
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. రాహుల్ నివాసంలో అరగంట పాటు జరిగిన ఈ భేటీలో సార్వత్రిక ఎన్నికలపై చర్చించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. వీవీ ప్యాట్లను కనీసం 25 శాతం లెక్కించాలని కోరుతూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం, తదనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అదే అంశంపై ప్రతిపక్షాలు అభ్యర్థించడం తదితర అంశాలను చంద్రబాబు రాహుల్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం.
అలాగే ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసొచ్చే అవకాశం ఉన్న అన్ని పార్టీల బలాబలాలను సమీక్షించినట్టు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. యూపీఏ భాగస్వామ్య పార్టీలు, కలిసొచ్చే విపక్షాలతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు నిర్వహించాల్సిన సమావేశంపై కూడా ఇద్దరు నేతలు చర్చించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత చంద్రబాబు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment