
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదని, తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్ని రకాలుగా సహకరిస్తానని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. తాను ఎక్కడున్నా తెలంగాణ ప్రియమైన ప్రాంతమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఎందుకు దూషిస్తున్నాడో అర్థం కావడం లేదని చెప్పారు. హైదరాబాద్ కట్టలేదు.. కానీ సైబరాబాద్ నిర్మించినట్టు చెప్పుకున్నారు. కాంగ్రెస్-టీడీపీ కలయిక చారిత్రక అవసరమని చెప్పారు. ఖమ్మం పట్టణంలో బుధవారం మహాకూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రజా గాయకుడు గద్దర్, ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ, టీ కాంగ్రెస్ నేతలతో చంద్రబాబు ఈ సభలో వేదిక పంచుకున్నారు. గద్దర్ పాట పాడి సభలో ఊపు తెచ్చారు. ఈ సభలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక గత నాలుగున్నరేళ్లుగా దోపిడీ జరిగిందనివిమర్శించారు. నిరంకుశ కేసీఆర్ పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకే టీడీపీ పొత్తు పెట్టుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ దోచుకుందని చెప్పారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయని, ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి అమలు చేస్తామని, రైతులకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.