15 లక్షల పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్లు చేయడం నిజంకాదా రామోజీ?
పేదల ఇళ్ల రిజిస్ట్రేషన్లలో చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్ ప్రభుత్వం
జగనన్న కాలనీల్లో 22 లక్షల మంది ఇళ్లు కట్టుకుంటుండడం తెలీకపోతే ఎలా?
31 లక్షల ఇళ్ల స్థలాల్లో 7 లక్షల ఇళ్లకు గతంలోనే పొజిషన్ సర్టిఫికెట్లు
ఎన్నికల కోడ్‌తో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల
ఈసీ అనుమతితో త్వరలో మిగిలిన రిజిస్ట్రేషన్లూ ప్రారంభం
సాక్షి, అమరావతి : అధికారంలో చంద్రబాబు తప్ప వేరెవరైనా ఉంటే అ ప్రభుత్వం చేసే మంచి పనులేవీ రామోజీరావుకు కనిపించవు. ఒకవేళ కనిపించినా కనిపించనట్లు జీవిస్తారు. అదే చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయనెంత దుర్మార్గం చేసినా ఆహా ఓహో అంటూ భజనలు. ఇది తన సహజ లక్షణమని ఆయన నిత్యం నిరూపించుకుంటున్నారు. తాజాగా.. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల చరిత్రలో ఏ ప్రభుత్వం తీసుకురాని సంస్కరణను వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చి విజయవంతంగా అమలుచేయడాన్ని ఈ పచ్చకళ్ల రామోజీరావు సహించలేకపోతున్నారు.
జగన్‌ను, ఆయన సర్కారును ఎలాగైనా అభాసుపాల్జేయాలన్న కసి ఆయనను దహించేస్తోంది. దీంతో.. దేశంలో పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసిన ఏకైక ప్రభుత్వంగా నిలిచినా దాన్ని తక్కువచేసి చూపేందుకు, లబ్ధిదారుల్లో అపోహలు సృష్టించేందుకు తన క్షుద్ర పత్రికలో చేతికొచ్చింది రాసిపారేస్తున్నారు. ‘అంకెలు భళా.. అమలు డీలా’ అంటూ నిజాలకు పాతరేసి తన పెత్తందారీ భావజాలాన్ని అక్షరం అక్షరంలో ప్రదర్శించారు. 45 రోజుల వ్యవధిలో పేదలకిచ్చిన 15.59 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్లు చేయడం డీలాపడడం ఎలా అవుతుందో రామోజీరావుకే తెలియాలి.
పేదలకు జగన్ సర్కారు చేస్తున్న మేలుతో చంద్రబాబుకు ఇక జన్మలో అధికారం దక్కదన్న దుగ్థతో రామోజీనే డీలాపడి ఇష్టమొచ్చినట్లు రంకెలు వేస్తున్నారు. అసలు.. రిజిస్ట్రేషన్ల శాఖ సంవత్సరం మొత్తం మీద చేసే రిజిస్ట్రేషన్ల సంఖ్య 20 లక్షలు. మామూలుగా అయితే ఈ రిజిస్ట్రేషన్లు చేయడానికి దాదాపు ఏడాది పడుతుంది. కానీ, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై వారికి వెనువెంటనే హక్కు కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ రిజిస్ట్రేషన్లు చేసింది. ఫిబ్రవరి 4న మొదలుపెట్టి మార్చి 15 వరకు రికార్డు స్థాయిలో 15.59 లక్షల రిజిస్ట్రేషన్లను చేసింది.
ఎన్నికల పనులు, రీసర్వే వంటి కార్యక్రమాలున్నా జిల్లా కలెక్టర్లు, అధికార యంత్రాంగం అత్యంత వేగంగా రిజిస్ట్రేషన్లు చేసి చరిత్ర సృష్టించడాన్ని డీలాపడడం అని రామోజీ పదకోశంలో ఈనాడు అనుకుంటే దానిని కడుపుమంట కాక ఇంకేమనాలి? నిజానికి.. చంద్రబాబు తన హయాంలో పేదలకు చెప్పుకోదగ్గ మేలు చేసింది ఏమీలేదు. కానీ రామోజీరావు ఎప్పుడూ దీన్ని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పుడు డీపీటీ (దోచుకో–పంచుకో–తినుకో) పద్ధతిలో పచ్చముఠా రాష్ట్ర ఖజానాను పూర్తిగా నాకేసింది. కానీ, ఇప్పుడు అలాంటిదేవీులేదు. ఖర్చుపెట్టే ప్రతి పైసాకూ తగ్గ ప్రతిఫలం పేదలకు దక్కాలన్నదే సీఎం జగన్ తపన. దీనిని చంద్రబాబే కాదు.. ఎల్లోగ్యాంగ్‌లో ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ రాతలు.. ఈ రోత కథనాలు.
రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక విరామం..
ఇక ఎన్నికల కోడ్ మార్చి 16న రావడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని వక్రీకరించి ఇక అక్కడితో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయినట్లు చిత్రీకరించడం రామోజీ దివాళాకోరుతనం. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంవల్ల రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న కన్వేయన్స్ డీడ్లపై సీఎం ఫొటో ఉండకూడదనే నిబంధనవల్లే ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్లకు విరామం ఇచ్చారు.
ఎన్నికల కమిషన్ అనుమతితో సీఎం ఫొటోలేకుండా రిజిస్ట్రేషన్లు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆధ్వర్యంలో దీనిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో మిగిలిన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.
లెక్క ఎక్కువ కాదు. అసలు లెక్కే రామోజీ..
ఇళ్ల స్థలాల లెక్కను ఎక్కువచేసి ప్రచారం చేసుకుంటున్నారని, కాలనీలు కాదు ఊళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ఈనాడు తన అక్కసు వెళ్లగక్కింది. 31.19 లక్షల మంది ఇళ్ల స్థలాలులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలివ్వగా అందులో 22 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. మరో 7 లక్షల మంది పొజిషన్‌లో ఉండడంతో వీరికి గతంలోనే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. మిగిలినవి టిడ్కో, ఇతర ఇళ్లు.
ఇందులో లెక్క ఎక్కువచేసి చూపింది ఎక్కడ? 22 లక్షల మంది జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టుకుంటున్న విషయం నిజంకాదా? 17 వేలకుపైగా జగనన్న కాలనీలు ఏర్పడడం రామోజీకి కనిపించడంలేదా? 22 లక్షల ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే 15.50 ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. త్వరలో మిగిలిన స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. ఇవి కాగితాల్లో లెక్కలు కాదు. వాస్తవంగా కనిపించే లెక్కలే.
రిజిస్ట్రేషన్లు చేయకుండా టీడీపీ అడ్డంకులు..
పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామనే మాటకు కట్టుబడి వైఎస్ జగన్ ప్రభుత్వం 2020లోనే జీఓ ఇచ్చినా టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి దానికి అడ్డుపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలోపు పేదలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఏకంగా 71,811 ఎకరాల భూమిని సేకరించి, పేదలకు అప్పటికి డీకేటీ పట్టాలిచ్చింది. టీడీపీ అడ్డుకున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించేందుకు ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (పీఓటీ) చట్టాన్ని 2021లో సవరించి పదేళ్ల తర్వాత ఇంటి పట్టాను అమ్ముకునే అవకాశం లబ్ధిదారులకు కల్పించింది.
రిజిస్ట్రేషన్ చేస్తుంటే ఉపయోగంలేని రిజిస్ట్రేషన్ అంటూ వక్రభాష్యం చెబుతూ పేదలను మోసం చేస్తోంది. వాస్తవానికి.. ఈ రిజిస్ట్రేషన్ చేయడంవల్ల బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి రుణం తెచ్చుకునే సౌలభ్యం ఏర్పడుతుంది. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది కాబట్టి బ్యాంకులు రుణాలిస్తాయి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి డేటాబేస్‌లో ఆ వివరాలన్నీ పదిలంగా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు సర్టిౖఫెడ్ కాపీ పొందే దానికి వీలుంటుంది. ఫోర్జరీ, ట్యాంపరింగ్ భయం ఉండదు. ఇన్ని ఉపయోగాలుండగా రిజిస్ట్రేషన్ అవసరంలేదని బుకాయించడం రామోజీ ఏడుపు కాక మరేమిటి?
వైఎస్సార్‌సీపీ నేతలు ఎక్కడ రాయించుకున్నారు?
ఇళ్ల స్థలాలు తీసుకున్న వారిలో కొందరు చనిపోవడంతో వారి వారసులను (లీగల్ హైర్స్) గుర్తించడం ఆలస్యమవడంవల్ల కొన్ని రిజిస్ట్రేషన్లు ఆలస్యమయ్యాయి. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అర్హులను గుర్తించి వారికి రిజిస్ట్రేషన్లు చేసేందుకు చేసే ప్రయత్నాన్ని కూడా ఈనాడు రామోజీ తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి స్థలాలను వైఎస్సార్‌సీపీ నేతలు తమ పేరుతో ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆధారాల్లేకుండా కుట్రపూరిత రాతలు రాస్తోంది.
అలాగే, ఈ కథనంలోనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మొదట రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే తప్పుడు ఆరోపణను అచ్చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఇచ్చిన ఇళ్లన్నింటికీ రిజిస్ట్రేషన్లు చేస్తుంటే దానిపైనా నిందలు మోపి తన వక్రబుద్ధిని ఆ క్షుద్ర పత్రిక చాటుకుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల స్థలాలపై యాజమాన్య హక్కులు ఆటోమేటిక్‌గా వస్తాయని, వాటికి కన్వేయన్స్ డీడ్ల పేరుతో రిజిస్ట్రేషన్లు చేయడం అవసరంలేదనే వింత వాదన లేవనెత్తింది. రెవెన్యూ శాఖ ఎన్‌ఓసీ లేకుండా యాజమాన్య హక్కులు ఎలా వస్తాయో మహా మేధావి రామోజీకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment