అధినేతలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు చారిత్రక పరిణామాలకు అని వార్యంగా దారితీస్తాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు చాలాకాలం తటపటాయించిన సోనియాగాంధీ యూపీఏ–2 ప్రభుత్వం పదవీకాలం ముగుస్తున్న దశలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) రెండుసార్లు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజీనామా అన్నది ఒక అస్త్రం. వైఎస్సార్సీపీకి చెందిన అయిదుగురు ఎంపీలు అదే అస్త్రాన్ని ప్రయోగించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించేందుకు పోరాటం కొనసాగిస్తున్నారు. అంతేకాక ఢిల్లీలోనే ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామా చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఎంపీలు 25 మందీ వైదొలిగినట్టు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంటుందనీ, ఎన్డీఏ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతుందనీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉద్ఘాటించింది అందుకే. తెలుగుదేశం ఎంపీల చేత రాజీనామా చేయించకపోగా వైఎస్సార్సీపీకి చెందిన లోక్‌సభ సభ్యులు మాత్రమే రాజీనామా చేశారేమి, రాజ్యసభ సభ్యులు ఎందుకు చేయలేదంటూ వంకర ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్టీఆర్‌కీ, చంద్రబాబుకీ ఉన్న తేడా అదే. ఎన్టీఆర్ ధీరోదాత్తుడు. ఆయనది ప్రత్యక్షయుద్ధం. అప్పుడు కూడా లోక్‌సభ సభ్యులే రాజీనామా చేశారు కానీ రాజ్యసభ సభ్యులు చేయలేదు. రాజ్యసభ సభ్యులను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. వారు రాజీనామా చేసినా ప్రజలపైన ప్రభావం ఉండదు. లోక్‌సభ సభ్యులు రాజీనామా చేసి తమ నియోజకవర్గాలకు వెళ్ళి ప్రజల మధ్య ఉంటారు. ఎన్టీఆర్ నాయకత్వంలో నేషనల్ ఫ్రంట్ సమష్టి నిర్ణయాలతో రాజీవ్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం యుద్ధరంగంలోకి దిగడానికి జడుస్తోంది. ప్రతిపక్షం దిశానిర్దేశం చేస్తే దాన్ని అనుసరించే సద్భావం లేదు. స్వయంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సాహసం లేదు. అవిశ్వాస తీర్మానాల చరిత్ర శుక్రవారం ముగిసిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని అపకీర్తి తెచ్చాయి. పార్లమెంటు చరిత్రలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ఆచార్య జేబీ కృపలానీ ప్రవేశపెట్టారు. నాటి ప్రధాని నెహ్రూ తీర్మానాన్ని స్వాగతించారు. చర్చకు సమగ్రంగా సమాధానం చెప్పారు. తర్వాత 25 మంది వివిధ ప్రభుత్వాలపైన విశ్వాస రాహిత్యం ప్రకటించే తీర్మానాలకు నోటీసులు ఇచ్చారు. అన్ని తీర్మానాలపైనా వివరంగా చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఒక్క లోక్‌సభ సభ్యుడు నోటీసు ఇచ్చినా దాన్ని స్పీకర్ ఆమోదించి తీరాలి. తిరస్కరించే అధికారం రాజ్యాంగం స్పీకర్‌కు ఇవ్వలేదు. 1979 జులై 15న జనతా పార్టీ ప్రధాని మొరార్జీ తన ప్రభుత్వంపైన వచ్చిన అవిశ్వాస తీర్మానంపైన చర్చ పూర్తి కాకమునుపే తన పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ సందర్భం మినహా అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రధాని రాజీనామా చేయవలసిన వచ్చిన సందర్భం మరొకటి లేదు. బ్రిటన్‌లో డజను మంది ప్రధానులు అవిశ్వాస తీర్మానం నెగ్గిన ఫలితంగా రాజీనామాలు చేశారు. మన ప్రధానులూ రాజీనామా చేసిన సందర్భాలు లేకపోలేదు. వారు తాము ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం వీగిపోయిన కారణంగా వైదొలిగారు. మొరార్జీ తర్వాత వచ్చిన జాట్ నాయకుడు చౌధరి చరణ్‌సింగ్ 1979 ఆగస్టు 20న లోక్‌సభలో ‘విశ్వాస తీర్మానం’ పైన చర్చ జరగకుండానే పదవి నుంచి వైదొలిగారు. వి.పి. సింగ్ 1990 నవంబర్ 7న విశ్వాస తీర్మానం నెగ్గని కారణంగా పదవి నుంచి తప్పుకున్నారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన ‘విశ్వాస తీర్మానం’ 265–251 ఓట్ల తేడాతో గెలిచింది. వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండుసార్లు ‘విశ్వాస తీర్మానం’ ఎదుర్కొన్నది. 1998 మే 28న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని గెలిపించుకోవడానికి సరిపడ మద్దతు సమీకరించలేమని తెలుసుకొని వాజపేయి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రతినిధి హెచ్డీ దేవెగౌడ 1979 ఏప్రిల్ 11న విశ్వాస తీర్మానం వీగిపోయిన కారణంగా గద్దె దిగవలసి వచ్చింది. వాజపేయి ప్రభుత్వానికి ఏఐఏడిఎంకే అధినేత జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో 1999 ఏప్రిల్ 17న ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపైన ఓటింగ్ జరిగింది. ఒక్క ఓటు తేడాతో (269–270) తీర్మానం వీడిపోయింది. వాజపేయి సర్కార్ పడిపోయింది. నేషనల్ ఫ్రంట్ అయినా యునైటెడ్ ఫ్రంట్ అయినా రేపు ఫెడరల్ ఫ్రంట్ అయినా ఏదో ఒక జాతీయ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందే. మద్దతు ఇచ్చిన పార్టీ అదను చూసి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు ఢమాల్న పడిపోవలసిందే. అన్ని ప్రభుత్వాలూ పట్టుమని ఏడాది గడవకుండానే కూలి పోయాయి. ఫ్రంట్లు ఏర్పడటానికి ముందు జనతా పార్టీ చీలిపోవడంతో మొరార్జీ సర్కార్ కూలిపోయింది. తరువాత వచ్చిన చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పడగొట్టింది. నేషనల్ ఫ్రంట్ ప్రధాని వి.పి. సింగ్ ప్రభుత్వానికి బీజేపీ, కాంగ్రెస్, జనతాపార్టీ (చంద్రశేఖర్) కలిసి ఎసరు పెట్టాయి. చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ ప్రభుత్వాలు కాంగ్రెస్ తంత్రం ఫలితంగా కూలిపోయాయి. స్పీకర్ నిస్సహాయత పార్లమెంటు బడ్జెట్ సమావేశంలోని రెండవ భాగంలోని 22 రోజులూ నిష్ఫలంగా గడిచిపోయాయి. అవిశ్వాస తీర్మానం చేపట్టడానికి అవసరమైన 50 మంది సభ్యుల కంటే ఎక్కువమందే లేచి నిలబడినా స్పీకర్ సుమిత్రామహాజన్ సభను వాయిదా వేశారు. స్పీకర్‌కు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను వినియోగించలేదు. పోడియం దగ్గర చేరి నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించిన ఏఐఏడిఎంకె సభ్యులను సస్పెండు చేసి సభ నిర్వహించే అధికారం ఆమెకు ఉన్నది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రధాని తటస్థంగా ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ వ్యవహారదక్షుడు. తన గురువు ప్రమోద్ మహాజన్ వాజపేయి ప్రభుత్వంలో ఇదే శాఖను సమర్థంగా నిర్వహిం చారు. ప్రతిపక్ష నాయకులతో, మిత్రపక్షాల నేతలతో ఎలా మెలగాలో మహాజన్ నుంచి అనంతకుమార్ నేర్చుకున్నారు. కానీ ఆయన ఈ సమావేశాలలో ఉత్సాహంగా కనిపించలేదు. చర్చకు అధికార పక్షం సిద్ధంగా ఉన్నదంటూ ప్రతిరోజూ ప్రకటించడం మినహా ఆయన చేసిన ప్రయత్నం ఏదీలేదు. పీవీ హయాంలో 1995లో పార్లమెంటు శీతాకాల సమావేశాలను బీజేపీ అడ్డుకుంది. సుఖ్రామ్ టెలికాం కుంభకోణంపైన చర్చించాలని పట్టుబట్టి సమావేశాలు జరిగినన్ని రోజులూ చర్చ సాగనివ్వలేదు. పైగా సభలో చర్చ జరిగే విధంగా చూసే బాధ్యత అధికార పార్టీదేనంటూ వాదించింది. బీజేపీ, కాంగ్రెస్‌ల నెలవులు మారినాయి కానీ వాదనలు మారలేదు. ఇక్కడ ఇలా వాయిదాలు పడుతున్న సమయంలోనే పొరుగున ఉన్న శ్రీలంక ప్రభుత్వంపైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చ జరిగింది. ప్రధాని రణిల్ విక్రమసింఘే వెంట్రుకవాసితో గట్టెక్కారు. ఎన్డీఏకి తిరుగులేని సంఖ్యాధిక్యం ఉంది. చర్చకు వెనకంజ ఎందుకో అర్థం కాదు. అవిశ్వాస తీర్మానంపైన చర్చ జరిగితే ప్రతిపక్షం లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం కష్టమని మోదీ భావించి ఉండాలి. యుద్ధవిమానాల కొనుగోలులో అవినీతి ఆరోపణలు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ గందరగోళం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం ప్రయత్నించిందనే అనుమానం, నానాటికీ తీవ్రతరం అవుతున్న వ్యవసాయ సంక్షోభం మోదీ ప్రభుత్వాన్ని కట్టిపడవేశాయి. యుద్ధతంత్రం విస్మరించిన యోధుడిలాగా మోదీ కనిపిస్తున్నారు. అవి శ్వాస తీర్మానాన్ని చర్చకు పెట్టని తొలి లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రామహాజన్ చరి త్రలో మిగిలిపోతారు. చర్చ జరిపించడానికి ప్రయత్నించని సభానాయకుడుగా మోదీ అపకీర్తి మూటకట్టుకున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా విఫలుడైన అనంతకుమార్ సంగతి సరేసరి. నిస్తేజం, నిర్వికారం బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరునూ, ప్రతిపక్షం చేసిన హడావిడినీ, అధికారపక్షం నిమ్మకు నీరెత్తినట్టు, దిక్కుతోచనట్టు వ్యవహరించిన పద్ధతి గమనిస్తే కొన్ని సందర్భాలు గుర్తుకు రాకమానవు. మన్మోహన్సింగ్ ప్రభుత్వం 2013లో పార్లమెంటులో 2జీ కుంభకోణం, కామన్వెల్త్ అక్రమాలపర్వం, బొగ్గు కుంభకోణం వగైరా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన సన్నివేశం గుర్తుకొస్తున్నది. పీవీ ప్రభుత్వం ద్వితీయార్ధంలో ప్రతిపక్ష బీజేపీ దాడి తట్టుకోలేక విలవిలలాడిన దృశ్యాలు కళ్ళకు కడుతున్నాయి. 1989లో బోఫోర్స్ కుంభకోణం తాలూకు ఆరోపణలతో రాజీవ్‌గాంధీ దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడటం కనిపిస్తున్నది. మే నెలలో మోదీ ప్రభుత్వం చివరి సంవత్సరంలో ప్రవేశిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్లోనా, వచ్చే వేసవిలోనా అన్నది ఇంకా తేల్చుకున్నట్టు లేదు. మంత్రులు రాజీ నామా చేసినా, మిత్రపక్షం వైదొలిగినా, పార్లమెంటులో గొడవ జరిగినా, పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి నిరాహారదీక్ష చేస్తున్నా మోదీ మౌనాన్ని ఆశ్రయించడం ప్రజలకు ఆశ్చర్యం, దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ మౌనం వెనుక ఎన్ని సముద్రాల ఘోష ఉన్నదో మరి? - కె. రామచంద్రమూర్తి -
నవభారత నిర్మాణానికి నడుంబిగించాలి
యువతకు ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి పిలుపు సాక్షి, హైదరాబాద్: నవభారత నిర్మాణానికి యువత నడుం బిగించాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. శనివారం గీతం విశ్వవిద్యాలయంలో ప్రజాసంబంధాల నూతన విద్యార్థి విభాగాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పొరుగువాడి గురించి పట్టించుకునేవారే కరువయ్యారని, దీంతో ఆత్మన్యూనతకు లో నైన కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిని మార్చగలిగే శక్తి యువత లోనే ఉందని, వారు మంచి సమాజాన్ని స్వప్నించి దాని సాకారానికి కృషి చేయాలని అన్నారు. రచయితలు, మేధావులు, సంఘ సేవకులను తరచూ విశ్వవిద్యాలయా నికి ఆహ్వానించి ముఖాముఖి నిర్వహించాలని, తద్వారా మనచుట్టూ ఉన్న ప్రపంచంపై విద్యార్థులకు విశాలమైన భావన ఏర్పడుతుందని అన్నారు. గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జీహెచ్బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై.లక్ష్మణ్‌కుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ జీఏ రామారావు తదితరులు రామచంద్రమూర్తిని సత్కరించి పండ్లు, మొక్కను అందజేశారు. గీతం పీఆర్ అండ్ మీడియా సెల్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతకంతో కూడిన శుభాభినందన సందేశం రావడం విద్యార్థుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. -
‘ఉద్దానం’ నీటిలో ప్రమాదకర మూలకాలు
జీఎస్ఐ పరీక్షలో నిర్ధారణ: నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి - కిడ్నీ వ్యాధులతో వేల సంఖ్యలో మరణాలకు ఇదే కారణం - భూ ఉపరితల జలాల వినియోగమే దీనికి పరిష్కారమని వెల్లడి - 26న ఉద్దానంలో బహిరంగసభ: సాక్షి ఈడీ రామచంద్రమూర్తి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో వేల మంది మరణాలకు అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) పరీక్షలో తేలింది. ఉద్దానం ప్రాంతంలోని నీటిలో కిడ్నీవ్యాధులకు కారణ మయ్యే మూలకాలు అధిక స్థాయిలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. శుక్రవారం నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యలతో కలసి ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఈ వివరాలను వెల్లడించారు. కిడ్నీ వ్యాధుల బారినపడి వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న ఉద్దానం ప్రాంతంలోని తాగునీటి నమూనాలను ఇటీవ ల సేకరించి జీఎస్ఐలో పరీక్షించినట్లు నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ‘‘తాగే నీటిలో ఏ మూలకం కూడా పరిమితికి మించి ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూగర్భం లో 118 రకాల మూలకాలు ఉంటాయి. వాటిలో 14 రకాలు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులు తలెత్తుతా యి. ఉద్దానం ప్రాంతం నుంచి సేకరించిన 12 తాగునీటి నమూనాలను జీఎస్ఐ పరీక్షించింది. ఆ ప్రాంతంలోని ఒక గ్రామంలో 23 మంది కిడ్నీ వ్యాధులతో చనిపోయారు. ఆ గ్రామం లోని తాగునీటిలో కాడ్మియం, యురేనియం, క్రోమియం, లెడ్ మూలకాలు అధిక స్థాయిలో ఉన్నాయి. అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. సిలికా స్థాయి కూడా ఎక్కువే ఉంది. కానీ సిలికా ఏ స్థాయిలో ఉంటే ప్రమాదకరమనే అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో ఇంకా నిర్ధారించలేదు..’’ అని ఆయన చెప్పారు. ఉపరితల జలాల వినియోగమే శ్రేయస్కరం తాగునీరు డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం ఉంటే వ్యాధులు రావనేది కూడా అన్ని సందర్భాల్లో జరగదని రాజారెడ్డి చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల ఆరోగ్యస్థాయిని బట్టి ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని పరిశోధనలలో తేలిందని, దాంతో కోట్ల రూపాయలతో డీఫ్లోరైడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ తర్వాత పరిస్థితి ఇంకో రకంగా మారిందని, బోర్ల నుంచి వచ్చే నీటిని సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. భూగర్భ జలంలో ఎన్నో రకాల మూలకాలు మోతాదుకు మించి ఉంటాయని, వాటన్నింటినీ సరిపోయే స్థాయిలోకి తీసుకురావడం కష్టమని వివరించారు. తాగేందుకు, వంట కోసం భూ ఉపరితలంలోని నీటినే వినియోగించాలని, కిడ్నీల వ్యాధుల నియంత్రణకు అదే శాశ్వతమైన పరిష్కారమని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 26న ఉద్దానంలో కిడ్నీ బాధితులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నా మని సాక్షి ఈడీ రామచంద్రమూర్తి చెప్పారు. ఆ సభ ఏర్పాట్లను జర్నలిస్టు రమణమూర్తితో పాటు స్థానికులు కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఉద్దానం ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లుగా వంశధార నది నీటిని తాగునీటి కోసం సరఫరా చేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలే కాదు అందరూ ఆలోచించాలన్నారు. ఇక తమకు అందరూ మద్దతుగా నిలవాలని ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు కోరారు. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఉద్దానంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.