మర్యాదలు మంటగలిసిన వేళ | K Ramachandra Murthy Article On 2018 Telangana elections | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 2 2018 12:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

K Ramachandra Murthy Article On 2018 Telangana elections - Sakshi

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడేందుకు నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్నది. యోధానుయోధులు ప్రచారం చే శారు. రోజూ పదిహేను హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. అనేక సభలు జరిగాయి. ఓటర్లపైన ప్రభావం వేయడానికి ఎవరికి తోచిన పద్ధతిలో వారు ప్రచారం చేశారు. మూడు న్నర దశాబ్దాల వైరం మరచి భుజం కలిపిన కాంగ్రెస్, టీడీపీ నేతలు కొత్త ప్రేమికుల వలె వ్యవహరిస్తున్నారు. వారికి ఇతరులు ఎవ్వరూ కనిపించడం లేదు. అంతా పక్కాగానే ఉన్నదనే అంచనాతో శాసనసభ రద్దు చేసి ముందస్తు ఎన్ని కలకు సాహసించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఒక వైపు కూటమినీ, మరో వైపు మోదీ పరివారాన్నీ ఎదుర్కొంటూ సవ్యసాచిలాగా పోరాడుతు న్నారు.

ఆపద్ధర్మ మంత్రులు హరీష్‌రావూ, కల్వకుంట్ల తారకరామారావూ (కేటీఆర్‌) సమర్థంగా సేనానికి చేదోడువాదోడుగా పరిశ్రమిస్తున్నారు, పరా క్రమిస్తున్నారు. ప్రతిపక్ష కూటమిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి ఆలస్యంగా ఆరం భించినప్పటికీ శక్తివంచనలేకుండా పరుగెత్తుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున రోజుకొక జాతీయ స్థాయి నాయకుడు వచ్చి ప్రచారం చేసి, మీడియాతో మాట్లాడి వెడుతున్నారు.  తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండ రామ్‌ హెలికాప్టర్‌లో తిరిగి ప్రచార సభలలో ప్రసంగిస్తున్నారు.

ఖమ్మంలో జరి గిన బహిరంగ సభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)అధినేత చంద్రబాబునాయుడు ప్రప్రథమంగా వేదిక పంచుకొని ప్రసం గించారు. ప్రజాగాయకుడు గద్దర్‌ రాహుల్‌తోపాటు చంద్రబాబునాయుడు పొట్టలో కూడా తలపెట్టి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఖమ్మం సభకు అధ్యక్షత వహించిన భట్టి విక్రమార్క శీలం సిద్ధారెడ్డిని గుర్తు చేసుకోవడం బాగుంది. కానీ పీవీ నరసింహారావు పేరు విస్మరించడం, జలగం వెంగళరావు ప్రస్తావన లేకపోవడం, వైఎస్‌ రాజశేఖరరెడ్డిని స్మరించకపోవడం కృతఘ్నతగానే పరిగణించాలి. అదే రోజు హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో సభకు అధ్యక్షత వహించిన టీడీపీ నాయకుడు ఎల్‌ రమణ చంద్రబాబును అపరచాణక్యుడుగా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేయడం, తెలంగాణలో అన్ని ప్రాజెక్టులూ, అన్ని రకాల అభివృద్ధీ తనవల్లనే అయిందంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ఆమోదిస్తున్నట్లు రాహుల్‌గాంధీ చిరునవ్వులు చిందించడం ఎబ్బెట్టుగా కనిపించింది.

 రాజకీయాలలో శాశ్వత మిత్రులూ, శాశ్వత శత్రువులూ ఉండరనే నానుడిని నూటికి నూరు పాళ్ళూ నిజమని నిరూపించిన దృశ్యం ఖమ్మంలో కళ్ళకు కట్టింది. ఇంతకాలం కాంగ్రెస్, టీడీపీల మధ్య రాజకీయ వైరం మాత్రమే ఉండేది కానీ సైద్ధాంతిక విభేదాలు ఏమీ లేవని చంద్రబాబు చెప్పారు. రాహుల్, చంద్రబాబు పరస్పరం ఒకరిపైన ఒకరు ఆధారపడినట్టు కనిపించారు. ఇంత వరకూ జరిగిన ప్రచారంలో కొట్టవచ్చినట్టు కనిపించిన ధోరణులను మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి–అలవికాని వాగ్దానాలు చేయడం. రెండు– నోటికి వచ్చిన ఆరోపణ చేయడం, దుర్భాషలాడటం. మూడు–వాస్తవాలను యధేచ్ఛగా వక్రీకరించి తమ అవసరాలకు తగిన కల్పితాలను సత్యాలుగా ప్రచారం చేయడం. ఈ మూడు ధోరణులూ అన్ని ఎన్నికలలో ఏదో ఒక స్థాయిలో ఉంటాయి. ఈ ఎన్నికలలో పరాకాష్ఠకు చేరాయి. అన్ని సరిహద్దులనూ అతిక్ర మించాయి. సకల మర్యాదలనూ మంట కలిపాయి. 

హామీల అమలు సాధ్యమా?
నేతలు లెక్కలేనన్ని వాగ్దానాలు లెక్కలేకుండా చేశారు. ఎన్నికలలో హోరాహోరీ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అధికారంలో కొన సాగినా, ప్రజాకూటమి అధికారంలోకి వచ్చినా వారు చేసిన బాసలను అయిదేళ్ళపాటు సక్రమంగా అమలు చేయడం దాదాపు అసాధ్యం. అందుకు అవసరమైన నిధులు లభించే అవకాశం లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే తప్ప రాష్ట్ర వనరులకు పరిమితమై చేయడం సాధ్యం కాని పని. ఈ ఎన్నికలలో గట్టెక్కితే చాలు, వాగ్దానాల సంగతి తర్వాత చూసు కుందామనే ధోరణితో పోటాపోటీగా వాగ్దానాలు చేశారే కానీ వాటి అమలుకు ఎంత ఖర్చు అవుతుందో, దాన్ని భరించడానికి ఆదాయం ఎక్కడి నుంచి లభిస్తుందో ఆలోచించిన దాఖలా లేదు. ఒక వేలం(Ðð ర్రి)పాట పాడినట్టు కని పిస్తున్నది కానీ ఆచితూచి చేసిన వాగ్దానాల వలె కనిపించడం లేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనూ, ఎన్నికల ప్రణాళికలో చెప్పిన అంశాలనూ మించి వాగ్దానాలు చేయాలనే తాపత్రయం కాంగ్రెస్‌లో కనిపిం చింది. ఒక వేళ గెలిచి అధికారంలోకి వస్తే ప్రతి హామీ నుంచి లబ్ధిపొందేవారి సంఖ్యను కుదించడానికి కసరత్తు చేయాలనే ఉద్దేశం ఉండి ఉండవచ్చు.


తగిన ఆదాయం లేకుండా వాగ్దానాలు చేసినట్టే సాక్ష్యాధారాలు లేకుండా ప్రత్యర్థులపైన విపరీతమైన ఆరోపణ చేయడం అలవాటుగా మారింది. ఎన్నికల వ్యయం విపరీతంగా పెరిగిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశంలోనే మొదటి రెండు స్థానాలలో నిలుస్తాయి. తర్వాత తమిళనాడు, కర్ణాటక. ఇంత వ్యయం భరించాలంటే రాజకీయ నాయకులు అక్రమంగా ఆర్జించడం అని వార్యం. ఉత్తరాదిలో ఇతర అవలక్షణాలు అనేకం ఉన్నాయి కానీ ఎన్నికలలో ధనబలం ఇంత పెద్ద మోతాదులో లేదు. అవినీతికి ఒడిగట్టినవారే నీతిసూత్రాలు వల్లెవేయడం, తమకంటే నీతిమంతులు దేశంలో మరెవ్వరూ లేరంటూ చెప్పుకోవడం, మీడియా ప్రశ్నించకుండా ప్రచారం చేయడం మన ప్రత్యేకత. పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాహుల్‌గాంధీ కాస్త రాటు తేలినట్టు  కనిపిస్తున్నారు.

మోదీపైన రఫేల్‌ డీల్‌ ఆరోపణాస్త్రం సంధించడమే కాకుండా ప్రత్యర్థులందరిపైనా అవినీతి ఆరోపణలు చేయడమే రాజకీయం అనుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను ప్రస్తావిం చినవారు తాము అధికారంలోకి వస్తే వైఫల్యాలను సాఫల్యాలుగా ఏ విధంగా మార్చదలిచారో వివరిస్తే అది సకారాత్మక రాజకీయం అవుతుంది. ప్రత్య ర్థులపైన ఒంటి కాలిపైన లేస్తున్న రాహుల్‌గాంధీ కొత్త మిత్రులపట్ల అసా ధారణమైన ఆదరణ, గౌరవం ప్రదర్శిస్తున్నారు.  దేశాన్ని రక్షించడానికి తానూ, చంద్రబాబూ పెద్ద బాధ్యతను భుజాలపైన ఎత్తుకున్నట్టు చెబుతున్నారు. తాము జాతీయ స్థాయికి కూటమిని విస్తరించి మోదీని గద్దె దింపుతామని రాహుల్‌ అంటున్నారు. ఎంత తీవ్రమైన ఆరోపణ ఎంత బిగ్గరగా చేస్తే అంత గొప్పగా పోరాటం చేసినట్టు మన నాయకులు భ్రమిస్తున్నారు.

నిన్న ఏమి చెప్పామో, ఈ రోజు చెబుతున్నామో, నిన్నటికీ, నేటికీ  పొంతన ఉన్నదో లేదో నాయకులు చూసుకోవడం లేదు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా గమనిస్తున్నారు. అవినీతికి  పెట్టినపేరు కాంగ్రెస్‌ అంటూ బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు వ్యాఖ్యానిస్తే బీజేపీకి అంబానీలూ, అదానీలు ముఖ్యమనీ, సామాన్య ప్రజల బాగోగులు వారికి పట్టవనీ కూటమి సభ్యులు అంటున్నారు. కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులలో నిధుల స్వాహా చేశారని కూటమి నాయకులు ధ్వజమెత్తారు.

ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో కేసీఆర్‌ ప్రభుత్వం దారుణంగా విఫలమైనదంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉంటూ చంద్రబాబు విమ ర్శించడం విడ్డూరం. అన్ని రంగాలలో విఫలం చెందిన ముఖ్యమంత్రిగా స్వరా ష్ట్రంలో ప్రజల విమర్శలను ఎదుర్కొంటూనే పక్క రాష్ట్రంలో ప్రభుత్వం తీరు తెన్నులపైన చేస్తున్న వ్యాఖ్యానాలలో విశ్వసనీయత ధ్వనించదు. మోదీ వ్యతిరేక పోరాటం కొనసాగిస్తున్నట్టు సంకేతం ఇవ్వడానికి తెలంగాణ ఎన్నికలను చంద్రబాబు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. 

ప్రచారమే ప్రధానం
నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడం ఈ  ఎన్ని కలలో కనిపిస్తున్న మరో ధోరణి. ప్రతి రాజకీయ నాయకుడు తనకు అంది వచ్చిన అవకాశాల మేరకు అభివృద్ధి సాధించడానికి పాటు పడతారు. మేధాశక్తి ఉన్న నాయకులు దూరదృష్టితో వ్యవహరించి భవిష్యత్తరాలకు ఉపయోగపడే విధంగా ప్రగతికి బాటలు వేస్తారు. దేశంలో సమాచార సాంకేతిక విప్లవానికి బీజాలు వేసింది మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు అనీ, రాజీవ్‌ సాఫ్ట్‌వేర్‌ పార్క్‌కు హైదరాబాద్‌లో 1992లో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి శంకుస్థాపన చేశారనీ, చంద్రబాబు మంత్రి కావడానికి ముందే కంప్యూటర్‌ సంస్థలు హైదరాబాద్‌లో ఉండేవనీ చాలామందికి తెలి యదు.  నేదురుమల్లి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఐటీ రంగాన్ని అభివృద్ధి చేశారు. వారిలో చంద్రబాబు ఒకరు. తొమ్మిదిన్నర ఏళ్ల సుదీర్ఘకాలం పాలించడం వల్ల మిగిలినవారితో పోలిస్తే ఆయనకు అదనంగా అవకాశాలు వచ్చి ఉండ వచ్చు. కానీ తాను చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవడం ఆయనకు అలవాటు.

వైఎస్‌ హయాంలో నిర్మించిన ఔటర్‌రింగ్‌రోడ్డు, శంషాబాద్‌ విమా నాశ్రయం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్టు కూడా తమ ఖాతాలోనే వేసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత సైతం హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరిస్తోంది. బెంగుళూరులో ఐటీని శిఖరాగ్రంలో నిలపడానికి కారకుడైన ఎస్‌ఎం కృష్ణ ఎన్నడూ తాను బెంగుళూరు కట్టినట్టు కానీ ఐటీ తెచ్చినట్టు కానీ చెప్పుకోలేదు. తమిళనాడు నాయకులు కరుణానిధి కానీ జయలలిత కానీ ప్రచారం చేయలేదు. స్వోత్కర్ష ఒక మానసిక అవసరంగా మారి చంద్రబాబు చేత లేనిపోని మాటలన్నీ మాట్లాడిస్తున్నది. ఓటుకు కోట్ల కేసు ప్రసక్తి లేదు. ‘చంద్రబాబూ, బ్రహ్మదేవుడు కూడా  నిన్ను రక్షించలేడు’ అంటూ హుంకరించిన కేసీఆర్‌ ఇప్పుడు ఆ కేసు గురించి గట్టిగా మాట్లాడటం లేదు. నాలుగేళ్ళు బీజేపీతో టీడీపీ సహజీవనం చేసిన వైనం ప్రస్తావనకు రావడం లేదు. తొమ్మి దిన్నర సంవత్సరాలలో హైదరాబాద్‌ని కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్ళలో అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుకు కూడా పేర్చలేక పోయారు ఎందుకని? ఈ ప్రశ్నలన్నీ అడగవలసిన కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కూటమి కట్టారు.

సమకూరిన మీడియా మద్దతు
టీడీపీతో పొత్త  పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్‌కు ఒక రకంగా నష్టం, మరో రకంగా లాభం. చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా పరిగణించేవారూ, ఇతరత్రా చంద్రబాబు అంటే ఇష్టం లేనివారూ కూటమికి ఓటు వేయరు. టీఆర్‌ఎస్‌కు కానీ బీజేపీకి కానీ వేస్తారు. చంద్రబాబుతో పాటు మీడియా కాంగ్రెస్‌ పక్షాన పెద్ద ఎత్తున చేరింది.  సోషల్‌ మీడియా కూడా రంగంలో దిగింది.  ఇది కాంగ్రెస్‌కు విశేషంగా ఉపకరించే పరిణామం. ఇంతకాలం కేసీఆర్‌కు కొమ్ముకాసిన పత్రి కలూ, చానళ్ళూ ఇప్పుడు కాంగ్రెస్‌కు అధిక ప్రచారం ఇస్తున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ సర్వేల పేరుతో మైండ్‌గేమ్‌ ఆరం భించారు. కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనిపించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ ప్రచారాన్ని ప్రజలు విశ్వసిస్తే టీఆర్‌ఎస్‌ పరిస్థితి నల్లేరుమీద బండి చందం కాదు. గట్టి పోటీ ఎదుర్కోవలసి వస్తుంది. 

మాటల యుద్ధంలో ఎవరిది పైచేయి అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో టీఆర్‌ ఎస్‌కి అనుకూలించే అంశాలు అనేకం ఉన్నాయి. వృద్ధాప్య పింఛనూ, రైతు బంధు, రైతుబీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచాయి. మిషన్‌ భగీరథ మెయిన్‌ పైపులు ఇళ్ళముందుకు వచ్చి నిలిచాయి.  ఇళ్ళకు పైపులు వేయడమే తరువాయి. మిషన్‌ కాకతీయ వల్ల మేలు జరిగింది. ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సరఫరా ఒక ఘనవిజయంగా కేసీఆర్‌ ప్రతి సభలో చెప్పుకుంటున్నారు. వృత్తిపనివారికోసం ప్రభుత్వం తల పెట్టిన సంక్షేమ పథకాలు జనాదరణ పొందాయి. సంక్షేమ పథకాలు అన్నీ సవ్యంగా అమలు జరుగుతున్నాయనే ధీమాతోనే కేసీఆర్‌ ముందస్తు ఆలోచన చేశారు. 

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలో పోలింగ్‌ ముగిసింది. తెలంగాణతో పాటు రాజస్థాన్‌లో పోలింగ్‌ ఈ నెల ఏడో తేదీన ఉంది. పదకొండో తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాలు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంచనా. అందుకే వీటిని సెమీఫైనల్స్‌ అంటున్నాం. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు తెలుసు కోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పది రోజుల్లో భవిష్యత్తు చిత్రపటం దర్శనమిస్తుంది. 


కె. రామచంద్రమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement