సాక్షి, విజయనగరం : కాంగ్రెస్-టీడీపీల మధ్య రహస్య ఒప్పందం బట్టబయలైంది. మాజీ కేంద్ర మంత్రి, ఇటీవలే తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వైరిశర్ల కిషోర్ చంద్రదేవ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం విశేషం. విజయనగరం జిల్లా కురుపాం కోటలో కార్యకర్తల సమావేశంలో ఆయన ...చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ మధ్య జరిగిన తెర వెనక ఒప్పందాన్ని బయటపెట్టారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని చంద్రబాబు, రాహుల్ మధ్య అవగాహన కుదిరిందన్న ఆయన... అందులో భాగంగానే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ కలిపి పోటీ చేయవని కిషోర్ చంద్రదేవ్ తేల్చి చెప్పారు. అయితే కేంద్రంలో తమ రెండు పార్టీలు పనిచేస్తాయని పేర్కొన్నారు. అందుకే తాను టీడీపీలో గెలిచి, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పని అయినా.. మీకు చేసి పెడతా అని కార్యకర్తలకు... హామీ ఇచ్చారు.
కాగా విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా పేరున్న వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ సుమారు 40ఏళ్లుగా ఆ పార్టీలో ఉన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో ఆయన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితానికి దుష్టశక్తులు పని చేస్తున్నాయన్న కిషోర్ చంద్రదేవ్... అలాంటివాళ్ల మధ్య ఇమడలేకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంటే మాత్రం మంత్రి పదవి చేపట్టి అన్ని పనులు చేసిపెడతా అంటూ ఆయన బహిరంగంగా చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో పనికి రాని కాంగ్రెస్ పార్టీ.... కేంద్రంలో మాత్రం కిషోర్ చంద్రదేవ్‌కు ఎలా పనికి వస్తుందబ్బా అంటూ గుసగుసలాడుకుంటున్నారు. హస్తాన్ని వీడి పసుపు కండువా కప్పుకున్న కిషోర్ చంద్రదేవ్ తాజా వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లోనే కాంగ్రెస్ నాటకం నడుస్తుందనేది స్పష్టంగా తెలిసిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment