
ఓటమి భయంతో దిగజారి బూతులు మాట్లాడుతున్న చంద్రబాబు
అధికారం దక్కదన్న అక్కసు, తీవ్ర అసహనంలో వృద్ధ నాయకుడు
విచక్షణ కోల్పోయి దారుణ తిట్లే ప్రధానాంశంగా ప్రచారం
సీఎం జగన్‌ను కొట్టండి నుంచి చంపండి.. నరకండి అనే స్థాయికి బాబు
ఇప్పుడు పూర్తిగా మతి చెడి తిట్ల పురాణం, బూతుల దండకం
చివరకు సీఎం జగన్ కుటుంబం, అమ్మమ్మలు, తాతయ్యలపైనా దిగజారి వ్యాఖ్యలు
నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అంటూ దుర్భాషలు
14 ఏళ్లు సీఎంగా చెప్పుకోవడానికి ఏమీ లేక జగన్‌ని తిట్టడమే పనిగా బాబు
సీఎం జగన్‌పై చేసిన దుష్ప్రచారాలను నమ్మని ప్రజలు
సీఎం జగన్ ప్రభుత్వంపై పన్నిన కుట్రలు బూమరాంగై ఆయనకే తగిలాయి
దీంతో తీవ్ర అసహనంతో బజారుస్థాయి మాటలు
అనకాపల్లి సభలో ప్రధాని ఉన్నంత వరకు మౌనం.. ఆ తర్వాత తిట్ల పురాణం
బాబు మాటలు ఎన్నికల కోడ్‌కు విరుద్ధం.. అయినా విననట్లున్న ఈసీ
తెలంగాణలో కేసీఆర్‌పై చర్యలు తీసుకున్న ఈసీ.. ఏపీలో అందుకు విరుద్ధం
సాక్షి, అమరావతి: అధికారం, అవినీతి మరిగిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ రెండూ లేక, ఇక దొరకవని తేలిపోవడంతో మతి చెడింది. ఈసారీ అధికారం దక్కదన్న అక్కసు, తీవ్ర అసహనం ఈ వృద్ధ నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైకు దొరికితే చాలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై కారు కూతలు కూస్తున్నారు. తిట్లే ప్రధానాంశంగా మాట్లాడుతున్నారు. అనకూడని నిందలేస్తూ తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకుంటున్నారు.
రోజురోజుకు నీచ స్థాయికి దిగజారిపోతున్నారు. మతి పూర్తిగా చెడిపోయి, గతి తప్పి బజారు భాషకు దిగిపోయారు. నోరు తెరిస్తే తిట్ల పురాణం, బూతుల దండకమే. సీఎం వైఎస్ జగన్‌ను కొట్టండి.. తిట్టండి అంటూ మొదలైన ఆయన ప్రచారం.. ఇప్పుడు చంపండి.. నరకండి అనే స్థాయికి దిగజారిపోయింది. సీఎం వైఎస్ జగన్‌నే కాకుండా, ఆయన కుటుంబాన్ని, చివరకు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలను కూడా విచక్షణ మరిచి దూషిస్తున్నారు.
ఎన్నికల నిబంధలను యధేచ్ఛగా ఉల్లంఘిస్తూ పదే పదే అనకూడని మాటలు అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల సీఎంనని చెప్పుకొంటూనే, ఆ హుందాతనమేదీ తనలో లేదని, ఉన్నదల్లా నీచ మనస్తత్వమేనని వేదికల మీదే బహిరంగ ప్రదర్శన చేస్తున్నారు. ఇలా గతి తప్పి మాట్లాడటం ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధం. అయినా చంద్రబాబు కారు కూతలను ఎన్నికల సంఘం (ఈసీ) వినీ విననట్టు ఊరుకోవడమూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
అన్ని ప్రయత్నాలూ విఫలమై..
ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు, విభజిత ఏపీకి ఐదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిన మేలు చెప్పుకోవడానికి ఒక్కటీ లేదు. వెన్నుపోట్లు, మోసాలు, అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు తప్ప. దీంతో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ పైన, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై బురద చల్లడానికి, ప్రజలను పక్కదారి పట్టించి, ఓట్లు దండుకోవడానికి బాబు పన్నిన కుట్రలన్నీ విఫలమయ్యాయి. పింఛన్లు, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై పన్నిన కుట్రలు పారలేదు.
అవి బూమరాంగై తిరిగి ఆయనకే గట్టిగా తగిలాయి. టీడీపీ ఓటమిని నిర్ధారించాయి. అంతకు ముందు కూడా ప్రభుత్వంపై అనేక అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మలేదు. రోజురోజుకూ ఆయనే దోషిగా ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. మరోపక్క ఓటమి భయం ఆయనలో అణువణువునా వ్యాపించింది. కంటి ముందు అవినీతి కేసులు దయ్యాల్లా కనిపిస్తున్నాయి. దీంతో వణికిపోతున్న ఈ వయసు మళ్లిన వెన్నుపోటు వీరుడు నోటికి పని చెప్పారు.
ఇలా ఉంటుంది.. చంద్రబాబు తీరు
చంద్రబాబు నక్క వినయం, తోడేలు దాడి ఎలా ఉంటాయో సోమవారం అనకాపల్లిలో జరిగిన ప్రధాని మోదీ సభే చెబుతోంది. ఈ సభలో ప్రధాని ఉన్నంతవరకు చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా మెలిగారు. ఆయన వెళ్లీ వెళ్లగానే మైకందుకున్న చంద్రబాబు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోయారు. సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులను తూలనాడుతూ, బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ‘జగనన్న భూహక్కు అంట.. నీ తల్లి మొగుడిచ్చాడా.. మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా.. మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా.. జేజే తాత ఇచ్చాడా.. ఎవడిచ్చాడు’ అంటూ వినే వారికి రోత పుట్టించారు.
మహిళలు చెవులు మూసుకునేలా చేశారు. ఆదివారం జరిగిన సభల్లోనూ ఇలాగే తీవ్ర అసహనాన్ని ప్రదర్శించారు. అంతకు ముందూ ఆయన ముఖ్యమంత్రిపై దాడులు చేయాలని, ఆయన్ని కొట్టాలంటూ మాట్లాడారు. తాడికొండ సభలో సీఎంను రాయితో కొట్టాలని కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. సీఎంను దున్నపోతు అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ఈ వ్యాఖ్యల తర్వాతే సీఎం జగన్‌పై విజయవాడలో రాయి దాడి జరిగింది.
ఆ తర్వాత ఆయన మాటలు దాడుల నుంచి చంపండి అనే వరకు సాగాయి. సీఎంను గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఓ సభలో విచక్షణ మరిచి అనడంతో పక్కనున్న నేతలే ఆశ్చర్యపోయారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో సీఎంను చంపితే ఏమవుతుంది అని మాట్లాడి దిగజారడంలో తనకు ఎవరూ సాటి రారని నిరూపించుకున్నారు. సీఎం జగన్‌పై కట్టలు తెగే స్థాయిలో అసూయ, ద్వేషాలను చంద్రబాబు వెళ్లగక్కుతుండడం చర్చనీయాంశంగా మారింది.
ఇదేమి తీరు ఈసీ?
చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నా ఎన్నికల సంఘం మౌనం వహిస్తుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. బహిరంగ వేదికలపై సీఎంను కొట్టండి, గాజు గ్లాసుతో పొడవండి, చంపితే ఏమవుతుంది అంటూ పిలుపునిస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నా ఈసీకి వినపడటంలేదా? ఈసీ ఎందుకు మౌనం వహిస్తోంది? తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకొని, 48 గంటల పాటు ఆయన ప్రచారంపై నిషేధం విధించింది.
ఏపీలో చంద్రబాబు సభా వేదికలపై ఎంతలా వీరంగం వేస్తున్నా, సీఎం జగన్ కుటుంబ సభ్యులను, మహిళలను కూడా దూషిస్తున్నా, చంపాలని బహిరంగంగానే కార్యకర్తలను రెచ్చగొడుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమే. తెలంగాణలో అయితే ఒకలా, ఏపీలో అయితే మరోలా ఈసీ తీరు ఉంటుందా? తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో పొత్తు పెట్టుకొన్నంత మాత్రాన చంద్రబాబు వ్యాఖ్యల విషయంలో ఈసీ జోక్యం చేసుకోకూడదని ఏమీ లేదు. అయినా ఈసీ మౌనం వెనుక మర్మమేమిటన్నది ప్రజలకు అర్థంకావడంలేదు.
జగన్‌ది హుందాతనం..బాబుది దిగజారుడుతనం
ఒకవైపు జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని హుందాగా ప్రజలను కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం దిగజారిపోయి తిట్ల పురాణంతో సభలు నడిపిస్తున్నారు. సీఎం జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చి చూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళుతుండడంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు చవకబారు దూషణలకు దిగుతున్నారు. జగన్ ఒక పద్ధతిలో మాట్లాడుతూ ముందుకెళుతున్న వైనాన్ని, చంద్రబాబు బజారుస్థాయి మాటలను ప్రజలు గమనిసూ్తనే ఉన్నారు.